Others

ఆశ్రీత జన వాత్సల్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. ఒకనాడు ‘ద్వైతవనం’లో ఉన్న మృగాలు కలలో కనబడ్డాయి. మహాత్మా మీ నివాసం వలన మేము అంతరించిపోతున్నాం. బీజమాత్రంగా మిగిలాం. మీరు నిండు మనుస్సతో కనికరించి మరొక అరణ్యానికి పోవచ్చును గదా! మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించాయి. ధర్మరాజు మేల్కొన్నాడు. తమ్ములను, భార్యను పిలిచి కల విషయం చెప్పాడు. ఈ వనంలో ఇరవై నెలలు ఉన్నాం. మరొకచోటికి పోదాం అని అందరూ అంగీకరించాక వారితో కామ్యక వనానికి చేరుకున్నాడు. పాండవులు కాలం గడుపుతూ ఒక రోజు తమ దుఃఖాలను నెమరువేసుకుంటున్నారు. అక్కడకు శ్రీ వేదవ్యాసుడు వచ్చాడు.
వేదవ్యాసుని లక్షణాలను ఎఱ్ఱన కవి అరణ్య పర్వంలో ఒక పద్యంలో మనోజ్ఞంగా వర్ణిస్తూ-

శా ప్రీతుండై చనుదెంచె నాశ్రీత జనాభీష్టక్రియాశీలుడు
ద్గీతామ్నాయుడు- నిర్విధూత దురిత క్లేశుండు- యోగామృత
స్ఫీత స్వాంతుడనంత -సంతత- సమావిర్భూత కారుణ్య ధా
రాతోయ స్నపనైకశీలుడు- పారాశర్యుడచ్చోటికిన్
శ్రీవేదవ్యాసుడు తన్నాశ్రయించిన జనుల మంచి కోర్కెలను తీర్చడమే శీలంగా అయినవాడు. పెద్దగా గానం చేయబడిన వేదాలు కలవాడు. పూర్తిగా తొలగింపబడిన పాపాల కష్టాలు కలవాడు. యోగం ఒక అమృతం. దానిచే బాగా బలం శక్తి పొందిన మనస్సు కలవాడు. అంతులేనీ, ఎడతెగనిదీ అయి ఏర్పడిన దయాధారలుగల నీటితో స్నానం చేయించే ఒకే ఒక ఆదర్శ ప్రవర్తనగలవాడు అయిన పరాశర మహర్షి సుతుడైన వ్యాసుడు పాండవులున్న వనానికి ప్రేమతో విచ్చేశాడు.
ఆయన మహిమ అపారమైనది. అనుగ్రహం కూడా ప్రసాదమే. ఆయనను ఎవరూ రమ్మని ఆహ్వనించలేదు. తనంత తానుగా వచ్చాడు. సచ్ఛీలం గలవారు తనను ఆశ్రయించినవారికి హితం గూర్చుటయే పనిగా తలంచి రావడం వాత్సల్య లక్షణం. ఆ మహాత్ముని మాటలో మనస్సులో నిరంతరమూ వేదాలే తిరుగుతుంటాయి. ఆయన వాఙ్మయ స్వరూపుడుగదా!
పెద్దరాశిగా వున్న వేదాలన్నిటినీ వేరు వేరుగా విభజించాడు కనుకనే వేదవ్యాసుడైనాడు. సర్వజ్ఞానమూ ఆయనలోనే నిండి వుంద గాన ఆయన ఆకారం ధరించిన జ్ఞానశీలుడు. అందులకే నన్నయగారు వ్యాసుని జనన వేళ ఆయన జ్ఞానంతో వెలిగిపోతూ కన్పడినాడని అంటూ ‘ఉద్యత్ జ్ఞానంబుతోడ నుదితుండయ్యెన్’ అని అభివర్ణించాడు. అది ఆయన జ్ఞాన లక్షణం. ఆయనలో అణువంత కూడా పాప చింతన, దానివలన కలిగే క్లేశం లేకపోవడమని కవి వర్ణిచాడు.
పాపాలు, క్లేశాలు లేకుండుట సహజం. ఆయన దర్శనమార్గంలో పడిన ప్రతి వ్యక్తికీ పాపాలు కష్టాలు పటాపంచలౌతాయని విశేషం. కావున ఆయన భగవల్లక్షణాలు కలవాడని భావం. అందుకే ‘వ్యాసాయ విష్ణురూపాయ’యనీ, ‘వ్యాసరూపాయ విష్ణవే’ అనీ శ్లోకం.
యోగామృతంతో ఆయన మనస్సు నిండిపోయినది. కర్మలయందు నేర్పు- సమత్వం- జీవాత్మ పరమాత్మల సంయోగం- యమ నియమాదులనే ఎనిమిది అంశాలున్నాయి. వీటినే మహా విద్యలంటారు. ఇవన్నీ వేదవ్యాసునికి అన్వయిస్తాయి. కాననే ఆయన యోగామృత స్ఫీతస్వాంతుడైనాడు. నిరంతరం పరమాత్మ భావనతో నిండి యుంటాడు. సర్వత్రా సమదర్శనం కల్గి, విశిష్ట గుణాలతో ప్రకాశిస్తూ వుండే మహాత్ముడు.
ఆయనలో కారుణ్యం- జాలి - దయ- వాత్సల్యం అనంతంగా నిండి వుంటాయి. అవి అనంతమైనవి. అంతులేనివి. నిరంతరం ఆయనలో వ్యాపించి యుండేవి. సద్యోజాత తత్త్వంగలవాడు. అనగా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాణంలో కావాలో అప్పుడు అక్కడ ఏర్పడేది. వీనినే సద్యోజాతుడంటారు. వేదాల్లో నారాయణ సూక్తంలో సద్యోజాతాయ వైనమో నమః సద్యోజాతం ప్రపద్యామ అని వుంది. సర్వభూతాంతరాత్ముడై సర్వకాలాల్లో విషమ భావన లేకుండా తల్లిలా వాత్సల్య భావంగలవాడు. సహజంగా ఏర్పడినది ఆయన శీలం. దాని శక్తి మరింత గొప్పగా వుంటుంది.
పరాశరుడు విష్ణుపురాణ ప్రవక్తగా ఖ్యాతిగాంచాడు. తండ్రి పేరున పారాశర్యుడైనాడు. పరమ భాగవతుల పంక్తిలో గణనీయ స్థానం గలవాడు. వ్యాసుడు సర్వలోకాలకూ మేలు చేయడం కొరకే సంయమశీలం కలవాడయినా సత్యవతిని ఒప్పించి కృష్ణద్వైపాయనుని పుత్రునిగా పొందాడు పరాశుడు. వారి కలయికలో జ్ఞాన సోపానాలేగాని, కామజ్వాలలు లేవు. సూర్యతేజస్సు గలవాడు ప్రకాశిస్తున్న జ్ఞాన కిరణాలుగలవాడు కృష్ణదైవపాయనుడు. అట్టివానిని లోకానికందించిన తండ్రి పేరుతో మహాత్మునిగా ఎఱ్ఱన మహాకవి మనోజ్ఞంగా వ్యాసుని వాత్సల్య లక్షణునిగా వర్ణించి కీర్తిగాంచాడు. పాండవులు భావించినంతనే వారి ఎదుట ప్రత్యక్షమై వారికి శాంతి వచనాలు బోధించి వారికి మనశ్శాంతిని అందించిన మానవీయుడు- మహనీయుడు- గురుపరంపరలో అగ్రతాంబూలం అందుకున్న వ్యాసుని సద్గురువుగా ఆరాధించుట యుగయుగాల ధర్మం. మానవతా లక్షణం. వాత్సల్యపూరిత మనస్సు సుఖశాంతులనందిస్తుంది. స్పందిస్తూ వుండే కోమలతత్త్వం వేదవ్యాసునిది.

-పి.వి.సీతారామమూర్తి 9490386015