మెయిన్ ఫీచర్

కొత్త ఊపిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1950ల నుంచి 60 యేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఏటా అకాడెమీ అవార్డుల కోసం సినిమాలను పంపుతున్నా -నామినేషన్ సాధించిన చిత్రాలు కేవలం మూడంటే మూడే. ఇప్పటి వరకూ 48 చిత్రాలను అకాడెమీ అవార్డుల పోటీకి భారత్ పంపింది. ఇందులో 40 చిత్రాలు హిందీ అయితే, 8 తమిళ చిత్రాలు, మూడు మరాఠి చిత్రాలు, బెంగాలి, మళయాలం నుంచి రెండేసి చిత్రాలు, తెలుగు, గుజరాత్ క్యాటగిరీల్లో ఒక్కో చిత్రం మాత్రమే ఆస్కార్‌కు వెళ్లాయి. వీటిలో 1957లో ‘మదర్ ఇండియా’, 1988లో ‘సలామ్ బాంబే’, 2001లో ‘లగాన్’ చిత్రాలు మాత్రమే నామినేషన్‌కు అర్హత సంపాదించాయి. కోట్ల రూపాయలకు భారతీయ చిత్ర పరిశ్రమ విస్తరించినా -ఒక్క భారత్ చిత్రానికీ ఇంతవరకూ ఆస్కార్ లభించకపోవడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో -పరిస్థితిలో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి.

భారతీయ సినిమాకు మంచి ప్రోత్సాహమే లభించింది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించి భారతీయ సినిమా స్టామినా పెంచుకునేలా చేసింది. ఇప్పటికే భారతీయ సినిమా దేశ ఎల్లలు దాటి కలెక్షన్లను కొల్లగొడుతూ విదేశీ మార్కెట్‌ను విస్తృతపర్చుకుంది. హాలీవుడ్ టెక్నాలజీ.. లొకేషన్లతో హంగులు పులుముకుని అలరించడం ఎప్పుడో మొదలెట్టింది. ఈమధ్యకాలంలో ప్రాంతీయ భాషా చిత్రాలు సైతం కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తూ నిర్మితమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచ మార్కెట్‌ని ఏర్పాటు చేసుకోవడమే! ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న రోబో-2 ఏకంగా వంద కోట్ల బడ్జెట్‌ను హాలీవుడ్ టెక్నాలజీకే కేటాయించింది. ఇటు బాహుబలి-2 సైతం హాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేయడానికి సిద్ధవౌతుంది.
మరోపక్క బడ్జెట్‌కు వెనకడుగువేయకుండానే -కంటెంట్‌కూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. భారతీయ లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడం, విజయ కేతనం ఎగురేయడం లాంటి సన్నివేశాలు -స్క్రీన్‌కు ఈవలివైపు నుంచి చాలాకాలంగానే చూస్తున్నాం.
ఇన్ని జరుగుతున్నా -్భరతీయ సినిమా ఆస్కార్ వేదికకు వెళ్ళడమైతే వెళ్లిందిగానీ, వేదిక ఎక్కలేకపోతుండటం ఒకింత నిరాశను మిగులుస్తున్న విషయమే. ఇలాంటి నిరాశలోనూ ఆశలు చిగురించే అంశాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ ప్రయత్నంలో కేంద్ర సమాచార శాఖ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తోంది కూడా. ఆస్కార్ వేదికను చేరే సినిమాకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు, కేన్స్.. వెనీస్ ఫిలిం ఫెస్టివల్స్ వేదికకు వెళ్ళే సినిమాలకు యాభై లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం అందించాలన్నది ఆశలు చిగురింపచేసే విషయంలో భాగం. నిజానికి కేంద్రం ప్రకటిస్తోన్న నగదు బహుమతి ప్రోత్సాహం -ఏమంత గొప్పదేం కాదు. కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రాలను నిర్మిస్తోన్న తరుణంలో -ఆస్కార్‌కు ఎంపికయ్యే సినిమాకు కోటి ఇవ్వడం పెద్దగా పరిగణించాల్సిన విషయమే కాకపోవచ్చు. కానీ, ప్రోత్సాహకం పేరిట దానికి ప్రభుత్వపరంగా లభించే గుర్తింపే పెద్ద బహుమతి అనుకోవడం తప్పేం లేదు. ఇప్పటికే కేన్స్.. వెనీస్‌లోనే కాదు, ఆస్కార్ వేదికపైనా మన భారతీయ హీరోయిన్లు సందడి చేయడం జరిగింది. ఇక భారతీయ సినిమాయే వేదికనెక్కాల్సి వుంది. ఈ కోరిక కూడా త్వరలో తీరనుందేమో!? ననిపిస్తుంది.
అంతర్జాతీయ గుర్తింపు పొందాలంటే సబ్జెక్టే కాదు.. మేకింగ్ విషయంలోనూ అనుసరణ.. అనుకరణ ఉండకూడదనేది జగమెరిగి పాటించాల్సిన నియమం. ఇటీవల తెలుగు సినిమా ఏడు పదుల వయసులో జాతీయ పురస్కారం పొందింది. కానీ ఈ సినిమా (బాహుబలి) ఆస్కార్ విషయంలో ఏమాత్రం ఆస్కారం సంపాదించదనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే సినిమాలోని ఎక్కువ సన్నివేశాల చిత్రీకరణ అంతా కాపీ (హాలీవుడ్ చిత్రాల) అనేది సామాన్య ప్రేక్షకుడే గుర్తించాడు. గతంలో స్వాతిముత్యం.. నాయకన్ వేదిక ముందుకు వెళ్ళినపుడు ప్రేక్షకులు ఆశపడ్డారు. బాహుబలి విషయంలో ఇలా కనీసం ఆలోచించనైనా ఆలోచించలేదనే చెప్పాలి. గాంధీ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయా, స్లమ్‌డాగ్ మిలీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహ్మాన్ ఆస్కార్లు పొందినా ఆ రెండు చిత్రాలు విదేశీ హస్తంతో తయారైనవే కావడం గమనార్హం! భారతీయ సినిమాకు ఆస్కారముంటుందా?నని ప్రశ్నించుకునే భారతీయులకు ఆ కల నెరవేరే వీలుకల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించడం, తద్వారా భారతీయ సినీ వ్యాపారాన్ని విస్తృతపర్చడానికి ఉత్సాహపర్చడం ప్రస్తుతం ఏర్పాటవుతోన్న ప్రత్యేక నిధి ఉద్దేశ్యమని చెప్పాలి.
విదేశీ లొకేషన్లకు 80వ దశకంనుంచీ తెలుగు సినిమా బాగా పరిగెడుతుంది. అయితే విదేశీ మార్కెట్ విషయంలో మాత్రం 90వ దశకం నుంచే ఆసక్తి పెరిగింది. ఎంతగాఅంటే -ఇప్పుడు బడ్జెట్‌లో విదేశీ రైట్స్ కూడా భాగంగా మారిపోయేంతగా. ప్రధానంగా భారతీయ సినిమా అమెరికా.. జపాన్‌లలో ఎక్కువ మార్కెట్ కలిగివుంది. బాలీవుడ్ సినిమాలు విదేశాల్లో బాగా హల్‌ఛల్ చేస్తున్నా టాలీవుడ్ సినిమాలు అమెరికాలో బాగా వసూళ్ళను రాబడుతున్నాయి. విదేశాల్లో సైతం వందలాది థియేటర్లలో రిలీజ్ కావడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు బాగా తోడ్పడుతున్నారు. మొదట్లో మార్కెట్ అంచనా దొరక్కపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు గట్టి లాభాలను మూటకట్టుకున్నా, ప్రస్తుతం వారు సైతం పోటీతత్వంతో నష్టాలను చవిచూడడం విశేషం!
అనువాదం.. సబ్ టైటిల్స్‌తో సినిమాలు విదేశాల్లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. భారతీయ సినిమా విషయంలో ఆస్కార్ అందని ద్రాక్షగా భావించేవారి శాతమే ఎక్కువ. ప్రపంచంలో ఎక్కువ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా డి రామానాయుడు.. ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా దాసరి.. మహిళా దర్శకురాలిగా విజయనిర్మల.. తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన హాస్య నటుడిగా బ్రహ్మానందం గిన్నీస్ రికార్డులతో టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి తెలియజేసారు. ఇదే కోవలో బాహుబలితో రాజవౌళి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాడు. ఇలాంటి ప్రయత్నాలకు ఇప్పుడు ఈ ప్రత్యేక నిధి మరింత ఊతమిస్తుందనే చెప్పాలి.
ఆస్కార్ వేదిక తలుపుతట్టే సినిమాకు ప్రమోషన్ చేసే బాధ్యత కూడా సమాచార ప్రసార శాఖ తీసుకుంటుందని చెప్పడం అభినందించదగ్గ విషయం. ఐటెమ్ భామలను ఎగరేసుకొచ్చే (బా) టాలీవుడ్ దర్శకులు ఈసారి ఆస్కార్ దిశగా కథలను.. కాంబినేషన్‌లను.. లొకేషన్లను.. మేకింగ్‌ని ఆలోచించాల్సి ఉంది. బాలీవుడ్ నుంచి ఇర్భాన్‌ఖాన్ ఎక్కువ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తే, చాలామంది హీరోహీరోయిన్లు అప్పుడప్పుడు మెరుస్తూనే వున్నారు.
ఆస్కార్ వేదికపై నిలిచే చిత్రం ఏదైనా ఎక్కువ విభాగాల్లో నామినేషన్స్ సొంతం చేసుకోవడం ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తుంది. హాలీవుడ్ చిత్రాలకే తోటి చిత్రాలతో పోటీ ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో, భారతీయ చిత్రం వాటికి ధీటుగా ఎదగాలంటే దానిని ఎలా తీర్చిదిద్దాలో దర్శకులే ఆలోచించాలి. ఒక చిత్రం ఒక ఉన్నత వేదికపై నిలవాలంటే 24 క్రాఫ్టులు అంకితభావంతో కృషిచేయాలి. కష్టం ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది. ఫలితమే ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పే సినీ మేకర్స్‌కి ప్రత్యేక నిధి ఓ ప్రత్యేక సవాల్ విసురుతుంది. ప్రాంతీయ, దేశీయ అనే భేదంలేకుండా భారతీయ సినిమా ఈ సవాల్‌ని ఎలా తీసుకుంటుందో రానున్న కాలమే చెప్పనుంది. ఏదేమైనా భారతీయ సినిమా వీలైనంత త్వరగా ఆస్కార్ వేదికపై నిలవాలని ఆశిద్దాం!

-పోలిశెట్టి