Others

మన చేతుల్లో మన ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం తిన్నామో అనేదే కాదు, ఎలా తిన్నామనేది కూడా ముఖ్యమే. ఎంత మంచి ఆహారమైనా చేతులు పరిశుభ్రంగా లేకుంటే అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ చేతులు శుభ్రం చేసుకోవడంపై పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఏటా అక్టోబరు 15న విశ్వవ్యాప్తంగా చేతుల పరిశుభ్రత దినోత్సవం పాటిస్తారు. మన చేతులు ఎన్నో బాక్టీరియాలు, వైరస్‌లకు నిలయం. మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ రకరకాల వస్తువులను తాకుతుంటాం. ఈ క్రమంలో పలు రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు చేతి వేళ్లు, ముంజేతులు, గోళ్లలోకి చేరుకొంటాయి. అందుకే ఆహారం తీసుకొనేముందు సబ్బు లేదా యాంటీ బాక్టీరియల్ లోషన్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో నోరు, కళ్లు, ముక్కు, పెదవులను తాకితే వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. చేతి శుభ్రతను ఆషామాషీగా తీసుకోవడం వల్ల వ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
భోజనం చేసే ముందు, మరుగుదొడ్లు వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిందే. చేతి శుభ్రత లోపంతో కలిగే అంటువ్యాధుల్ని అరికట్టడానికి ‘ది గ్లోబల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఫర్ హ్యాండ్ వాషింగ్ డే’ని 2008లో అక్టోబరు 15న ప్రారంభించారు. చేతి శుభ్రతపై అందరికీ అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని తెలపాల్సిన రోజు ఇది.
చేతుల శుభ్రత ఇలా...
* అరచేతులు, వేళ్ల సందులను సబ్బు లేదా లోషన్‌తో రుద్దుకోవాలి.
* చేతుల వెనుక వైపునుంచి వేళ్ల సందులలో శుభ్రం చేసుకోవాలి.
* చేతుల మునివేళ్లను రుద్దుకోవాలి.
* చేతుల మణికట్టును బాగా రుద్ది కొళాయి కింది వేళ్లు ఉంచి
మురికిపోయేటట్లు శుభ్రపరచుకోవాలి.
* చేతుల బొటన వేళ్లను రుద్దాలి.
మురికిగా ఉన్న చేతులతో భోజనం చేస్తే వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి జబ్బులు వస్తాయి. అవగాహన లేక చాలామందికి చేతుల శుభ్రత గురించి తెలియడం లేదు. మన దేశంలోని మహానగరాల్లో అత్యధికులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. మనిషి ఆరోగ్యం శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు గోళ్లు కత్తిరించుకోవాలి. పిల్లలు మట్టిలో ఆడుతుంటారు కనుక తినేముందు చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. మలమూత్రాల విసర్జన తర్వాత అవయవాలను శుభ్రపరుచుకోవాలి. చేతులు సబ్బుతో కడుక్కోవాలి. మూత్రం చేసే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను ఇరవై సెకన్లపాటు కనీసం శుభ్రంగా కడుక్కోవాలి.
శుభ్రపరుచుకున్న చేతులతో ఆహారం తీసుకొంటే ఎలాంటి క్రిములు కడుపులో చేరవు. ఆరోగ్యంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు శుభ్రత అనేది బాల్యంనుంచే అలవాటు అవుతుంది. చేతులను శుభ్రపర్చుకోవడం ద్వారా దాదాపు 50 శాతం పైగా అతిసార అనుబంధ వ్యాధులు, 20 నుంచి 30 శాతం శ్వాస సంబంధిత వ్యాధులు నివారించవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు. మన చేతిలో మన కంటికి కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. చేతుల పరిశుభ్రత ఉద్దేశం మట్టి, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలను తొలగించడం.
తప్పక పాటించాల్సినవి...
* తుమ్మినా, దగ్గినా వెంటనే చేతులు కడుక్కోవాలి.
* పెంపుడు జంతువులను తాకినప్పుడు సైతం చేతులు కడుక్కోవాలి.
* బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు.
* భోజనం తయారుచేసేముందు, భోజనానికి ఉపక్రమించే ముందు.
* టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత.
* వైరల్ జ్వరాలతో బాధపడుతున్నప్పుడు.
* పరిశుభ్రమైన పొడి తువ్వాలుతో తుడుచుకోవాలి.
కార్యాలయానికి వచ్చిన తర్వాత కంప్యూటర్‌పై పనిచేయడం సహజమే. మధ్యలో ఏదైనా అవసరం వచ్చి పర్సులోని నోట్లు తీసి ఇవ్వడం జరుగుతుంది. సినిమాలకు, షికార్లకు వెళ్లినపుడు ఎన్నో వస్తువులను ముట్టుకుంటారు. ప్రతి వస్తువులపైన కనిపించని క్రిములుంటాయి. ఆయా వస్తువులను తాకినపుడు మన చేతికి అంటుకొంటాయి. అవే చేతులను కళ్లు, నోరు, ముక్కు దగ్గర పెట్టినపుడు బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి చేరుతుంది. చేతిశుభ్రత ఉంటే- విరేచనాలతో తలెత్తే మరణాలు, న్యూమోనియా, శ్వాసకోశ వ్యాధుల రోగాలను నివారించే వీలుంది. నెలలు నిండని శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లలను తాకే ముందు తల్లిదండ్రులు, ఇతరులు తప్పక శుభ్రత పాటించాలి. చేతులను కడుక్కున్న తర్వాతే శిశువులను తాకాలి.
మన ఆరోగ్యం మన అరచేతిలోనే ఉందనేది విస్మరిస్తున్నాం. చేతుల శుభ్రతపై గతంలో యునిసెఫ్ నిర్వహించిన సర్వేలో- వంట చేసే ముందు 30శాతం మంది మాత్రమే సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారని తేలింది. మరుగుదొడ్డి వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కునేవారు 53 శాతమేనట. ఆహారం తీసుకునేముందు సబ్బుతో చేతులు కడుక్కునే వారు 38 శాతం మాత్రమేనట. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో ఆస్తమా, డయేరియా వ్యాపించడానికి చేతులు శుభ్రంగా లేకపోవడమే కారణం. శరీరంలో అన్ని భాగాలను తాకేవి చేతులు మాత్రమే. స్వైన్‌ఫ్లూ విజృంభించడానికి చేతుల అపరిశుభ్రతే కారణమట.
ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం మన దేశంలో 44 శాతం మంది మాత్రమే చేతుల శుభ్రత పాటిస్తున్నారని తేలింది. ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయిలోనే పాఠశాలలో ఈ కార్యక్రమంను ఉధృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. చేతులు కలపడమే కాదు, చేతులు శుభ్రం చేసుకుందాం. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారితో షేక్‌హ్యాండ్ తీసుకుంటే ఆరోజు రాత్రిలోగా మీకు అది అంటుకోవడం ఖాయం. అందుకే సంస్కారవంతంగా ఓ నమస్కారం పెట్టి ఊరుకోండి. అప్పుడు సగం రోగాలకు మీరు దూరమైనట్టే. బాలలకు చిన్నప్పటి నుంచే చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తే, తరతరాలకు అది కొనసాగడం చాలా సులువు. ఒక గ్రాము మానవ మలంలో 10 మిలియన్ వైరస్‌లతోపాటు ఒక మిలియన్ బ్యాక్టీరియా ఉంటుందని పీడియాట్రిషియన్‌లు చెబుతున్నారు. దీనికి విరుగుడు హ్యాండ్‌వాష్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడమే.
క్రిములతో ఇబ్బంది...
చేతుల్లో చేరే ఇన్‌ఫ్యూయంజ్ వైరస్ వల్ల దగ్గు, జలుబు, సాల్మోనెల్లా క్రిమివల్ల విరేచనాలు, వాంతులు, ఇకోలి క్రిమివల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, స్ట్రిప్టోకాకై వల్ల గొంతునొప్పి, నోరీ వైరస్‌వల్ల విరేచనాలు, క్లెబ్‌సీలా క్రిమివల్ల పుండ్లలో ఇన్‌ఫెక్షన్, క్లోస్ట్రిడియిమ్ డిఫికల్ వల్ల పేగుపూత, హీమోఫిలిస్ వల్ల కళ్లు ఎర్రబారటం, షిగెల్లా వల్ల విరేచనాలు వంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండటంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడంవల్ల అనేక రోగాల్ని చేతులతో ఆహ్వానించినట్టే. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడంవల్ల 80 శాతం రోగాలు మన శరీరానికి దూరంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. అందుకే ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ముందు విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియచేయాలి. అందరం చేతులను శుభ్రంగా ఉంచుదాం. ఆరోగ్యంగా ఉందాం.
(నేడు ‘గ్లోబల్ హ్యాండ్‌వాష్ డే’)

-కె.రామ్మోహన్‌రావు 94414 35912