AADIVAVRAM - Others

భయంగొలిపే.. బన్ని ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగలు, ఉత్సవాలు, ఆచారాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. పండుగలు అంటేనే సంతోషాన్ని తెచ్చి పెడతాయి. అయితే బన్ని ఉత్సవం మాత్రం భయాన్నీ, గగుర్పాటును కలిగిస్తాయి. రక్త్ధారల మధ్య జరిగే బన్ని ఉత్సవాన్ని భక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం భక్తి, భయం మధ్య సాగుతుంది.
దేవరగట్టులో వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని భక్తులు దేవరగట్టు మల్లయ్యగా పిలుచుకొంటారు. తమకు పుట్టిన పిల్లలకు స్వామి పేరు పెట్టుకొని భక్తి భావాన్ని చాటుకొంటారు. కంకణధారణతో ప్రారంభమయ్యే దేవరగట్టు ఉత్సవాలు వసంతోత్సవంతో ముగుస్తాయి. పనె్నండు రోజులపాటు జరిగే దేవరగట్టు ఉత్సవాలలో విజయదశమి నాడు జరిగే బన్ని ఉత్సవం ప్రత్యేకత కలిగి ఉంది. బన్ని ఉత్సవం రోజున దేవరగట్టుకు లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. కర్నూలు జిల్లా ప్రజలే కాకుండా చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, సిరుగుప్ప, రాయచూర్, మాన్వి, గంగావతి, హోస్పేట్ మొదలగు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకొని ఉత్సవాల్లో పాల్గొంటారు.
బన్ని కార్యక్రమం రోజునే గట్టు మల్లయ్య ఉత్సవమూర్తులను నెరణికి గ్రామం నుంచి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన ప్రజలు, కర్రలు, ఆయుధాలు, కాగడాల వెలుగుల్లో తీసుకొని వస్తారు. ఆటవిక సంప్రదాయాన్ని బన్ని ఉత్సవం తలపిస్తుంది. కర్రలు, కాగడాలు డుర్..డుర్.. డుర్.. బహుపరాక్ అంటూ చేస్తున్న నినాదాలు భయాన్నీ, గగుర్పాటును కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే బన్ని ఉత్సవాలలో కర్రలతో తలలు పగలగొట్టుకోవడం, కాళ్లు చేతులకు దెబ్బలు తగలడం, ఒక్కో సందర్భంలో చనిపోవటం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ, సంప్రదాయం పేరున రక్త్ధారలు ప్రవహిస్తోంది. రక్తపాతం నివారించటానికి పోలీసు, రెవిన్యూ యంత్రాంగం చేస్తున్న కృషి ఫలించటంలేదు.
స్థల పురాణం
600 అడుగుల ఎత్తులో వున్న దేవరగట్టు కొండపైన మాళ మల్లేశ్వరస్వామి కొలువుతీరి ఉన్నారు. ఈ గట్టు మల్లయ్య క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. నెమళ్లు, జింకలు, కుందేళ్లు, పక్షుల కిలకిలారావాల మధ్య ప్రకృతి సోయగాలతో దేవరగట్టు క్షేత్రం మిగతా అన్ని రోజుల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బన్ని ఉత్సవం నాడు మాత్రం యుద్ధ్భూమిని తలపిస్తుంది. పూర్వం లోక కళ్యాణం కోసం దేవరగట్టులో మునులు తపస్సు చేస్తూ ఉంటే మణి మాళసురులు అనే రాక్షసులు మునీశ్వరులకు తపోభంగం కలిగిస్తూ వారిని హింసించేవారు. ఆ రాక్షసుల బాధ భరించలేక తమను కాపాడమని పరమేశ్వరుని ప్రార్థించారు. పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమైన శివుడు ఆ రాక్షసులను సంహరించి మునులను రక్షిస్తాడు. శివుని చేతిలో మరణిస్తున్న సమయంలో రాక్షసులు తమ చివరి కోరికగా ప్రతి సంవత్సరం ఒకరోజు తమకు నరబలి కావాలని కోరగా శివుడు నిరాకరించి, ఒక పిడికెడు రక్తం ఇవ్వటానికి అంగీకరించాడు. అప్పటి నుంచీ ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. కురువ కులస్థులకు గట్టుమల్లయ్య ఆరాధ్య దైవం. గట్టు మల్లయ్య ఉత్సవాలు ప్రారంభమైన వెంటనే గోరవయ్యలు నల్లటి దుస్తులు ధరించి, పిల్లనగ్రోవితో, ఢమరుకం చేతపట్టి గ్రామాల్లో నృత్యాలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.
దసరా పండుగ రోజు బన్ని ఉత్సవం రాత్రి ప్రారంభమవుతుంది. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ మూర్తులను నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థులు డోలుబండ వద్దకు తీసుకొని వచ్చి అక్కడ మూడు గ్రామాల ప్రజలు దేవుళ్లను రక్షించుకొనేందుకు వ్యక్తిగత కక్షలు పక్కన ఉంచుతామని బాసలు చేసుకొంటారు. డోలుబండ వద్దకు చేరగానే బాణాసంచా పేల్చి బహుపరాక్ అంటూ నినాదాలు చేస్తారు. కర్రలతో ఒకరినొకరు కొట్టుకొంటూ ఉత్సవ మూర్తులను రాక్షసపడ, శమీవృక్షం వరకు తీసుకొని వెళ్లి అక్కడ పూజలు చేసి, గోరవయ్య తొడలో దబ్బనంతో గుచ్చుకొని రక్తం తీసి ఆ రక్తాన్ని రాక్షసపడ వద్ద చల్లి, ఉత్సవ మూర్తులను శివసానం కట్ట వద్దకు చేర్చటంతో బన్ని కార్యక్రమం ముగుస్తుంది.
బన్నీ ఉత్సవం మొత్తం కర్రల యుద్ధం మధ్యనే సాగుతుంది.

-టి.ఈరన్న