Others

ఓం గణేశాయ నమః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నపిల్లల మొదలుకొని పండు ముదుసలి వరకు ఎంతో హుషారుగా, ఆనందంగా కాలం గడుపుతారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కులాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతంగా కార్యక్రమం ముగించడానికి పలు ప్రయత్నాలు చేస్తారనడంలో అనుమానం అక్కర్లేదు.
నేడున్న పరిస్థితుల్లో దేశంలో ఎన్నో మతాలు విరాజిల్లుతున్నాయి. ఎవరి సంప్రదాయాలు వారివి. రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులు వారివి. అందులో భావప్రకటన స్వేచ్ఛ కూడా ఉన్నది. హిందూ సంప్రదాయ ప్రకారం తొలి దేవుడు విఘ్నేశ్వరుడు. ఆయన పూజ చేసిన తర్వాతనే మిగతా పలు రకాల పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారనడం విశ్వమెరిగిన నగ్నసత్యం. కానీ రోజురోజుకు మనమెక్కడి కెళ్ళుతున్నామో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్తున్నాము.
గతంలో వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి వారికి తోచిన చందా వ్రాయించుకొని, గ్రామ పెద్దలవద్ద పట్టుబట్టి మరికొంత ఎక్కువ ఇప్పించుకొని, గ్రామ నడిబొడ్డున తాత్కాలిక ఆలయాన్ని నిర్మించుకొని, గ్రామ ప్రజల సమక్షంలో వినాయకుని ప్రతిష్ఠించుకొని, అయ్యగార్ల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని, ఆ తర్వాత 5,7,9,11 రోజులపాటు రాత్రి సమయాలలో గ్రామ ప్రజలంతా వారివారి వయస్సు ఆధారంగా పెద్దలు డోలు, చిటికెల సహాయంతో అడుగుల భజన, అమ్మలక్కలందరు బతుకమ్మలాట, యువకులు కోలాటాలు, వివిధ క్రీడా సంబంధమైన ఆటలు, చిన్నపిల్లలు సైతం వారికి తోచిన ఆటలాడుకుంటూ అర్ధరాత్రి వరకు ఎవరికివారు సమయం లేకుండా గడిపేవారు. ఊరంతా ఒకచోట కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా, రోజంతా కష్టపడి సేదతీరేలా గడిపే విధానం ఎంతో ఆనందభరితంగా వుంటూ, మనస్సులో ఎలాంటి ఆందోళనలు లేకుండా ఉండేది. పల్లెటూరులో మానవ జీవితాలు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులతో ముడిపడి ఎల్లప్పుడూ వాటి గురించి ఆలోచిస్తూ మనుషులు చావుకు దగ్గరయ్యేవారు. కానీ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు పలువురితో చర్చించుకొని, మనోధైర్యం తెచ్చుకొని కుదుటపడేవారు. ఆ దేవుడు వున్నాడో లేడో తెలియదు కానీ, మనకు తెలియకుండానే ఎన్నో మంచి పనులు జరిగాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
కానీ ఐరోపా ఖండంలో 13 నుండి 18 శతాబ్దం మధ్యలో జరిగిన విప్లవాత్మకమైన మార్పులవలన పారిశ్రామికాభివృద్ధి ఎలా పరుగులు పెట్టిందో అలాగే ఇలాంటి పండుగలలో కూడా అలాంటి మార్పులే వచ్చాయనడంలో ఎలాంటి అబద్ధం లేదు. నేడు ఒక గ్రామాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, అందులో ఎన్ని వాడలుంటాయో అన్ని విగ్రహాలను ప్రతిష్టిస్తే... కులాల పరంగా, మతాల పరంగా, పార్టీల పరంగా, వయసుల పరంగా ఒక్క ఊరిలోనే పదుల సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇంకాస్తా ముందుకెళితే పిల్లలు చదువుకునే పాఠశాలలో, ఉద్యోగులు పనిచేసే కార్యాలయాల్లో సైతం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది.
ఇంతవరకు బాగానే వున్నది. కానీ భక్తితో చేస్తే బాగుండేది. ఈ కార్యక్రమం పేరుతో వారుచేసే పనులుచూస్తే సగటు వ్యక్తికి బాధనిపించక మానదు. నేడున్న పరిస్థితుల్లో వివిధ వినాయక కమిటీలు ఆర్థిక వనరులను అతి సులభంగా సమకూర్చుకుంటున్నాయి. ఎలా అంటే ఒక్కసారి పది మంది కలిసి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తే నిమజ్జనం రోజున పూజలందుకున్న వినాయకుని ప్రతి వస్తువును వేలం పాటలో పెడతారు. అందులో మొదటగా లడ్డూను వేలంపాటలో పెట్టగా అక్కడికి వచ్చిన జనానీకం భక్తితో కొందరు, త్రాగిన మైకంలో ఇంకొందరు, తామేంటో నిరూపించుకోవడానికి మరికొందరు, వర్గాలు, కులాలు, పార్టీలు, ఇలా ఎవరికివారు వేలం పాటలో పాల్గొని సుమారుగా పదివేల నుండి యాభై వేల వరకు పాట పాడి లడ్డును దక్కించుకుంటారు. ఇలాగే పండ్లను, వస్త్రాలను, కొబ్బరికాయలను తదితర వస్తువులను వేలం పాటలో పెట్టి డబ్బులు సమకూర్చుకుంటారు. ఇదే తంతు గ్రామంలోని అన్ని వినాయకుల వద్ద ఇలానే జరుగుతుంది.
చవితినాడు విగ్రహ ప్రతిష్టాపన జరిగిన నుండి నిమజ్జనం వరకు డీజే శబ్దాలతో ఊరు ఊరంతా ధ్వనిమయం కావాల్సిందే. దీన్ని మూలంగా చదువుకునే పిల్లలకు అంతరాయంతోపాటు విద్యుత్ వృధా, శబ్దకాలుష్యం, ఎంత డబ్బు వృథా అవుతుందో లెక్కే ఉండదు. సరే, ఇదంతా భక్తిఅనుకుందామా, దేవునిపై ప్రేమ అనుకుందామా అనుకుంటే అక్కడి ఆయా వినాయక మందిరాల కమిటీ సభ్యులు సేకరించిన డబ్బులతో వారం రోజులపాటు విచ్చలవిడిగా మద్యం సేవించి చేసే కార్యకలాపాలు, నిమజ్జనం రోజున చేసే సందడి, హడావుడి, వారి దృశ్యాలను చూస్తుంటే భక్తిని దేవుడెరుగు గానీ జీవితంపైననే అసహ్యం కలిగేలా ఉంటుంది.
ఒకప్పుడు ఊరంతా కలిసి ఒక విగ్రహాన్ని ప్రతిష్టించుకొని ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడిపిన క్షణాలువేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
ఇంకో విషయమేమిటంటే పాఠశాలలో ఇలాంటి ఉత్సవాలను నిర్వహించడం బాధాకరం. రాజ్యాంగం ప్రకారం ఒక మతానికి, కులానికి, వర్గానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళి ఇతర మనోభావాలను దెబ్బతీయకూడదు. అలాగే ప్రజలంతా ఒక్కటే అని చెప్పే సందర్భంలో ఇలా ఇంకా మతాల పేరిట వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఈ ఉత్సవం వచ్చిందంటే చాలు వ్యాపారస్తులకు కాసుల పంట ప్రారంభమవుతుంది. సౌండ్ సిస్టమ్ వ్యాపారుల బ్రతుకుకు కొంత భరోసా, వస్త్ర వ్యాపారులకు డబ్బుల పండుగ. వారిపై ఆధారపడి జీవించే వారికి ఆర్థిక భరోసా. అయ్యగార్లకు మాత్రం ఎంత ఉన్నతమైన కొలువున్న కూడా ఈ వారం రోజులు సెలవుపెట్టి వార్షికాదాయాన్ని సమకూర్చుకోవడమే, మద్యం ఏరులై పారాల్సిందే. వాటి అమ్మకందార్లకు నిత్యం కాసుల పంటే కానీ ఈ పండుగ వచ్చిందంటే చాలు ఇంకొంత అదనంగా మద్యాన్ని సమకూర్చుకోవాల్సిందే.
ఇంతవరకు బాగానే వున్నది ఎందరో ఆర్థికపరంగా ముందుకు వెళ్తున్నారు కానీ అసలు సమస్య సాధారణ ప్రజలది, వీళ్ళందరి వల్లనే వారికీ డబ్బు చేకూరుతుంది. వేలం పాటలో పాల్గొని డబ్బులు చెల్లించుకునే స్తోమతలేక పది మందిలో పలుచన అవడానికి ఇష్టపడక తమ ఆస్తులను అమ్ముకొని కొందరు, అప్పుతెచ్చి మరికొందరు చెల్లిస్తూ అష్టకష్టాలు పడుతున్నవారు కొందరైతే, సమయానికి డబ్బుదొరక్క చెల్లించుకోని సందర్భంలో వారి ఇగో అడ్డువచ్చి ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలను సైతం మనం దినపత్రికలలో, న్యూస్‌ఛానల్స్‌లలో చవిచూడవచ్చు.
ఇక్కడ ఈ వ్యాస ఉద్దేశం ఒక్కరిని నిందించాలనో లేదో దేవుని తప్పుపట్టాలనో కాదు. ఒక సామాన్య పౌరుడిగా ఆలోచించి, పరిశీలించి లిఖించదలిచి, ఎలాంటి చెడు సాంప్రదాయాలకు, సంస్కృతికి దారితీయకుండా కుటుంబ, గ్రామ ప్రజలంతా కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకుంటే అందరికీ బాగుంటుంది. అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలను పలువురికి తెలియజేయడం సమాజానికి మేలు జరుగుతుంది. కానీ ఇలాంటి పండుగను ఆర్థికపరంగా, చెడు వ్యసనాల అలవాటున్న వారికీ ఉచిత ఆర్థిక వనరుగా భావించకూడదు. తెల్లవార్లు పెద్దపెద్ద సౌండ్స్‌తో శబ్దకాలుష్యానికి దారితీయకుండా పాత రోజులలో ఎలాగైతే ఆనందభరితంగా కొనసాగించేవారో అలా వారి దారిలో నడుచుకుంటూ వారి సాంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రభుత్వం సైతం ఈ విషయంలో జోక్యం చేసుకొని పలువురు మేధావులతో చర్చించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేటట్లు ప్రణాళికలు రూపొందించి, గ్రామ అధికారులచే ఆచరణ అమలుపరిచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆస్తి, ఆరోగ్య, ప్రాణనష్టాలను నివారించడానికి ప్రత్యేకమైన కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

- డా.పోలం సైదులు 9441930361