Others

ధీరవనిత ఈశ్వరీబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరతరాలుగా అంటరానితనం అనుభవిస్తూ, బానిసత్వం, పీడనలకు గురైన వర్గాలవారి కోసం తన జీవితమంతా అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత స్ర్తిమూర్తి ఈశ్వరీబాయి. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబర్ 1న జన్మించిన ఈశ్వరీబాయికి విద్యాభ్యాసం రోజుల్లోనే అప్పటి దురాచారాల ప్రకారం తన 13వ ఏటనే పూణెకు చెందిన డా.జె.లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్దికాలానికే భర్తను కోల్పోయాక తన ఏకైక సంతానమైన కుమార్తె గీతతో కలిసి పుట్టింటికి చేరుకొంది. ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఈశ్వరీబాయి తల్లిదండ్రులపై ఆధారపడకూడదని ‘పరోపకారిణి పాఠశాల’లో ఉపాధ్యాయురాలిగా చేరింది. కొంతకాలం పౌర సరఫరాల శాఖలో ఉద్యోగం చేసింది.
అప్పట్లో కులం, అంటరానితనం మూలంగా అవమానపడే తన జాతివారిని, ముఖ్యంగా స్ర్తిలు పడే అవస్థలను చూసి ఈశ్వరి ఎంతగానో కలతచెందేవారు. బడుగువర్గాలకు అండగా ఉండాలన్న తలంపుతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి, చిలకలగూడలో గీతా విద్యాలయం స్థాపించి పిల్లలకు చదువు చెప్పేవారు. ఆ ప్రాంత స్ర్తిలందరినీ చేరదీసి, చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేశారు.
సాంఘిక దురాచారాల ఫలితంగా షెడ్యూల్డ్ కులాలు, స్ర్తిలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈశ్వరీబాయి ఆవేదన చెందుతున్న సమయంలో 1944లో డా.బి.ఆర్.అంబేడ్కర్ వైశ్రాయ్ కార్యనిర్వాహక సభ్యుని హోదాలో హైదరాబాద్‌లో పర్యటించటం ఆమెకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది. అంబేడ్కర్ ఉద్యమాలు, ప్రసంగాలు ఆమెను మరింతగా ప్రభావితం చేశాయి. అప్పటికే భాగ్యరెడ్డివర్మ, అరిగే రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు లాంటి ఉద్ధండులు షెడ్యూల్డ్ కులాల ఉద్ధరణకు బాబాసాహెబ్ మార్గంలో పాటుపడుతుండగా, వారి బాటలోనే ఆమె నడిచారు. సామాజిక అసమానతలపై నిరంతర పోరాటాన్ని మొదలుపెట్టారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశాక 1951లో హైదరాబాద్ నగర పాలక సంస్థకు మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈశ్వరీబాయి ఘన విజయం సాధించారు. దళితులు, స్ర్తిలు, కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న తీరునుచూసి అధికార పార్టీలో చేరాలని తనపై కొందరు నాయకులు ఎంతగా వత్తిడి చేసి, ప్రలోభాలకు గురిచేసినా లొంగక బాబాసాహెబ్ సిద్ధాంతాలను ఆమె వదలిపెట్టలేదు. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్యలో చేరి హైదరాబాద్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. అక్టోబర్ 14, 1956లో బాబాసాహెబ్ నాగపూర్‌లో దమ్మదీక్షా స్వీకార కార్యక్రమం చేపట్టి 5 లక్షల మందితో బౌద్ధమతం స్వీకరించినప్పుడు కీలకపాత్ర పోషించి అనేకమంది తన అనుచరులతో ఆమె సైతం దీక్షను స్వీకరించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన ప్రణాళిక మేరకు ఆయన మరణానంతరం కొందరు అనుచరులు అఖిల భారత షెడ్యూల్డ్‌కులాల సమాఖ్య స్థానంలో భారత రిపబ్లికన్ పార్టీ (ఆర్.పి.ఐ.)ని స్థాపించగా ఆ పార్టీలో ఈశ్వరీబాయి ప్రముఖ పాత్ర పోషించారు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆర్.పి.ఐ. అభ్యర్థిగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి టి.యస్.సదాలక్ష్మిపై ఆమె విజయం సాధించారు. అప్పటి శాసనసభలో తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి ప్రతిపక్ష నాయకుల సరసన అదే హోదాను ఆమె పొందారు. మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రతిపక్ష నాయకురాలిగా అనేక సమస్యలను ఆమె సభలో లేవనెత్తేవారు. అసెంబ్లీ చర్చలలో తగిన సలహాలను ఇచ్చేవారు. ప్రజాసమస్యల పరిష్కారానికి శాసనసభ సరైన వేదిక అని తలచారు ఈశ్వరీబాయి. దళిత విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు, భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి బంజరుభూమి, కార్మికులకు భద్రత, కనీస వేతన చట్టం, అస్పృశ్యత నివారణ చట్టం అమలు, బౌద్ధమతం స్వీకరించిన అస్పృశ్యులకు ఎస్‌సి హోదా కల్పించడం, ఉపాధి కల్పన వంటి అనేక అంశాల గురించి శాసనసభలో ప్రస్తావించి చర్చ జరిగేలా పట్టుబట్టేవారు. అప్పటి ప్రభుత్వం ఈశ్వరీబాయిని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశుసంక్షేమ సంస్థకు అధ్యక్షురాలిగా నియమించగా, ఆ హోదాలో రాష్టమ్రంతా పర్యటించి స్ర్తిలు, శిశువుల స్థితిగతులపై అనేక సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో కృష్ణాజిల్లా కంచికచర్లలో కోటేశు అనే దళిత యువకుడిని కొంతమంది పెత్తందార్లు సజీవ దహనం చేసిన ఘటనపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా, అప్పటి వ్యవసాయమంత్రి తిమ్మారెడ్డి చర్చలో కలుగజేసుకొని- ‘దొంగతనం చేస్తే కాల్చి చంపక ముద్దుపెట్టుకుంటారా?’ అని అనటంతోనే ఈశ్వరీబాయి ఆగ్రహంతో సివంగిలా లేచి- ‘ఎవడ్రా ఈ కూత కూసింది, దళితులు అంటే దొంగల్లా కనిపిస్తున్నార్రా మీకు? చెప్పుతో కొడతానం’టూ చెప్పుతీసి విసరటంతో సభ్యులంతా ఒక్కసారిగా నిశే్చష్టులై ఆమెవంక చూడసాగారు, వెంటనే ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కలుగజేసుకొని- ‘అమ్మా శాంతించు..’ అని బతిమాలి ఆమెను శాంతింపజేసారు. ఈ ఘటనపై ఈశ్వరీబాయి మెజిస్ట్రేటు విచారణ జరిపి, తక్షణం దోషులను అరెస్టు చేయాలని పట్టుపట్టారు. కృష్ణా జిల్లా చినవోగిరాల, నిజామాబాద్ జిల్లా తుజాల్‌పూర్ ఘటనలపై పోరాడి అప్పటి ముఖ్యమంత్రులు వెంగళరావు, యన్.టి.రామారావు లాంటి వారికి ముచ్చెమటలు పట్టించిన ధీర వనిత ఈశ్వరీబాయి.
1968లో ప్రత్యేక తెలంగాణ కోసం ప్రారంభమైన పోరాటం మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రజాఉద్యమంగా రూపుదిద్దుకొన్నప్పుడు తెలంగాణ ప్రజాసమితికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ, తెలంగాణ మొత్తం తిరిగి ఉద్యమాన్ని నిలబెట్టిన ధీశాలి ఈశ్వరీబాయి. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని విరమించాక, చిన్న రాష్ట్రాలను కోరుతున్న అంబేడ్కర్ అనుచరురాలిగా బద్రి విశాల్, సత్యనారాయణరెడ్డి, నాయిని నర్సింహారెడ్డిలతో కలిసి ‘సంపూర్ణ తెలంగాణ సమితి’ని ఏర్పాటుచేసి కొంతకాలం ఈశ్వరీబాయి ఒక్కరే ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణలోని కొందరు అగ్ర కుల నాయకులు పదవులకు లొంగిపోయినపుడు తెలంగాణ సమస్యలపై ఆమె నిస్వార్థ పోరాటం నిర్వహించారు. 1986లో ఆర్.పి.ఐ (కె) జాతీయ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈశ్వరీబాయి తాను మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. ఎన్ని ప్రలోభాలు, పదవులు ఆశచూపినప్పటికీ తాను ఎంచుకున్న మార్గాన్ని వీడలేదు, డా.బి.ఆర్.అంబేడ్కర్‌ను తప్ప మరొకరిని నాయకుడిగా ఆమె అంగీకరించలేదు. ఆమె జీవితం నేటితరాలకు ఆదర్శం. అటువంటి ఈశ్వరీబాయి అకస్మాత్తుగా అస్వస్థతకులోనై 24 ఫిబ్రవరి 1991లో తుది శ్వాస విడిచారు.
*
(నేడు ఈశ్వరీబాయి 101వ జయంతి)

-బూర్గుల వెంకటేశ్వర్లు 93993 70005