Others

దివ్యాంగులూ స్ఫూర్తిదాతలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకల్యం అనేది ఒక చేదు ఘటన మాత్రమే కాని సమస్య కాదు, అంటువ్యాధి అంతకన్నా కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్యపరచవలసిన అవసరం ఉంది. లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో, నవీన ఆవిష్కరణల్లో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. లక్ష్యసాధనలో దివ్యాంగులు ముందుండాలి. ఇటీవల ఐఏఎస్ సాధించిన విద్యావంతురాలైన ప్రాం జల్ పాటిల్ (అంధత్వం) , ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హాలను స్ఫూర్తిగా తీసుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి.
సమాజంలో ఎవరు ఏ పనిచేసినా దానివెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. సమాజం నుంచి వచ్చే ప్రోత్సాహంతో ఎవరైనా ఎంత ముందుకైనా వెళ్ళగలరు, లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలరు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజమైన సామర్థ్యం గురించి తెలుసుకున్నవారు ఎవరూ ఎవరినీ తక్కువగా చూడలేరు. సమర్ధులను సైతం అసమర్ధులుగా చూస్తున్న సమాజాన్ని ఎదిరిస్తూ వికలాంగులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవాలి. ప్రపంచంలో పనికిరాని వారంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైనవాళ్లే ఉండరు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపోతే మనం వాళ్లకన్నా గొప్పవాళ్ళం అనుకోవడం సర్వసాధారణం. వికలాంగులను అర్థం చేసుకోడానికి ఐరిస్ అనే మహిళ ఏమంటారంటే ‘ఒకవ్యక్తి కూర్చున్న చోటినుండి లేవలేకపోవడం శారీరక సమస్య ఐతే, ఆ వ్యక్తి నిలబడడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం’ అని అంటారు.
చిరిగిన, మాసిన బట్టలతో, పెరిగిన గడ్డం, చుట్టలు తిరిగిన జుట్టు, బందిఖానాలా ఉండే ఓ చిన్నగది, ఒంటరితనం, ఈ ప్రపంచంలో నా గురించీ ఆలోచించేవారు, నన్ను గుర్తించే మనిషి ఒక్కరూ లేరా... అనే ఆవేదనతో ఆకాశం ఊడిపడేలా అరుస్తున్న ఆ గొంతు, నలుదిక్కులుగా వెతుకుతున్న కళ్లు, మంచానికి గొలుసులతో కట్టేసిన కాళ్లు... మానసిక వైకల్యం కారణంగా పిచ్చివాళ్లు అనే ముద్ర వేయించుకుని, ప్రపంచంలో ఎవరికి పట్టని వారుగా దీనంగా బతుకులను వెళ్లదీస్తున్న వాళ్లు మనచుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారికి అందరూ ఉంటారు. అన్ని హక్కులూ ఉన్నాయి. ఎవరికీ ఏమీకాని వాళ్లలాగే, ఏవీ వినియోగించుకోలేక జీవితాలను వెళ్లదీస్తున్నవారు ఎందరో.. వాళ్లూ మనుషులే... వారి పట్ల సమాజ దృక్పథం మారాల్సి ఉంది.
వైకల్య ధ్రువీకరణ పత్రం: ప్రభుత్వం కల్పించే అవకాశాలు, సౌకర్యాలు, రాయితీలలో లబ్ధిపొందాలంటే వైకల్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నమోదు చేసుకున్న దివ్యాంగుల వివరాలు ఇవీ.. శారీరక వైకల్యం 479391 మంది , వినికిడి లోపం: 70336 మంది, బుద్ధిమాంద్యత (మెంటల్ ఇల్‌నెస్): 36778 మంది, మానసిక వికలాంగులు: (మెంటల్ టార్‌డేషన్): 85482 మంది, అంధులు: 94605 మంది, బహుళ వైకల్యం: 3127 మంది ఉన్నారు. వికలాంగుల జాబితాలో మొత్తం 769709 మంది ఉన్నారు.
ఆత్మవిశ్వాసం ఆయుధమైతే..
అంగ వికలురు సైతం ఇతరుల వలే అనేక పనుల్ని సక్రమంగా చేయగలరని నిరూపిస్తూనే ఉన్నారు. తెలివికి, తెలివిలేని తనంతో అంగ వైకల్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక పని చేయగలగడం, చేయలేకపోవడం అనేవి వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. వికలాంగులు దేంట్లోనూ తీసిపోరు, వారి ప్రతిభ అనూహ్యమైనది. అన్నీ ఉండి ఇతరుల కోసం ఏమీచేయడానికి ముందుకు రానివారు మానసిక వికలాంగులు (మెంటల్లీ డిసేబుల్డ్), కాళ్ళూచేతులూ ఉండి ఇతరుల కోసం ఏ సేవా చేయనివారు ఫిజికల్లీ హేండీకాప్డ్, కళ్ళుండీ ఇతరుల మంచి చూడలేని వారూ, మన తోటివారికి అవసరమైన సహాయమేంటో చూడలేనివారు నిజమైన బ్లయిండ్ పీపుల్. ఇతరుల ఉన్నతస్థితికి బాధపడి ఏడ్చేవారు, మెంటల్లీ రిటార్డెడ్, అన్నీ అవయవాలూ సరిగాఉండి శ్రమ చేయగల శక్తిసామర్థ్యాలుండీ సోమరిగా ఉండేవారే అసలైన వికలాంగులు. ఇలాంటి వైకల్యాలను మనంతట మనం సరిదిద్దుకోవాలి.
వైకల్యంతో పుట్టిన శిశువుకు చేసే ప్రతి సేవను భగవంతునికి ప్రత్యక్షంగా చేసిన సేవగా సమాజం భావించాలి. ప్రత్యేక అవసరాలుగల పిల్లలు చదువుకోవడానికి అనువైన పరిసరాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కల్పించాలి. పిల్లలలో చెడు ఆలోచనలను దరిచేరనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దివ్యాంగులలో స్వతంత్రంగా జీవించడానికి కావలసిన అన్ని సహాయ సహకారాలను తల్లిదండ్రులు అందించాలి.
స్వతంత్రంగా జీవించగలిగితే వారికి వారిపై ఆత్మవిశ్వాసం పెంపొందించబడి జీవన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఎందరో దివ్యాంగులు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారి విజయగాథలను చెప్పడం ద్వారా, వీడియో క్లిప్పింగ్‌లు చూపడం ద్వారా లక్ష్యాన్ని స్థిరీకరించుకోవడానికి దోహదపడుతుంది. దివ్యాంగులలో తమ తప్పులను, అపజయాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన ప్రోత్సాహాన్ని అందించాలి. సైకాలజిస్ట్ ద్వారా లక్ష్యనిర్ధారణ, ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని నింపే విధంగా కౌనె్సలింగ్ ఇప్పించాలి. తద్వారా జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను తనకుతానుగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ రకాల సేవలు, పెన్షన్లు, ఉపకార వేతనాలు, రవాణా సౌకర్యాలు, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు చైతన్యం చేయాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక పాఠశాలలు (అంధుల పాఠశాల, మూగ చెవిటి, మానసిక వికలాంగుల) ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
పుట్టుకతో వికలాంగులైనవారికి ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయమూ నిరూపించిన వారెందరో ఉన్నారు. చూపులేనివారు ఒకసారి విన్న స్వరాన్ని మరోసారి వినగానే తమ వద్దకు వచ్చిన వ్యక్తిని గుర్తిస్తారు. ఒకమారు స్పర్శతగిలిన వారినీ రెండోమారు గుర్తించగలుగుతారు. వారికి గ్రహణశక్తి అధికంగానే ఉంటుంది. తమ ప్రతిభను చాటుకుంటూ ఎందరో వికలాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నారు. అందుకే దివ్యాంగులకు చేయూతనిద్దాం. వారికి గౌరవాన్ని అందిద్దాం, వారిని ఆదరిద్దాం, వారిలో దాగి ఉన్న అద్భుత శక్తులు ప్రపంచానికి తెలిసేలా చేద్దాం.
*
(నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం)

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321