Others

సైనికుడే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సైనిక సిబ్బందికి జాతి యావత్తూ సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో ఏటా డిసెంబర్ 7న ‘సాయుధ దళాల పతాక దినోత్సవం’ పాటిస్తున్నాం. సైనిక సిబ్బంది సంక్షేమం కోసం ఈజున విరాళాలు వసూలు చేస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రక్షణ సిబ్బంది సంక్షేమ నిర్వహణ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. రక్షణమంత్రి నేతృత్వంలో 1949 ఆగస్టు 28న ఏర్పడిన కమిటీ ఏటా డిసెంబర్ 7న జాతీయ పతాక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈరోజున ప్రజలకు జాతీయ జెండాలను పంచి విరాళాలను సేకరిస్తారు. దేశరక్షణ కోసం పోరాడే సైనిక సిబ్బంది కుటుంబీకులు, వారిపై ఆధారపడిన వారి సంక్షేమంలో సాధారణ ప్రజలు సైతం పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో పాటిస్తున్న జాతీయ పతాక దినోత్సవానికి ప్రాధాన్యత లభించింది.
‘యుద్ధంలో నీకు అత్యంత విలువైనది ఏది?’ అని ఎవరైనా అడిగినప్పుడు ఏ దేశ సైనికుడైనా ‘రైఫిల్’ అనే చెబుతాడు. అతడికి రైఫిల్ విలువైనదే కావచ్చు. కానీ దేశ పౌరులకు అతడి ప్రాణం విలువైనది. అందుకే దేశానికీ, దేశాధినేతలకూ ఇచ్చినంత గౌరవాన్ని మనం సైనికుడికీ ఇవ్వాలి. ప్రతికూల పరిస్థితులలో సైతం నిగ్రహంతో సైనికులు తమ విధులలో నిమగ్నమై ఉండటం, దేశ సరిహద్దులను కంటికి రెప్పలా వారు కాపాడడం శ్లాఘనీయం. సైనికుడు దేశాన్ని కాపాడితే, సైనికుడి కుటుంబాలను దేశ పౌరులు కాపాడాలన్న ఆలోచన అందరిలో ఉండాలి. ఎదురుపడిన సైనికుడికి వందనం చేయడం మాత్రమే కాదు, అతనికి ఏ విధంగా సహాయపడగలను? అని అందరూ ఆలోచించాలి. దేశరక్షణ కోసం అమరులైన వీర జవాన్ల త్యాగాలను జాతి సదా స్మరించుకోవాలి. ఈ దేశం నిశ్చింతగా ఉందంటే సైనికుల త్యాగాల ఫలమే. వారి సేవలు దేశం ఎప్పుడు మరువదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ధైర్యంగా పోరాడుతూ తమ ప్రాణాలను పోగొట్టుకున్న వీరజవాన్ల కుటుంబాలకు జోహార్లు.
ప్రజల ఆకలిని తీర్చే బాధ్యతను రైతు తన భుజాలమీద వేసుకుంటే, దేశ పౌరులంతా నిశ్చింతగా ఉండేందుకు సైనికుడు తన ప్రాణాలను పణంగా పెడతాడు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచడానికి... ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు ఎల్లవేళలా సైనికుడు ముందడుగు వేస్తుంటాడు. అందుకే సైన్యంలో పనిచేసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి యువకులు ముందుకు రావాలి. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పలు రకాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. యుద్ధంలో అసమాన ప్రతిభ చూపిన వారితోపాటు, తమ తెలివితేటలతో, ధైర్యసాహసాలతో దేశానికి రక్షణగా నిలుస్తున్న వారికీ ఎన్నో అవార్డులను సైతం అందిస్తోంది. పరమవీరచక్ర, అశోక చక్ర, మహావీర చక్ర, కీర్తిచక్ర, వీర చక్ర, శౌర్యచక్రలతోపాటు సేవా పతకం, విశిష్టసేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, ఉత్తమ్ యుద్ధ సేవా పతకాలు అందిస్తోంది. ఒక్కో పతకాన్ని, అవార్డునుబట్టి గౌరవ వేతనం కూడా అందిస్తారు.
సైన్యంలో పనిచేయడం గర్వంగా భావించాల్సిన అంశం. ఏ ఇతర ఉద్యోగాల్లో లేని తృప్తి ఇందులో దొరుకుతుంది. శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తూ చేసే సేవ ఉన్నతమైనది. సమాజంలో గౌరవం, ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వీరి కుటుంబ సభ్యుల గురించి కూడా రక్షణ శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది.
మిలటరీలో చేరి శిక్షణ తీసుకున్న వారికి వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నతంగా ఎదగడంలో ఈ శిక్షణ ఎంతగానో తోడ్పడుతుంది. సొంత లాభం మానుకుని వీరు దేశభద్రత కోసం పోరాడుతారు. దేశంలోని 126 కోట్ల పైచిలుకు మంది ప్రజల భద్రత సైనికుల చేతుల్లో ఉందని, దేశానికి నిజమైన సేవకులు సైనికులే. దేశంలో బాలికలకు మొదటిసారి మిజోరం సైనిక పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. అక్కడ విజయవంతం కావటంతో దేశవ్యాప్తంగా అన్ని సైనిక పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బాలికల విభాగం ఏర్పాటు చేయనున్నారు.
తల్లిదండ్రులు ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇలా పెరిగిన పిల్లలు మాత్రమే పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకుంటారు. దేశం కోసం పరితపించే వారిలోనే నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను గుర్తిస్తాడు. పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కుటుంబ పెద్దలు కృషిచేయాలి.
దేశాన్ని తీర్చిదిద్దే విషయంలో యువత ఆలోచనల్లో మార్పురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే అలనాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, నేడు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు కారణం. ఎముకలు కొరికే చలిలో దేశం కోసం పనిచేస్తున్న సైనికుల గురించి నేటి యువత ఆలోచించాలి. యువతకు తప్పనిసరిగా సైన్యంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగపూర్‌తోపాటు మరికొన్ని దేశాలు యువతీ యువకులకు ఆరు నెలలు లేదా ఏడాది కాలంపాటు సైనిక శిక్షణను ఇస్తున్నాయి. ఈ శిక్షణ ద్వారా యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెరగడంతోపాటు విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకోవాలనే అంశంపై సైతం అవగాహన ఏర్పడుతుంది. యువత తమను తాము సంస్కరించుకునే స్వభావాన్ని అలవరచుకోవాలి. పాఠ్యాంశాలపైనే దృష్టి పెట్టకుండా, నైతిక విలువలను పెంపొందించేందుకు ఆసక్తి చూపాలి.
నేటి సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురుతీసి ఊరేగుతున్న యువత సన్మార్గంలో నడవాలంటే మిలిటరీ క్రమశిక్షణ అలవరచుకోవాలి. కుటుంబంలోని అనుబంధాలను, విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆనందమయ జీవితానికి అడుగులు పడాలంటే మిలిటరీ క్రమశిక్షణను బాల్య దశనుండే విద్యార్థులకు అలవరచాలి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321