AADIVAVRAM - Others

‘మనోహర’ చిత్రాల చిరునామా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చట్రంలో ఒదిగిపోయి పని చేయడం తనకు కుదరదని, సంపూర్ణ స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, ఆలోచనలను మధిస్తూ రంగుల పదనిసలు సాగించడం తనకెంతో ఇష్టమని శిల్పి, చిత్రకారుడు చిలువేరు మనోహర్ అంటున్నారు.
ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలోని బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో తనదైన ప్రత్యేక శైలిలో బహిరంగ చిత్రరచన (లైవ్ పెయింటింగ్) చేశారు. పిల్లలు.. పెద్దలు చుట్టూ గుమిగూడి ఉండగా నేలపై ఓ ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై ఓ పెద్ద కాన్వాసు పెట్టి, పెద్ద బ్రష్‌లతో అనేక రంగులతో తన మానసిక స్థితికి అద్దం పట్టే నైరూప్య చిత్రాలను గీశారు. ఎలాంటి ఆలోచనలు.. భావాలు ముందుగా అనుకోకుండా ఆ క్షణంలో మనసులో మెదిలే.. కదిలే రంగుల - రేఖలను కాన్వాసుపై తీసుకురావడమే ఈ శైలి ప్రత్యేకత అని మనోహర్ అంటున్నారు. స్టూడియోలో అయితే ముందుగా ఊహించుకుని, స్కెచ్ గీసుకుని, అవసరమైతే నోట్స్ రాసుకుని ఓ ప్రణాళిక ప్రకారం కాన్వాసుపై బొమ్మ గీయడం జరుగుతుందని, తాను గీసే బహిరంగ చిత్రరచన దానికి పూర్తి భిన్నమని, ఎలాంటి ప్రణాళిక పద్ధతి లేకుండానే కుంచె పట్టుకుని ఆ క్షణపు మనోభావాలకు రంగుల రూపం ఇవ్వడం ఈ బహిరంగ చిత్రరచన అని ఆయన చెప్పారు.
నిజ జీవితంలో ధ్యానం చేస్తే మెదడు ప్రశాంతంగా ఉంటుందని, అందుకోసం ప్రయత్నిస్తారు.. ధ్యానం చేసేప్పుడు ఇతర ఆలోచనల్ని దరి చేరనీయొద్దని ఎంత కట్టడి చేసినా అనేక ఆలోచనలు ముసురుతాయని.. మనిషి మెదడుకున్న లక్షణమే అదని.. అలాంటి స్వభావంగల మనిషి ఆలోచనల్ని కొన్ని ‘క్షణాలపాటు’ పక్కకు నెట్టి శూన్యంలోకి చేరుకుని మనసు పలికే మాటలు వింటూ తాదాత్మ్యంలో కాన్వాసుపై రంగులు పూయడం అది ఏ రూపం తీసుకుంటుందో తెలియదని, ఆ ‘సమయం’లో చర్య - ప్రతిచర్య.. బింబం.. ప్రతిబింబం.. నాడీ మండలం పని చేస్తుంటే దానికి ప్రతీకగా రంగుల.. రేఖల వృష్టి జరుగుతుందని ఆయన అంటున్నారు. గతంలోనూ.. ఇటీవల ఈ ప్రత్యేక శైలిలో నైరూప్య చిత్రాలను గీశానని ఆయన చెబుతున్నారు.
కాన్వాస్‌పై రంగులు ఎలా పరచుకుంటున్నాయి.. వాటిని ఎలా సమతూకం (బాలెన్స్) చేయాలి? ఈ దృష్టి కోణంతో మనసు - కుంచె కదులుతుందని ఆయన తన అనుభవాన్ని చెప్పారు. ఆ తాదాత్మ్యత (ట్రాన్స్)లో బాహ్య ప్రపంచం మరిచి రంగుల ప్రపంచంలోకి జారుకుని ఓ కొత్త ‘ముఖద్వారం’ సృష్టించడం జరుగుతుందంటున్నారు.
అలా నిష్టతో నాలుగైదు చిత్రాలు (పెయింటింగ్స్) గీయడంతో ధ్యానం చేసిన భావన, చిత్రకళతో రమించడం, ప్రదర్శించడం జరుగుతుందని కూడా ఆయన అంటున్నారు.
వాస్తవానికిదొక ప్రత్యేక వ్యక్తీకరణ ప్రక్రియ. ఇందులో చిలువేరు మనోహర్ సాధన చేసి తనదైన సిగ్నేచర్ శైలిని నెలకొల్పారు.
స్టూడియోలో గాని, ఇంట్లో గాని కాన్వాస్‌పై, కాగితంపై బొమ్మలు గీసి, గ్యాలరీలలో పెట్టి అమ్మే విధానాన్ని ఆయన అంతగా ఇష్టపడరు. చిత్రకళ అంటే ఓ వేడుక, ఆనందం, ఓ అపురూప సందర్భం.. దాన్ని అలాగే ఆస్వాదించాలని, ధనం.. డబ్బు అనేది చిత్రకళ సైడ్ ఎఫెక్ట్‌గా ఉండాలి తప్ప డబ్బు.. సంపాదన కోసమే చిత్రకళ అన్నది సబబైనది కాదని మనోహర్ మనస్ఫూర్తిగా విశ్వసించి ఆచరణలో పెడుతున్నారు. సమకాలీన చిత్రకళ (కాంటెంపరరీ ఆర్ట్) ఎప్పుడూ అమ్మకాలు - కొనుగోళ్లు.. డబ్బు.. కీర్తిప్రతిష్టల చుట్టూ గాక ప్రత్యేక పంథాలో కొనసాగుతూ ఉంటుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ధోరణి అని ఆయన చెబుతున్నారు.
పాశ్చాత్య దేశాల్లో చాలా గ్యాలరీలు కొంతమంది ఉత్తమ చిత్రకారుల శైలిని, సిద్ధాంతాన్ని, విద్వత్‌ను పసిగట్టి అతనికి అవసరమైన ‘పెట్టుబడి’ని ముందే ఇచ్చి ఆ చిత్రకారుడిని పోషిస్తారని, ఆ చిత్రకారుడు జీవన శైలిని, చిత్రాలను క్రోడీకరించి (కాటల్యాగ్) ఆర్ట్ లవర్స్‌కు అందిస్తారని, ఆ విధంగా సరికొత్త చిత్రకళ తెరపైకి బలంగా ఉబికి వస్తుందని ఆయన వివరించారు.
తానిప్పుడు ఆ మార్గంలో పయనిస్తున్నానని, ఆ భావజాలంతో ముందుకు కదులుతున్నానని అందులో భాగంగా అనేక దేశాలు, ఆ దేశాల్లోని ప్రముఖ నగరాలు తిరిగానని ఆయన చెప్పారు. ఇప్పటికే వివిధ ప్రముఖ నగరాలలో మనోహర్ చిలువేరు అంటే భారీ స్థాయి చిత్రకళ ఈవెంట్స్, శిల్పం, పబ్లిక్ ఇన్‌స్టాలేషన్స్ అని గుర్తు చేసుకుంటారు. 2017 సం. రోమ్‌లో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ ‘మామ్’లో మనోహర్ తన చిత్రకళ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. భారత్‌లోని పూణె, కొచ్చిలో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ భారీ చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. 2015 సం.లో వెనిస్‌లోనూ ఈవెంట్ చేశారు. వివిధ శీర్షికలతో ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాల్లోనూ ఆయన తన సృజనాత్మకతను కళాప్రియుల ముందు ప్రదర్శించారు.
ఆయన కలిసి ప్రాజెక్టు ప్రపంచంలోని 24 ప్రముఖ నగరాలను సందర్శించి ‘ఒడిస్సీ’ పేర ఓ వినూత్న పంథాలో చిత్రరచనను భద్రపరిచే పనిలో ఉన్నారు. ఇప్పటికే బార్సిలోనా, రోమ్, కైరో, వెనిస్ తదితర నగరాలను చుట్టి వచ్చారు. ఆయా నగరాల్లోని చిత్రకారులను పరిచయం చేసుకుని, వారితో భావాలను పంచుకుని, ఆయా నగరాల జీవితాన్ని అవగతం చేసుకుని కొన్ని చిత్రాలు గీసి వాటిని ప్రదర్శించి, అనుభవాలను, అనుభూతుల్ని చిత్రాలను గ్రంథస్థం చేయడం, ఇందులో భాగంగా పెట్టుకున్నారు. దీనే్న ట్రావెల్ ప్రాజెక్టుగా... ఒడిస్సీ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. ఈ పర్యటన వల్ల ప్రపంచ చిత్రరచన, దాని వైభవం.. వైభోగం.. జీవితం.. నూతన భావం, ప్రయోగశీలత, విస్తృతి, విద్వత్, రంగుల అల్కెమీ అన్నీ అవగతమవుతాయని ఆయన అంటున్నారు.
ఈ చొరవతో ఆయన అనేక అంతర్జాతీయ మ్యూజియాలలో, గ్యాలరీలలో ‘స్థానం’ సంపాదించుకుని, తన సృజనను వారు ఆస్వాదించేలా చేశారు. ఆ రకంగా ఆయన ఇప్పుడు అంతర్జాతీయ చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్యాలరీలలో ‘స్థానం’ సంపాదించడం, వారి మెప్పు పొందడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఆయన అన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసి, సృజనాత్మకతపై గురి ఉన్నప్పుడు, సమకాలీన చిత్రకళపై పట్టు సంపాదించినప్పుడే ఇది సాధ్యమవుతుందని కూడా ఆయన చెప్పారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ఆవరణలో ‘అన్‌లిమిటెడ్’ శీర్షికతో బహిరంగ చిత్రరచన చేసిన రోజు సాయంత్రం మనోహర్ ఫ్రెంచ్ సాంస్కృతిక సంస్థ అలయన్స్ ప్రాంకైస్ కేంద్రంలో తన పెయింటింగ్స్, శిల్పాలు ఇతర సృజనాత్మకత వస్తువులను ప్రదర్శించారు. దీనికి ఆయన ప్రేమ (లవ్) శాంతి (పీస్) సమతూకం (బ్యాలెన్స్) అన్న శీర్షిక పెట్టారు. ఈ ప్రపంచానికి ఈ మూడింటి అవసరం ఎంతో ఉందని ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకనుగుణమైన భారీ పెయింటింగ్స్‌ను ప్రదర్శనలో పెట్టారు. అక్రలిక్, ఆయిల్ ఆధారిత రంగుల్లో బొమ్మలతోపాటు అనేక శిల్పాలు చూపరులను ఆకర్షించాయి. అందులో ఎన్నదగినది.. భూగోళాన్ని ప్రేమాకారంగా మార్చి అందులో సమస్త జీవుల మధ్య ప్రేమను ప్రదర్శించిన శిల్పం. ఇలా ఎంతో వైవిధ్యం ప్రదర్శించి, ప్రపంచ చిత్రకారుల్ని ఆకర్షిస్తున్న చిలువేరు మనోహర్ వరంగల్ పట్టణంలో 1970 సం.లో జన్మించారు. బాల్యం నుంచే చిత్రాల పట్ల, రంగుల పట్ల ఆసక్తి ఉండటంతో బాలల దినోత్సవం నాడు తరగతి గదిని అలంకరించడంలో ముందుండేవాడు. ఆ రకంగా బహుమతులను తన తరగతికి సంపాదించి పెట్టాడు. చదువుపైకన్నా చిత్రరచన పైనే ఆసక్తి అధికంగా ఉండటంతో చదువులో అంతగా రాణించలేదు. పెరిగి పెద్దై ఎలా బతుకుతారని అందరూ ‘సానుభూతి’ ప్రదర్శించారు. ఈ ‘వాతావరణం’ తనను మరింత ‘అంతర్ముఖుడి’ని చేసిందని మనోహర్ చెప్పారు. పట్టణంలోని సినిమా థియేటర్ల వద్ద కనిపించే కటౌట్‌లను ఆరాధించి అదే ‘ఆర్ట్’ అనుకుని అందులో రాణించాలని హైదరాబాద్‌కు 1990లో చేరుకున్నాడు. ఆత్మస్థైర్యం పెరిగేందుకుగాను రామకృష్ణ మఠంలో కొన్ని నెలలు ఆంగ్ల భాషా తరగతులకు హాజరై.. అది కూడా మనసుకు నచ్చక సినిమా హోర్డింగ్‌లు తయారుచేసే నాగేశ్వరరావు దగ్గర సహాయకుడిగా చేరారు. అలా కొంతకాలం గడిచాక నిజమైన చిత్రరచన (ఆర్ట్) ఇది కాదని తెలుసుకుని మాసాబ్ ట్యాంక్‌లోని జెఎన్‌టియులో బిఎఫ్‌ఏ కోర్సులో చేరారు. అక్కడ ‘శిల్పం’ స్పెషలైజేషన్‌గా 1996లో కోర్సు పూర్తి చేశారు. సరోజిని నాయుడు పర్‌ఫార్మింగ్ ఆర్ట్ సెంటర్‌లో లక్ష్మాగౌడ్ నేతృత్వంలో ప్రింట్‌మేకింగ్ ప్రధాన అంశంగా 1998లో ఎంఎఫ్‌ఏలో చేరి పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం బరోడా వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఇక తన మనసు చెప్పే రీతిలో తన జీవితాన్ని చిత్రరచనను మలచుకుంటూ ఉన్నారు. దాని పర్యవసానమే శిల్పిగా, చిత్రకారుడిగా, ఆర్ట్ ఈవెంట్ చేసేవాడిగా, ఇన్‌స్టాలేషన్స్ రూపకర్తగా, అంతర్జాతీయ చిత్రకారుల సరసన నిలబడి తెలుగు వారి సృజనను, కౌశలాన్ని, కళాత్మకతను సరికొత్తగా తన ‘సత్తా’ను చాటుతున్నారు. వరంగల్ మట్టి వాసనను, పరిమళాన్ని ప్రపంచానికి మనోహరంగా పంచుతున్నారు.
*
''చిత్రాలు.. చిలువేరు మనోహర్.. 9394103223
*

-వుప్పల నరసింహం 9985 781799