AADIVAVRAM - Others

అణువుల అమరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు బాగా వచ్చిన వాళ్లు కూడా పబ్లిక్ (public), ప్రైవేట్ (private) అనే ఇంగ్లీషు మాటలకి సమానార్థకాలైన తెలుగు మాటలు తట్టక, ఆ ఇంగ్లీషు మాటలనే యథాతథంగా వాడేస్తూ ఉంటారు.
నామవాచకంగా వాడినప్పుడు, పబ్లిక్ అంటే జనసామాన్యం. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నప్పుడు ‘పబ్లిక్ ఒపీనియన్’ సేకరిస్తాం. దీనిని జనాభిప్రాయం అనొచ్చు. కానీ ఈ మాట వేళకి బుర్రకి తట్టక ఇంగ్లీషు మాట వాడేస్తూ ఉంటాం.
నామవాచకంగా వాడినప్పుడు ‘ప్రైవేట్’కి, అమెరికాలో అయితే, సైన్యంలో పనిచేసే సిపాయి, జవాను అనే అర్థాలు ఉన్నాయి కానీ, ఈ అర్థాలు భారతదేశంలో చెల్లవు.
పోటీ, ఈ రెండు మాటలూ విశేషణం (adjective) గా వాడినప్పుడు చాలా అర్థాలు స్ఫురిస్తాయి. ఉదాహరణకి private అంటే స్వంత, సొంత, వ్యక్తిగత, స్వకీయ, వ్యష్ఠి అనే అర్థాలే కాకుండా ఖాసా, ఖానిగీ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ‘నా ఖాసా తమ్ముడు’ అంటే నా సొంత (own)) తమ్ముడు అనే అర్థం ఉంది. ‘ఖానిగీ భూమి’ అంటే ప్రైవేట్ లాండ్. ‘నా సొంత విషయాలలో జోక్యం చేసుకోకు’ అన్నప్పుడు ‘సొంత’ అంటే ప్రైవేట్. ‘ప్రైవేట్ మాస్టారు’ అన్నప్పుడు ‘అందరితోటీ కాకుండా ప్రత్యేకించి’ అనే అర్థం వస్తుంది.
పబ్లిక్ అంటే బాహాటపు, బాహాటమైన, బాహిర, బహిరంగ, బహిరంగమైన, రట్టయిన, రచ్చ (ఉ.రచ్చబండ) అనే అర్థాలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రజా, జనహితైక, సర్వజనిత, అనే మరొక రకమైన అర్థాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, రాజస, దివాణపు, సర్కారు లేదా సర్కారీ అని మూడో అర్థం కూడా ఉంది. ఈ దిగువ ప్రయోగాలు చూడండి.
Public Health ప్రజారోగ్యం
Public Interest ప్రజాహితం
Public Officer ప్రభుత్వోద్యోగి
Public Safety ప్రజాక్షేమం
Public Opinion - ప్రజాభిప్రాయం
Public Performance బహిరంగ ప్రదర్శనం
Public Relations పౌర సంబంధాలు
Public Road - రహదారి, రచ్చదారి
Public Sector ప్రభుత్వరంగం
Public Platform రచ్చబండ
దీనిని బట్టి అర్థం అయిందేమిటంటే ఈ రెండు మాటలకీ సమానార్థకాలైన తెలుగు మాటలు లేకపోలేదు. సందర్భానుసారంగా ఉపయోగపడే మాటలని వెతుక్కోవాలి. ఒక భాష నుండి మరొక భాషలోకి వెళ్లేటప్పుడు ఇది తప్పనిసరి.
* * *
చీమలు కుట్టినప్పుడు చుర్రుమని మంట పుడుతుంది. దీనికి కారణం? చీమ మన శరీరంలోకి ఒక మోతాదు ఫార్మిక్ ఆమ్లంని ఎక్కిస్తుంది. లాటిన్ భాషలో ‘్ఫర్మైకా’ అంటే చీమ కనుక చీమ శరీరంలో ఉండే ఈ ఆమ్లానికి ఫార్మిక్ ఏసిడ్ అని పేరు పెట్టారు. ఈ ఫార్మిక్ ఏసిడ్ కూడా చీమలులా పుల్లగా ఉంటుంది కనుక దీనిని తెలుగులో చీమామ్లం అనొచ్చు. కానీ తెలుగు మరీ నాటుగా, దేశవాళీ భాషలా, బైతు భాషలా ఉందనుకుని తెలుగు మాట్లాట్టం మానేస్తున్నారు మనవాళ్లు. వాళ్ల సౌకర్యార్థం దీనికి సంస్కృతంలో పేరు పెడదాం. తెలుగు కానంతసేపూ మన వాళ్లకి అభ్యంతరం ఉండదు కనుక, సంస్కృతంలో చీమని ‘పిపీలికం’ అంటారు కనుక (ఉ.పిపీలికాది బ్రహ్మ పర్యంతం) ఈ ఆమ్లానికి ‘పిపీలికామ్లం’ అని పేరు పెడదాం.
ఇంతవరకు వచ్చిన తరువాత మరొక్క మెట్టు ఎక్కి, ‘్ఫర్మాల్డిహైడ్ కి ‘పిపీలికాలంతం’ అన్న పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ‘బయాలజీ లేబు’కి కానీ ‘ఎనాటమీ లేబు’కి కానీ వెళితే అక్కడ వేసే వాసన ఈ ఫార్మాల్డిహైడ్ దే! ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కొంచెం ఓపిగ్గా ఈ రసాయనంలో ఉన్న అణువుల అమరిక అర్థం చేసుకోవాలి. ఈ అమరికని రెండు కోణాల వెంబడి చూద్దాం.
ముందు మెతేనుతో మొదలు పెడదాం. మెతేను వాయువు గురించి ఇంతకు ముందు చదివారు కదా. ఒక మెతేను బణువులో మధ్య ఒక కర్బనపు అణువు, దానికి నాలుగు చేతులు, చేతికొకటి చొప్పున నాలుగు ఉదజని అణువులు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒక ఉదజని అణువుని తీసేసి దాని స్థానంలో ఒక ‘హైడ్రాక్సిల్ గుంపు’ (అంటే ఒక ఉదజని, ఒక ఆమ్లజని అణువుల జంట, లేదా ‘ఉదామ్ల గుంపు) ప్రతిక్షేపిస్తే, ‘మెతల్ ఆల్కహాలు’ వస్తుంది. దీన్ని తెలుగులో కర్ర సారా అంటారు. (ఈ కర్ర సారా విష పదార్థం, జాగ్రత్త!) ఇలా కాకుండా, మెతేను బణువు నుండి రెండు ఉదజని అణువులని తీసేసి, ఆ రెండింటి తరఫునా ఒకే ఒక ఆమ్లజని అణువుని తగిలించవచ్చు. అప్పుడు ఆమ్లజని తనకి ఉన్న రెండు చేతులతోటీ కర్బనపు అణువుకున్న రెండు చేతులని పట్టుకుంటుందన్న మాట. మరొక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు కర్బనానికి ఆమ్లజనికీ మధ్య ఒక జంట బంధం ఉందన్నమాట. ఇలా వచ్చిన పదార్థమే ఫార్మాల్డిహైడ్.
బొమ్మ: బొమ్మలో ఎడం పక్క మెతేను, మధ్యలో మెతల్ ఆల్కహాలు, కుడి పక్క ఫార్మాల్డిహైడ్.
ఈ పదార్థానికి ‘్ఫర్మాల్డిహైడ్’ అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే పైన చెప్పిన ప్రక్రియని మరొక కోణం నుండి చూడాలి. ఒక మెతల్ ఆల్కహాలు బణువులో ఒక కర్బనం, ఒక ఆమ్లజని, నాలుగు ఉదజని అణువులు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒకటి ‘ఆమ్లజని - ఉదజని’ జంటలో ఉంది. ఈ జంటలో ఉన్న ఉదజని అణువునీ, మిగిలిన మూడు ఉదజని అణువులలోంచి మరొక ఉదజని అణువునీ తొలగిస్తే మిగిలినదే ఫార్మాల్డిహైడ్. ఇలా ఉదజని అణువులని తొలగించే పద్ధతిని ఇంగ్లీషులో ‘డీ హైడ్రాజినేషన్’ అంటారు. ఆల్కహాలు నుండి రెండు ఉదజని అణువులని తీసివేశాము కనుక మిగిలిన దానిని ‘డీహైడ్రాజినేటెడ్ ఆల్కహాలు’ అనటం సబబే కదా! లేదా ఆల్కహాల్ డీహైడ్రాజినేటెడ్ అని తిరగేసి కూడా అనొచ్చు. ఈ పదబంధంలోని మొదటి మాట ‘ఆల్కహాలు’ లోని ‘ఆల్’, నీ రెండవ మాట ‘డీహైడ్రాజినేటెడ్’లోని మొదటి భాగం ‘డీహైడ్’నీ తీసుకుని సంధిస్తే ‘అల్‌డీహైడ్’ వచ్చింది కదా. ఉచ్చారణ సౌలభ్యం కోసం దీని చివర ‘ఇ’ చేర్చగా మనకి ఇంగ్లీషు వర్ణక్రమం aldehyde తయారయింది. అదండీ ఆల్డిహైడ్ ప్రవర.
ఇప్పుడు ఈ ఆల్డిహైడ్‌కి తెలుగులో ఒక పేరు పెడదాం. రసాయన శాస్త్రంలో ఒక కర్బనపు అణువు. రెండు ఆమ్లజని అణువులు, ఒక ఉదజని అణువు ఉన్న గుంపుని కార్బాక్సిల్ గుంపు అంటారు. (ఇది అర్థం కాకపోతే మాత్రం మింగినట్లు మింగెయ్యండి) రసాయన శాస్త్రంలో పేరు చివర ‘గుంపు’ అనే తోక ఉంటే ఆ బణువుకి ఒక ‘ఖాళీ చెయ్యి’ ఉంటుంది. ఆ ఖాళీ చేతికి మరొక ఉదజని అణువుని తగిలిస్తే మనకి ఫార్మిక్ ఏసిడ్ లేదా పిపీలికామ్లం వస్తుంది. ఈ పిపీలికామ్లంలో ఉన్న ఆమ్లజని - ఉదజని జంటని పైకి పీకేసి ఆ స్థానంలో ఒకే ఒక ఉదజని అణువుని ప్రతిక్షేపిస్తే వచ్చేది పిపీలిక ఆల్డిహైడ్, లేదా ఫార్మాల్డిహైడ్. పిపీలికాల్డిహైడ్ దుష్ట సమాసంలా ఉంది కాబట్టి దీనికి పిపీలికాలంతం అని నేను తెలుగు పేరు పెట్టాను. ఇదెలాగంటారా? నీతిచంద్రిక కథలలా ఆ పిట్ట కథా చెబుతాను. చదవండి.
ముందస్తుగా, పూర్వపు రోజుల్లో, రసాయన శాస్త్రంలో తారసపడే పదార్థాలకి ఎవరికి తోచిన పేరు వారు పెట్టేసేవారు. అంతా గందరగోళంగా ఉండేది. అప్పుడు పెద్దలు కొందరు జెనీవాలో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చేరు. ఈ ఒప్పందం ఏమిటంటే ప్రతి ‘ఆల్కహాలు’ జాతి పదార్థం పేరూ ‘-ఓల్’ శబ్దం తోటీ, ప్రతీ ఆల్డిహైడ్ జాతి పదార్థం పేరు ‘-ఆల్’ శబ్దం తోటీ అంతం అయేటట్టు చూడమన్నారు. అప్పుడు పేరు వినగానే ఈ రసాయనం యొక్క కులగోత్రాలు మనకి తెలిసిపోతాయన్న మాట. ఈ నియమానికి అంతా ఒప్పుకున్నారు. ఫార్మాల్డిహైడ్‌కి ‘మెతేను’ తల్లి వంటిది కనుక ‘్ఫర్మాల్డిహైడ్’ పేరు మార్చేసి ‘మెతనాల్’ అనమన్నారు. కానీ ఎవ్వరూ వినలేదు. వాడుకలో ఫార్మాల్డిహైడ్ అనే అంటున్నారు ప్రజలు; అలవాటులు తప్పించటం కష్టం! ఇదే పద్ధతిలో ‘మెతల్ ఆల్కహాలు’ని ‘మెతనోల్’ అనమన్నారు. చూశారా! ‘మెతనాల్’ ‘-ఆల్’ శబ్దం తోటీ, ‘మెతనోల్’ ‘-ఓల్’ శబ్దం తోటీ అంతం అవుతున్నాయి. ఉచ్చరించవలసి వచ్చినప్పుడు వీటిని మెతనాలు, మెతనోలు అని ఉచ్చారణ దోషం లేకుండా అనాలి. ఈ ఉచ్చారణ నియమాలని పాటిస్తూ, ఇంగ్లీషులో ‘-ఆల్’ శబ్దంతో అంతం అయే వాటిని ‘అలంతాలు’ అనీ, ‘-ఓల్’ శబ్దంతో అంతం అయే వాటిని ‘ఒలంతాలు’ అనీ అందాం. ఏమంటారు? కనుక ఆల్డిహైడ్‌లు అలంతాలు అవుతాయి. ఆల్కహాలు లు ఒలంతాలు అవుతాయి. కనుక శాస్త్రోక్తంగా ఉండాలంటే ఆల్కహాలు అనుకూడదు. ‘ఆల్కహోలు’ అని మలయాళీ వాళ్లల్లా అనాలి. (తెలుగులో మాటలు అచ్చులతో అంతం అవుతాయి కనుక తెలుగుని అజంతం అనలేదూ, అలాగే అనుకొండి!)

-వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా