Others

వృద్ధుల గుండెఘోష వినండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు రీత్యా పెద్దవాళ్లు మహావృక్షాల్లాంటి వారు. ఆధునిక జీవన శైలితో నిత్యం అశాంతిగా బతికే నేటి యువతకు ఈ మహావృక్షాలు నీడనిచ్చి సేద తీరుస్తాయి. అందుకే వృద్ధులను అభిమానంతో ఆదరించాలి. వయోధికులను గౌరవించేందుకు ‘జాతీయ వృద్ధుల దినోత్సవా’న్ని ఏటా ఆగస్టు 21న జరుపుకుంటారు. ఏదో మొక్కుబడిగా ‘సీనియర్ సిటిజన్స్ డే’ పాటిస్తే చాలదు.. వృద్ధుల సమస్యల పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి. వేధింపులు, ఆరోగ్య సమస్యల నుంచి వృద్ధులను దూరంగా ఉంచేలా కుటుంబ సభ్యులంతా చొరవ చూపాలి. మనిషి జీవితంలో వృ ద్ధాప్యం అనేది చివరి దశ కావడంతో- వారిలో శారీరక మార్పులను ఆపడం ఎవరితరం కాదు. వృద్ధాప్యం అన్నది శరీరానికే కానీ మనసుకు కాదని ప్రతివారూ తెలుసుకోవాలి.
ప్రస్తుతం అరవయ్యేళ్ల వయసు దాటిన వారు దేశంలో 15 కోట్ల మేరకు ఉంటారని అంచనా. వీరిలో సుమారు కోటిన్నర మందికి పైగా ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు, ఔషధాలు అందుబాటులోకి రావడంతో ఆయుర్ధాయం పెరుగుతోంది. దీంతో వృద్ధుల సంఖ్య అదే స్థాయిలో అధికమవుతోంది. ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 60 ఏళ్లకు పైబడినవారు 16.7 కోట్ల మంది, 80 ఏళ్లకు పైబడిన వారు పది లక్షల మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన వారి ‘సూపర్ సీనియర్ సిటిజన్స్’ అంటారు. జపాన్‌లో నూటికి 30 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 2050 నాటికి 64 దేశాలు 30 శాతం వృద్ధులతో నిండిపోతాయట! అంటే వృద్ధుల జనాభా 120 కోట్లకు చేరుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 80 శాతం వృద్ధులుంటారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. 2050 నాటికి మన దేశంలో వృద్ధుల జనాభా 30 కోట్లపైనే ఉండే అవకాశముంది. మన దేశంలో ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. ముగ్గురిలో ఒకరు వేధింపులకు గురి అవుతున్నారు. ‘హెల్పేజ్ ఇండియా’ అధ్యయనం నిగ్గుతేల్చిన విషయమిది.
ఆత్మీయ పలకరింపు...
వృద్ధుల సంరక్షణ వారి పిల్లల కనీస బాధ్యత. వయసుడిగిన దశలో తమ వారసుల నుంచి వారు కోరుకునేది ప్రేమ పూర్వక పలకరింపు, ఆదరణ, అభిమానాలే తప్ప- ఆడంబరాలు, విలాసాలు కాదు. వృద్ధాప్యంలో చర్మంపై ము డుతలు ఏర్పడుతాయి. కొంతమందిలో వినికిడి శక్తి తగ్గుతుంది. ప్రకృతి మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కొంత సమయం గడిపితే వీరికి మానసిక ప్రశాంతత ఉంటుంది. కొంతమందిలో దృష్టికి ఇబ్బంది కలుగుతుంది గనుక నేత్ర వైద్యుని చేత పరీక్షలు చేయించుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం సూర్యోదయం వేళ ఆరుబయట ఉంటే విటమిన్- డిలోని కాల్షియాన్ని శరీరం గ్రహించేందుకు తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో ఆరో గ్య సమస్యలే కాదు, ఆర్థిక, సామాజిక సమస్యలు వారిని చుట్టుముడుతాయి. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సి ఉండగా కొన్ని కు టుంబాల్లో చిన్నచూపు చూ స్తున్నారు. ప్రపంచీకరణ, చి న్న కుటుంబాలు ఇందుకు కొంతవరకు కారణాలు.
60 ఏళ్లు వస్తేనే వృద్ధులై పోయారని అంటారు గానీ.. నిజ జీవితం మొదలయ్యేది స్వీట్ సిక్స్టీస్‌లోనే అంటున్నారు మనస్తత్వ నిపుణులు. 60 ఏళ్లు పైబడిన అనుభవజ్ఞుల శక్తిని, అనుభవ సారాన్ని ఉపయోగం చేసుకుంటే తప్పకుండా ఏ దేశమైనా పురోగమిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్లు ప్రారంభమయ్యాయి. కొన్ని వెబ్‌సైట్లు రిటైర్ అయినవారికి ఉద్యోగాలను వారి అభిరుచి మేరకు చూసి పెడుతున్నాయి. నగరాల్లో ఎక్కువమంది ఇంటికే పరిమితం కావడంతో వయోధికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
దూరవౌతున్న బంధాలు...
పేద, మధ్యతరగతి కుటుంబాల వారే కాదు, సంపన్న కుటుంబాల్లోనూ వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించి తమ పని పూర్తయిందనుకుంటున్నారు. రేపు తమదీ ఇదే బతుకని వారు మరచిపోతున్నారు. సంతానం ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా పిల్లలు కళ్లముందున్నప్పటికీ కొందరు వృద్ధులు అనాథలుగా మారుతున్నారు. ఆవేదనతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. సంపాదన అనే వ్యామోహంలో పడి కొందరు యువకులు తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది బంధాలను దూరం చేసుకుంటున్నారు. గడిచిపోతే తెలుస్తుంది- కాలం విలువ. దూరం అయితే తెలుస్తుంది- మనిషి విలువ.
జాతీయ స్థాయిలో వృద్ధుల స్థితిగతులపై ‘హెల్పేజ్ ఇండియా’ వెలువరించిన నివేదికలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 19 రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, విశాఖ సహా 23 నగరాల్లో 5814 మంది వృద్ధుల నుంచి సమాచారం సేకరించారు. వృద్ధుల పట్ల మంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, అమృత్‌సర్, ఢిల్లీ, కాన్పూర్ నగరాల్లో నిరాదరణ ఎక్కువగా ఉంది. జమ్ము, ముంబయి, విశాఖ, కొచ్చి, గౌహతి నగరాల్లో ఇది తక్కువగా ఉంది. సొంత కుటుంబ సభ్యులనుంచే నిరాదరణ ఎదురవుతోందంటూ 56 శాతం వృద్ధులు స్పందించారు. కుమారుల్లో 57 శాతం, కోడళ్లలో 38 శాతం పెద్దవారిని ఆదరించడం లేదట. తమ హక్కుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలపై వృద్ధుల్లో కొంతవరకు అవగాహన ఉన్నప్పటికీ, కుటుంబ గౌరవం మంట గలుస్తుందన్న భయంతో పోలీసులను ఆశ్రయించటం లేదన్నది 52 శాతం వృద్ధుల స్పందన. వృద్ధుల జనాభాలో కేరళ, తమిళనాడు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో వృద్ధులు తక్కువగా ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్కువ ధరకే భోజనం అందిస్తున్నందున వృద్ధుల ఆకలి బాధలు కొంతవరకూ తీరుతున్నాయి.
వృద్ధులపై వేధింపుల నిరోధానికి కేంద్రం ఒక చట్టం చేసింది. ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ నిర్వహణ చట్టం’గా వ్యవహరించే దీని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు. సంపన్న దేశాల్లో సమాజమే వృద్ధుల సంరక్షణ బాధ్యతను తీసుకుంటుంది. కేరళలో మధ్యాహ్నం వేళల్లో వృద్ధుల బాగోగులు చూసుకునే సంరక్షణాలయాలున్నాయి. ఇలాంటివి దేశమంతటా నెలకొల్పాలి. వృద్ధులకు ప్రత్యేక రవాణా, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలి. వయసులో ఉన్నపుడు కుటుంబం కోసం, సమాజం కోసం తమ శక్తియుక్తులు ధారపోసిన వారిని ఆదుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యులపై, ప్రభుత్వాలపై, సామాజిక సంస్థలపై ఉంది.
గ్రామీణ వృద్ధుల్లో 45 శాతం మంది దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారని జాతీయ నమూనా సర్వే తెలిపింది. ముంబయిలో డిగ్నిటీ ఫౌండేషన్ అనే సంస్థ మతిమరుపు వచ్చిన వృద్ధులకు మధ్యాహ్నం వేళలో సేవలు అందించడానికి మూడు ప్రాంతాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఈ ఫౌండేషన్ సభ్యులు వృద్ధులను తమ కేంద్రాలకు తీసుకువచ్చి అన్నపానాలు సమకూర్చడంతోపాటు ఇతర సపర్యలు చేస్తారు. ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నా నోరువిప్పని వృద్ధులు ఢిల్లీలో 92 శాతం వరకు ఉంటారని హెల్ప్‌ఏజ్ ఇండియా అధ్యయనం తెలిపింది. నేటి ఆధునిక కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఏర్పాటుకావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వయోధికులు ప్రశాంత జీవనం గడపాలంటే ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం, నడక, ఎండలో ఉండడం వంటివి చేయాలి. సత్పురుషులను ధ్యానించడం, వారి ఉపదేశాలను మననం చేయడం వల్ల మనస్సు ప్రశాంతత పొందుతుంది. వృద్ధులు ప్రశాంతంగా కాలం గడపడానికి అవసరమైన చేయూత అందచేయడం కుటుంబ సభ్యులందరి కనీస బాధ్యత. వృద్ధాప్యంలో ఉన్నవారితో ప్రతిరోజూ కాసేపైనా గడపాలి. వారి అనుభవాల్ని తెలుసుకోవాలి. ఈరోజు మనం వృద్ధులకు ప్రేమను పంచితే- రేపు మన వృద్ధాప్యంలో మనం కూడా ప్రేమను పొందగలుగుతాం- అని యువత గుర్తించాలి.
వృద్ధులను మన జాతి సంపదగా గుర్తించాలి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నందున వయోధికులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పూర్వ వైభవం వచ్చినపుడే వృద్ధులకు గౌరవం పెరుగుతుంది. అన్నింటికన్నా కుటుంబ సభ్యుల ఆదరణే వారికి కొండంత అండ అన్న సంగతిని విస్మరించరాదు. అందుకే వృద్ధులను గౌరవిద్దాం. వారికి అండగా ఉందాం.

- కె.రామ్మోహన్‌రావు