Others

పున్నమినాటి పసిడి వెన్నెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండి చందమామలు -పులగం చిన్నారాయణ -వడ్డి ఓంప్రకాష్ నారాయణ
వెల: 50/-
ప్రచురణ: ఫ్లాట్ నెం.89, ఎఫ్-2, రాధాసదన్, బాలాజీ స్వర్ణపురి కాలనీ, మోతీనగర్ దగ్గర, హైదరాబాద్ -500114
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, తెలుగు బుక్‌హౌస్, సాహిత్య నికేతన్, మరియు ప్రముఖ పుస్తక కేంద్రాల్లో
=============================================================

విత్తులో ఊపిరుంటే.. మొలకను మట్టికూడా ఆపలేదురా -అనేది మా నాయనమ్మ. బతుక్కి పనికొచ్చే పెద్ద మాట, పెద్దల మాట కూడా. ‘వెండి చందమామలు’ పుస్తకాన్ని చదివినపుడు -మస్తిష్కంలోకొచ్చిన మొదటి మాటిదే. ఎందుకంటే -పుస్తకం సాలోచనకు ఆలోచన దర్శకుడు వంశీదేనంటూ రచయితలు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాష్ నారాయణ అక్షర నిజంగా అచ్చేశారు. వంశీ విత్తు తాలుదైవుంటే -పుస్తకమొచ్చేది కాదేమో. కానీ, ఆయన మాటలో ఊపిరుంది. అందుకే -పుస్తకమొలిచింది. సరే, మాటమాత్రంగా వంశీ ఓ మాటన్నాడనుకుందాం. అన్నదేతడవుగా -మూలాల్ని వెతకడానికి నాలుగు మూలల్నీ తడిమేశారు పులగం, వడ్డి. అందుకే -పుస్తకం చిన్నదైనా.. ప్రయత్నం పెద్దదైంది.
ఆలోచన అక్షరమై.. అక్షరం దృశ్యమై -సినిమా అనిపించుకున్న తరువాత, మళ్లీ అక్షరాల్లోకొదిగి పఠనానందాన్ని పంచే ప్రక్రియ ఎలా మొదలైంది, ఎక్కడి వరకూ సాగిందో క్లుప్తుంగా చెప్పే కథనమే ఈ -వెండి చందమామలు. వెండితెరపై సినిమా బలపడ్డాక.. దృశ్యాన్ని అక్షరం చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన నిర్మాత దుక్కిపాటికి రావడంతో -తోడికోడళ్లు (1957లో రామ్‌చంద్ రాశారు) వెండితెర నవలైందని సినీమనీషి రావి కొండలరావు రాసిన ముందుమాట నుంచీ.. ఇవీ వెండితెర నవలలు అంటూ చివరిగా విప్పిన చిట్టా వరకూ -పుస్తకంలో ప్రత్యక్షరం పఠనానందమే.
అప్పుడెప్పుడో- చిరంజీవి ‘మహానగరంలో మాయగాడు’ సినిమా వచ్చింది. గోడమీద పోస్టర్లుపడ్డాయి. వచ్చినోడు పోస్టరేసి -సైకిలు, నిచ్చెన, మైదా జిగురు పట్టుకుని అలా వెళ్లగానే ఇలా మేం వచ్చేశాం. పోస్టర్ పీకేసే ఫైట్‌లో నాకు దొరికిన ముక్కతో -తెలుగు టెక్ట్స్‌బుక్‌కి అట్టేశాను. చిరు ఫేసు, టైటిల్ అట్టమీదకొచ్చింది. స్కూల్లో పాఠం చెప్పడానికి పుస్తకం అడిగిన తెలుగు మాస్టారు ‘ఈ సినిమాకి వెండితెర నవల ఎప్పుడొచ్చిందిరా?’ అన్నారు. అదే ఫస్ట్ వినడం -తెలుగు సినిమాలు నవలవుతున్నాయని. సినిమా సబ్జెక్టే పాఠమై కొన్ని సినిమాలు ఎలా నవలలుగా వచ్చాయో చెప్పినప్పటి ముచ్చట్లన్నీ -వెండి చందమామలు చదువుతున్నపుడు లీలగా గుర్తుకొచ్చాయి. బహుశ పుస్తకం చదివినోళ్లకి -ఇలాంటి వాళ్లవాళ్ల జ్ఞాపకాలు చాలానే గుర్తుకొస్తాయేమో. పులగం, వడ్డి జర్నలిస్టు వృత్తినుంచి వచ్చిన సినీ సమాచార జ్ఞానులు కనుక -వెండితెర నవలల పరిశోధనను వ్యాసం స్థాయికి కుదించారు. సేకరించిన సమాచారాన్ని ఇంతగా ‘ఎడిట్’ చేయకుంటే -చదవడానికి మరింత విపులంగా ఉండేదేమో. ఏయే సినిమాలకు వెండితెర నవలలు వచ్చాయి? రాసిందెవరు? ఎందుకు రాశారు? రాసిన తరువాత వచ్చిన ఫలితం..లాంటి వివరాలు చదువుతున్నపుడు -వెండితెర నవలల వెనుక ఇంత చరిత్ర ఉందా? అని ఆశ్చర్యపోతాం. రచయితలు అందించిన అనేక విషయాలు ఎక్కడెక్కడో చదివినవో, విన్నవో, తెలిసినవో అనిపించినా.. అన్నీ ఒకేచోటికి తీసుకొచ్చి.. పద్ధతిలో పేర్చి.. క్లుప్తీకరించి.. మంచి విషయంగా గుదిగుచ్చి.. పుస్తకంగా అందించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం.
వెండితెర నవల జ్ఞాపకాల్లోనే ఉండిపోయందన్న ఆవేదన నుంచి.. హాలీవుడ్ క్లాసిక్స్ స్క్రిప్ట్‌లు వర్థమాన సినీతరానికి పనికొచ్చేలా డిజిటల్ ఫ్రేములవుతున్నాయన్న సమాచారం వరకూ.. అలాంటి పనికొచ్చే ప్రక్రియ మొదలెట్టాలన్న ఆలోచన మనకెప్పుడొస్తుందోనంటూ వ్యక్తం చేసిన బాధ -రచయితల నిబద్ధతకు నిదర్శనం. వెండితెర నవలలపై ప్రముఖుల అభిప్రాయ మాలిక శీర్షికన -నవలలు రాసిన వారి మాటల్ని ప్రచురించటం బావుంది.
ప్రతి పేజీ కిందిభాగానా -వెండితెర నవల ముఖచిత్ర మాలికలా అచ్చేయడం అంతగా నప్పలేదు. అంతకంటే -ఆయా నవలల్లోని ముఖ్య వ్యాఖ్యలో, పనికొచ్చే పలుకులో ‘కొటేషన్స్’ మాదిరి అందించివుంటే -చిన్న పుస్తకం బరువు పెద్దదై ఉండేది. బాధ్యత -విలువకట్టలేనిదై ఉండేది. సినిమాకు వినోదం ఎంత ముఖ్యమో.. పుస్తకానికి ఆహ్లాదం అంత ముఖ్యం. ఈ విషయంలో రచయితలు దృష్టిపెట్టివుంటే బావుండేదేమో.

-మహాదేవ