AADIVAVRAM - Others

పసిడి మెరుపుల బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఒక తీపి జ్ఞాపకం. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇవి మానవ జీవితంలో ప్రధాన దశలు. ఇందులో కల్లాకపటం తెలియని బాల్యం మధురానుభూతికి ప్రతీక అని చెప్పవచ్చు. స్వేచ్ఛగా విహరించే పిల్లల్ని సుతిమెత్తని పూలు, స్వేచ్ఛగా విహరించే పక్షులు, సుకుమారమైన కుందేళ్లతోను పోలుస్తుంటారు. భగవంతుడు మనిషికిచ్చిన అమూల్యమైన వరం బాల్యం. భారత తొలి ప్రధానిగా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జవహర్‌లాల్ నెహ్రూ జయంతి అయిన నవంబర్ 14న మన దేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. క్షణం తీరిక లేకుండా పని భారంతో ఉన్నప్పటికీ నెహ్రూ పిల్లలతో గడపడానికి ఇష్టపడేవారు. ఒక పిల్లవాడు ఒకానొక సందర్భంలో జవహర్‌లాల్ నెహ్రూ కోటుపై గులాబీని ఉంచాడు. ఆ రోజు నుండి తన కోటుపై గులాబీని ధరించడం ఆనవాయితీగా మొదలు పెట్టారు నెహ్రూజీ. ఆయనకు పిల్లలంటే అమితమైన ఇష్టం. ఆ కారణంగానే పిల్లలు చాచా (బాబాయి) అని పిలుచుకునేవారు. అప్పటి నుండి చాచా నెహ్రూగా బాలల హృదయాలలో స్థానం పొందారు నెహ్రూజీ. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నెహ్రూజీ అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. తన కుమార్తె ఇందిరాగాంధీతో ఎక్కువ సమయం గడపలేక పోయారు. ఆమెకు నెహ్రూజీ అనేక లేఖలు రాశారు. ఇందిరాగాంధీ ఆ ఉత్తరాలను భద్రపరచుకొని తండ్రి సూచించిన ప్రకారమే నడచుకునేవారు. ఆనాటి నుండి దేశంలోని పిల్లలందరినీ తన సొంత బిడ్డలుగా భావించారు నెహ్రూజీ. చిన్నారులను మనం నేడు సంరక్షిస్తే రేపు దేశం బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. కల్లాకపటం తెలియని బాలల భవితకు బంగరు బాట వేయాలని ఆయన కలలు కన్నారు. సెలవు రోజుల్లో పిల్లల్ని నెహ్రూజీ తన నివాసానికి పిలిపించుకుని వారికి మిఠాయిలు పంచేవారు. పిల్లలు కూడా నెహ్రూజీకి గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు. ఒకసారి జపాన్‌కు చెందిన కొందరు పిల్లలు ఏనుగు కావాలని చాచా నెహ్రూకు ఉత్తరం రాశారు. భారతదేశం తరఫున జపాన్ పిల్లలకు ఈ ఏనుగు కానుక అని ఉత్తరం రాసి మరీ ఏనుగును పంపించారు. మరో సందర్భంలో బాలల సినిమా చూసిన నెహ్రూజీ అందులో నటించిన ఏడేళ్ల పాపకు కరచాలనం చేసి మెచ్చుకున్నారు. ఆ పాప తిరిగి ధన్యవాదాలు చెప్పలేదు. ఇది గమనించిన నెహ్రూజీ పాపను పాఠశాలకు పంపడం లేదా? అని తల్లిని ప్రశ్నించారు. ఆమె లేదని బదులిచ్చింది. వెంటనే నెహ్రూజీ ఆ పాప తల్లిని సున్నితంగా మందలించి బడిలో చేర్పించమని సూచించారు. ఇలా పిల్లలతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు నెహ్రూజీ. ఆ కారణంగా నెహ్రూజీ పుట్టిన రోజున భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరపాలని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఆమోదించారు. నిజానికి ప్రపంచంలోని అన్ని దేశాలు నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దాదాపు ప్రపంచంలోని అనేక దేశాలు నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 1959లో ఐక్యరాజ్య సమితి నవంబర్ 20న బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించిన బిల్లుపై 191 దేశాలు సంతకాలు చేశాయి. ప్రపంచమంతటా బాలల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడం అనేది బాలల దినోత్సవ ముఖ్య లక్ష్యం.
అయితే కొన్ని దేశాలు ప్రత్యేక కారణాల వల్ల వేరేవేరే రోజుల్లో సైతం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మన దేశంలో నెహ్రూజీ పుట్టిన రోజున బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. దక్షిణ కొరియాలో పిల్లలకు స్వేచ్ఛ పట్ల అవగాహన కల్పించాలని అక్కడి రచయిత డాక్టర్ బాంగ్ కోరుకున్నారు. దక్షిణ కొరియాలో మే 5న బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. చైనాలో జూన్ 1న, టర్కీలో అక్కడి తొలి ప్రభుత్వం ఏర్పడిన ఏప్రిల్ 23న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీలంకలో అక్టోబర్ 1, జపాన్‌లో మే 5, పోలాండ్‌లో జూన్ 1న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జపాన్‌లో బాలల దినోత్సవాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఆ రోజు పిల్లలు చేప ఆకారంలో వున్న గాలి పటాల్ని ఎగురవేస్తారు. యుద్ధ వీరుల బొమ్మలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.
బాల్యంలో తీపి జ్ఞాపకాలు
ప్రతి ఒక్కరికీ బాల్యంలో అనేక తీపి జ్ఞాపకాలుంటాయి. అమ్మచేత్తో తిన్న గోరుముద్దలు, బోసినవ్వుల పసితనం, బామ్మలు చెప్పే కమ్మని కథలకు ఊ కొట్టడం, పల్లెల్లో అయితే పొరుగు వారి జామచెట్టు, నేరేడుచెట్టు, మామిడి చెట్టు, సీమచింత చెట్లు ఎక్కి దొంగచాటుగా కాయలు కోసుకోవడం. చెరువుల్లో, దిగుడు బావుల్లో, పిల్ల కాలువల్లో ఈతలు కొట్టడం. ఇంకా ముందుకు వెళితే ఆడపిల్ల అన్నం వండి వడ్డించినట్లు అమ్మలా నటిస్తే, మగపిల్లవాడు కనిపించని అన్నాన్ని తింటూ నాన్నలా నటిస్తూ ఆడే అమ్మానాన్న ఆటలు, ఏడు పెంకులు, కోతిక్కొమ్మచ్చి, కప్పగంతులు, ఉప్పుబస్తా, ఎంతెంత దూరం, ఇసుకలో చుకుచుకు పుల్ల, అవ్వా అప్పచ్చి, అష్టాచెమ్మ, దాగుడు మూతలు, దాడి, బచ్చాలాట, వైకుంఠపాళి ఇలా అనేక రకాల ఆటలు ఆడుకుంటూ కల్లాకపటం లేకుండా ప్రతి ఒక్కరూ బాల్యాన్ని గడిపినవారే. నేడు పిల్లలు ఇటువంటి ఆటలకు, ఆనందాలకు దూరమై పోయారంటే అతిశక్తో కాదు. కల్లాకపటం తెలియని బాల్యం అంటేనే భగవంతుని స్వరూపం. అటువంటి బాల్య దశలో సుఖాలు, సౌకర్యాలు కల్పించినంత మాత్రాన పిల్లలు సంతోషంగా ఉంటారనుకోవడం పొరపాటే. బాలలకు అనేక హక్కులు ఉన్నాయి. కానీ నేడు ఏం జరుగుతోంది? బాలల హక్కులను కాలరాస్తున్నారు. పిల్లలు ఏదైనా సందేహం అడిగితే ‘్ఛ.. నోర్ముయ్’ అనేస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు దూరం చేస్తున్నారు. పిల్లల అభిరుచుల్ని గౌరవించడం లేదు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగానే వాళ్లు చదవాలని కోరుకుంటున్నారు. పిల్లవాడు జీవితంలో ఏ విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలను కుంటున్నాడనేది ఎవరికీ పట్టడం లేదు. అమ్మ డాక్టర్ కావాలని కోరుకుంటే నాన్న ఇంజనీర్ అవ్వాలంటున్నాడు. చివరకు పిల్లలు అగమ్యగోచరంలో పడి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. నేడు అనేక దేశాలు పిల్లల్ని దండించటాన్ని నిషేధించాయి. అలా దండించినట్లయితే పిల్లలు ఫోన్ చేస్తే చాలు కొన్ని దేశాలలో తల్లిదండ్రుల్ని సైతం జైల్లో పెడతారు. మార్కులు, ర్యాంకులు అంటూ వారిని చీకటి గదుల్లో బంధించి వారి జీవితాలను ఉద్ధరిస్తున్నామనుకుంటే పొరపాటే.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన విషయాలు
పిల్లలతో సున్నితంగా వ్యవహరించాలి. వారిని ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చకూడదు. దండించకుండా బహుమతులు అందించి వారిని ప్రోత్సహించాలి. స్నేహపూర్వకంగా ఉంటూ సౌకర్య పూర్వక స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లల ముందు పెద్దలు వాదించుకోవడం, పోట్లాడుకోవడం, అసభ్య పదజాలాలతో మాట్లాడుకోవడం చేయరాదు. ‘మొక్కై వంగనిది మ్రానై వంగునా’ అన్నారు పెద్దలు. మొక్క దశలోనే వారిని సరైన దశ, దిశ చూపాలి. నైతిక విలువల గురించి బాల్యంలోనే తెలియజెప్పాలి. వారిలో కర్తవ్యాన్ని పెంచాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతతో వ్యవహరించి వారిని మంచి పౌరులుగా తయారుచేయడానికి కృషి చేయాలి. పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. పిల్లల్ని బాగు చేయాలంటే వారిని సంతోషపెట్టడమే సరైన మార్గం. వారితో మనసు విప్పి మాట్లాడి ప్రేమను పంచడమే తల్లిదండ్రులిచ్చే గొప్ప కానుక. నేడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. అమ్మ చూసే టీవీ సీరియల్స్‌కు పిల్లలు అడ్డమొస్తే విసుగు, నాన్నను ప్రశ్నిస్తే కోపం, ఏం తినాలి? ఏ ఆట ఆడాలి? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? అన్ని తల్లిదండ్రుల ఇష్టప్రకారమే జరిగేలా చూస్తూ పిల్లల్ని ఒక చట్రంలో బంధిస్తున్నారు. పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు కచ్చితంగా వినాలనుకున్నప్పుడు పిల్లల మనసులో ఏముందో, వాళ్లు ఏం చెబుతారో పెద్దలు కూడా వినాలి. బాల్యంలో వారిని చదువు పేరుతో హాస్టళ్లకు పంపుతున్నారు. తల్లిదండ్రులు వృద్ధులైన పిదప పిల్లలు వారిని వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. ‘అవినీతి, అక్రమార్జనతో విలాసవంతమైన జీవితాన్ని గడపడం కంటే సాధారణమైన జీవితమే మేలు’ అని నిర్భయంగా పిల్లలు కన్నవారితో అని నైతిక బలాన్ని అందిస్తారో అప్పుడే నిర్మాణాత్మకమైన భావిభారతం మన ముందు ఆవిష్కృతవౌతోంది’ అని స్వర్గీయ ఏపీజె అబ్దుల్ కలాం పిల్లలకు హితబోధ చేశారు. విలువలను నేర్పించి, లక్ష్యాలను కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులది ప్రధాన భూమి అనే చెప్పాలి. పిల్లలు మంచి అలవాట్లతో ఉండాలని మనం కోరుకున్నప్పుడు వాటిని ముందుగా మనం పాటించి వారికి ఆదర్శంగా నిలవాలి. జీవితంలో ప్రతిక్షణం వచ్చే సమస్యలు, సవాళ్లను పిల్లలు ఎలా ఎదుర్కోవాలో విలువలతో కూడిన మార్గదర్శకత, తగు శిక్షణను పెద్దలే అందించాలి. పిల్లలు మంచి ప్రవర్తన, సత్యశీలత అలవరచుకోవడంలో ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. పిల్లలు ఉపాధ్యాయులను అనుకరిస్తారు. ఏదైనా ఒక పాఠంలో ఉపాధ్యాయుడు తప్పు చెబితే పిల్లు అదే నేర్చుకుంటారు. ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తండ్రి ఇది తప్పు అని పిల్లలతో చెప్పినా వాళ్లు అంగీకరించరు. మా ఉపాధ్యాయుడు చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు. అంతగా నమ్మిన పిల్లల్లో ఉపాధ్యాయుడు నైపుణ్యాలను పెంపొందించడంలో శక్తివంచన లేకుండా కృషి చేయాలి. బడి - ఇల్లు సంబంధాన్ని పిల్లల సాంఘిక, ఉద్వేగ, విద్యాభ్యాసనాభివృద్ధిని సాధించడానికి మెరుగుపరచుకోడానికి వాడాలి. దీని కోసం తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే అటు పాఠశాలలోను, ఇటు ఇంట్లోను స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి పిల్లలు మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు.
పిల్లల్ని వేధించకూడదు
కొంతమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని చితకబాదుతుంటారు. ఇటువంటి పిల్లల్లో క్రూర ప్రవర్తన పెరిగే అవకాశం ఉంది. మరి కొందరు ఇతరులతో పోలుస్తూ పిల్లల్ని అసభ్యంగా తిడుతూ మానసికంగా వేధిస్తుంటారు. ఈ మధ్యకాలంలో పట్టుమని 15 సంవత్సరాలు కూడా దాటని బాలికలు సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆ మాటకొస్తే నెలల చిన్నారులను సైతం కొందరు మృగరాయుళల్లు వదలడం లేదనుకోండి. కొందరైతే బాలికలైతే లైంగిక అత్యాచారాలకు బలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు బీహార్, ఢిల్లీ, అసోం ఇత్యాది అనేక రాష్ట్రాలలో ఇటువంటి చెడ్డ పనులను ఉపాధ్యాయుల వంటి బాధ్యత తెలిసినవారే చేయడం కంచే చేను మేసినట్లుగా తోస్తుంది.
పౌష్ఠికాహార లోపం
పిల్లల్లో పౌష్ఠికాహార లోపం లేకుండా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాలు, అంగన్‌వాడీలో పలు ధాన్యాల పిండి పంపిణీ చేస్తున్నారు. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే మధ్యతరగతి, పేద విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంది. ఎన్ని పథకాలు అమలైనా ప్రపంచంలో పౌష్ఠికాహార లోపం గల పిల్లలు ఎక్కువమంది భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో హానికరమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నవౌతున్నాయి. అయోడిన్ లోపంతో మెదడు దెబ్బతిన్న పిల్లలు లక్షల్లోనే ఉంటారు. ఐరన్ లోపం, విటమిన్ ‘ఎ’ లోపం ఇత్యాదివన్నీ పిల్లల్లో కనిపిస్తున్నాయి. అనేక మంది పిల్లలకు సరైన తాగునీరు కూడా అందటం లేదు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం అనేక పథకాలు పెట్టినప్పటికీ, ఇంత అభివృద్ధిని సాధించినా పాఠశాలకు వెళ్లి చదువుకోని పిల్లల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ధనవంతుల బిడ్డలకు కూడా నవీనత మాయలో సరైన పౌష్ఠికాహారం లభించడం లేదు. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, పాస్తా, బేకరీ ఆహార పదార్థాలు, శరీరానికి ఎటువంటి మేలు చేయని అందమైన పొట్లాలలోని తినుబండారాలను తింటూ అనారోగ్యం పాలౌతున్నారు. ఆరోగ్య, ఆహార, వ్యాయామ స్పృహల పట్ల పిల్లలకు అవగాహన కల్గించాలి.
బాలల హక్కులు.. బాధ్యతలు
ప్రతి భారతీయుడికి విద్య అనేది రాజ్యాంగం నుండి లభించిన ప్రాథమిక హక్కు. మనిషి తెలివితేటలను అభివృద్ధి చేసుకోడానికి విద్య ఎంతగానో దోహదపడుతుంది. అప్పుడు మానవ హక్కులను కాపాడుకోవచ్చు. ఆడపిల్లలు,

వెనుకబడిన తరగతుల వారు, దివ్యాంగులు, బాల కార్మికులు ఇత్యాది వారందరికీ విద్యా వసతిని కల్పించాలి. నిర్బంధ ఉచిత విద్యను బాలలకు అందించాలని 29 ఆగస్టు 2009లో చట్టం చేస్తే రాష్టప్రతి కూడా ఆమోదించారు. నేడు విద్య, వైద్యం, మద్యం ఇత్యాది వాటిని మించిన వ్యాపారం లేదనే భావన సర్వత్రా వినిపిస్తుంది. చదువుకునే రోజులు పోయి చదువు‘కొనే’ రోజులు వచ్చేశాయి. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలకు ఎక్కడలేని భయం పుట్టుకొని వస్తుంది. వాటిపై ఎక్కువమందికి సదభిప్రాయం లేదు. అదే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే చాలు క్యూలు కట్టి నిలబడతారు. కేరళలో ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. అక్కడ ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యా బోధన బాగుంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. నేడు అనేక ప్రైవేటు పాఠశాలలుల అపార్ట్‌మెంట్లలోనే నడుపుతున్నారు. ఏ కొన్ని పాఠశాలలకో తప్ప అందరికీ క్రీడా మైదానాలు కూడా లేవు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే క్రీడా మైదానాలు తప్పనిసరిగా ఉంటాయి. దేశవ్యాపితంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న దురభిప్రాయం పోవాలి. పిల్లలకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించినప్పటికీ చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందనే సదభిప్రాయం కలిగిననాడు ఎక్కువ మంది చేరతారు. ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. ఇది పిల్లల ఆర్థిక, పౌర, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం. అన్ని దేశాలలోని పిల్లలందరికి వర్తించే ఒప్పందమిది. భారత ప్రభుత్వం 11 డిసెంబర్ 1992లో ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తున్నట్లు సంతకం కూడా చేసింది. జీవించే హక్కు, అపాయం నుండి సంరక్షణ పొందే హక్కు, భావ ప్రకటన హక్కు ఇత్యాది అనేక హక్కులు బాలలకు ఉన్నాయి. మన దేశంలో చాలామంది బాలబాలికలు వారి హక్కుల్ని కోల్పోయి దీనావస్థలో కనిపిస్తున్నారు. అటువంటి వారి కోసం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు. బాలల మనస్తత్వ శాస్త్రం, పిల్లల పరమైన చట్టాల గురించి అవగాహన, సమగ్రత, సమర్థత, నిపుణత, అనుభవం, నైతికత, విద్య, ఆరోగ్య, శిశు సంక్షేమ, భద్రత, అభివృద్ధి ఇత్యాది శాఖల నుండి సమర్థత గల ఆరుగురు సభ్యులు ఈ దిశగా పని చేస్తున్నారు. అనేక మంది బాలబాలికలు ప్రమాదకరమైన పరిశ్రమల్లో సైతం పని చేస్తున్నారు. 9 నుండి 14 ఏళ్లలోపు వయస్సు వారిని జాతీయ బాల కార్మిక పథకంలో చేర్చుకుని సర్వశిక్షాభియాన్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా వాళ్లు చదువుకునేలా చేస్తున్నారు. బాల కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన యజమానుల వద్ద నుండి రాబట్టిన ధనంతో బాలకార్మిక పునరావాస సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పిల్లలందరూ పనిలో కాదు, బడిలో ఉండాలి అనే నినాదంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నారు.
బాలల కోసం అనేక పథకాలు
నేడు మన ప్రభుత్వాలు బాలల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. జవహర్ బాల ఆరోగ్య రక్షణ, బాలికా సంక్షేమం, పాఠశాల సమాచార పరిజ్ఞానం, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్, బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు, బాలల ఉద్ధరణ బాధ్యతను నిర్వహించడానికి రాజ్యాంగపర నిబంధనలు రూపొందించారు. 1974 బాలల కోసం జాతీయ కార్యాచరణ విధానం ప్రకారం అనేక హక్కులు కల్పించారు. పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి తగిన వనరులు, సేవలు అందించడం, వారి పెరుగుదలకు అన్ని విధాలా తోడ్పడటం, మానసిక, సామాజిక అభివృద్ధికి సహాయపడటం, దేశంలో అన్ని ప్రాంతాలలోని బాలల మధ్య అసమానతలు లేకుండా అభివృద్ధి చెందేలా కృషి చేయడం ప్రధాన లక్ష్యాలుగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. దీని ప్రకారం పిల్లలకు జీవించే హక్కు కల్పించారు. ఎటువంటి అనారోగ్యాల పాలుకాకుండా, ఆరోగ్యంగా జీవిస్తూ శారీరక, మానసిక, సామాజిక వికాసానికి పునాది వేయాలి. ఎటువంటి బాధలు, అవమానాలు పడకుండా బాలలకు రక్షణ హక్కు కల్పించారు. పిల్లల ఉన్నతి, వికాసానికి కల్పించిన హక్కు ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు కర్మాగారాలలో పని చేయరాదు. అలా పనిచేసే వారిని బాల కార్మికులు అంటారు. బాల కార్మికులు కర్మాగారాలు, హోటళ్లు, దుకాణాలలో పని చేయించడం నేరం. భావస్వామ్య హక్కు ప్రకారం బాలలు వారి భావాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కును కల్పించారు. బాలల శ్రమ దోపిడీ నుండి రక్షించడానికి 1933లో ఒక చట్టం, బాలలను కార్మికులుగా ఉపయోగించరాదని 1938లో మరో చట్టం, కర్మాగారాలలో బాలల్ని పనికి తీసుకోకుండా 1949లో ఇంకో చట్టం చేశారు. సర్వశిక్ష అభియాన్, బాలికా విద్య, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్, విద్యను హక్కుగా పొందే చట్టం ఇలా ఎన్నో పథకాలు పెట్టి వాటి అమలుకు చట్టాలను చేసి బాలల ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఎవరైనా బాల బాలికల్ని శారీరక, మానసిక వేధింపులతోపాటు లైంగిక వేధింపులకు గురి చేయడం, పిల్లల హక్కుల్ని కాలరాయడం వంటి చర్యలకు పాల్పడితే 1098 నంబర్‌కు ఫోన్ చేస్తే అటువంటి వారిపై ప్రభుత్వ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
స్వార్థానికి దూరంగా పిల్లల్ని పెంచాలి..
తల్లిదండ్రులు స్వార్థానికి దూరంగా పిల్లల్ని పెంచాలి. వారిని బాగా చదివిస్తే అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించి వృద్ధాప్యంలో మనల్ని బాగా చూసుకుంటాడు అనే భావనతో కాకుండా చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని, తాను జీవిస్తూ పది మంది జీవించడానికి మార్గం సుగమం చేసే ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి. నేడు వ్యక్తిగత స్వార్థ అణువణువునూ పెరిగిపోయింది. నేను బాగుండాలి అనుకోవడం తప్పు కాదు. నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం చాలా తప్పు. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా వ్యక్తిగత జీవితంతోపాటు దేశ ప్రయోజనాల గురించి అందరూ ఆలోచిస్తారు. కానీ మన దేశంలో వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అసత్యం లేదు. కనీసం 75 శాతం మన గురించి ఆలోచించినప్పటికీ 25 శాతం దేశ ప్రయోజనాల గురించి ఆలోచించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనవి అవినీతి, ఉగ్రవాదం. బాల్యం నుండి పిల్లలకు బాల సాహిత్యాన్ని చదివించి వారికి నైతిక విలువల గురించి తెలియజేయాలి. పాషాణ హృదయాలతో కాకుండా మానవత్వపు విలువలు తెలిసిన వారిగా పెంచాలి. పిల్లలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. వారే మన జాతీయ సంపద. వాళ్లే రేపటి ఆశలు. వారిలోని గొప్పతనాన్ని మనం గుర్తించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. అప్పుడే మన దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అప్పుడే భావిభారత ఉత్తమ పౌరులుగా వారు రూపొంది మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది.

-షేక్ అబ్దుల్ హకీం జానీ 9949429827