Others

ఆ శబ్ధానికి అర్థం సారథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపూ గీసిన కొకోపా
సినీ స్వర్ణయుగంలో సారథి
*
రచయిత: రాంపా
వెల: 125/-
ప్రచురణ:
సాహితి ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్
సిఆర్ రోడ్, చుట్టుగుంట, విజయవాడ
*
కొకోపా.
తెలుగు సినిమా బతికున్నంత కాలం వినిపించే చిత్ర విచిత్రమైన శబ్ధం -కొకోపా. ‘చిత్ర విచిత్ర’ అని ఎందుకనాల్సి వచ్చిందంటే -దానర్థం స్క్రీన్‌మీద ఒకలా వినిపించినా, అసలర్థాన్ని మాత్రం దాని సృష్టికర్తలు బాపురమణలు మనెవ్వరికీ చెప్పలేదు కనుక. ‘కోయపిల్లకు కొత్తపాఠాలు’ అన్నది కొకోపాకు స్క్రీన్ అర్థం. ఆ పదం సారథి గొంతునుంచి బయటికొచ్చాక -పరిపరివిధాలైంది. దాన్ని పలికించిన తీరుతో కొకోపా అన్నది సారథి పేటెంట్ రైట్‌గా మారింది.
కళపై మమకారం పెంచుకుని పరిశ్రమకు వచ్చినోళ్లు -ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంటుంది. వాళ్లంతా.. తెరపై అనేక కథల్లో అనేకానేక పాత్రలుగా కనిపించినా -తెరవెనుక మాత్రం ఒకే ఒక్క బతుకు కథలో అనేకానేక పాత్రలు పోషించినోళ్లే. నవరసాల్లో ఏ రసాన్ని ఆవాసం చేసుకున్నా -దానిలోని సారాన్ని రుచి చూపించి ఎంతోకొంత వినోదాన్ని పంచినోళ్లే. అలాంటి కళాసాధకుల దశమ రసమే -జీవితం. ఆ రసాన్ని ఆస్వాదించాలంటే బయోపిక్‌లో, ఆటోబయోగ్రఫీలో అవసరం. అచ్చంగా అలానే కాదుకానీ, అలాంటి బాపతుగా వచ్చిన పుస్తకమే -బాపు గీసిన కొకోపా. హాస్యనటుడు సారథి జీవిత ప్రయాణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఏరుకుంటే.. వాటిపై ఆయన మనసు ముచ్చట్లు చెబుతుంటే.. రచయిత రాంపా తనకర్థమైన సారథిని తనదైన విశే్లషణలో విపులీకరించి, అన్వయించి, ఆశ్చర్యపరుస్తూ అక్షరీకరిస్తే.. అట్టతో కలిపి 180 పేజీల సంపుటంగా వచ్చిన జీవితమే -బాపు గీసిన కొకోపా. ఇది -సారథిగా సుపరిచితమైన కడలి జయసారథి జీవితానికి సంక్షిప్తరూపమే తప్ప.. సుదూర జీవిత ప్రయాణానికి అడుగడుగుల సమాహారం కాదని మాత్రం చెప్పొచ్చు.
సినిమా సముద్రం. నెడితే పడ్డాడో తానే దూకాడో.. మొత్తానికి బండనుకొట్టుకుని దెబ్బతిన్నాడు. దెబ్బతో ఇంటికెళ్లలేడు. నొప్పిని భరించి ఉండలేడు. తప్పక ఉండాలన్న అనివార్యపు స్పృహ వెనక్కి వెళ్లకుండా ఆపింది. సంకల్పాన్ని నెట్టిపడేసే అనుభవాలకు ఎదురీదాడు. లక్ష్యంపై దృష్టి సడలకుండా గమ్యం చేరుకోవాలన్న సంకల్పాన్ని చుక్కాని చేసుకున్నాడు. పుట్టుకతో కళామతల్లి వరంగా ఇచ్చిన విద్యల్ని పెట్టుబడిపెట్టాడు. అక్కినేని ఏకలవ్యుడినన్న ధైర్యాన్ని ధరించాడు. పదిహేడేళ్ల నిరీక్షణా తపస్సు తరువాత -సినిమా అమ్మ ఓ బ్రేక్‌నిచ్చింది. అలా కడలి జయసారథి -నవ్వుల సారథిగా, నవ్వించే సారథిగా మనముందుకొచ్చాడు. అలా ఎదిగిన సారథి -సినిమాతో ఏం సంపాదించాడు. సినిమాకు తనేం ఇచ్చాడు? ఈ రెండు ప్రశ్నల మధ్య సారథి ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది.
సారథికి సరికొత్త జీవితాన్నిచ్చింది ‘్భక్తకన్నప్ప’ సినిమా. దాని సృష్టికర్తలు బాపురమణలు. వాళ్లు పుట్టించిన కొకోపా శబ్దం -సారథి జీవితానికి ఆశయ సిద్ధి కలిగించింది. కొకోపా శబ్దం నుంచే పరిధిలో పరిమితిలో ఎంతో ఎదిగి ఒదిగిన సారథి -సృజన కళారుషులైన బాపు, రమణల ఆత్మశాంతి కోరుతూ ఆత్మీయ కృతజ్ఞతా వందనంగా తెచ్చిన పుస్తకం కూడా ఇది.
జీవితాన్నిచ్చి -బాల్యంలోనే హరికథలతో బతుకు సారాన్ని బోధించిన తండ్రి కడలి వీరదాసు నుంచి.. తన జీవిత ప్రయాణం ఎలా సాగింది.. ఎవరెవర్ని కలిపింది.. ఎవర్ని దగ్గర చేసింది, ఎవరెవర్ని దూరం చేసిందీ.. ఎలా ఎదిగిందీ.. ఎలా ఒదిగించిందీ.. కళెలా అబ్బింది.. ఎన్ని వేషాలు వేయించింది.. ఎంత ఎత్తుకు తీసుకెళ్లింది.. ఏం చేయమని బోధించింది.. కలిసిన దార్శనికులు.. దాటిన దరిద్రాలూ.. ఒక్కటేమిటి కనుచూపు విస్తరించినమేర సారథి బతుకు సముద్రం ఈ పుస్తకం. అందుకే -‘నటుడి నా జీవితం తెలుసుకునేవాళ్లకి.. అది హాస్యానికే పరిమితమైంది. కానీ, ఆ వెనుక నేనేంటి చెప్పుకోవాలనిపించింది. బహుశ అదే ఇదేమో’ అంటాడు పుస్తకం ముందుమాటలో సారథి.
-‘నటుడిగా సరే. రచయితే కాదు, చిత్రకారుడు, కవి, కార్టూనిస్టు.. ఇంకా ఎన్నో అయిన బహుముఖ మేధావికి నేనెలా కృతజ్ఞతలు చెప్పాలో పుస్తకం చదివి మీరే చెప్పాలి’ అన్నాడు ముందుమాటలోని చివరి మాటగా. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు -పుస్తకంలోని ముచ్చట్లు చెప్పింది సారథే అయినా.. బహుముఖ మేధావి అయిన ‘ఆత్మ’ను కళాగౌరవంతో వేరుచేసి చూస్తున్నాడని.
సారథిని వెతుక్కుంటూ వెళ్లిన రచయిత రాంపా -ఆయన చెప్పింది చెప్పినట్టు రాసేసిన పుస్తకం కాదిది. సారథి అనుభవాల్ని విని.. అర్థం చేసుకుని.. ఆకళింపైన సారాన్ని అక్షరాల్లోకి ఒదిగించే ప్రయత్నమేనన్నది పుస్తకం చదివితే అర్థమవుతుంది. సారథి జీవితాన్ని ప్రతిబింబించే బొమ్మల్ని గుదిగుచ్చుతూ.. సారథి జీవితసారాన్ని అక్షరాల్లోకి ఒంపుతూ.. ప్రయాణంలోని పల్లపు ఎత్తులను నిజాయితీగా కొలుస్తూ.. జీవితం ఎక్కడ మొదలైంది.. ఎక్కడివరకూ సాగింది.. ఇప్పుడెలా సాగుతోంది అన్న విషయాలను పార్శ్వాలుగా అందించటం పసందు అనిపించింది. ‘అనుభవాల లయల్ని’ ముచ్చట్లగాను, మురిపెంగానూ చెబుతూనే.. సారథి ప్రయాణంలోని చిన్నా పెద్ద, గొప్పా పేద, దూరం దగ్గర బాటసారులను పరిచయం చేయడం మరీమరీ బావుంది.
సారథిని ఒక్క పేజీలో చెప్పిన చిటుక్కు-చటుక్కు ప్రశ్న జవాబుల ఇంటర్వ్యూ, సారథి నటించిన ముఖ్య సినిమాల జాబితా ఇవ్వడం గొప్ప విషయం.
కొకోపాను అత్యద్భుతంగా మన ముందు పెట్టడానికి రచయిత రాంపా ఎంత కష్టపడ్డారన్నదానికంటే.. ఎంత ఇష్టపడ్డారన్న విషయం పుస్తకం చదివితే అర్థమవుతుంది. బాపు గీసిన కొకోపా (సినీ స్వర్ణయుగంలో సారథి) ఓ మంచి పుస్తకం. ఓ హాస్య నటుడి జీవితంలోని ఎత్తుపల్లాలు తెలుసుకోవాలంటే పుస్తకం కొని చదవండి.

-మహాదేవ