Others

ఊపిరున్నంతవరకూ నటించాలా? (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం! ఊపిరున్నంతవరకూ నటించాలా? నటించడం మానేస్తే ఊపిరాగిపోతుందా? ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తూ జగ్గయ్య. సినీ పరిశ్రమలో జగ్గయ్యకో ప్రత్యేకత వుంది. ఆయన కళావాచస్పతి. రవీంద్రుడిని చదివారు. వాస్తు జ్యోతిష్యం తెలుసు. ముఖ్యంగా ఆత్రేయకి మంచి స్నేహితుడు. ఇద్దరూ కలుసుకుంటే.. తొమ్మిదింటికి ఆరంభమైన ‘గానాభజానా’ తెల్లార్లూ కొనసాగేది.
జగ్గయ్యకు నేను రెండువిధాలా దగ్గరయ్యాను. మొదటిది ఆత్రేయ భక్తుడిని. ఆయన తీసుకుపోతుండేవారు. ఆయన చెప్పింది చెప్పినట్టే రాసుకొనేవాడిని. మేం పాటమీద కూర్చున్నామనే విషయాన్ని బయటపెట్టేవాడ్ని కాను. అందుకే ఆత్రేయ ప్రేమగా చూసేవారు. ఆత్రేయ మరిచిపోయిన ఆత్రేయ పాటల్ని గుర్తుచెయ్యగలను.
ఇదిలావుంటే
జగ్గయ్యకూ నాకూ కామన్ ఫ్రెండ్ ఒకరున్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నపుడు -కొయ్యవారి వీధిలో ఆయన ఇంటిపక్కనే వుండేవాడిని. ఆయన పేరే ఆకుల నరసింహరావు. ఆకుల నరసింహరావు, ఆదినారాయణరావు, రాజేశ్వరరావుకు గురుతుల్యులు. ఆరడుగుల పొడుగూ, బంగారు ఛాయ, వీణలాంటి గొంతు. ముఖ్యంగా లెగ్ హార్మోనియం వాయించినపుడు ఆయన చేతి వేళ్లు మెరుపుతీగల్లా మెరిసేవి. పీఠికా వాద్య ప్రవీణుడు. ‘అర్ధాంగి’ చిత్రంలో ‘వద్దురా కన్నయ్యా..’ జిక్కి పాడిన పాట. రాధను రమ్మన్నాడే... ఆకులవారు పాడిన పాట మరిచిపోలేం.
ఆకులవారికి జగ్గయ్య ఆప్తుడు.
ఆయన చెన్నై వస్తే జగ్గయ్య ఇంట్లో బసచేసేవాడు. పాత సినిమాల్లోని పాటలూ...సాహిత్యం.. నటన.. మామధ్య టాపిక్.
అది సాయంసంధ్యలో మొదలైతే... తెల్లారేవరకూ విసుగూ విరామం లేకుండా కొనసాగవలసిందే! మధ్యమధ్యలో ఫలహారాలూ...అవీ... ఇవీ... అన్నీన్నూ...
ఆయన జీవితంలో ప్రత్యేకమైన రోజు డిసెంబరు- 31.
ఆరోజు సినిమా ఇండస్ట్రీ... ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పండగరోజు. ఎందుకంటే. ఆరోజు ఉదయంనుంచి జగ్గయ్యగారింట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆరోజుల్లోనే వందకు పైగా ఐటెమ్స్‌తో భోజనం. సాయంత్రమైతే మందు ప్రియులందరూ మూగిపోతారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న బ్రాండులన్నీ అక్కడే చోటుచేసుకుంటాయి. ఎవరు ఏది కావాలంటే అది. ఎవరు ఎంత తీసుకుంటే అంత. ఆటాపాటా మాటలతో కొనసాగుతుంది.
ఆరోజు మాటల సందర్భంగా..
‘మీ జీవితాశయం ఏవిటి? అగ్రజులు (ఒకర్ననలేదు) కొన ఊపిరున్నంతవరకూ నటిస్తానంటున్నారు. మీరూ నటిస్తారా?’ అనడిగాను. నిజానికి ఆత్రేయకి తెలుసు, జగ్గయ్యను గిల్లుతున్నానని.
అంతే!
భగ్గుమన్నాడు జగ్గయ్య.
‘నాకా అవసరం లేదండీ. నేను సగం ఊపిరి బ్యాలెన్స్ ఉంటుండగానే విరమిస్తాను. ఏం? నటించకపోతే ఊపిరాగిపోతుందా?
ఇండస్ట్రీకి వచ్చినపుడు మన సంపద ఎంత? ఇపుడున్న సంపద విలువెంత?
ఎంతకాలం ఈ సంపాదన? ఎంతకాలం ఈ జంజాటం? ఇండస్ట్రీలో మనమొక్కరిమే సంపాదించుకోవాలా? వేరేవారికి అవకాశం ఇవ్వకూడదా? మనముందున్న సీనియర్సు కడవరకూ వారే వుండాలని ప్రాకులాడితే మన మెక్కడుండేవారం? భారతదేశంలో సగటు మానవుడి సంపాదనతో పోల్చి చూసుకుంటే... మన సంపద ఎన్నిరెట్లు ఎక్కువ? అంటూ వూగిపోయారు.
‘ఇది మీ మనసులో వున్నమాటా? ఈ మూడ్‌లో తన్నుకొచ్చిన మాటా?’ నర్మగర్భంగా అడిగాను.
‘అయ్యా! మీ ఆంతర్యం అర్థమైంది. ఇది నా మనసులో మాట కాదు. నా స్టేట్‌మెంట్-. పత్రికల్లో రాయండి. ఈ జగ్గయ్య మనసులో ఒకటి బయటికి ఒకటీ ఏరోజూ మాట్లాడడు. అలా మాట్లాడితే అతడి పేరు జగ్గయ్యకాదు!’ అన్నాడు సీరియస్‌గా. అదే జగ్గయ్యలోవున్న విశిష్టమైన వ్యక్తిత్వం!
జగ్గయ్యకు కాస్ట్యూమ్స్ ఒళ్లు దగ్గరుంచుకొని కుట్టాలి. తేడావస్తే విసిరి అవతల కొడతారు. షూటింగు దాదాపు ఉదయం పూట రారు. ఆయన నియమ నిబంధనలు ఆయనకుంటాయి. అయినా తెలుగు పరిశ్రమ ఆయన్ని పెద్దమనిషిగా గుర్తించింది. బ్రతికున్నంతకాలం ఆయనకూ పెద్దపీట వేసింది.

-ఇమంది రామారావు 9010133844