AADIVAVRAM - Others

వినూత్నం.. విశేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక్షేపించడం ఆమె నైజం. ఇతరులను ఆలోచింపజేయడం ఆమెకు ఇష్టం. మనుషులు మన్నుతిన్న పాముల్లాగాక నిత్య చైతన్యంతో నిప్పు కణికల్లా మంచి సమాజం వైపు సమష్టిగా సాగాలనేది యువ చిత్రకారిణి ‘స్వాతి’ స్వగతం. పూర్తి స్వతంత్ర భావాలుగల ఆమె పరిసరాలకు, చుట్టూ జరిగే సంఘటనలకు వేగంగా స్పందిస్తుంది. ఆ స్పందనను రంగుల్లో బహిరంగంగా గోడలపై, కట్టడాలపై అందరి దృష్టికి వచ్చేలా శ్రమిస్తుంది.
చిత్రరచన ద్వారా సమాజంలో సాధ్యమైనంత గరిష్టంగా చైతన్యం తీసుకురావాలన్న బలమైన ఆకాంక్షతో ఆమె తన భర్త - చిత్రకారుడు విజయ్‌తో కలిసి ‘సాహసం’ చేస్తున్నారు. స్ట్రీట్ ఆర్ట్.. గ్రాఫిటీ మాధ్యమంగా సందేశాత్మక సూక్తులు, నినాదాలు.. బొమ్మలతో, వినూత్న భావ వ్యక్తీకరణతో భావ విప్లవానికి తన వంతు పాత్రను పోషిస్తున్నారు. తెలుగు నేలపై ‘స్ట్రీట్ ఆర్ట్’ ప్రక్రియ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ అనేక దేశాల్లో ఈ ప్రక్రియకు గుర్తింపు, గౌరవం, ఆదరణ అపూర్వంగా కనిపిస్తోంది. ఆ వాతావరణం ఇక్కడా ఏర్పడాలని, అందుకు తాము ఆద్యులుగా నిలవాలని ఈ చిత్రకారుల జంట తీవ్రంగా తపిస్తోంది. ఈ మాధ్యమంలో సృజనాత్మకత, కళాత్మకత కనిపించదనే ‘అపోహ’ సరైంది కాదని స్వాతి ‘స్వరం’ పెంచి చెబుతారు. ప్రతి చిత్రం అందంగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా ఉండాల్సిన అవసరం లేదన్న సిద్ధాంతం స్వాతిది.
తన (్భర్త విజయ్ కూడా) మనసులోని ‘గొడవ’ను వెళ్లబోసుకునేందుకు ఆమె నిరంతరం ఓ ‘గోడ’ను వెతుక్కుంటారు. వర్తమానంలో ‘నెటిజన్లు’ తమ అసంతృప్తిని, స్పందనను, ఆవేశాన్ని, అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు ‘ఫేస్‌బుక్’ వాల్ (గోడ)ను ఎలా ఆశ్రయిస్తారో తాను (తాము) అలాగే వాస్తవ గోడలను ఆశ్రయిస్తామని, తమ ‘గొడవ’ను వ్యక్తపరుస్తామని ఆమె చెబుతున్నారు. ఈ మాధ్యమంలో అలంకరణకు ప్రాధాన్యం అంతగా కనిపించదు. వీక్షకుల్ని ఆలోచింపజేసే తత్వం ఎక్కువగా దర్శనమవుతుంది. ఆ నినాదాలు.. చిత్రాలు.. భావాలు వీక్షకుల మదిలో కల్లోలం సృష్టిస్తాయి. మెదడుకు మేత వేస్తాయి. ప్రశ్నల కొడవళ్లను మొలిపిస్తాయి. బాధ్యతల్లో ఉన్నవారిని ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి.. అలాగని అన్ని చిత్రాలు.. రాతలు అగ్నివర్షం కురిపించవు... కొన్ని సందర్భాల్లో మార్దవం, మనసుకు హత్తుకునే సానునయ దృశ్యాలు, సానుకూల దృక్పథం పెంపొందించే ‘స్థితప్రజ్ఞత’ స్వాతిలో దర్శనమిస్తుంది. ఇదంతా తామెంచుకునే ‘సబ్జెక్ట్’పై ఆధారపడి ఉంటుందని స్వాతి అంటున్నారు. ఉదాహరణకు.. ‘లవ్ బ్రేక్స్ బారియర్స్’ (ప్రేమ అడ్డంకుల్ని బద్దలు కొడుతుంది) నినాదం. ఇదో సందేశం.. నినాదం.. సూక్తి.. స్టేట్‌మెంట్.. ఏదైనా అనుకోవచ్చు. ఈ అక్షరాలను రహదారి పక్కనున్న ఓ కాంపౌండ్ గోడపై రాసి, ఆ గోడ దరి చేరకుండా వేసిన ముళ్లకంచెను వంచి అక్కడ హృదయాకారపు గాలి బుడగలను చిత్రించారు. దీన్ని స్వీకరించే హృదయాలపై దాని తీవ్రత ఆధారపడి ఉంటుంది. సున్నిత మనస్కులు ఆ దృశ్యం తిలకించినప్పుడు స్పందించే తీరుకు, ఏదో బొమ్మ గీశారులే అనుకుని వెళ్లిపోయే వారి స్పందనకు తేడా ఉంటుంది. మొదటి రకం వ్యక్తులను అంటే సున్నిత మనస్కుల మదిని ఆకర్షించేందుకు ఉద్దేశించినదీ నినాదం.. హృదయాకారపు బుడగల గుచ్ఛం. ఇది చూసి కొందరు ఇదీ ఒక ఆర్టా?.. ఇందులో చిత్రకళ కళాత్మకతేమున్నది?.. సౌందర్యం ఎక్కడున్నది? అని ప్రశ్నించే అవకాశం ఎక్కువున్నది. దానికి ఆమె సమాధానం.. ప్రతీది అందంగా, ఆకర్షణీయంగా ఉండాల్సిన అవసరం లేదు. రసస్ఫోరకంగా కనిపిస్తోందా?.. లేదా? అన్నదే కీలకమని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. దృష్టినంతా కేంద్రీకరించి, దృశ్యం పరికిస్తే, అక్షరాలను వాటి పక్క బుడగలను ‘కలిపి’ చూస్తే మనసులో పలికే భావం ముఖ్యం. అలా వీక్షించినప్పుడు తప్పక మనసులో తళుక్కున ఓ అనుభూతి ‘తడి’ మెరుస్తుంది. స్వాతి ఆశించేది, కాంక్షించేది హృదయాల్లోని ఆ ‘తడి’నే.. మానవత్వానే్న.. మంచితనానే్న.. మానవ విలువలు మంటగలిసి పోకుండా ఉండటమే.
అలాగే మరో మూడంతస్తుల ఇంటి గోడపై చాలా సాధారణ నినాదాన్ని అర్థవంతంగా ‘మడిచి’ చూపారు. ఆంగ్ల అక్షరాలు హఖ్ఘౄశజఆక (మానవత్వం) పెద్దవిగా రాసి, దానికో ‘బాక్స్’ కట్టి చివరి రెండు అక్షరాలైన కూ ని కాగితం మడతలో మూసుకుపోయినట్టు చిత్రించారు. ఇప్పుడు కనిపించే అక్షరాలు హఖ్ఘౄశ (మనిషి) మాత్రమే. అంటే మానవత్వం మటుమాయమై మనిషి మాత్రమే సమాజంలో కనిపిస్తున్నాడన్న అర్థంలో తన గొడవ (ప్రజాకవి కాళోజి ‘నా గొడవ’లా) గోడ మీద దర్శనమిస్తోంది.
స్వాతి తన భర్త విజయ్‌తో కలిసి రాజకీయంపై బలమైన అధిక్షేపణగా స్వచ్చ భారత్ నినాదాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇది తీవ్రంగా ఆలోచింపజేసే నినాదం.. దృశ్యం. వీక్షకుల గుండెలను తాకే వైనం.
ఓ పెద్ద గోడపై విశాల పార్లమెంట్ భవనం ముందు ఓ పెద్ద చీపురు పట్టుకున్న పారిశుద్ధ్య కార్మికుడు కనిపిస్తాడు. పక్కన ఆంగ్లంలో ‘ది రియల్ ప్లేస్ టు డు’ (స్వచ్ఛ భారత్‌కు.. ఇదే సరైన చోటు) అన్న అక్షరాలు కనిపిస్తాయి. ఇందులో రంగుల రసజ్ఞత, నాజూకుతనం.. నైరూప్యత.. అధివాస్తవికత లాంటివేమీ లేవు. అతి సాధారణమైన అక్షరాలు, పార్లమెంట్ బొమ్మ కనిపిస్తుంది.. కానీ అసాధారణమైన భావం.. అర్థం అందులో ఇమిడి ఉంది. ఈ ‘చిన్న’ వ్యత్యాసం.. ఈ చిన్న పరిశీలనాత్మక అంశం.. అధిక్షేపణ, ఆలోచన స్వాతిని ఆమె భర్తను మరో మెట్టుపై నిల్చోబెట్టింది. నిజాయితీగల (రాజకీయ) నాయకుడు కనిపించడం లేదు అన్న నినాదం ఓ బస్టాండులో రాసి ఎందరినో ఆకర్షించారు. ఈ ‘స్పార్క్’ (మెరుపు) ను పసిగట్టిన ఫ్రాన్స్ వారు తమ దేశానికి ఈ జంటను ఆహ్వానించారు. గత దసరా పండుగ సమయంలో స్వాతి ఫ్రాన్స్‌లోని డాక్స్ అనే పురాతన నగరంలో తన ఆలోచనల మెరుపును అక్కడ గోడలపై చిత్రించారు. అక్కడి డామ్ (డిఓఎం) ఆర్ట్ గ్యాలరీ వాళ్లు వీరికి ఆతిథ్యమిచ్చి అపురూపంగా చూసుకున్నారు. పది రోజులపాటు అక్కడ తమ ‘ప్రజ్ఞ’ను ప్రదర్శించారు. యూరప్‌లో ‘స్ట్రీట్ ఆర్ట్’కు అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. ప్రజల్ని జాగృతం చేసేందుకు ఈ మాధ్యమం సరైనదని అక్కడివారి విశ్వాసం. అందుకే ఎందరో చిత్రకారుల్ని ఆహ్వానిస్తారు. తమ సృజనను గోడలపై ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తారు. భారతీయ సంగీత పరికరాన్ని వాయిస్తున్న వ్యక్తిని వారక్కడ ‘పెయింట్’ చేశారు.
అలా ఫ్రాన్స్ పర్యటన అనంతరం స్పెయిన్ వెళ్లి ఫిగరోస్ పట్టణంలో ప్రముఖ సర్రియలిస్టిక్ (అధివాస్తవిక) చిత్రకారుడు సాల్విడార్ డాలీ మ్యూజియంను సందర్శించి, ప్రపంచ చిత్రకళను ప్రత్యక్షంగా చూసి తమలోని ‘్భవుకత’కు వనె్నలద్దారు. సరికొత్త అనుభూతిని సొంతం చేసుకున్నారు. మరికొన్ని ప్రముఖ దేశాల మ్యూజియాలను సందర్శించి తమ చిత్రకళ దాహాన్ని తీర్చుకున్నారు. దీంతో ‘అవగాహన’ స్థాయి పెరుగుతుందని, అనుభవ సంపద వృద్ధి చెందుతుందని స్వాతి చెబుతున్నారు. గతంలో జపాన్‌లోనూ తమ స్ట్రీట్ ఆర్ట్ ప్రదర్శించి అక్కడి మ్యూజియంలోని చిత్రకళను పరిశీలించారు. ఇలా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో తన ‘గొడవ’ను గోడల కెక్కిస్తున్న స్వాతి 1986లో ఖమ్మం పట్టణంలో జన్మించారు. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. తన మేనమామలిద్దరూ చిత్రకళా రంగంలో ఉండటం కారణంగా తానూ ఇటువైపు మొగ్గానని, తొలుత కనిపించిన ప్రతీది గీసేదానినని అనంతరం 2003 సంవత్సరంలో మాసాబ్ ట్యాంక్ దగ్గర గల జెఎన్‌టియులో బిఎఫ్‌ఏ కోర్సులో చేరానని, అక్కడే సముద్రమంతటి చిత్రకళా ప్రపంచం పరిచయమైందని ఆమె చెప్పారు. అదే కళాశాలలో 2008లో ఎంఎఫ్‌ఏ పూర్తి చేశాక తన చిత్రాలు ఎక్కువమంది.. సాధారణ ప్రజలు చూడాలంటే స్ట్రీట్ ఆర్ట్ మాధ్యమమే సరైనదని నిశ్చయించుకుని, అప్పటికే పరిచయమైన సహచర చిత్రకారుడు విజయ్‌ను వివాహమాడి రంగంలోకి దిగింది. అమెరికా అజ్ఞాత స్ట్రీట్ ఆర్టిస్టుగా పేరొందిన ‘బాంక్సి’ని ఆమె ఆదర్శంగా తీసుకుంది. తొలుత తన సొంత జిల్లా ఖమ్మంలోని రంగసాయిపేట పాఠశాల భవనాన్ని ఎంపిక చేసుకుని దాన్ని పిల్లల మనస్తత్వానికి దగ్గరగా తీర్చిదిద్ది పాఠశాల హాజరు శాతం పెరిగేలా చేయడంతో చాలామంది దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత తిరిగి వెనక్కి చూసుకోకుండా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, మక్త తదితర ప్రాంతాల్లోని గోడలపై వీరి బొమ్మలు ఇప్పటికే ఆలోచింపజేస్తుంటాయి.
అలా వర్తమానంలో వినూత్న, విశేష వీధి చిత్రకళను తెలుగు వారికి పరిచయం చేస్తూ స్వాతి చరిత్రకెక్కారు.
స్వాతి 7569994776

-వుప్పల నరసింహం 9985781799