AADIVAVRAM - Others

ఆదిదేవా.. నమోస్తుతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే॥
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు
తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,
విద్యాబలం, దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి॥
భాద్రపద శుద్ధ చవితినాడు ఉదయానే్న లేచి స్నానమాచరించి, సంధ్యా వందనం మొదలగు నిత్యకర్మలను చేసుకుని తమ శక్తికి తగినట్లుగా వెండితోగానీ, బంగారంతోగానీ, తుదకు మట్టితోగానీ వినాయక ప్రతిమను చేసుకుని ఇంటి ఉత్తరవైపున ఒక పాలవెల్లిని ఏర్పరిచి దాని నడుమ ఎనిమిది దళములు గల కమలమును యవలతోగానీ, బియ్యంపిండితోగానీ నిర్మించి అచ్చట ఆ ప్రతిమను ఉంచి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోను, అక్షతలతోను, పూలతోను, గరిక పోచలతోను.. ఇలా ఇరువది ఒక్క పత్రములతో పూజచేసి, ధూమ దీపములను సమర్పించి నేతితో వండిన కుడుములు, అరటిపండ్లు, నేరేడుపండ్లు, వెలగపండ్లు, చెరుకుగడలు, కొబ్బరికాయ, మరి అనేక విధాల లభ్యమయ్యే భక్ష్యములు, పండ్లు నైవేద్యంగా సమర్పించి వినాయకుని దనివి నొందించి భక్తితో ఈ వ్రతమును ఆచరించినవారు ఎట్టి విఘ్నములు లేక కార్యసిద్ధిని పొందెదరని స్కాంద పురాణం చెప్తోంది.
పంచముఖ గణపతి
ఐదు ముఖాలతో దర్శనమిచ్చే గణపతిని హేరంబ గణపతి అని కూడా పిలుస్తారు. సింహ వాహనుడైన ఈ స్వామి పది చేతులతో దర్శనమిస్తుంటాడు. ముందు రెండు చేతులలో అభయ, వరద ముద్రలతో, వెనుకనున్న మిగతా ఎనిమిది చేతులలో అంకుశం, గదాయుధం, చెరకువిల్లు, శంఖు, చక్రం, పాశం, తామరపువ్వు, ధాన్యపుకంకిని పట్టుకుని నయన మనోహరంగా గోచరిస్తుంటాడు. కొన్ని విగ్రహాలలో ధాన్యపు కంకి, తామరపువ్వులకు బదులుగా రత్నకలశాన్ని పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. స్వామివారు తెల్లని శరీరకాంతితో మెరిసిపోతుంటారు.
నృత్యగణపతి
నేపాల్ దేశంలో గణేశ భక్తులు నృత్య గణపతిని ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ గణపతి ఎరుపురంగులో మెరిసిపోతుంటాడు. అంతే కాదు ఈయన త్రినేత్రుడు. తన వాహనమైన ఎలుకపై కుడికాలును కొద్దిగా మడిచి పెట్టి నృత్యం చేస్తున్న గణపతి, ఎడమ కాలును పూర్తిగా పైకెత్తగా, ఆ కాలు బొజ్జను చుట్టుకుని ఉన్న నాగబంధాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. పనె్నండు చేతులతో దర్శనమిచ్చే ఈ స్వామివారు విఘ్నాలను తొలగించి, కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తాడన్నది నేపాల్ భక్త జన విశ్వాసం. అటువంటి నృత్య గణపతులను మనదేశంలోని హాలిబేడు హోయసలేశ్వరాలయం, మధుర మీనాక్షీ ఆలయం, బీదర్ జిల్లా జలసంగవి వంటి క్షేత్రాలలో దర్శించుకోవచ్చు. హాలిబేడు హోయసలేశ్వరాలయ గోడపైనున్న నృత్యగణపతి మూర్తి అత్యంత సుందరరూపంతో దర్శనమిస్తుంటారు. ఎనిమిది చేతులతో కనిపించే ఈ స్వామి ముందు రెండు చేతులు దండముద్ర, విస్మయముద్రతో కనిపిస్తుండగా, వెనుకనున్న ఆరు చేతుల్లో పరశు, పాశ, మోదక పాత్ర, దంత, సర్ప, కమల పుష్పాలు ఉన్నాయి. కరండమకుటంతో నృత్యం చేస్తున్న ఈ గణపతి నిలబడిన పీఠభాగంలో మరుగుజ్జులు వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా చూడగలము.
మధుర మీనాక్షీ దేవాలయం స్తంభం పైనున్న నృత్య గణపతి, ఎలుకపై నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎడమకాలితో ఎలుకపై నించున్న ఈ గణపతి, కుడికాలును పైకెత్తి నృత్యం చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ నృత్యగణపతి కుడివైపున్న నాలుగు చేతులలో పరశు, వలయ, పుష్పం, దంతాలతో.. ఎడమవైపు నాలుగు చేతుల్లో అంకుశం, పాశం, మోదకం, ఫలాలు ఉంటాయి. ఇప్పుడిప్పుడే దక్షిణ భారతదేశంలో కూడా నృత్య గణపతి పూజకు విశేష ఆదరణ లభిస్తోంది.
కవల సోదర వినాయకులు
తమిళనాడులోని అరుణాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ అత్యంత పుణ్యప్రదమని భక్తజన విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ప్రదక్షిణ మార్గంలో.. ముందుగా కనిపించే విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ప్రదక్షిణను మొదలుపెడతారు. భక్తితో విఘ్నేశ్వర గర్భాలయం వైపు చూసిన భక్తులు ఆశ్చర్యపోతుంటారు. కారణం గర్భాలయంలో కవల సోదర వినాయకులు దర్శమిస్తుంటారు. ఈ ఆలయంలో వినాయకుడు కవలలుగా అవతరించడానికి వెనుక ఓ ఆసక్తికరమైన ఉదంతం ఉంది.
సుమారు 452 సంవత్సరాల క్రితం, వీరబాహుదేశికుడు అనే శివభక్తునికి స్వయంభువైన ఓ వినాయక ప్రతిమ దొరకడంతో, ఆ వినాయకునికి ఆలయాన్ని నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు. అరుణాచల క్షేత్రానికి ఉత్తర దిశలో ఆలయ నిర్మాణాన్ని చేసేందుకై భూమిని తవ్విస్తున్న అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అతని సంతోషానికి అవధుల్లేవు. అందుకు కారణం ఏంటంటే.. స్వయంభువుగా లభించిన వినాయకుని కోసం ఆలయాన్ని నిర్మించే పనిలో ముమ్మరమై ఉన్న తనకు, ఆలయ నిర్మాణానికై పునాదులను తవ్వుతున్నప్పుడు, ఆ స్వయంభువు విగ్రహాన్ని పోలిన మరో విగ్రహం లభించింది. అదంతా దైవ నిర్ణయంగా భావించిన వీరబాహుదేశికుడు ఆ కవల గణపతులను శాస్త్రోక్తంగా ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడు. అరుణాచల గిరిప్రదక్షిణ చేసే భక్తులు మొదట ఈ కవల గణపతులను దర్శించుకుని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ ఫలిస్తాయని భక్త జన విశ్వాసం.
* వైష్ణవ ఆగమంలో గణపతిని విష్ణువుగా పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని మండేసేర్ నందు, కన్యాకుమారి(శుచీంద్రం)లోను, మధుర సుందరేశ్వర్ ఆలయాలలో గణపతిని స్ర్తి రూపంలో కొలుస్తారు. టిబెట్, చైనా, జపాన్, బర్మా, మెక్సికో, కంబోడియా, అమెరికా మొదలగు ప్రాంతాలలో పూజలందుకుంటున్న గణపతి దేవుడు విశ్వవ్యాపకుడు.
పూజకు ఎలాంటి విగ్రహాలు..?
ఇప్పుడు మట్టి వినాయకుడిని ఇంట్లో చేసుకోకుండా అందరూ బయట కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. బజారులో అమ్మే వినాయకుడిని కొనేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని కొనాలో ఒకసారి చూద్దాం..
* వినాయక చవితినాడు ఇంట్లో, వినాయక మంటపంపై ప్రతిష్ఠించే విగ్రహం విషయంలో కొన్ని సూచనలు పాటించాలి. సాకారంగా దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ రూపంలో ఏ విధమైన అవయవలోపం లేకుండా శిల్ప సౌందర్యం కలదిగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు చాలా ప్రశస్తమైనవి. లోపల డొల్ల లేకుండా నిండుగా ఉన్న విగ్రహాలను పూజించడం చాలా మంచిది.
* చవితి పూజలో ఏ లోహంతో చేసిన విగ్రహాన్నైనా పూజించవచ్చని పెద్దలు చెబుతారు. అయితే ఇంట్లో పూజించే ప్రతిమ ఆరు అంగుళాల పరిమాణం మించకుండా ఉంటే మంచిది. వినాయక చవితి నాడు పచ్చి మట్టితో చేసిన గణపతి ప్రతిమను ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది. ఆనాడు పార్వతీదేవి నలుగుపిండితో చేసిన చిన్న బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసిన పురాణ కథ ఆధారంగా ఈ విశ్వాసం లోకంలో బలపడింది. అంతేగాక వినాయకుడు మూలాధారానికి అధిపతి అనీ, పృథ్వీ తత్త్వానికి చెందిన వాడని చెప్పే యోగశాస్తర్రీత్యా కూడా ఈ ఆచారం అమల్లోకి వచ్చింది.
* గణపతి నవరాత్రుల్లో పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే సంప్రదాయం. అయితే అలా నిమజ్జనం చేయని పక్షంలో మన ఇంటి పెరటిలో ఎవరూ తొక్కకుండా చెట్టుపాదులో ఉంచవచ్చు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో రూపొందించిన విగ్రహాలను పూజలో ఉంచితే.. నిమజ్జనం రోజు ఉద్వాసన పలికి, తిరిగి యథావిధిగా పూజామందిరంలో ఉంచవచ్చు. పచ్చిమట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలో ఒక చిత్రమైన ఆంతర్యం ఉంది. నిమజ్జనం అంటే నీటిలో ముంచడం. అంటే ప్రవాహ జలంలోగానీ, కనీసం ఊరి చెరువులోగానీ నిమజ్జనం చేయాలి. వర్షరుతువులో వచ్చే ఈ పండుగ వేళ పచ్చిమట్టి కోసం మనకు తెలియకుండానే చెరువులకు పూడికలు తీసే పని జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్తాడు వినాయకుడు. ఈ సత్యం మనకు ప్రబోధించడమే నిమజ్జనంలోని ఆంతర్యం.
ఏకదంతుడు
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డుకోవడానికి నీవెవ్వడివి’ అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురాముడిని పైకెత్తి పడేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ‘ఏకదంతుడు’గా పేరుగాంచాడు.
గరిక ఎందుకు?
గరిక పూజను స్వీకరించడం గణపతి నిరాడంబరత్వాన్ని, ప్రకృతి ప్రియత్వాన్ని సూచిస్తుంది. వినాయకుడిని వివిధ రకాల పత్రాలతో పూజించడం వెనుక ఓ ఆంతర్యం ఉంది. పూజలో వినియోగించే రకరకాల పత్రాల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు అవగాహన కల్పించడం ఇందులోని ముఖ్య ఉద్దేశం. అంతేకాదు గరిక.. మట్టితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. గరికతో పూజ చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తానని గణపతి ప్రకటించినట్లు ఓ పురాణ కథనం కూడా ఉంది.
రకరకాలు
మనం వినాయక పూజ చేస్తున్నప్పుడు వినాయక ప్రతిమను ఏయే పదార్థంతో చేసి పూజిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుందన్న విషయం పురాతన గ్రంథాలలో చెప్పబడింది.
* మట్టి గణపతిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది.
* పసుపుతో చేసిన గణపతిని పూజిస్తే వివాహ ప్రయత్నాలకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
* పుట్టమట్టి గణపతిని పూజించడం వల్ల అన్నింటా లాభం కలుగుతుంది.
* బెల్లంతో చేసిన గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
* ఉప్పుతో చేసిన గణపతిని పూజించడం వల్ల శత్రువులపై విజయం ప్రాప్తిస్తుంది.
* వేపచెట్టు కలపతో చేసిన గణపతిని పూజించడం వల్ల శత్రు నాశనం జరుగుతుంది.
* తెల్లజిల్లేడు మొదలుతో చేసిన గణపతిని పూజించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.
* వెన్నతో చేసిన గణపతిని పూజించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.
* పాలరాతితో చేసిన గణపతిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజించడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది.
* స్పటిక గణపతిని పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం నిలిచి ఉంటుంది.
* నల్లరాయితో చేసిన గణపతిని పూజించడం వల్ల చేసే పనిలో అనవసరపు శ్రమ తొలిగిపోతుంది.

నిమజ్జనం ఎలా చేయాలి?

వినాయక చవితి, దసరా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిదిరోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతామూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితినాడు కానీ 3,5,7,9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య ఉన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థప్రసాదాలను అందరూ భుజించి ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే.. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంతో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి సంప్రదాయం పాటించాలి? ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని పఠిస్తూ ఆ గణనాథుడ్ని నీటిలోకి వదలాలి? అన్న ప్రశ్నకు దాదాపు ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సమయంలో శ్లోకాలను చదివి, పూజ చేయాలంటే కష్టం అని అందరూ అనుకుంటారు. అసాధ్యమైన విషయం అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాథుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు ‘‘శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ’’ అని చెప్పుకోవడం సంప్రదాయం.
================================================================
సీ॥ పర్వదినాలను భారతంబున యందు
ఆదిపర్వాధి నాయకుడెవండు?
హాస్యాధి దైవమై అక్షరాస్యాన లా
స్యంబాడు కవి వినాయకుడెవండు?
సత్యధర్మాహింస శాంతి హస్త చతుష్ట
యముగల్గు గాంధినాయకుడెవండు?
అడుగు పట్టక మునె్న ఇడుమల కుడుములన్
నములు వినాయక నవ్యుడెవడు?
సదమలారోగ్య పత్రి పూజల గ్రహించి
ప్రకృతి పర్యావరణము సంరక్ష చేయు
వ్యావసాయికమైన రూపంబెకాక
అమృత మోంకార రూపుడై అలరునెవడు?
ఆయన వినాయకుండు; విఘ్నాధిపతియె;
వినుతులర్పింతు - తత్పర్వదినము నందు
-రామడుగు వేంకటేశ్వర శర్మ
9866944287

-నాగ ఉమామహేశ్వరి