AADIVAVRAM - Others

చైనీయుల దేశ పునర్నిర్మాణ కాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంధొమ్మిది వందల ఎనభైలలో చివరి సంవత్సరాల సందర్భం ఇది. హైదరాబాద్ త్యాగరాయ గానసభా వేదికపై కె.ఎల్.రావు సన్మాన సభ జరిగింది. సన్మానపత్రం రమాపతిరావు అనే నేను చదివి వారికి సమర్పించాను. మానవీయ శంకర దయాళ్ శర్మ ఆనాటి ఉత్సవ ముఖ్య (విశిష్ఠ) అతిథి. పి.వి.ఆర్.కె. ప్రసాద్ సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్. సభా ప్రారంభానికి ముందు సభా భవనం దిగువ మొదటి వరుస కుర్చీలలో మొదటి కుర్చీలో ఈ రచయిత కూర్చొని ఉండగా, కె.ఎల్.రావు మొదటి వరుసలో కూర్చుని ఉన్నారు. గొప్ప వాళ్ల ఉదాత్త సంస్కారం, మాన్యత ఎటువంటివో తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతకు పూర్వం నాకు కె.ఎల్.రావుగారితో పరిచయం లేదు. ఈ సభను ఏర్పాటు చేసిన వారు అయ్యదేవర పురుషోత్తమ రావు. ఈయనకు విజ్ఞాన దీపిక అని సాహిత్య, సంగీత, నాటక కార్యక్రమ సంస్థ ఉండేది. ఈ సంస్థ తరఫున ఈ సమ్మాన కార్యక్రమం.
కె.ఎల్.రావు నా వైపు తిరిగి అభిమాన వాత్సల్యంతో ‘మీ కొమర్రాజు వేంకట లక్ష్మణరావు జీవిత చరిత్ర నేను చదివాను’ అని మన్నించటం అదొక ఉత్తేజకర మధురానుభూతి. శ్రీ లక్ష్మణరావు శత జయంతి స్మరణీయంగా విశాలాంధ్ర ప్రచురణకర్తలు దానిని ప్రచురించారు. సుమారు 20 సంవత్సరాల కిందటి సంఘటన అది. ఇంకా కె.ఎల్.రావుగారు నాకిట్లా చెప్పారు. కొమ్రరాజు వారి మనవడు ‘రవి’ అనేవారు ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో పని చేస్తున్నారనీ, అతడి దగ్గర కొమర్రాజు వారి రాత ప్రతులు కూడా ఉన్నాయనీ నాకు తెలిపారు. నా వంటి అతి సామాన్యుడితో కె.ఎల్.రావు అట్లా సన్నిహితంగా మాట్లాడటం అది ఒక గొప్ప అదృష్టం. కె.ఎల్.రావు గారి పేరు కూడా లక్ష్మణరావే. అంతేకాదు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారి బావగారు.
సమ్మాన సభ గొప్పగా జరిగింది. సమ్మాన పత్రం రమాపతిరావే చదివాడు. కె.ఎల్.రావు ఈ కాలపు అభినవ భగీరథుడనీ, వారి అరచేతుల రేఖలలో భారతదేశ నదీ సంపద అంతా ప్రవహిస్తున్నదనీ, ఇత్యాదిగా ఆ సమ్మాన పత్రంలో రాశాను. ఇక అసలు విషయం ఏమిటంటే కె.ఎల్.రావుగారి స్వీయ చరిత్ర ‘క్యూసెక్స్ కేండిడేట్’ నేను అంతకు పూర్వమే చదివి ఉన్నాను.
ఎన్నికల ప్రచారంలో కానీ, పార్లమెంట్‌లో కానీ, నదీజల వినియోగ సాంకేతిక వివరాలలో కానీ ‘క్యూసెక్స్’ అనే పదం ఆయన జిహ్వగ్రాన ఎప్పుడూ ఉండేది. అందువల్ల ఆయన అభిమానులు, సాంకేతిక విషయ విజ్ఞాన నిపుణులు ‘క్యూసెక్స్ కేండిడేట్’గానే అవిరతం సంభావించేవారు. అందుకే స్వీయ చరిత్ర కాయన ‘క్యూసెక్స్ కేండిడేట్’ అనే పేరు ఉంచారు. ఈ స్వీయ చరిత్రలో ప్రపంచాద్భుతాలు, తమ విదేశ పర్యటనల అత్యంత కుతూహలకరమైన విషయాలు వారు ప్రస్తావించారు. ఆధునిక చైనా ప్రగతి గూర్చి వారెన్నో విషయాలు చెప్పారు. అత్యంతాసక్తికరమైన విషయం వారిట్లా చెప్పారు. ఒకటి ‘చైనాలో దక్షిణ కాంగ్‌సియా రాష్ట్రంలో సేద్యపు కాలువను ఆ దేశీయులు బ్రహ్మాండంగా నిర్మించుకున్నారు. ఈ కాలువ వెడల్పు 140 మీటర్లు. అంటే రెండు ఒడ్ల మధ్య ఆ కాలువ వెడల్పు అది. భూమి ఉపరితలం నుంచి కాలువ లోతు 7 మీటర్లు. కాలువ పొడవు 170 కిలోమీటర్లు. చైనాలో ఈ పనిని 80 రోజులలో సంపూర్తిగా నిర్వహించారు. ఈ పనిలో 7 కోట్ల ఘనపు మీటర్ల మట్టి ఎత్తిపోయవలసి వచ్చింది. ఈ పనిలో యంత్ర సాధనలేవీ లేవు. పాల్గొనలేదు. 13 లక్షల సంఖ్య కార్మికులు ఈ పనిని, తన సొంత పనిగా ఉత్సాహోల్లాసాలతో పూర్తి చేశారు. రోజు కూలి ఏమీ తీసుకోలేదు ఈ పని వాళ్లు.
ఈ పనిలో పాల్గొన్న కార్మిక, కర్షకులను దేశం ఎంతో ఆదరంగా చూసింది. వీళ్లకో సందేశంలో సువిఖ్యాతులైన కళాకారులెందరో వచ్చి ఈ పనుల మధ్య విరామ, వినోద ప్రదర్శనలు నిర్వహించే వాళ్లు. చైనాలో ఇంజనీర్లు ఎంతో ప్రతిభావంతులు. కలుపుగోలుతనం కలవారు. ఉల్లాస ప్రవృత్తి కలవారు. అతిథి మర్యాదలను గొప్పగా నిర్వహిస్తారు, అని డా.కె.ఎల్.రావు స్వీయ చరిత్రలో చెప్పారు.
ఇటువంటి దేశహితైక బృహత్ప్రణాళిక మన దేశంలో నిర్వహించాలంటే 80 రోజులు కాదు కదా ఎనిమిదేళ్లకు కూడా పూర్తి అయ్యేది కాదు. పదమూడుసార్లు అంచనాలు మారిపోయేవి. ఇంజనీర్లు, స్థానిక చోటా మోటా రాజకీయులు లంచాలు మేసేవారు. లంచాలు లేకపోతే గజం పని కూడా పూర్తి అయ్యే అవకాశం ఉండేది కాదు. పదమూడు లక్షల మంది జనుల సంగతి అట్లా ఉంచి లక్ష మంది కూడా స్వచ్ఛందంగా ఈ పనిలో పాల్గొనటానికి వచ్చేవారు కారు. అధికారులకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు కూడా దురాలోచన తప్ప, దూరాలోచన ఏమీ పట్టేది కాదు. పని సాగుతున్న ప్రదేశానికి చలనచిత్ర కళాకారులు ఎంత మాత్రం వచ్చేవాళ్లు కాదు. టీవీ వాళ్లు, వార్తా మాధ్యమాల వాళ్లు ఇందులో మనకు గిట్టేదేముంది? అని అశ్లీల, అసభ్య దృశ్యాలు తెరకెక్కించే అవకాశం లేదనీ, అస్మదీయులు, తస్మదీయులు, పార్టీలు, సదరు పార్టీల అభిమానుల ప్రమేయం ఏముంటుందనీ ఆ ఛాయలకు వచ్చేవారు కారు. లేదా శక్తి కొద్దీ బురద చల్లేవారు. ఇందువల్లనే దేశం ఇట్లా కునారిల్లుతున్నది. డా.కె.ఎల్.రావు గారి వంటి ఉత్తమ దేశభక్తులు, విజ్ఞాన సంపన్నులు ఉండి కూడా నీతి, నిజాయితీ, దేశభక్తి, ప్రజోపయోగ భారీ వ్యవస్థల పట్ల అనురక్తి మన దేశ ప్రజలలో డెబ్బై మూడేళ్లుగా పాలక వర్గం, విద్యాధిక వర్గం, పారిశ్రామిక వర్గం, సంపన్న వర్గం పట్టించుకోలేదు. సామాజిక జీవనం, సాహిత్యం, విద్య, సంస్థలు రాజకీయాలు యథాశక్తి భ్రష్టు పట్టించారు.
కాబట్టి చైనా దేశం వలె ప్రపంచం రంగంపై మన దేశం అభివృద్ధి చెందలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. కానీ ప్రజా శ్రేయస్సు ఉంది. ఇక్కడో ఏమున్నదో తెలియదు.

-అక్కిరాజు రమాపతిరావు