Others

ఏడు పదుల నవ యువకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(2020 జనవరి 18న అదృష్టదీపక్ సప్తతి పూర్తి సందర్భంగా)
*
ప్రముఖ అభ్యుదయ కవి, కాలమిస్టు, గాయకుడు, నటుడు, కథకుడు అదృష్టదీపక్. దీపక్ సప్తతి పూర్తిచేసుకున్నారని విని విస్తుపోయిన వాళ్లలో నేనొకణ్ణి. అలాగని ఆయన్ని ఎరగనివాణ్ణేం కాదు. 1972 నుంచీ దీపక్‌తో పరిచయం వుంది. కాలక్రమేణా అది స్నేహంగా వృద్ధి చెందింది. అలా, నాలుగు పుష్కరాలుగా బాగా తెలిసినప్పటికీ దీపక్‌లో వృద్ధాప్యం ఛాయలు నాకెక్కడా గోచరించలేదు. పరిచయమయినప్పటి అమాయకత్వం అచ్చం అలాగే వుంది!
కొత్త విషయాలు నేర్చుకోవడమంటే ఆసక్తి అక్షరాలా అలాగే వుంది! స్వపర భేదాలు లేకుండా ‘కొత్త ప్రయోగాలు’ గురించి చర్చించే విషయంలో తత్పరత్వం అలాగే కొనసాగుతోంది! మాటల పుట్టుక గురించి దీపక్ వేసే ప్రశ్నలు వింటే ఆయన విశ్రాంత చరిత్రోపన్యాసకులు అనిపించదు- ఏ ఓరియెంటల్ కాలేజీ విద్యార్థో అనిపిస్తుంది! ముఖ్యంగా ఆంధ్రభూమి దినపత్రికలో దాదాపు నాలుగు నెలల కాలం ధారావాహికంగా వెలువడిన నా ‘పెరటిచెట్టు’ వ్యాసాల గురించి ఎప్పటికప్పుడు అక్షరాలా ప్రతిరోజూ రచయితతో చర్చించిన దీపక్ డెబ్భయ్యో పడి దాటి ఎనభయ్యో పడిలో పడుతున్నారని విన్నప్పుడు విస్తుపోక మరేం చెయ్యగలం?
డెబ్భయ్యేళ్ళ దీపక్, అర్థ శతాబ్దానికిపైగా సాహిత్య జీవనం సాగించారు. (దాన్ని సాహిత్య సేద్యం, సాహిత్య వ్యవసాయం అనడం నాకిష్టంలేదు. సాహిత్యమే జీవితంగా బతికారు కనుక సాహిత్య జీవనం అనడమే సరైందని నా నమ్మకం!) బాల్యంలోనే విభిన్న సాహితీ ప్రక్రియల్లో చొరబడి, గుర్తింపునూ, గౌరవాన్నీ సంపాదించుకున్నారు. 1950-60 దశకాలనాటికి, తెలుగులో హాస్య రచయితలు అనే తెగ ఒకటి వుండేది. మునిమాణిక్యం- భమిడిపాటి (కామేశ్వరరావు మేస్టారు) విశ్వనాథ కవిరాజు- పూ.ల.మూర్తి తదితరుల దారిలో మన హాస్య రచయితలు విజృంభించి రాశారు. ముళ్లపూడి వెంకటరమణ క్రమంగా ఈ నక్షత్ర కోటిలో అత్యంత ప్రకాశమానమయిన తారగా ఆవిర్భవించారు. రా.వి.శాస్ర్తీ, బీనాదేవి, పతంజలి తదితరుల రచనల్లో తళుక్కుమన్న హాస్యస్ఫోరకత వేరు. ఇక్కడ చెప్పుకున్న అచ్చు మచ్చు హాస్య రచయితల రచనల్లోని కాలక్షేప లక్షణం వేరు. దీపక్ మొదట్లో ఈ తెగలోనే సభ్యుడిగా వుండేవారు. ఆయనే రాసుకున్నట్లు, పది పనె్నండేళ్ల వయసులోనే కోకిలమ్మ పదాలు, జోకులు, చిట్టి కథలు లాంటి పాపులర్ రచనలు అచ్చేసి, దీపక్‌ని ఆనాటి హాస్య పత్రికలు తమ ఆస్థాన రచయితగా మార్చేసుకున్నాయి.
ఇంగ్లీష్‌లో ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ అనే జాతీయం ఒకటుంది. తెలుగులో ‘ఈడు రావడం’ లాంటి భావప్రకటనే ఇది కూడా. 1960 దశకం అంతం కావస్తూండగా, కవి అదృష్టదీపక్‌లో అలాంటి పరిణామమే సంభవించింది. శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రభావంతో దీపక్ సీరియస్ కవిగా అవతరించారు. అయితే కవిత్వ రచనకు దీపక్ ఎప్పుడూ భుజబలం ఉపయోగించలేదు. బుద్ధిబలానే్న వినియోగించారు ఆ కారణం చేతనే ఆయన తొలి సీరియస్ కవితా సంపుటి (అగ్ని) 1974 వరకూ వెలువడలేకపోయింది. మరో నాలుగయిదేళ్లకు గానీ మలి సీరియస్ కవితా సంపుటి (ప్రాణం) వెలువడలేదు. కారణం నాకూ తెలీదు కానీ, దాదాపు మూడు దశాబ్దాల పాటు దీపక్ కవితా సంకలనం అచ్చువేసుకోలేదు. 2008లో ‘అడవి’ వెలువడేనాటికి దీపక్ ప్రముఖ రచయితగా సువ్యవస్థితులు. అప్పటికి ఆయన సినిమా పాటల రచన మొదలుపెట్టి దాదాపు మూడు దశాబ్దాలు అయింది. ఆటు తర్వాత రెండు మూడేళ్ల కాలంలోనే దీపక్ రెండు మూడు పుస్తకాలు వెలువరించారు. వాటిల్లో ఒకటి సినిమా పాట సంకలనం (ఆశయాల పందిరిలో) కాగా, రెండు వ్యాస సంపుటులు. ఎప్పట్నుంచో కథలు రాస్తున్నప్పటికీ, 2016 నాటికి కానీ దీపక్ కథల పుస్తకం వెలువరించలేదు.
ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకప్పటి ఒకే ఒక్క తెలుగు మహానగరంగా ఉండిన మద్రాసులోనూ, వేల సంఖ్యలో మిత్రుల్ని మాత్రమే సంపాదించుకున్నారు దీపక్. తనకన్నా పాతికేళ్లు పెద్దవాళ్ళతోనూ, పది పదిహేనేళ్లు చిన్నవాళ్లతోనూ సమంగా స్నేహం చెయ్యగల ‘న్యాక్’ ఉంది దీపక్‌కి. ముఖ్యంగా, సాహిత్యంతో సంబంధమున్న మనుషులతో అతని బాంధవ్యం గాఢంగా పెనవేసుకుపోయేది. తన కన్నా పాతిక ముప్ఫైయేళ్లు పెద్దవారయిన రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, చాగంటి సోమయాజులు, నాజర్, సి.నారాయణరెడ్డి తదితరులతో గౌరవంతో కూడిన చనువుండేది. ఏటుకూరు ప్రసాద్, సి.రాఘవాచారి, పెద్ద్భిట్ల నారాయణరెడ్డి తదితరులతో గౌరవంతో కూడిన చనువుండేది ఆయనకి. తనకన్నా ఒక్క తరం ముందున్నవాళ్ళతో- అంటే, డాక్టర్ చెలికాని స్టాలిన్, డివివిఎస్ వర్మ, ఏటుకూరి ప్రసాద్, సి.రాఘవాచారి, పెద్ద్భిట్ల నిర్మలానంద, స్మైల్ తదితరులతోనూ అలాంటి చనువే ఉండేదాయనకి. కొంచెం హెచ్చుతగ్గులతో సమవయస్కులైన చందు సుబ్బారావు, విరియాల లక్ష్మీపతి, తనికెళ్ల భరణి, కార్టూనిస్టు మోహన్, సింగంపల్లి అశోక్‌కుమార్‌లతోనూ అలాంటి స్నేహమే వుండేది దీపక్‌కు. ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన వాళ్లందరూ వారి వారి రంగాల్లో ప్రసిద్ధులు. ఈ వాస్తవం దీపక్ వ్యక్తిత్వంలోని వైవిధ్యానికి అద్దంపడుతోంది.
ఈనెల 18న దీపక్ డెబ్భయ్యేళ్ల మైలురాయిని దాటుతారు. ఆ సందర్భంగా ఆయన తన జ్ఞాపకాలను ‘తెరచిన పుస్తకం’ పేరిట సంకల్పించడం చక్కగా వుంది. త్వరలో విడుదలకానున్న ఈ పుస్తకంలో 33 వ్యాసాలున్నాయని విన్నప్పుడు, రచయితల జ్ఞాపకాల జల్లెడలోంచి బోలెడన్ని ఆణిముత్యలను ఏరుకోవచ్చు కదా అనిపించింది. దీపక్ జీవితంలోని విపులత్వం గురించి ప్రత్యక్షంగా తెలిసిన నాలాంటివాళ్లకు అలా అనిపించడం సహజం!

'చిత్రం...అదృష్టదీపక్

-మందలపర్తి కిషోర్ , 8179691822