Others

రాముడు హరనాథ్‌కి ప్రత్యేక ఎస్కార్ట్స్( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి సోదరులు యన్టీఆర్, త్రివిక్రమరావు క్రమశిక్షణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. వారు ఏ పనిచేసినా మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేది. అంటే ట్రెండ్ స్టెటర్స్ అన్నమాట.
యన్‌ఏటి బ్యానరులో ‘సీతారామ కల్యాణం’ చిత్రం తీస్తున్న రోజులు. ఆ చిత్రానికి దర్శకుడు యన్టీఆరే. పైగా నెగిటివ్ షేడ్‌వున్న రావణుడి పాత్రని ఏరికోరి చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మరీ.. రావణుడి పాత్రకు నగిషీలు చెక్కించుకున్నారు. అలాగని మిగతా పాత్రలు దశరథుడు, జనకుడు, విశ్వామిత్రుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రుష్యశృంగుడు, సీత, మండోదరి... ఈ పాత్రల మీద తక్కువ శ్రద్ధ తీసుకున్నారని కాదు. టోటల్‌గా సీతారామకల్యాణం చిత్రం స్క్రిప్టే ఓ అద్భుతం.
శ్రీరాముడి పాత్ర ఎంపిక దగ్గర ఆగిపోయింది. యన్టీఆర్ రావణుడైతే.. ఆయన ముందు రాముడిగా నిలబడగలిగే ఫిజిక్ ఎవరికుంది? కాంతారావూ, శోభన్‌బాబూ వున్నారుగాని, వారికంత ఇమేజ్ లేదు. సీతకోసం ఫ్రెష్‌గా కాకినాడ అమ్మాయి గీతాంజలిని పరిచయం చేశారు. మరి రాముడు?
ఆజానుబాహువు
అరవింద దళాయతాక్షుడు
మిధిలానగరం చూసి సమ్మోహనంగా మైమరచిపోయే అందం.
ఎవరికుంటుంది?
హరనాథ్!
హరనాథ్.. పేరు ప్రతిపాదించారు పుండరీకాక్షయ్య.
ముందుగా చిన్నాయన (త్రివిక్రమరావు)కి చూపించారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతున్నాడు. చదువుకున్న రోజుల్నుంచీ ఎవరికీ భయపడని తత్వం. ఛెయిన్ స్మోకింగ్-. వున్నదున్నట్టు మాట్లాడటం.. ముఖ్యంగా నాటకీయత అంటే అసలు పడని వ్యక్తి. సహజసిద్ధంగా వుండాలన్నదే హరనాథ్ కోరిక- సెట్‌లో అలాగే నటించేవాడు. అలాకాదు.. నేను చెప్పినట్లు చెయ్యి? అని డైరెక్టరు చెబితే.. మారుమాట్లాడకుండా మీరు చెప్పినట్టు వినే ఆర్టిస్టునే పెట్టుకోండి’ అంటూ బయటికి వచ్చేసేవాడు.
ఈ విషయాలన్నీ హరనాథ్‌తో మాట్లాడిన అరగంటలోనే అర్థమైంది. చిన్నాయనకి మేకప్ టెస్ట్‌చేసి శ్రీరాముడి గెటప్‌లో స్టిల్సు తీశారు. మరుసటిరోజు ఆ స్టిల్సు పెద్దాయనకు చూపించారు. పెద్దాయన భోళాశంకరుడు. మనసులో ఆనందం ఉప్పొంగినా, ఆవేశం చెలరేగినా దాచుకోలేడు. ఉప్పెనలా ముంచేస్తాడు.
‘వెరీగుడ్- చాలా బావుంది. వారినోసారి పిలవండి’ అని ఆర్డరు జారీచేశారు యన్టీఆర్.
అప్పటికే హరనాథ్‌ని గురించి అన్ని సమాచారాలూ సేకరించారు.
లక్ష్మీనిలయంలోకి హరనాథ్ అడుగుపెట్టగానే.. తేరిపారచూసి ‘రండి.. బ్రదర్’ అంటూ ఆహ్వానించాడు.
‘మీరు హీరో.. నేను విలన్.. మా యన్‌ఏటి బ్యానర్‌లో’
‘........’ హరనాథ్ నోట మాట పెగల్లేదు.
‘్భయపడకండి! ఓపెన్‌గావుండండి. మీరు రాముడు. నేను రావణుడ్ని.. మనం చరిత్ర సృష్టించాలి. భావితరాలవారికి రాముడంటే ఇలాగే వుండాలి అనిపించాలి’
‘అంతా మీ బ్లెస్సింగ్స్ సర్!’
‘నాదేం లేదు.. అంతా ఆ భగవంతుడి నిర్ణయం. ఈ పాత్ర మీకు ప్రాప్తంవుంది. మీరు చేస్తున్నారు. ఓకేనా బ్రదర్’
‘ఓకే...సార్!’
‘మీరు సిగరెట్లు కాల్చకూడదు’
‘ఓకే సార్’
‘మందు ముట్టుకోకూడదు’
‘ఓకే సర్’
‘షూటింగ్ ముగిసేటంత వరకూ మద్య మాంసాదులు ముట్టకూడదు’
‘ఓకే సర్’
‘షూటింగు ముగిసేటంత వరకూ మీకు ఎస్కార్టులుగా మా రాజు (ఫైట్ మాస్టర్), సాంబశివరావు(ఫైట్ మాస్టర్) వుంటారు.
‘ఏ... ఎందుకు సార్’
‘నేను చెప్పినవన్నీ తుచ తప్పకుండా పాటిస్తున్నావో లేదో చూడ్డానికి’
అంతే.. హరనాథ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. ‘అదేవిటో ఆయన మొహం చూస్తే ఆయన మాటకి ఎదురు చెప్పలేకపోయాను. ఎదురుగా భగవంతుడు ప్రత్యక్షమై ఆర్డరు జారీ చేసినట్లనిపించింది’ అంటుండేవాడు హరనాథ్.
‘సీతారామ కల్యాణం’ చిత్రం షూటింగు జరుగుతున్నంత కాలం పెద్దాయన కండిషన్సుకి లోబడే పనిచేశాడు. ఈ చిత్రానికి గాలిపెంచల నరసింహారావు స్వర రచన. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఇప్పటికీ ‘సీతారాముల కల్యాణం చూతమురారండీ’ పాట ఆంధ్రదేశంలో ప్రతి పెళ్లి పందిరిలోనూ వినిపిస్తోంది. ఇదిలావుంచితే, హరనాథ్ ఈ చిత్రంలో నటిస్తున్నంతకాలం.. ఇంట్లోవున్నా.. సెట్‌లోవున్నా ఈ ఇద్దరు ఎస్కార్ట్స్ రాజు, సాంబశివరావులు వుండి తీరాల్సిందే. అయితేనేం? రాముడిగా హరనాథ్ జన్మధన్యమైంది!
(నందమూరి త్రివిక్రమరావుకి క్షమాపణలతో)

-ఇమంది రామారావు 9010133844