Others

చెల్లెలి కాపురం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్ అనే రచయిత పాత్రతో సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చి సహజ కవిగా ఒక పల్లెటూరు యువకుని పాత్రను సృష్టించి, కవిత్వాన్ని అన్నాచెల్లెళ్ల అనుబంధాలను మేళవించి సినారె, దేవులపల్లి, కొసరాజు, దాశరథి రాసిన పాటలతో కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఎం బాలయ్య నిర్మాతగా అమృతా ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఉదాత్తమైన కుటుంబ కథాచిత్రం -చెల్లెలి కాపురం. అందాల నటుడు శోభన్‌బాబు డీగ్లామరైజ్డు పాత్ర పోషించడం సాహసోపేత నిర్ణయం. కవిగా, అమాయక పల్లెటూరు యువకుడిగా శోభన్‌బాబు అద్వితీయమైన నటన కనపర్చారు. కళాభినేత్రి వాణిశ్రీ కవికి అభిమాన పాఠకురాలిగా తన సాత్వికాభినయం, హుందాతనంతో పాత్రకు వనె్న తెచ్చిపెట్టారు. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, చరణ కింకణులు ఘల్లుఘల్లుమన.. ఈ రెండు పాటలలో వాణిశ్రీ అభినయం అమోఘం. ప్రత్యేకించి సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిన చరణ కింకణులు పాట సాహిత్యంలోని ప్రతి పదానికీ అభినయం చూపుతూ నర్తించి ఆ పాత్రకు జీవం పోశారు. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ అందించిన సంగీతం వీనులవిందు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను పరవశింపచేశారు. క్లైమాక్స్‌లోని చరణ కింకిణులు పాటకు ప్రాణప్రతిష్ఠచేశారు. పేదరికం బయటపడకుండా లేని ఆడంబరాన్ని చూపుతూ లౌక్యంగా వ్యవహరిస్తూ సమాజంలో ఎలా నెగ్గుకురావాలో తెలియజేసే పాత్ర (రాఘవ) నాగభూషణంది. పిసినారి పబ్లిషర్‌గా అల్లు రామలింగయ్య పాత్రోచితంగా నటించి మెప్పించారు. ఫైటింగ్‌లు, క్లబ్బు డాన్సులు వంటి అనవసరపు హంగు ఆర్భాటాలు లేకుండా కుటుంబ సమేతంగా చూడతగిన చిత్రం -చెల్లెలి కాపురం. అందుకే ఇది నాకు నచ్చిన సినిమా. టైటిల్ పాత్ర పోషించిన మణిమాల నటన వలన సినిమాకు సార్థకత చేకూరిందని చెప్పడంలో సందేహం లేదు. నచ్చిన సినిమాగా, జనం మెచ్చిన సినిమాగా విజయవంతంగా ప్రదర్శించబడిందని చెప్పడం అతిశయోక్తి కాదు.

-పిసిహెచ్ కోటయ్య, అద్దంకి