AADIVAVRAM - Others

విస్మృత వాహనాలకు విశేష గుర్తింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన జీవితం నుంచి కొన్ని సాధనాలు కనుమరుగవుతాయి. అలాంటివి చరిత్రలో కలిసిపోకుండా తన చిత్రాల్లో తాజాగా నిలిపేందుకు చిత్రకారుడు గాంగ్జి రమేష్‌కుమార్ తన వంతు కృషి చేస్తున్నారు. వాటిలో జట్కా బండి, మనిషి లాగే రిక్షా, సైకిల్.. వగైరా.. ఇవన్నీ గత జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. విస్మృతిలోకి వెళ్లిపోతున్నాయి. కాన్వాస్‌పై, పేపర్‌పై వాటిని చూసినప్పుడు ‘ప్రాణం’ లేచొస్తుంది.
ముఖ్యంగా జట్కా బండి చాలా కాలం వాహనంగా ఓ వెలుగు వెలిగింది. దాని సోయగం.. దర్పం, ఆ గిట్టల చప్పుడు, కదలిక కన్నుల పండువలా కనిపించేది. మనుషులనే కాదు సామాగ్రిని తరలించేందుకు సైతం చాలాకాలం ఉపయోగపడింది. ఎక్కడో అక్కడ ఇప్పుడూ కనిపిస్తే కనిపించవచ్చు. అదో అలాంటి జట్కా బండిని చిత్రకారుడు ప్రత్యేకమైన కాన్‌సన్ కాగితంపై ప్రత్యేకమైన స్టెడ్‌లర్ రంగు పెన్సిళ్లతో జీవం ఉట్టిపడేలా గీశారు. సరుకులను తీసుకెళుతున్న ఆ బండి.. బండిని తోలే వ్యక్తి.. వ్యక్తి చేతిలో కళ్లెం, కళ్లకు గంతలతో లయబద్ధంగా పరుగులు తీసే గుర్రం.. ఆ దృశ్యం నాష్టాల్జియాలా నిలిచిపోతుంది. గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి వీక్షకులు ‘కనెక్ట్’ కావటం ఖాయం.
అలాగే చేత్తో లాగే రిక్షాలు.. కోల్‌కతాలో ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ నగర జీవనంలో అంతర్భాగంగా ఉన్నాయి. అక్కడి సంస్కృతిలో విడదీయలేని సంబంధం ఏర్పరచుకున్నాయి. అదో అలాంటి లాగుడు రిక్షాలో సజీవ బాతులను ఓ వ్యక్తి తీసుకెళుతున్న చిత్రం సైతం సహజంగా కనిపిస్తుంది. లుంగీ కట్టుకుని, బనీను ధరించి, ఓ తుండుగుడ్డ భుజంపై వేసుకొని వడివడిగా అడుగులేసే కార్మికుడు తన కర్మ (పని) తాను చేస్తున్నట్టు కనిపిస్తాడు.. బాతులు మాత్రం తలలు వేలాడేసి దీనంగా, అగమ్య గోచరంగా చూస్తూ ఉంటాయి. కొన్ని బాతులు తమని ఎక్కడికి తీసుకెళుతున్నావు? అని ఆ రిక్షా కార్మికుని ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇదో చిత్రమైన వాస్తవ చిత్రం.. దృశ్యం.
ఇక సైకిల్. ఈ వాహనం కూడా సరకులను చేరవేసేదని చెప్పేందుకు గాను సైకిల్ క్యారియర్‌కు రెండు వైపులా కొబ్బరి బోండాల గుత్తులతో, హ్యాండిల్‌కు ఓ సంచి వేలాడుతూ ఉండగా చిత్రకారుడు చిత్రించాడు. నగరాల్లో ఇప్పటికీ అక్కడక్కడ కొబ్బరి బోండాలు అమ్ముతూ తిరిగే వారి సైకిల్‌ను ఈ చిత్రం గుర్తు చేస్తుంది.
పై మూడు వాహనాలు యంత్రాలతో సంబంధం లేనివి. రణగొణ ధ్వనులకు తావివ్వనివి. పర్యావరణాన్ని కాపాడేవి. జీవితానికి ఓ పరమార్థం చూపేవి. కానీ ఇవి క్రమంగా కనుమరుగవుతున్నాయి. వీటి స్థానంలో యంత్ర వాహనాలు వచ్చేశాయి. వాటి స్థానాన్ని ఆక్రమించాయి. రణగొణ ధ్వని పెరిగింది. కాలుష్యం హెచ్చింది. శ్రమ తగ్గింది. పారమార్థికతకు అర్థం మారింది.
ఓ క్షణం ఆ తాత్వికత మనసులో మెదిలేందుకు ఈ బొమ్మలు ఆస్కారమిస్తాయి. గత జ్ఞాపకాలను స్పృశిస్తాయి. ఇవన్నీ ప్రత్యేక కాగితంపై ప్రత్యేక రంగుల్లో రూపొందించడం విశేషం. చిత్రకారుడు రమేష్ కాన్వాసుపై అక్రలిక్ రంగుల్లోనూ తన ప్రతిభ కనబరిచారు. వాటిలో తెలంగాణ (అధికార) పక్ష పాలపిట్ట ఒకటి. ఓ యాత్రాస్థలిలో యాత్రికుడు నడుస్తుండగా దారిలోని పావురాల గుంపు ఒక్కసారి ఎగరడం.. కుక్క యాత్రికుడిని అనుసరించడం.. మొత్తం కాంపోజిషన్ ఆకట్టుకుంటుంది. వాస్తవికతకు అద్దం పడుతుంది. అద్భుతం అనిపిస్తుంది.
పై రెండు పద్ధతులకు భిన్నంగా పోస్టర్ కలర్స్‌తో ‘గోల్డన్ రూల్స్’ ఆధారంగా గీసిన చిత్రాలు ఆయన ప్రత్యేకతను, ప్రతిభను తెలుపుతాయి. ఈ ‘శైలి’లో గీసిన ‘కథకళి’ బొమ్మ ఆయన నైపుణ్యానికి అద్దం పడుతుంది. డ్రాయింగ్ కాగితాన్ని మూడు భాగాలుగా విభజించి, అందులో తిరిగి ఒక్కో భాగాన్ని మళ్లీ విభజించి.. ఇలా స్కేల్ - పెన్సిల్ ఆధారంగా విభాగం చేసి తాను అనకున్న బొమ్మను పెన్సిల్‌తో గీసి చతురస్రపు చిన్న గళ్లలో వివిధ రంగులు నింపి ఓ సంపూర్ణత్వం తీసుకురావడం దీని ప్రత్యేకత. అంటే బొమ్మ అనేక విభాగాలుగా.. విడిపోయి కనిపించినా అంతిమంగా అది సంపూర్ణ చిత్రంగా అవతరిస్తుంది. ఈ ప్రత్యేక శైలి అంటే తనకెంతో ఇష్టమని చిత్రకారుడంటున్నారు. తనకు చిత్రకళను బోధించిన కవితా దేవస్కర్ దగ్గర ఈ శైలిని నేర్చుకున్నానంటున్నారు. ఈ పద్ధతిలో ఏనుగు చిత్రాలను, టీ కప్పులను వినూత్నంగా వీక్షకుల ముందుకు తీసుకొచ్చి తన ప్రతిభను చాటుకున్నారు.
వాటర్ కలర్స్‌లో స్టిల్ లైఫ్ బొమ్మలు చిత్రించడంలో - పక్షులు.. ప్రకృతి బొమ్మలు గీయడంలో ఆయన చేయి తిరిగిన చిత్రకారుడిగా గుర్తింపు పొందారు.
ఈ ప్రతిభావంతమైన చిత్రకారుడు రమేష్ కుమార్ పూర్వ రంగారెడ్డి జిల్లా పరిగి సమీపాన మల్లెపల్లి గ్రామంలో 1971 సంవత్సరంలో జన్మించారు. సమీపంలో దోమ మండల కేంద్రంలో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. పాఠశాల రోజుల్లో డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకుని అదే ఊపిరిగా గడిపారు. పాఠశాలలో చదువుతూనే డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు రాశారు. అనంతరం 1986లో జెఎన్‌టియులో బిఎఫ్‌ఏ కోర్సులో చేరి పూర్తి చేశాడు. అక్కడే కవితా దేవిస్కర్ మార్గదర్శనం లభించింది. ఆ తర్వాత కర్నాటక రాష్ట్ర విశ్వవిద్యాలయానికి ‘ఫ్రాఛైంజ్’గా ఉన్న శ్రీ వెంకటేశ్వర కళాశాల (మాదాపూర్‌లోని - దూరవిద్య) ఎంఎఫ్‌ఏ డిగ్రీ 2016లో పూర్తి చేశారు.
చిత్రకళపై పట్టు దొరికాక కొంతకాలం వివిధ చోట్ల ఇల్లస్ట్రేటర్‌గా పని చేశారు. సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకుని చిత్రకళా రంగానికి సంబంధించి వివిధ పనులు చేశారు. ఇప్పుడు పూర్తి సమయాన్ని చిత్రకళకే అంకితం చేస్తూ అనేక చిత్రాలు గీస్తున్నారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి రెండు మార్లు అవార్డులు అందుకున్నారు. వివిధ గ్రూప్ షోలలో తన చిత్రాలను ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. భవిష్యత్‌లో ‘సోలో షో’ నిర్వహించే పనుల్లో ఉన్నారు. ఇందులో విస్మృతి చెందిన వాహనాలకు ప్రాధాన్యత ఉంటుందంటున్నారు.
*
జి.రమేష్‌కుమార్.. 9394731021.. 9396731021
*

- వుప్పల నరసింహం 9985781799