Others

నిర్మాతని బతికించుకోవాలి(ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు సినీ పరిశ్రమ పచ్చగా పదికాలాలు వుండాలంటే నిర్మాత పచ్చగా వుండాలి. చెట్టు పచ్చగా వుంటేనే దానికింద నీడ దొరుకుతుంది. దాని ఫలాలూ పదిమందికి అందుతాయి. అదే చెట్టు మోడువారిపోతే? ఆ మోడు కింద ఎవరు తలదాచుకుంటారు? అక్కడ తినడానికి ఏంమిగుల్తుంది బూడిద!’
ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు, మహానటులు రేలంగి. నేను వేసవి శెలవులకి మద్రాసు మా బావ ఇంటికి వెళ్లినప్పుడు నేను పోరుపెడితే మా బావ ఏఏ రాజు (మ్యూజిక్ డైరెక్టరు) తీసుకెళ్లాడు. అప్పుడు చెప్పిన మాటలివి. అప్పటికీ ఒకటీ అరా వేషాలు వేస్తున్నారు. నీలకంఠ మెహతా వీధిలో పెద్ద భవనం. పోర్టికోలో వాలు కుర్చీలో పేపరు చదువుతూ సింహంలా కూర్చొనేవారు. ఆయన సినిమాల్లోనైతే హాస్యం పండించేవారు కానీ. నిజ జీవితంలో సీరియస్‌గా గంభీరంగా వుండేవారు.
చిత్రం ఏవిటంటే నలభై ఏళ్ళకు ముందే నిర్మాణ రంగం చెడిపోయిందనీ, నటీనటులందరూ డబ్బు వెనుక పరుగులు తీస్తున్నారని మాట్లాడుకొనేవారు. అంటే ఈ బాధలు ఇండస్ట్రీ పుట్టినప్పట్నించీ వున్నాయి. వుంటాయి. తాను నిర్మాతను ఎలా ఆదుకుందీ చెప్పిన విషయాలు ఇప్పటికీ మరిచిపోలేను.
ఎ శంకరరెడ్డి లలితా శివజ్యోతి బ్యానరుమీద ‘లవకుశ’ సినిమా మొట్టమొదటిసారిగా గేవార్ కలర్‌లో తీశారు. ఆ సినిమా ప్రారంభంనుంచీ అన్ని కష్టాలే. ఎంతో ఇష్టపడి సి పుల్లయ్య తయారు చేసుకున్నారు కథ, ట్రీట్‌మెంటు, పాటలు, మాటలు. సంగీతం అయితే ఘంటసాల మాస్టారు ప్రాణం పెట్టిమరీ చేశారు. ఆదిలోనే హంసపాదులా ప్రారంభంలోనే పుల్లయ్య మరణం అందరినీ కృంగదీసింది. తరవాత కమలాకర కామేశ్వరరావుని సంప్రదిస్తే ఇది సినీ పితామహులు పుల్లయ్య సంపద. దీన్ని నా పేరుతో అనుభవించలేను! అంటూ సున్నితంగా తిరస్కరించారు. చివరికి పుల్లయ్య అబ్బాయి సియస్ రావునే చిత్రం పూర్తి చేసేందుకుగానూ యన్టీఆర్‌తో సహా అందరూ తీర్మానించారు. సియస్ రావు మంచి చదువరి. వర్క్ చాలా ఫాస్ట్‌గా చేసేవారు. ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్. మొత్తానికి సినిమా పూర్తయిందనిపించుకుంది. అయితే అక్కడే మొదలైంది చిక్కంతా. ఫస్ట్‌కాపీ చూసిన వారంతా మొహాలు పేలవంగా పెట్టారు. సినిమా అంతా ట్రాజెడీ.. ఒకటే ఏడుపు. పిల్లల్ని ఎవరు చూస్తారు? ఆ పాటల్ని ఎవరు వింటారు? వచ్చే వాళ్లు యన్టీఆర్‌నీ, అంజలీదేవిలను చూడాలనుకుంటారు. వాళ్లు కనిపించినంత సేపు బాధగానే కనిపిస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్టు అస్సలు లేదు. కనీసం రేలంగి, గిరిజల మీద రెండు పాటలయినావుంటే బావుంటుంది అని సలహా ఇచ్చారు.
ఆ సమయంలో శంకర్రెడ్డి నా దగ్గరకొచ్చారు. జరిగింది చెప్పేరు. వెనువెంటనే ఘంటసాల మాస్టారితో మాట్లాడాను. కొసరాజును పాటలు సిద్ధం చెయ్యమన్నాను. రావుగారు (డైరెక్టరు) కొసరాజు, ఘంటసాల మాస్టారితో కొర్చొని పాటలు సిద్ధం చేసారు. అరుణాచలం స్టూడియోలో చిన్న సెట్టు. మేం షూటింగు చేస్తున్నామన్న విషయం గిరిజకు తెలీదు. నిద్రపోతున్నదాన్ని లేపి మరీ షూట్ చేశాం. అలాగా రెండు పాటలూ పూర్తిచేశాం. మాకే అనిపించింది. డైలాగు పార్టుకీ, పాటకీ చాలా వ్యత్యాసం కనిపించింది. సినిమా రిలీజైంది. ఎలా ఆడిందో మీకు తెలుసు!’ అంటూ తన గతాన్ని నెమరువేసుకున్నాడు రేలంగి.
చాలామందికి తెలీని మరో విషయం ఏమిటంటే -రేలంగి అగ్రనటులకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలు వున్నాయి. అలాగని నిర్మాతల ముక్కుపిండి తీసుకోలేదు. నిర్మాత సంతోషంగా ఇస్తే తీసుకున్నాడు. ‘సినిమా రిలీజ్‌కి కష్టపడుతున్న సమయంలో కావాలనే బ్యాలన్స్ ఇవ్వవలసిన అవసరం లేదని స్వయంగా లెటర్రాసి పంపించేవాడ్ని. ఒక్కోసారి ప్రొడ్యూసర్లకి ఎదురిచ్చిన సందర్భాలూ వున్నాయనుకోండి!’ అంటూ తన అనుభవాలు గుర్తు చేసుకున్నారు రేలంగి.
ఆయన చాలా సినిమాలకు సహాయం చేశారు. చాలామంది నటీనటులను ప్రోత్సహించారు. అగ్ర నటులిద్దరితోనూ సామరస్యంగా ఉండగలిగిన ఏకైక నటుడు రేలంగి! నవ్వుతూ జటిలమైన సమస్యలను నిముషాల్లో పరిష్కారం చేయగలిగిన దిట్ట. చివరి రోజుల్లో తన సమస్యలకు పరిష్కారం వెదుక్కోలేక, ఆర్థిక ఇబ్బందులకు సమాధానం చెప్పుకోలేక నలిగిపోయాడు.
రేలంగి జీవితంలో నవ్వుతూ బ్రతికాడు. బ్రతికినంతకాలం నవ్వులు పంచాడు. నవ్వుతూనే బ్రతుకుచాలించాడు. చివరికి ‘నవ్వు’కి నజరానాగా నిలిచిపోయాడు.

-ఇమంది రామారావు 9010133844