AADIVAVRAM - Others

నూతన దశాబ్దిలోకి సంతోషంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో సాధించాలన్న తపన..
ఇంకేదో కోల్పోతున్నామన్న ఆవేదన..
ఏవేవో కొత్త పరిచయాలు..
ఇంకెందరో కొత్త స్నేహితులు..
తెలియకుండానే సంవత్సరకాలం గడిచి..
మరో నూతన సంవత్సరంలోకి..
మరో నూతన దశాబ్దిలోకి స్వాగతం పలుకుతోంది కాలం..
ఈ నూతన సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది వేడుకల వెనుక బోలెడు ఆసక్తికర విషయాలు, ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చదివేద్దామా..!
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం రోమ్ పట్టణంలో మొదలైనట్లు చెబుతారు. క్రీస్తు కంటే ముందు 700 సంవత్సరంలో రోమ్ చక్రవర్తి న్యూమా పాంటీలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను కొత్తగా కేలండర్‌లో చేర్చినట్లు చెబుతారు. అంతకుముందు వరకు నూతన సంవత్సరం మార్చిలో మొదలై డిసెంబరుతో ముగిసేది. కేవలం పదినెలల పాటే రోమన్ కేలండర్ కొనసాగేది. ఏడాదిలో ఉండే రోజులన్నీ ఆ పదినెలల్లోనే సర్దుబాటు చేశారు. పాంటీలియస్ చక్రవర్తి జనవరి, ఫిబ్రవరిలను జత చేయడంతో జనవరి ఒకటి నూతన సంవత్సరం తొలిరోజుగా మారింది.
క్రిస్టియన్ శకంలోని మధ్యకాలంలో యూరోప్ ప్రాంతంలో జీసస్ జన్మదినమైన డిసెంబర్ 25న, అలాగే మార్చి 25న నూతన సంవత్సరం జరుపుకేవారు. 1582లో మరింత కచ్చితత్వంతో గ్రెగేరియన్ కేలండర్ అందుబాటులోకి వచ్చినా కూడా 1752 వరకు బ్రిటీష్ రాజ్యం, అమెరికన్ కాలనీలు మాత్రం మార్చిలోనే నూతన సంవత్సరాన్ని జరుపుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా అమెరికా దేశాలు జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. ఫలితంగా ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు వ్యాపించింది.
ఆసక్తికర అంశాలు
* నూతన సంవత్సరం మొదలయ్యే క్షణంలో ప్రియురాలిని ముద్దుపెట్టుకుంటూ గడపాలని నలభై నాలుగు శాతం మంది అమెరికా యువతీయువకులు భావిస్తున్నారట.
* దాదాపు అరవై ఆరు శాతం మంది ఒకటో తేదీన దైవప్రార్థన తప్పనిసరి అంటున్నారు.
* అమెరికాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి గడియారం పనె్నండు కొట్టిన తరువాత ముద్దుతో పవిత్రతను చేకూర్చుకుని, దుష్ట ఆత్మలను తరిమి కొట్టడానికి పెద్దపెద్దగా శబ్దాలు చేస్తారు.
* ఇంగ్లండులో కూడా నూతన సంవత్సర ప్రారంభ సమయంలో వచ్చే తొలి అతిథి తమకు కానుకలను తెచ్చివ్వాలని కోరుకుంటారు. కానుకలు తెచ్చే వ్యక్తి ముందు ద్వారం నుంచి లోపలికి వచ్చి వెనుక ద్వారం నుంచి నిష్క్రమించడాన్ని సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆ సమయంలో ఖాళీ చేతులతో వచ్చ అతిథిని లేదా తమంటే ఇష్టపడని వారిని ముందుగా ఇంటి లోపలికి ప్రవేశించకుండా చేస్తారు.
* నూతన సంవత్సరం వచ్చే క్షణంలో సంబరాల ప్రస్తావనేమీ లేకుండానే నిద్రకే ప్రాధాన్యం ఇస్తున్న వారి శాతం దాదాపు అరవై పైనేనట.
* నూతన సంవత్సర సంబరాల్లో అత్యధిక వైన్‌ను వినియోగించేది అమెరికనే్లనట.
* మెక్సికన్లు అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్షపండ్లను తింటారు. ఆ వెంటనే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
* పెరూలో కూడా ఇదేవిధంగా పనె్నండు ద్రాక్షలను తినడంతో పాటు ఎక్స్‌ట్రా 13వ ద్రాక్షను కూడా తింటారట. కాకపోతే ఆ ద్రాక్ష తమ అదృష్టాన్ని బీమా చేయిస్తుందని వారి నమ్మకం.
* జపాన్‌లో అయితే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తమ ఇంటి ముందు వెదురుబద్దలతో అలంకరించుకుంటారు. వెదురు ఉదాత్తమైన భావాలకు, ఆశయాలకు చిహ్నాలుగా భావిస్తారు.
* గ్రీస్‌లో అయితే నూతన సంవత్సర ప్రారంభం రోజున బ్రెడ్ పీస్‌లో కాయిన్ ఉంచి.. అందరికీ బ్రెడ్‌ను అందిస్తారు. ఎవరికైతే కాయిన్ ఉన్న బ్రెడ్ వస్తుందో వారిని దేవుడు అనుగ్రహించినట్లు భావిస్తారు. అలాగే కొంతమంది ముగిసిపోయిన సంవత్సరంలో తమను
బాధపెట్టిన విషయాలను, తప్పులను ఒక పేపర్‌పై రాసి దాన్ని మంటల్లో వేస్తారు. ఈ చర్య ద్వారా తమలోంచి ఆ ప్రతికూలత తొలగించుకున్నట్లు వారు భావిస్తారు.
* నార్వేలో కూడా కొత్తసంవత్సర ప్రారంభం రోజున రైస్ పుడ్డింగ్‌లో ఆల్మండ్ పెట్టి వండుతారు. ఆ పదార్థాన్ని వడ్డించినప్పుడు ఎవరికైతే ఆల్మండ్ వస్తుందో వారికి ఆ సంవత్సరం సంపద వస్తుందని నమ్ముతారు.
* సిసిలీలో కొత్తసంవత్సరం రోజున లసగ్నను వడ్డిస్తారు. ఇతర నూడిల్స్‌ను వారు ఆ రోజు చేయరు. అది దురదృష్టాన్ని తెస్తాయని వారి నమ్మకం.
* ప్రపంచమంతా 2020లోకి అడుగుపెడుతుంటే ఇథియోపియాలో మాత్రం ప్రస్తుతం 2012వ సంవత్సరం నడుస్తోంది. ఇథియోపియా వాళ్ల కాలెండర్లో మొత్తం పదమూడు నెలలు ఉంటాయి. పనె్నండు నెలలు.. ఒక్కోటి ముప్ఫై రోజులు ఉండగా.. పదమూడో నెలలో మామూలు సంవత్సరం ఐదు రోజులు, లీపు సంవత్సరంలో ఆరు రోజులూ ఉంటాయట. ఈ నెలను వారు ‘ఇంటర్ కాలరీ నెల’ అంటారు. వాళ్లు నవంబర్ 11న (లీపు సంవత్సరం ముందు ఏడాదైతే 12న) నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. 2019 నవంబరులో వాళ్లు 2012వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. క్రీస్తు జనన సంవత్సరం గురించిన విషయంలో అక్కడ చర్చ్‌లు అనుసరించే లెక్కలకూ, మిగతా దేశాల చర్చ్‌ల్లో లెక్కలకూ తేడావల్లే ఇలా జరుగుతోంది.
* రష్యాలో నూతన సంవత్సర వేడుకల్ని రెండుసార్లు జరుపుకుంటారు. జనవరి ఒకటిన కొత్త కేలండర్ ప్రకారం, రెండోది జనవరి 14న పాత కేలండర్ ప్రకారం జరుపుకుంటారు.
* నూతన సంవత్సరాన్ని జనవరి ఒకటిన జరుపుకోని దేశాల్లో చైనా, కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం ఉన్నాయి. ఆయాదేశాల కేలండర్ల ప్రకారం నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.
* న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ గార్డెన్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపునేందుకు దాదాపు పదిలక్షల మంది ఒకచోట చేరతారట. అందులో ఐదో వంతు వివిధ దేశాల నుంచి వేడుకను చూసేందుకు వచ్చేవారేనట. ఇక్కడ దాదాపు 900 కిలోల రంగు కాగితపు ముక్కలను జనంపైకి చల్లుతారట.
* కొత్త ఏడాది వచ్చిన వెంటనే మనం చూసే వ్యక్తిని బట్టి మంచి లేదా చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారట. అందుకే చాలా దేశాల్లో ఆ సమయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి ఉండేందుకు ఇష్టపడతారట.
* ప్లాండర్స్ (బెల్జియం), నెదర్లాండ్స్‌లో ఏడో శతాబ్దంలో సంవత్సరం మొదటిరోజున బహుమతులు ఇచ్చుకునే సంప్రదాయం మొదలైంది.
గడచిన ఏడాది కొందరి జీవితాల్లో ఆనందానికి చోటిస్తే మరికొందరిలో అంతులేని వేదనని, రోదనని మిగిల్చి ఉంటుంది. వచ్చే సంవత్సరం అయినా ఆ వేదనలు తొలగిపోయి అంతులేని సంతోషాలు దరిచేరాలని 2019కి ప్రేమగా వీడ్కోలు పలుకుతూ ఆనందంగా 2020కి ఆహ్వానం పలుకుదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..
*
నెలల పేర్లు
* ప్రారంభానికి ఆదిదేవత అయిన రోమ్ దేవత ‘జానూస్’ పేరిట తొలినెలకు ‘జనవరి’ అని నామకరణం చేశారు. జానూస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి గతం వైపు చూస్తుంటే.. మరోటి భవిష్యత్తు వైపు చూస్తుంటుంది.
* ‘ఫెరు’ అనే రోమన్ పండుగ పేరు నుంచి ‘్ఫబ్రవరి’ నెల పేరు ఏర్పడింది.
* రోమన్‌ల యుద్ధ దేవత పేరును అనుసరించి ‘మార్చి’ నెల పేరు ఏర్పడింది.
* ‘ఎపెరిర్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘ఏప్రిల్’ నెల పేరు ఏర్పడింది.
* రోమన్‌ల దేవి పేరు ‘మయిమా’.. ఈ పదం నుండి ‘మే’ నెల ఏర్పడింది.
* ‘స్వర్గానికి రాణి జానో’.. ఈ పదం నుండి ‘జూన్’ నెల ఏర్పడింది.
* ‘జూలియస్ సీజర్’ పేరు నుంచి ‘జులై’ నెల పేరు వచ్చింది.
* రోమ్ చక్రవర్తి పేరు ‘అగస్టన్’. ఈ పేరు ఆధారంగా ‘ఆగస్ట్’ నెల పేరు ఏర్పడింది.
* లాటిన్ భాషలోని ఆధారంగా ‘సెప్టెంబర్’ నెల పేరు వచ్చింది.
* ‘అకో’ అనే లాటిన్ శబ్దం నుండి ‘అక్టోబర్’ నెల పేరు ఏర్పడింది.
* ‘నవమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘నవంబర్’ నెల పేరు వచ్చింది.
* ‘డసమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘డిసెంబర్’ నెల పేరు వచ్చింది.

- సన్నిధి