AADIVAVRAM - Others

ఈలపాటల ‘ఆంధ్రా కోయిల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్ర్తీయ సంగీతానికి కనీసం దగ్గరగానే కాదు దూరంగా కూడా నిలిచే అర్హతలేని పద్ధతి ఈల. ఈల అంటే ఎవరికీ మంచి ఉద్దేశం ఉండదు. చిన్న చూపు మాత్రమే ఉంటుంది. గ్రామాల్లో, సంతలో, సంబరాలో జరిగినప్పుడు గాలిని ఆధారంగా చేసుకొని ఆనందమో, ఆవేశమో లేదా పౌరుషానికో వేళ్ళను పెదవుల మధ్య పెట్టి నాలుక సాయంతో చేసే ధ్వని ఈల.
బడికి గుడికి ఈల అనేది నిషిద్ధం. కానీ ఈల ద్వారా కర్ణాటక సంగీతంలో కచేరీలు అంటే ఎవరైనా నమ్ముతారా? హర్షిస్తారా? అలాంటి సాధనతో కీర్తనలు స్వర సంచయనాలు, ఆలాపనలు పలికించి దీనికి ఓ చక్కటి సంగీత ప్రక్రియగా గుర్తింపు తేవడానికి అహర్నిశలు శ్రమపడ్డారు కొమరవోలు శివప్రసాద్.
పూర్వం ఈలపాట అనగానే ప్రముఖ నాటక కళాకారుడు రఘు రామయ్య గుర్తుకొచ్చేవారు. ఆయన చేతి వేళ్లు నోట్లో పెట్టుకుని తన పద్యాలను మాత్రమే వినిపించే వారు.
శివప్రసాద్ 1979 లో ఆయన ముందు తన ఈల కచేరీ చేస్తే అది విని పరవశించిన రఘురామయ్య శాస్ర్తీయ సంగీతాన్ని ఈల ద్వారా అద్భుతంగా వినిపిస్తున్నావు ఇక ముందు నీ ఈలపాట విని నన్ను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటారని దీవించడం ప్రసాద్‌కి మరపురాని మధుర జ్ఞాపకం .
ఇప్పుడు కొమరవోలు ప్రసాద్ ఈల ప్రపంచమంతా గుర్తించింది. దీన్ని ఇంకా తరతరాల స్వర సంపదగా మిగల్చడానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రోత్సాహంతో పాఠ్యాంశాలు తయారుచేసి తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
శివ ప్రసాద్ ముగ్గురు భారతరత్న ల మధ్య తన ప్రదర్శన ఇచ్చి వారిచేత శభాష్ అనిపించుకున్నారు.
ఈ మధ్య కాలంలో అతి పిన్న వయసులో భారతరత్న సాధించిన టెండూల్కర్ గారిని కలిసి వారికి తాను స్వరపరిచిన ఆల్బమ్స్‌ను బహూకరించి, సత్య సాయి కీర్తనలు వినిపించగా, ఇది ఒక అద్భుతమైన కళ అని ఇది వదిలి వేయటానికి వీలు లేదని, ఈ కళకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని, దానికి తన వంతుగా సహాయం చేస్తానని టెండూల్కర్ ప్రసాద్‌కు మాట ఇచ్చి వారిని సగౌరవంగా సత్కరించటం జరిగింది .
శివప్రసాద్ ఈ మధ్య కాలంలో ఒక నెల కొరకు అమెరికా పర్యటనకు వెళ్లిన, అనుకోకుండా అక్కడి వారి ఆదరణ అభిమానంతో అనేక గుళ్ళల్లో బళ్ళల్లో వారు తమ ప్రదర్శన ఇచ్చి, నెలరోజుల యాత్ర నాలుగు నెలల పాటు పొడిగించ వలసి వచ్చింది. అమెరికా లో అనేకచోట్ల వాషింగ్టన్, అట్లాంటా, హ్యూస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్, న్యూ జెర్సీలలో కచేరీల ద్వారా అమెరికాలోని భారతీయులు, అమెరికా వాసులను కూడా తన ఈల పాట ద్వారా రంజింపచేసి, తిరిగి మన భారతదేశానికి రావడం జరిగింది .
మనకున్నది 64 కళలు కానీ సంగీత కళలకు 65వ కళ గా ఈల పాటను చేర్చి ఇకపై 65 కళలు అని చాటి చెప్తున్న చరిత్రకారుడు కూడా శివప్రసాదే. ఈల సంగీతాన్ని విశ్వవిద్యాలయాల బాట పట్టించి, దానికి అధ్యయన రీతులను జతచేసి పాఠ్యాంశంగా చెప్పడానికి బోధనానుక్రమణిక తయారు చేసిన తొలి గురువు కూడా ఆయనే అవుతారు.
శివ ప్రసాద్ గుంటూరు జిల్లాలోని బాపట్లలో కొమరవోలు సుబ్బారావు రాజ్యలక్ష్మి దంపతులకు తొమ్మిదవ సంతానంగా జన్మించారు. పదో ఏట నుంచే వైద్యనాథ భాగవత్తర్, వసంతకుమారి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, టి.ఆర్. మహాలింగం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చౌడయ్య వంటి సంగీత విద్వాంసుల కచేరీలు ఆలకించి తన ఈల ద్వారా ఆయా రాగాలను పలికించే ప్రయత్నం చేసేవారు.
మన తెలుగు నాట ఈలా అంటే సదభిప్రాయం లేనందున, ఈలపాటల విద్వాంసుడు అంటే శివప్రసాద్‌ను కొందరు అదొరకంగా చూసేవారు. చీ..చీ. ఇదేం కళా! అని ఆస్వాదించకుండానే విమర్శించేవారు. ఆ అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా తన పని తను చేసుకు పోయారు.
సంగీత ప్రపంచానికి బాలమురళి పరిచయం చేస్తే, రాజకీయ ప్రపంచానికి సుప్రసిద్ధ రాజకీయ నాయకులు కోన ప్రభాకర్ రావు పరిచయం చేసారు.
ఆయన తొలుత ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి పరిచయం చేస్తే ఆమె ఓ పావుగంట మాత్రమే శివప్రసాద్‌కు సమయం ఇచ్చారు. ఆయన ఈలలో త్యాగరాజ కృతుల మాధుర్యానికి పులకించి గంటసేపు విన్నారు.
సంగీత కళానిధి స్వరబ్రహ్మ మంగళంపల్లి బాలమురళీకృష్ణ శివప్రసాద్ ఈల విని ఆయనను తన వద్దే ఉంచుకుని ఎన్నో మెళకువలు నేర్పి ప్రోత్సహించారు. శివప్రసాద్ ఈలపాటను గ్రామఫోన్ రికార్డ్‌గా విడుదల చేయించారు. అది విన్న ఎందరో సంగీత విద్వాంసుల సలహామేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు 1971లో సంగీత ప్రపంచంలోనే ఇది ఒక విశేష నూతన సంగీత ప్రక్రియగా గుర్తించి గౌరవించారు. ఆ తర్వాత శివప్రసాద్ తన శ్వాసను ప్రాసలతో శివమెత్తి సంగీత లయ తాండవం చేశారు. 30 దేశాలలో పదివేలకు పైగా కచేరీలు చేసి, ఈలా మానుష విగ్రహులయ్యారు. ఆస్ట్రేలియా సింగపూర్, మలేషియా, అమెరికా, జర్మనీ, ఇటలీ, సింగపూర్, దుబాయ్, రష్యా మొదలగు దేశాలలో ఈయన ఈల కచేరిలలో శ్రోతలు ఆనందబ్దిలో మునిగి తేలారు.
విదేశాలలో శివప్రసాద్ చేసిన కచేరీలలో భారతీయ సంప్రదాయ సంగీతాన్ని కాక లలిత గీతాలను జానపదాలను తన ఈల ద్వారా జాలువారించడమే కాక, ఆయా దేశాలలోని కళాకారులతో కలిసి జుగల్బందీ నిర్వహించి వారి శాస్ర్తీయ సంగీతాన్ని జానపదాలను కూడా ఆ కళాకారులు వినిపించగానే ఇట్టే పట్టేసి వారి సంగీత స్వరాలను వారిలాగానే అతి శాస్ర్తీయంగా తిరిగి వినిపించడంలో అక్కడి వారంతా అవ్యాజ్యమైన ఆరాధనా భావంతో లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ గౌరవ పురస్కారాన్ని తెలియ చేయడం భారతీయ సంగీత ప్రపంచమంతా గర్వించదగ్గ విశేషం .
తనకే సొంతమైన ఈ అపురూప కళా ప్రక్రియను ప్రపంచమంతా గుర్తించేలా చేయాలంటే వాగ్గేయకారుల గీతాలు తన ఈల ద్వారా పలికించి ప్రాచుర్యం లోకి తేవాలని శివప్రసాద్ ఆశించారు. అన్నమయ్య, రామదాసు, దీక్షితార్ మొదలగు వారి కీర్తనలు, భక్తి గీతాలు, సినీ గీతాలు సీడీ విడుదల చేశారు.
హిందుస్తానీ సంగీతంలోను బిస్మిల్లాఖాన్ పైన కేసెట్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు . 1977 లో సినీ వాగ్గేయకారులు నారాయణ రెడ్డి శివప్రసాద్‌ను శ్వాస మురళి బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించారు .
ఆంధ్రప్రదేశ్ కళావేదిక 84లో కళాసరస్వతి బిరుదు ఇచ్చి సత్కరించారు.
2010 నాటి ముఖ్యమంత్రి రోశయ్య నుంచి మహతి అవార్డుతో సన్మానించారు. తొలి క్యాసెట్ విడుదల చేస్తూ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జీ రామచంద్రన్ శివప్రసాద్ ఆంధ్రా కోయిల అని పిలిచారు. సాధన చేస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని, అయినా సాధనము వలననే పనులు సమకూరుతాయనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు శివప్రసాద్.

- పాలపర్తి సంధ్యారాణి sandhyapalaparthy@gmail.com