Others

పిల్లల్లో ఫోబియా పోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నపుడు బూచోడు వస్తాడు.. నిన్ను ఎత్తుకెళతాడు అంటూ చీకటిని చూపించి పిల్లలను భయపెట్టడం అందరి ఇంట్లో ఎవ్వరైనా సాధారణంగా చేసేదే. పిల్లలు సాధారణంగా చీకటికి భయపడుతుంటారు. మరికొందరు అపరిచితులు, నీళ్లూ, బొమ్మలు, ఎతె్తైన ప్రదేశాలు, బల్లులు, బొద్దింకలు, కుక్కలకు భయపడుతుంటారు. అలానే ఒంటరిగా ఉండటానికి, నలుగురిలో కలవడానికీ, ఒకవేళ కలిసినా మాట్లాడటానికి కంగారు పడుతుంటారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినపుడు వారిని చూసి భయపడటం, అమ్మా నాన్నలు దూరంగా వుంటే భయపడటం, ఎక్కువగా వినికిడి చేసే శబ్దాలు, క్రిమికీటకాలు లాంటివి చూసినపుడు పిల్లలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాగే పాఠశాలలో ఎవరైనా నువ్వు పొట్టిగా వున్నావ్ అని ఏడిపిస్తున్నా కూడా భయపడుతూ ఉంటారు. కొన్ని భయాలు కాస్త ఫోబియాగా మారే ప్రమాదం ఉంది. జీవితాంతం ఆ భయాలు వారిని వెంటాడుతూనే వుంటాయి. బాల్యదశలోనే ఆ భయాలను పోగొట్టేలా తల్లిదండ్రులు కృషి చేయాలి.
సహకారం
పిల్లలకు ఏదైనా పని చేయమన్నప్పుడు ఉత్సాహంగా వెళ్లకుండా వెనకడుగు వేస్తున్నారంటే ఆ పని చేయడం ఆపమని చెప్పాలి. పిల్లలపై కోపగించుకుని బలవంతంగా ఆ పనిచేయడానికి వెళ్లమనకూడదు. ఇలా చేయడంవలన పిల్లల్లో భయం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. మీకు ఆ పని సులువుగా అనిపించవచ్చు. కానీ మీ పిల్లలకు మాత్రం అదే పెద్ద భయం. అందుకని ఎక్కువగా బలవంతం చేయకండి. పిల్లలు ఏదైనా చేయలేనప్పుడు, ఆ పని చేయడానికి భయపడుతూ ఉంటే మీరే దగ్గరుండి అక్కడికి వారిని తీసుకెళ్లి మీ సహకారంతో పిల్లలు ఆ పని చేసేలా వారిలో ధైర్యాన్ని నింపాలి.
హారర్ సినిమాలకు దూరంగా..
హారర్ సినిమాలు, ఫ్రాంక్ వీడియోలు, దెయ్యం సినిమాలు మీతోపాటు చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు నిజంగా చీకట్లో మన గదిలోకి వస్తాయేమో అని పిల్లలు భయపడుతూ ఉంటారు. అవి అసలు నిజం కాదని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. చిన్నపిల్లలకు ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు కానీ ఎదుగుతున్న పిల్లలకు నిజ జీవితానికి, సినిమాలలో చూపిస్తున్నదానికి మధ్య వున్న తేడాను వివరించి అర్థం అయ్యేలా చెప్పాలి. సినిమాలకు, నిజీ జీవితం మధ్య తేడా గుర్తించేంతవరకు హారర్ సినిమాలకు దూరంగా ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి.
అతి జాగ్రత్తతో భయాలు..
అభద్రతాభావంవల్ల కొన్నిసార్లు తల్లిదండ్రులు చూపే అతిజాగ్రత్త కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. చీకట్లోకి వెళ్లకూ, మేడ ఎక్కకూ, వీధిలోకి వెళ్లకూ.. అంటూ చెబుతూంటారు. క్రమంగా పిల్లలు అలా చేయకూడదనీ, చేయడానికి భయపడే ఆస్కారముంటుంది. అప్పుడప్పుడు ఈ భయాలు పిల్లలను కలల రూపంలోనూ వెంటాడతాయి.
ఒంటరిగా వదలకండి
భయపడే విషయాలు పిల్లలు ఎక్కువగా గుర్తుచేసుకోవడంవలన, వారు విన్న కథలు లేదా చూసిన వీడియోలు తమ కళ్ళముందు కనిపిస్తున్నట్లుగా వుంటాయి. అలా గుర్తొచ్చినపుడు భయంతో వణికిపోతుంటారు. అలాంటప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లకూడదు. ప్రశాంతంగా ఉండమని కూర్చోబెట్టి కొద్దిసేపు రిలాక్స్ అవ్వమని చెప్పాలి. ఇలా టెన్షన్ పడటంవలన వారిలో మానసిక ధైర్యం కొరవడే ప్రమాదం ఉండవచ్చు. పిల్లలకు నచ్చిన విషయాలు చెప్పడం, ఫన్నీగా ఉండే జోక్‌లు వేయడం, తీపి స్మృతులను గుర్తుచేయడం చేయాలి. రాత్రి పడుకున్నపుడు లేదా గదిలో ఒంటరిగా వున్నపుడు కార్టూన్స్‌లో ఉండే విలన్ లేదా రాక్షసుడు తమ దగ్గరకు వస్తున్నాడనే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ క్షణం వరకు భయపడినా కూడా మళ్లీ మరుసటి రోజు అమ్మను అడిగి మరీ ఆ కార్టూన్ ఫిలిం పెట్టించుకుంటారు. ఈ విధంగా భయపడుతున్నపుడు అందులో హీరో ఏం చేస్తారో, వాటితో ఎలా ఫైట్ చేస్తాడో నువ్వుకూడా అలా చేయాలి. ఇలా భయపడకూడదు అంటూ సున్నితంగా చెప్పాలి.
భయం అందరితో పంచుకోరు
పిల్లలు వారు భయపడే విషయాలను ఎవరికైనా చెప్తే నవ్వుతారని, ధైర్యం లేని పిరికివాళ్లుగా చూస్తారని, ఆట పట్టిస్తారని తమ భయాలను అందరితో పంచుకోరు. అమ్మా నాన్నలే అడిగి మరీ తెలుసుకోవాలి. పిల్లలను దగ్గరకు తీసుకుని నీకు ఏదైనా భయం వుంటే నేను ఆ భయాన్ని పోగొడతాను అని ధైర్యం చెప్పాలి. వాళ్ళు చెప్పే విషయాలు సావధానంగా వినాలే తప్ప నవ్వడం చేయకూడదు. ఆ భయాన్ని పోగొట్టే మార్గం ఆలోచించాలి. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల భయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఒకవేళ చిన్నారులు ఏదైనా చెప్పినపుడు దానికి భయమెందుకు అంటూ కొట్టిపారేస్తారు. అలా చేస్తే అమ్మా నాన్నలు తమని అర్థం చేసుకోవడం లేదనుకుంటారు. క్రమంగా చెప్పడం మానేసి లోలోల భయపడుతుంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇలా ఎక్కువకాలం కొనసాగితే భయం కాస్తా ఫోబియా మారే ప్రమాదం వుంటుంది.
సానుకూల దృక్పథం పెంపొందించాలి
పిల్లలు భయపడేదాని గురించి వారికి సానుకూలంగా తల్లిదండ్రులు చెప్పాలి. భయాల గురించి తెలిశాక తేలిగ్గా తీసుకోకుండా దూరం చేసే ప్రయత్నం చేయాలి. చీకటికి భయపడుతుంటే రాత్రి సమయంలో ఆరుబయటకు తీసుకొచ్చి నక్షత్రాలు చూపించాలి. కథలు చెప్పాలి. చిన్నతనంలో రాత్రిపూట చందమామని చూస్తూ ఎలా అన్నం తినేవారో వివరించాలి. అలానే వెనె్నల్లో వారితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడాలి. వెలుతురూ, చీకటి అనేవి ప్రకృతి అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. మొదట గదిలో కాస్త వెలుతురును తగ్గించి వారితో కలిసి మీరుండాలి. అలా తరచూ చేస్తుంటే పిల్లల మానసిక స్థితి చీకటికి అలవాటుపడుతుంది. అలా ప్రతి విషయం గురించి క్రమేపీ చెబుతూ వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేస్తుంటే అలవాటు పడతారు. భయాన్ని దూరం చేసుకుంటారు. అలా కాకుండా ఒక్కసారిగా మారాలని మాత్రం వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఇలా చేస్తే ఇంకా సమస్య పెరుగుతుంది. పరిస్థితిని బట్టి సానుకూల దృక్పథం నేర్పించాలి. నేనున్నాను అనే ధైర్యం పిల్లల్లో కల్పించాలి. తల్లిదండ్రులు అప్పుడప్పుడూ సైకాలజిస్ట్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటూ చిన్నారుల భయాల్ని తొలగించే ప్రయత్నం చేయాలి. పరిస్థితిని బట్టి కౌన్సిలింగ్, సైకోథెరపీ కూడా ఉపయోగపడుతుంది.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321