Others

ప్రజల సొమ్ము పాలకుల పాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించడం కష్టం. నాగరికతనైనా, కట్టడాలనైనా నిర్మించాలంటే ప్రతిభ, సమయం, ధనం, శ్రమశక్తి అవసరం. కట్టడాలను కాని, నాగరికతను కాని ధ్వంసం చేయడం చాలా సులభం. నిర్మాణాలకు ఏళ్లు పడితే- వాటిని ధ్వంసం చేయడానికి కొద్ది గంటలు చాలు. వేల ఏళ్లుగా నిర్మించుకున్న సింధు, హరప్పా, మొహంజోదారో నాగరికతలను, బౌద్ధారామాలను నేలమట్టం చేశారు ఆర్యులు. చారిత్రక బౌద్ధ నాగరికతను, బౌద్ధారామాలను నేలమట్టం చేశారు ఆర్య రాజులు. ఆలయాలను, బౌద్ధారామాలను కూల్చివేసి తమ ప్రార్థనాలయాలను నిర్మించారు ముస్లిం రాజులు. బ్రిటీష్‌వారు తమ మత సంబంధ చర్చిలను నిర్మించుకున్నా, వేటిని కూల్చలేదు. బ్రిటీష్‌వారు ప్రవేశపెట్టిన ఆధునిక విద్య, ఇంగ్లీష్ విద్య, రైల్వే- విమాన ప్రయాణ సౌకర్యాలు, వైజ్ఞానపరమైన ఆవిష్కరణలు, రోడ్లు, నౌకాదళ సౌకర్యాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చేసిన సంస్కరణలు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించాయి. వారు ఇక్కడికి వచ్చింది దేశ సంపదను దోచుకోవడానికే అయినా పాలకులుగా రాచరిక కాలానికి భిన్నంగా ప్రగతి శీలమైన పనులనే చేశారు. కులాలకతీతంగా విద్యనందించారు. బ్రిటీష్ కాలంలోనే తొలిసారిగా- సామాజిక వెనుకబాటు తనంతో ఉన్న కులాలకు రిజర్వేషన్లను ఇచ్చాడు సాహు మహరాజ్.
అనవసర కట్టడాలను, ఉపయోగం లేని పనులను చేసిన రాజుల కాలపు పనులను- రాజుల సొమ్ము రాళ్ళపాలు చేస్తున్నారనే వారు. నిజానికి ఆ రాజులు తమకోసం నిర్మించుకున్న రాజభవనాలు, ఇతర కట్టడాలు తమ కష్టారిజతంతో నిర్మించుకున్నవేం కావు. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలుచేసినవే. అలా ప్రజల సొమ్మును ప్రజల కోసం ఉపయోగించకుండా రాళ్ళపాలు చేసారు రాజులు. రాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి అమ్మినా, నైజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనా ప్రజలకొరిగిందిందేంటి? మెజారిటీగా ఉన్న సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటన్నది చూడాల్సింది.
గొప్ప గొప్ప కట్టడాల వల్ల పాలకుల పేర్లు శాశ్వతత్వం పొందవు. ప్రజల స్థితిగతులను మార్చడానికేం చేశారన్న దానిపైనే కీర్తిప్రతిష్ఠలు ఆధారపడుతుంటాయి. కాకతీయులు కోటలు, ఖిల్లాలు నిర్మించుకోవడం వల్ల మంచిపేరు రాలేదు. ఊరూరికీ చెరువులు, కుంటలు, చెరువులు నిర్మించడం వల్ల పేరొచ్చింది. నైజాం నవాబులకు తాముండటానికి రాజభవనాలు, మహా కట్టడాలు నిర్మాణం చేయడంవల్ల కాకుండా మత సామరస్యాన్ని కాపాడటం, కాకతీయుల నీటి పారుదల ఊరూరికి చెరువుల పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడం, హైదరాబాద్ మహానగరాన్ని ఉద్యానవనాలతో, పార్కులతో, చెరువులతో, కుంటలతో నింపి ప్రకృతిని కాపాడటం వల్ల పేరొచ్చింది. చివరి సంవత్సరాలు రజాకార్ల విజృంభణ నైజాం నవాబుల పాలనకు మాయనిమచ్చ.
రాజుల కాలం పోయి ప్రజాస్వామ్య యుగం వచ్చింది. ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే పాలకులు. ప్రజల నుంచి ఎన్నుకైన వారే పాలకులవుతారు. పరిపాలన చేసేది ప్రజలు చెల్లించే సొమ్ముతోనే. ప్రజలు తాము తినే ఉప్పు, పాలు, కూరలు, నూనెలు, మాంసం, ఆహారంతో పాటు ఇల్లు, బట్ట, చుట్ట, జుట్టు, కారు, స్కూటర్... అన్నింటికీ పన్నులు చెల్లిస్తారు. పారిశ్రామిక ఉత్పత్తులకు, పెట్రోలుకు, పళ్లుతోముకునే మంజన్ పౌండర్, పండించే పంటపై కూడా పన్నులు కడతారు. ఈ ఆదాయంతోనే పాలకులు బడ్జెట్‌లు పెడతారు. పాలన చేస్తారు. తాము జీతాలు తీసుకుంటారు. ఉద్యోగులకు జీతాలిస్తారు. ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయి ఏదో విధంగా ప్రజల నుంచి వసూలు చేసినదే.
ప్రజల సొమ్మును ప్రభుత్వాలు ఎలా ఉపయోగించాలి? తమకిష్టమున్నట్టు తమకు నచ్చినట్టు ఉపయోగించుకోవచ్చా? మరయితే ప్రజాస్వామ్యానికర్ధమేంటి? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఐదేండ్లు లక్షల కోట్ల బడ్జెట్‌ను తమ ఇష్టమున్నట్టు వాడుకోవచ్చా? లక్షల కోట్ల అప్పులు చేయొచ్చా? ఆ అప్పులన్నీ ఎవరు తీర్చుతారు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారం పడేది ప్రజల మీదే కదా! అప్పుచేసి పప్పుకూడు తినడం కన్నా పైసా అప్పులేకుండా తినడం మేలు. ఉరికురుకి ఊబిలో పడటంకన్నా నిదానంగా గమ్యం చేరుకోవడం మేలు.
ప్రజాస్వామ్యంలో ప్రజల మేలుకోరే పాలకులు ప్రతి పనికీ, ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ అకౌంటబిలిటీ కలిగి వుండాలి. ప్రజల అవసరాలేంటి? ఉన్న సమస్యల్లేంటి? ప్రజల తక్షణ అవసరాలేంటివి అని తెలుసుకొని ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించి డబ్బులు ఖర్చుపెట్టాలి. కాని అలా జరుగుతోందా? ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల సొమ్మైన బడ్జెట్‌కు ట్రస్టీలు మాత్రమే తప్ప ఇష్టమున్నట్లు ఖర్చుచేసే హక్కున్న వాళ్ళు కాదు. ఓ దిక్కు లక్షలాది నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారు. మరోదిక్కు కార్పొరేట్ వైద్యం పేరిట లక్షల రూపాయల భారాన్ని మోయలేక పేదలు మృత్యువాత పడుతున్నారు. ప్రైవేట్ విద్యకయ్యే ఖర్చును భరించలేక అణగారిన కులాలవారు అంగలారుస్తున్నారు. ఇంకో దిక్కు నిలువనీడ కూడా లేకుండా సంచార జాతుల వాళ్ళు అన్నమో రామచంద్రా..! అని ఏడుస్తున్నారు. వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేవు. చాలా ఊళ్ళలో ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. ఎప్పుడో కట్టినవి కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మరో దిక్కు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. విద్యాగంధం లేక కోట్ల మంది నిరక్ష్యరాస్యులుగా ఉన్నారు. ఇంకా ఎన్నో సమస్యలున్నాయి.
ప్రాధాన్యతా క్రమంలో అత్యవసరంగా చేయాల్సినవెన్నో పనులుండగా, ఉన్న సచివాలయాన్ని, అసెంబ్లీని కూలగొట్టి కొత్త భవనాలు కట్టడం అవసరమా? చారిత్రక కట్టడాలను విస్మరించి, వేల కోట్లు పెట్టి కొత్త భవనాలు కట్టాలా? కొత్త భవనాలు కట్టాల్సిందే. కాని ఎప్పుడు? ఉన్నవి పూర్తి శిథిలావస్థలో ఉన్నప్పుడు, సచివాలయంలోని బిల్డింగులు 2,3 తప్ప మిగతావన్నీ ముప్పై ఏళ్ల, ఇరవై ఏళ్ల ముందు కట్టినవే. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆధునిక పద్ధతుల్లో కట్టినవే. ఆ పాత భవనాలు మరో ముప్పయేండ్లుంటాయి. మిగతావి ఇంకో 80, 90 ఏండ్లయినా చెక్కు చెదరవు. అసెంబ్లీ భవనం కూడా కొత్తదే. ఇటీవలే కోట్ల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసిందే. అసెంబ్లీ ఉంది నగరానికి నడిబొడ్డు ప్రాంతమైన పబ్లిక్ గార్డెన్లో. అందరకీ అందుబాటులో ఉంది. పబ్లిక్ గార్డెన్‌లో ఇంకా అవసరమైతే భవనాలను పెంచుకోవచ్చు. విశాలమైన రోడ్లుండి చారిత్రక ప్రసిద్ధి పొందిన స్థలమది. దాన్ని మార్చాల్సిన అవసరమంటి? అవి సరిపోవడం లేదనే అవకాశమే లేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇరు రాష్ట్రాల జనాభా పాలనా వ్యవహారాలకు సరిపోయిన భవనాలు ఒక్క రాష్ట్ర వ్యవహారాలకు సరిపోవా?
మట్టితో, డంగు సున్నంతో గ్రామాల్లో కట్టిన ఇండ్లు, బడులు డెబ్భై, ఎనభై ఏండ్ల నాటివి కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. సిమెంటు, ఇసుక, కాంక్రీటుతో కట్టిన భవనాలు వంద సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాంటప్పుడు వీటన్నిటినీ కూలదోసి, చారిత్రక కట్టడాలను కూడా లేకుండా చేసి కొత్త భవనాలు కట్టాలా? ఎందుకోసం? వీటికయ్యే వేల కోట్ల ఖర్చును ఏవైనా అత్యవసర పనులకు ఉపయోగిచుకోవచ్చుగదా! ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజలదే కదా! ప్రజల సొమ్మును పాలకులు తమ ఇష్టమున్నట్టు ఉపయోగించుకోవడం సరైందేనా? ఇంకో డెబ్బై ఏళ్ల తర్వాత కట్టాల్సిన వాటిని ఇప్పుడే కట్టడమెందుకు? అదీ ఉన్నవి నిర్మూలించి కట్టాలా? ఇది ప్రజల సొమ్మును ఫలహారం చేయడమే అవుతుంది.
తక్షణ సమస్యలెన్నో ఉన్నాయి. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగించడానికి కట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ సొమ్ముతో ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించండి. ప్రభుత్వ పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చండి. ప్రతి పాఠశాలలో, హాస్టళ్లలో అమ్మాయిలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించండి. అసలే ఇండ్లులేని వారికి చిన్నవైనా సరే ఇండ్లు కట్టించండి. బిందెడు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ పోవాల్సిన గ్రామాలు, గిరిజన తండాలున్నాయి. వారికి నీటి వసతి కల్పించండి. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే నడకే దిక్కు. వాటికి రోడ్డు సౌకర్యం కల్పించండి. ఇలా చేస్తే మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది.
ధనిక రాష్ట్రం కదా మనది. ఆకలి అనేది లేకుండా చేయండి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాకపోవచ్చు. కాని ఉన్న ఖాళాలకైనా పూరించండి. అందరికీ ఏదో పని కల్పించి సంపాదించుకునే మార్గం చూపండి. ప్రజల సొమ్మును వారి తక్షణావసరాలు తీర్చేందుకు నిర్మాణాలు చేయాలి కాని అద్భుతంగా ఉన్న భవనాలను కూల్చి కొత్తవి నిర్మించడానికి కాదు. కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి కాబట్టి కూలగొడదామనడం సరైనది కాదు. వాళ్ళు కట్టిందీ ప్రజల సొమ్ముతోనే. కొత్త నిర్మాణాల కోసం ప్రజల సొమ్మును సద్వినియోగం చేయండి. నిర్మాణం చేయడం ఎంత కష్టమో, ధ్వంసం చేయడం అంత సులభమని పాలకులకు తెలియని విషయం కాదు.

-డా. కాలువ మల్లయ్య 91829 18569