AADIVAVRAM - Others

శత వసంతాల సారస్వత నికేతన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రజలు గర్వించదగిన గ్రంథాలయాలలో ఒకటి సారస్వత నికేతన్. ఇది ప్రకాశం జిల్లా చీరాలకు సమీపాన వేటపాలెం గ్రామంలో నెలకొని ఉండటంతో ‘వేటపాలెం గ్రంథాలయం’గా అందరికీ సుపరిచితమే. ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి ఈ సరస్వతీ నిలయానికి నూరేళ్లు నిండటం విశేషం. శతాబ్ద కాలం పుస్తక ప్రియుల హృదయాలలో కొలువై ఉన్న ఈ గ్రంథాలయం నాటి నుండి నేటి వరకు అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎందరో మహనీయుల కృషి మరువలేనిది. సారస్వత నికేతన్‌ను 15 అక్టోబర్ 1918లో ఊటుకూరి సుబ్బరాయ శ్రేష్ఠి ప్రోత్సాహంతో అభ్యుదయ భావాలు కల కొందరు యువకులు ‘హిందూ యువజన సంఘం’ పేరుతో ఒక చిన్న గ్రంథాలయాన్ని స్థాపించారు.రెండు దినపత్రికలు, మూడు వారపత్రికలు, వంద పుస్తకాలతో తొలుత ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అలా అయిదేళ్ల పాటు ఈ గ్రంథాలయాన్ని నడిపారు. ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడంతో దాన్ని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో పుస్తక, భాషా, సాహితీ ప్రియుడు ఊటుకూరి సుబ్బరాయ శ్రేష్ఠి గ్రంథాలయ నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అప్పటివరకు గ్రంథాలయానికి ఉన్న రూ.4వేల అప్పు తీర్చడమే కాకుండా ఆ కాలంలోనే మూడు వేల రూపాయల మూలధనాన్ని ఏర్పాటు చేయడమే కాక రూ.2వేల విలువగల పుస్తకాలను సారస్వత నికేతన్‌కు విరాళంగా అందించారు.
సారస్వత నికేతన్ 1923 వరకు వేటపాలెం గ్రామానికి మధ్యనున్న చిన్నపాటి పెంకుటింటిలో నడిపారు. ఆ తరువాత 1 సెప్టెంబర్ 1924లో నూతన భవనంలోకి మార్చి పాఠకుల కోసం అనేక సౌకర్యాలు కల్పించారు. నూతన భవన ప్రారంభోత్సవం మహాత్మాగాంధీకి కుడిభుజంగా భావించే సేఠ్ జమన్‌లాల్ బజాజ్ చేతుల మీదుగా జరగడం విశేషం. శ్రేష్ఠిగారు చేసిన విశేష సేవలకు గుర్తుగా ఈ భవనానికి ‘సుబ్రాయ మహల్’ అని నామకరణం చేశారు. నాటి నుండి ఈ గ్రంథాలయ నిర్వహణలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. శ్రేష్ఠిగారు ఎన్నో అమూల్యమైన గ్రంథాలను సేకరించి పుస్తక సంపదను పెంపొందించి పాటకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అప్పట్లో వేటపాలెం గ్రంథాలయంలో లభించని పుస్తకాలను మద్రాసులోని కనె్నమరా పబ్లిక్ లైబ్రరీ నుండి కూడా తెప్పించి పాఠకులకు అందించేవారు. సారస్వత నికేతన్‌కు సేవలు అందించడంతోనే శ్రేష్ఠిగారు తన బాధ్యత ముగిసిందని భావించలేదు. గ్రంథాలయోద్యమంలో సైతం వారు చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి ఉపాధ్యక్షులుగాను, గుంటూరు మండల గ్రంథాలయ సంఘానికి అధ్యక్షులుగాను కొనసాగి నిరుపమాన సేవలు అందించారు. సారస్వత నికేతన్‌లో జరిగిన ఏడవ మండల గ్రంథాలయ సభలో ఈ గ్రంథాలయాన్ని మండల కేంద్ర గ్రంథాలయంగా గుర్తించారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన వేటపాలెం గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందింది. దాంతో శ్రేష్ఠిగారు మరో నూతన భవనాన్ని నిర్మించ తలపెట్టారు. అదే సమయంలో మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సందర్భంలో ది.18-04-1924లో బాపూజీ అమృత హస్తాలపై నూతన భవనానికి శంకుస్థాపన జరిగింది. గాంధీజీ రెండవసారి ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన కారు దిగుతుండగా చేతికర్ర విరిగిపోవడంతో అక్కడే వదిలివేసి వేరొక చేతికర్రతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. విరిగిపోయిన మహాత్ముని చేతికర్రను బాగుచేయించి ప్రత్యేకమైన పెట్టెలో కొంతకాలం భద్రపరిచారు. నూతన భవనానికి శ్రేష్ఠిగారి కుటుంబ సభ్యులతోపాటు వారి సోదరుడు కోటిలింగం కూడా ఆర్థిక సాయం అందించడంతో ఈ భవనానికి ‘మీనాక్షమ్మ కోటిలింగం శ్రేష్ఠి’ స్మారక మందిరమని నామకరణం చేశారు. ఈ భవన ప్రారంభోత్సవానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు విచ్చేయడం విశేషం. సారస్వత నికేతన్‌ను ఒక దేవాలయంగా భావిస్తారు. అందుకే ఈ గ్రంథాలయ ప్రాంగణంలో ది.22-11-1923లో ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేశారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కావించడం మరో విశేషం. శ్రేష్ఠిగారికి సంతానం కలగలేదు. సారస్వత నికేతన్ గ్రంథాలయాన్ని తన సొంత బిడ్డగా చూసుకుంటూ దాన్ని అభివృద్ధి చేసి తన 41వ ఏట మే 1935లో ఆయన కన్నుమూశారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన సారస్వత నికేతన్ గురించే ఆలోచించారు. పెదగంజాం, గొనసపూడి గ్రామాలలో 4.78 ఎకరాల భూమిని ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం కల్పించారు. ఇదే రీతిలో చేబ్రోలు గ్రామంలో రెండున్నర ఎకరాల మాగాణిని కూడా ఇచ్చారు. ఈ పొలాలను విక్రయించి గ్రంథాలయ నిర్వాహకులు మూల నిధిగా వాడుతున్నారు. శ్రేష్ఠిగారు కన్నుమూసిన అనంతరం వారి ధర్మపత్ని కమలాంబ సంస్థ నిర్వహణలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులకు చేదోడువాదోడుగా నిలిచారు. కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడమే కాక తన భర్త శ్రేష్ఠిగారు ఇచ్చిన పెంకుటింటిని తమ స్వంత ఖర్చుతో చక్కని భవనాన్ని నిర్మించి అందులో సభలు, సమావేశాలతోపాటు, కవిసమ్మేళనాలు, హరికథల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగడానికి మార్గ సుగమం చేశారు.
పరిశోధకులకు కల్పతరువు
నేడు అనేక మంది యువత విశ్వవిద్యాలయాలలో పరిశోధనా గ్రంథాలు రాస్తున్నారు. అటువంటి వారికి సారస్వత నికేతన్ కల్పతరువుగా, ఒక పరిశోధనా కేంద్రంగా ఉపయోగపడుతుంది. అనేక విషయాలపై పరిశోధనలు చేసిన ఎందరో విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు తమ పరిశోధనా గ్రంథాలు లిఖించే సమయంలో తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఈ పుస్తక భాండాగారం కేవలం విద్యార్థులకే కాక, అధ్యాపకులకు, ఆచార్యులకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి తూమాటి ద్రోణప్ప ప్రశంసించారు. విద్యార్థులు తమ సందేహాలను తీర్చుకోవడానికి విశ్వవిద్యాలయాలకు వస్తుంటే, ఆచార్యులు వారి సందేహాలను తీర్చుకోవడానికి సారస్వత నికేతన్‌కు వస్తుంటారు. పరిశోధనా కేంద్రంగా భావిస్తున్న ఈ గ్రంథాలయ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎందరో యువత డాక్టరేట్ డిగ్రీలను పొందారు. రమారమి 50 మందికి పైగా పరిశోధకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారని ఒక అంచన. సుదూర ప్రాంతాలలో ఉండి ఇక్కడికి రాలేని వారు కోరిన సమాచారాన్ని జెరాక్స్‌లు తీయించి ఇక్కడి గ్రంథాలయ పాలకులు అందజేస్తుంటారు. ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల నుండి కూడా పరిశోధకులు ఈ గ్రంథాలయానికి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి వందేళ్ల చరిత్ర కలిగిన సారస్వత నికేతన్ గురించి తెలుసుకుని ఈ గ్రంథాలయ ముఖ చిత్రంతో పోస్టల్ కవర్, స్టాంప్‌ను అక్టోబర్ 15నాటికి విడుదల చేస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
మహిళలకు సైతం ఎనలేని సేవలు
సారస్వత నికేతన్ ఆది నుండి స్ర్తి అభ్యున్నతికి కృషి చేసింది. స్ర్తి విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం కోసం సంచార గ్రంథాలయాన్ని సైతం నిర్వహించారు. స్ర్తిల ఎదుగుదలను కాంక్షిస్తూ ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇల్లాలి చదువు ఇంటికే వెలుగు అన్నారు. స్ర్తిలు విద్యావంతులైతే ఆ కుటుంబమంతా విద్యావంతులౌతారు. అందువల్ల మహిళల్లో విద్యావ్యాప్తి చేసి వారి ద్వారా పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడానికి విశేష కృషి చేశారు. అనేక మంది మహిళలు ఈ గ్రంథాలయ సేవలను సద్వినియోగ పరచుకున్నారు. ప్రస్తుతం గ్రంథాలయం ఆధ్వర్యంలో ఒక మహిళా మండలిని నిర్వహిస్తున్నారు. హిందీ విద్యాలయం కూడా నడుపుతూ దక్షిణ భారత ప్రచార సభ వారు నిర్వహించే ప్రాథమిక నుండి విశారద వరకు పిల్లలకు పరీక్షలు కూడా జరుపుతున్నారు. కొంతకాలం పాటు గ్రంథ ప్రచురణ కార్యక్రమాన్ని చేపట్టి అనేక మంది వర్థమాన, యువ రచయితలను ఈ సంస్థ ప్రోత్సహించింది. సారస్వత నికేతన్ ప్రచురించిన గ్రంథాలలో భగవద్గీతా సంగ్రహము, తులసీదాస హృదయము, త్రిభాషా బోధిని, ధన్వంతలహరి, శాంతిదూత, చీకటింట్లో నల్లపిల్లి, మంచాల ఇత్యాదివి ముఖ్యమైనవి. మద్యపాన నిషేధం, స్ర్తి విద్యాభివృద్ధికి వీరు ప్రచురించిన కరపత్రాలు పలువురి ప్రశంసలందుకున్నాయి. 1942లో జరిగిన గుంటూరు జిల్లా గ్రంథాలయ సమావేశాలు ఇక్కడే జరిగాయి. 1943లో అంతర్జాతీయ సహకార కదలిక ఇక్కడే ప్రారంభమైంది. వయోజనుల కోసం 1945లోనే ఈ సంస్థ తరగతులను నిర్వహించి వయోజన విద్యావ్యాప్తికి అవిరళ కృషి సల్పారు. 1950లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ప్రధాన అధ్యాపకుడిగా పాత్రికేయ మిత్రుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించారు. అందుకే నాటి బూదరాజు రాధాకృష్ణ నుండి నేటి తరం పాత్రికేయుల వరకు సారస్వత నికేతన్ స్ఫూర్తినిచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనేక సందర్భాలలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు.
అంకిత భావం
సారస్వత నికేతన్‌లో పనిచేసే గ్రంథాలయ సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. ప్రారంభం నుండి 1982లో తుదిశ్వాస విడిచే వరకు కమేడిశెట్టి కామయ్య అతి స్వల్ప వేతనంతో నిస్వార్థంగా, ఎంతో భక్తిశ్రద్ధలతో, అంకిత భావంత గ్రంథాలయానికి సేవలు అందించారు. అర్ధశతాబ్దం పాటు గ్రంథాలయానికి తన జీవితాన్ని అంకితం చేశారు. మేళ్లచెరువు ఆంజనేయ శర్మ కూడా 40 ఏళ్లపాటు ఎంతో సమర్థవంతంగా సారస్వత నికేతన్‌కు సేవలు అందించారు. గ్రంథాలయ శాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా పొంది 1953 నుండి గ్రంథాలయ పాలకుడిగా ఉండి ఎంతో ఓర్పు, నేర్పులతో బాధ్యతలను నిర్వహించిన వారిలో ఒకరు కె.సుబ్రహ్మణ్యం. వీరు గ్రంథాలయం ఒక క్రమపద్ధతిలో జరగడానికి అవిరళ కృషి చేశారు. అనేక మంది ప్రముఖులు, సాహితీవేత్తలు శ్రీయుతులు శివశంకర శాస్త్ర, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, డా.కర్ణ రాజశేషగిరిరావు, ఎస్.వి.్భజంగరాయ శర్మ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ, టేకుమళ్ల రాజగోపాలరావు ఇత్యాది అనేక మంది తన స్వంత గ్రంథాలయాలలోని పుస్తకాలను సారస్వత నికేతనానికి బహూకరించారు. ఈ సంస్థ 1993లో ప్లాటినమ్ జూబ్లీ జరుపుకుంది. అప్పుడే క్విట్ ఇండియా స్వర్ణోత్సవాలు కూడా జరిగాయి. ఈ సందర్భంలో చీరాలలో జరిగిన సమావేశం కోసం కూర్చుని రాట్నం వడుకుతున్న గాంధీజీ విగ్రహాన్ని చేయించారు. ఆ మీటింగ్ అనంతరం అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు డా.కొణిజేటి రోశయ్య సలహా మేరకు నిర్వాహకులు ఈ విగ్రహాన్ని సారస్వత నికేతన్‌లో ఉంచారు. గాంధీజీ ఇక్కడికి రెండవసారిగా వచ్చినప్పుడు వారి చేతికర్ర విరిగిపోయింది. ఆ చేతికర్రను ప్రస్తుతం ఈ విగ్రహానికి అమర్చారు. గాంధీజీ ఉపయోగించిన ఆ చేతికర్రను తిలకించడానికి అనేక మంది ఇక్కడికి వస్తూంటారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ కూడా ఒక సందర్భంలో ఈ గ్రంథాలయంలో అడుగిడినారు.
అరుదైన గ్రంథాల కంప్యూటరీకరణ
సారస్వత నికేతనంలో కొలువై వున్న అరుదైన గ్రంథాల నుండి 1200 పుస్తకాలను కంప్యూటరీకరణ చేశారు. వీటిలో 800 పుస్తకాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారు, మిగిలిన 400 పుస్తకాలను రాజిరెడ్డి ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం వారు కంప్యూటరీకరణ కార్యక్రమం పూర్తి చేశారు. ఇంకా అనేక అరుదైన గ్రంథాలతోపాటు తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి పురాతన గ్రంథాలను కంప్యూటరీకరించి, భద్రపరచి, జాతికి వనె్న తెచ్చిన అనేక ఉత్తమ గ్రంథాలను మెరుగులు దిద్ది భావితరాలకు అందించవలసిన ఆవశ్యకత ఉంది. చాలాకాలం నాటి దినపత్రికలు సైతం ఇక్కడ బైండింగ్ చేసి ఉన్నాయి. వెండి పూతతో లిఖించబడిన తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 12వ శతాబ్దం నుంచి సేకరించిన అనేక గ్రంథాలతోపాటు భారతి మాసపత్రిక, కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక ఇలా పలురకాల దినపత్రికలు ఇత్యాది అనేక ప్రచురణలు ప్రారంభ సంచిక నుండి ఇక్కడ లభించడం విశేషం. 2013 గణాంకాల ప్రకారం ఈ గ్రంథాలయంలో 91 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు పైగా దాటిపోయిందని అంచనా. వీటిలో 60వేలకు పైగా తెలుగు, 20,974 ఆంగ్ల గ్రంథాలు, అయిదువేలకు పైగా హిందీ పుస్తకాలు, 302 ఉర్దూ గ్రంథాలు, 1687 ఇతర భాషల గ్రంథాలు ఉన్నాయి. ఇంకా 121 తాళపత్ర గ్రంథాలు, 20 వరకు పుస్తక రూపం నోచుకోని గ్రంథాలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా అనేక పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే అనేక పుస్తకాలు చదవాలి. అందరూ వాటిని కొనే ఆర్థిక స్థితిని కలిగి ఉండరు. అటువంటి వారి కోసం పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక పుస్తకాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. విద్యార్థులు చదువుకోవడానికి విశాలమైన హాలు ఇక్కడ ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి ఈ పుస్తకాలను చదువుకుని పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారెందరో ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడానికి ఆర్థిక వనరుల ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం పూనుకుని తగినంత ఆర్థిక సాయాన్ని సారస్వత నికేతన్‌కు అందించవలసిన అవసరం ఉంది. దాతలు సైతం తమ వంతు ఆర్థిక సాయం కానీ పుస్తక రూపంలోనైనా సరే సహాయపడితే వేటపాలెం గ్రంథాలయం ఇంకా పటిష్టంగా తయారౌతుంది. పత్రికా ప్రచురణ కర్తలు కూడా తమ తమ పత్రికలను స్వచ్ఛందంగా, ఉచితంగా పంపినట్లయితే పత్రికలపై పెట్టే ఖర్చుతో మరికొన్ని పుస్తకాలను కొనుగోలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం కె.వి.డి. మల్లికార్జునరావు సారస్వత నికేతన్ అధ్యక్షుడిగాను, పి.శ్రీవల్లి గ్రంథాలయ పాలకురాలిగా వ్యవహరిస్తున్నారు. నేటి యాంత్రిక యుగంలో పిల్లలకు గ్రంథాలయాలకు వెళ్లే తీరిక, ఓపిక కూడా లేవు. ఈ నేపథ్యంలో నూరేళ్ల నుండి నడుస్తున్న సారస్వత నికేతన్ గ్రంథాలయాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తుంది.

-షేక్ అబ్దుల్ హకీం జాని 9949429827