AADIVAVRAM - Others

ఎద్దుతో పోల్చితే తప్పు కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం తరచుగా వినే ఇంగ్లీషు మాటలలో సమీపార్థం ఉన్న వాటిల్లో చెప్పుకోదగ్గవి ‘ఇనాక్యులేషన్’ ‘వేక్సినేషన్’ ‘ఇమ్యునైజేషన్’ అనేవి. ఈ మూడు మాటల అర్థాలకి దగ్గర సంబంధం ఉంది కానీ వీటిని పర్యాయ పదాలుగా వాడేస్తూ ఉంటారు. ఇనాక్యులేషన్ అన్న మాటకి కొంచెం ఎక్కువ విస్తృతార్థం ఉంది. ‘కృత్రిమంగా రోగనిరోధక శక్తిని పెంచడం’ అని అర్థం. మసూచికం నుండి రక్షించడానికి 1798లో జెన్నరు టీకాల మందు (స్మాల్‌పాక్స్ వేక్సిన్) వాడినప్పుడు దానిని ‘గోసూచికం ఇనాక్యులేషన్’ అన్నాడు. అనగా గోసూచికం ద్వారా, కృత్రిమంగా, మసూచికం రాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం’ అని మనం వ్యాఖ్యానించవచ్చు.
పాత ఇంగ్లీషులో ఇనాక్యులేషన్ అంటే ‘అంటుకట్టడం’ - అనగా ఒక మొక్క కొమ్మని నరికి మరొక మొక్కకి కట్టడం (from the Latin inoculare). ఒకచోట పెరుగుతూన్న దాన్ని తీసుకొచ్చి మరొక చోట పెంచడం. కనుక ఒకచోట పెరుగుతున్న విషాణువులని తీసుకొచ్చి మన శరీరంలోకి - చర్మం పొరల కిందికి - ఎక్కించి పెరగనియ్యడం ‘ఇనాక్యులేషన్’ అవుతుంది. ఇలా చెయ్యడం వల్ల మన శరీరపు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా మశూచికం రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి చేసే ‘ఇనాక్యులేషన్’కి ‘వేక్సినేషన్’ అని ఎడ్వార్డ్ జెన్నర్ పేరు పెట్టేడు. ఇలా ‘వేక్సినేషన్’ చేసి ఏ రోగాన్ని అయినా నిరోధించగలిగే శక్తిని పెంచే ప్రక్రియని ‘ఇమ్యునైజేషన్’ అంటారు.
ఒకచోట పెరుగుతున్న ‘వేక్సీను’ని తీసుకొచ్చి మన శరీరంలోకే ఎక్కించాలని నియమం ఏదీ లేదు. ఆ ‘ఎక్కించడం’ గాజు కుప్పెలో పెరుగుతున్న ‘కల్చర్’లోకి కావచ్చు లేదా సూక్ష్మజీవుల సహనివేశం (colony) కి కావచ్చు. ఆ ఎక్కించబడేది మరొక సూక్ష్మజీవి కావచ్చు. అప్పుడు ఆ పనిని ఇనాక్యులేషన్ అని అంటారు.
అసలు ‘వేక్సినేషన్’ ‘వేక్సీన్’ అన్న మాటలు ఇంగ్లీషులోకి ఎలా వచ్చేయో చూద్దాం. లేటిన్‌లో ‘వక్కా’ (vacca)అంటే ఆవు, లేదా ఎద్దు, లేదా దూడ. ‘వత్సా! ఏమి నీ కోరిక?’ అన్న పదబంధంలోని ‘వత్సా’ అన్న సంస్కృత పదమూ లేటిన్‌లోని ‘వక్కా’ జ్ఞాతులు (ఇక్కడ నేను వాడుతూన్న ‘జ్ఞాతులు’ అనే మాట. ఇంగ్లీషులోని cognate అనే మాట కూఢా జ్ఞాతులే!) కనుక ‘వత్సా’ అంటే ‘ఒరేయ్ ఎద్దూ!’ అని అర్థం. లేదా ధ్రువుడు లాంటి చిన్నపిల్లాడైతే ‘నాయనా, దూడా!’ అని అర్థం. ‘ఒరేయ్ దున్నపోతా!’ అని కానీ, ‘ఒరేయ్ గాడిదా!’ అని కాని సంబోధిస్తే కోపం రావచ్చేమో కానీ మన సంస్కృతిలో ‘ఒరేయ్ ఎద్దూ, ఒరేయ్ దూడా!’ వంటి ప్రయోగాలు గౌరవసూచకాలు. ఆడవాళ్లని ఆవుతోటీ, మగవాళ్లని ఎద్దు తోటీ పోల్చడం మన సంప్రదాయంలో ఉంది. అర్జునుడిని కృష్ణుడు ఎన్నిసార్లో ‘్భరతర్షభా!’ అని గీతలో సంబోధిస్తాడు. అంటే భరతవంశంలో వృషభం వంటి వాడా అని అర్థం.
ఇంత గాథ ఎందుకు చెప్పేనంటే వేక్సినేషన్ అన్న మాటకి ఆవుకి (లేదా ఎద్దుకి) గట్టి సంబంధమే ఉంది. మశూచికం రాకుండా ఉండాలంటే టీకాలు వేయించుకుంటాం కదా. ఈ టీకాల మందు ఎక్కడ నుండి వస్తుంది? ఎద్దులకి మశూచికంని పోలిన ‘గోశూచికం’ వచ్చినప్పుడు వాటి శరీరాలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని మనకి బదిలీ చేసే విధానమే వేక్సినేషన్. మొదట్లో ఈ మందు ఎద్దుల నుండి వచ్చింది కనుక దీనిని ‘వేక్సీన్’ అనిన్నీ, ఈ పద్ధతిని ‘వేక్సినేషన్’ అనిన్నీ అన్నారు. ఒక విధంగా ఇది (వక్కా, వత్సా) సంస్కృతం మాటే కనుక మనం తెలుగులో కూడా వేక్సినేషన్ అనొచ్చు కానీ ఈ ‘షన్’ అనే తోక ఇంగ్లీషు తోక అయిందాయె! కనుక కావలిస్తే ‘వేక్సినేషన్’ని వత్సీకరణం అనొచ్చు. ‘వేక్సీన్’ని వత్సం అనొచ్చు. నిజానికి ఈ తెలుగుసేత నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు. కనుక ‘టీకాలు’ బాగుందో, ‘వత్సీకరణ’ బాగుందో, ఇంతకంటె మంచి మాట మరొకటి ఉందో పాఠకులే తీర్పు చెప్పాలి.
(చొప్పదంటూ విషయాలని సేకరించే వారికి కొంత మేత వేస్తాను. ఎడ్వర్డ్ జెన్నర్ టీకాల పద్ధతి కనిపెట్టటానికి పూర్వమే ఒక నాటు రకం టీకాల పద్ధతి భారతదేశంలో అమలులో ఉండేదనిన్నీ, అందువల్లనే గొల్లభామల ముఖాలు స్ఫోటకం మచ్చలు లేకుండా అందంగా ఉండేవనిన్నీ నేను ఎప్పుడో, ఎక్కడో చదివేను! ఈ టీకాల ఆచారం చూసిన ఒక బ్రిటిష్ మహిళ ఈ వార్తని ఇంగ్లండు మోసుకుని వెళ్లిందట. ఆ మహిళ పేరు కూడా పుస్తకాలలో ఎక్కడో ఉంది. ఈ వార్త కర్ణాకర్ణిగా జెన్నరు చెవిని పడిందట.
మశూచికం సోకకుండా భారతదేశంలో టీకాల మందు ఎలా వాడే వారో బ్రిటిష్ వైద్యులే రాసిన ఉత్తరాలు, ప్రచురించిన పత్రాలు ఉన్నాయి. ‘ఈ వ్యాధి కంటికి కనిపించనంత చిన్నజీవుల వల్లనే కలుగుతోందని భారతీయులు నమ్మేవారు’ అని కూడ 1767లో డా.జె.హాల్వెల్ రాసిన ఉత్తరంలో ఉంది.)
మశూచికంతో సంబంధం లేకుండా ‘వేక్సినేషన్’ అనే మాటకి ‘టీకాలు వేయించడం’ అనే తెలుగు పదబంధం ఉంది. అలాగే ‘వేక్సీన్’ ని టీకాల మందు అని కూడా అంటాము. టీకా అనే మాట భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు రాక పూర్వం నుండీ చెలామణీలో ఉంది. ఉదాహరణకి మశూచికం, మీజిల్స్, టెటనస్, పోలియో వంటి వ్యాధులు రాకుండా మనం టీకాల మందో, సూది మందో, నోటి మందో పుచ్చుకుంటాం. ఈ మందు ఏ రూపంలో పుచ్చుకున్నా ఆ పద్ధతిని ‘వేక్సినేషన్’ అనే అంటాం. కానీ తెలుగులో మశూచికానికి పుచ్చుకునే పద్ధతిని, క్షయ రోగానికి పుచ్చుకునే పద్ధతిని మాత్రం ‘టీకాలు’ అంటాం. అనగా ‘టీకాలు’ అనే మాట ‘వేక్సినేషన్’ని అమలుచేసే పద్ధతిని చెబుతోంది కానీ ‘వేక్సినేషన్’ అనే భావాన్ని కాదు. ఉదాహరణకి టీకాలు వేసినప్పుడు చర్మాన్ని తొలగించి అక్కడ మందు పులుముతారు. మీజిల్స్, టెటనస్, వగైరాలకి సూది ద్వారా ఎక్కిస్తారు - వాటిని టీకాలు అనడం నేను వినలేదు. పోలియో మందు, టైఫాయిడ్ మందు నోటి ద్వారా పుచ్చుకుంటారు. వీటిని పోలియో టీకాలు, టైఫాయిడ్ టీకాలు అనడం కూడా నేను వినలేదు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా