AADIVAVRAM - Others

పండ్లమ్ముతున్న పెద్దాయన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై కిలోల పండ్ల బుట్టను
అరవై ఏళ్ల నెత్తి మీద మోస్తూ..
రోడ్డు మీద పడి తిరుగుతూ
‘కమలా కాయలు.. కమలా కాయలు’
అని అరుస్తూ..

అంత బరువు పైన పడినా
నలగని చిరునవ్వుల పూలు వెదజల్లుతూనే
బతుకు బరువు తొక్కి పెడుతున్నా
తొణకని స్వరంలో భాస్వరం ప్రజ్వరిల్లుతూనే..

బతుకంటే
చేతుల్ని పైన పెట్టి బతికించటమే
నంటాడు చావంటే
చేతుల్ని కింద పెట్టి చంపేయటమే నంటాడు...

భార్య ఆయన్ను వదిలేసి పైకెళ్లి పదేళ్లయింది
బాధ్యతల్ని వదిలేసి బిడ్డలు పాతాళంలో పడి పాతికేళ్లయింది..
అతని దేహం మీద దాడి చేసి
గాయాల గుర్తులు పెట్టిన ముసలితనం
అతని మనసు మీద మాత్రం
దాడి చేయాలంటే ఇంకా
భయపడుతూనే ఉంది...

నాలుగు బజార్లలో నాలుగు దిక్కులలో
నాలుగు కళ్లు పెట్టుకొని
పెద్దాయన తిరుగుతుంటే
నాలుగు ముఖాలతో తన సృజనను
చూసుకోటానికి
నేలమీదకొచ్చిన బ్రహ్మదేవుడిలా కనిపిస్తాడు...

కష్టాల నష్టాల బతుకు ప్రపంచం మీద
ఆధిపత్యం చెలాయిస్తున్న పేదవాడు
ఆత్మవిశ్వాసంతో ప్రపంచ దేశాల్ని
జయించిన అలెగ్జాండరు...

అన్ని వందల కమలాకాయల్ని
అలవోకగా మోస్తున్న
ఆ ఒక్క పండు ముసలి కమలాకాయ దృశ్యం
చూపరుల సుకుమార మనసుల్లో
శాశ్వతంగా నిలిచిపోయే
దయనీయ జీవన చిత్రం.
*

-డా.రావి రంగారావు.. 9247581825