AADIVAVRAM - Others

నేను పెద్దయ్యాక (స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభినందన్ తను రాసే పేపర్ని నలిపి, లేచి వెళ్లి చెత్తబుట్టలో పడేసి, మళ్లీ వచ్చి కూర్చున్నాడు. ఇంకో కాగితం తీసుకుని మళ్లీ ఏదో రాయడం గమనించిన తల్లి అడిగింది.
‘ఏమిటి? ఇందాకటి నించి కాగితాలతో కుస్తీ పడుతున్నావు?’
‘సోషల్ టీచర్ మాకు ఓ ప్రాజెక్ట్ ఇచ్చారమ్మా. పెద్దయ్యాక మేము ఏ ఉద్యోగం చేద్దామనుకుంటున్నామో రాయమన్నారు. నేను క్రికెట్ ప్లేయర్ అవుదామనుకుంటున్నాను. కానీ దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి. పైగా రాజకీయాలు కూడా ఉంటాయి కాబట్టి అది వద్దనుకుని, నాన్నలాగా ఫొటో స్టూడియోని నడపాలనుకుంటున్నానని రాశాను. కానీ నాన్న దాంతో వచ్చే సంపాదన సరిపోవడం లేదన్నారు. కాబట్టి రైతు అవుదామనుకున్నాను. కాని నాకు ఆ పని తెలీదు. పెద్దయ్యాక నేనేమైతే బావుంటుందమ్మా?’ అభినందన్ అడిగాడు.
ఆమె కొద్ది క్షణాలు ఆలోచనగా కిటికీలోంచి బయటకి చూశాక చెప్పింది.
‘కిటికీలోంచి చూడు. ఏం కనిపిస్తున్నాయి?’
‘మామిడి పళ్లు. ఏం?’ అభినందన్ అడిగాడు.
‘మామిడిచెట్టు సీతాఫలాలు కాయవుగా?’
‘ఊహు. మామిడిచెట్టుకి సీతాఫలాలు ఎలా కాస్తాయి?’
‘ఐతే నువ్వు కూడా మామిడిచెట్టులా ఉండాలి’
‘అంటే నేను మామిడి కాయలు కాయాలా?’ నవ్వుతూ అడిగాడు.
‘అది కాదు. దేవుడు మామిడి చెట్టుని, మామిడి కాయలు కాసేలాగే రూపొందించాడు. అలాగే సీతాఫలం చెట్టుని సీతాఫలాలు కాసేలా, నిమ్మచెట్టుని నిమ్మకాయలు కాసేలా... ఇలా ప్రతీ చెట్టుని ప్రత్యేకంగా రూపొందించాడు. ఇలాగే ప్రతీ మనిషికీ పరమాత్మ ఓ ప్రత్యేక నైపుణ్యాన్ని ఇచ్చి పంపుతాడు. మనకున్న నైపుణ్యం ప్రకారం మనం ఉద్యోగం, వృత్తి లేదా వ్యాపారం చేయాలి. తిరగడం ఇష్టం అనుకుంటే కొరియర్ బోయ్ లేదా సేల్స్ రిప్రజెంటేటివ్‌గా, సైన్స్‌లో ఉత్సాహం ఉంటే ఫార్మసిస్ లేదా డాక్టర్‌గా ఇలా...’
‘అర్థమైంది. ఇతరులని చూసి కాక మనలోని ఆసక్తి ఏదో తెలుసుకుని ఆ ప్రకారం మన పనిని ఎన్నుకోవాలన్నమాట’
‘అవును. నాన్నకి చిన్నప్పటి నించీ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి కాబట్టి ముందుగా ఫొటోగ్రాఫర్‌గా పని చేసి తర్వాత స్టూడియో పెట్టుకున్నారు’
‘అర్థమైంది’
‘ఐతే పెద్దయ్యేలోగా నీ ఆసక్తులు అనేకసార్లు మారుతూంటాయి. కాబట్టి 17-18 ఏళ్లకి ఏది ఏ ప్రధాన ఆసక్తి అన్నది చూసి అప్పుడు నిర్ణయించుకోవచ్చు’
‘ఇప్పుడు నాకున్న ఆసక్తి లెక్కలు. కాబట్టి ఇంజనీరో, ఏకౌంటెంటో అవుదామనుకుంటున్నానని రాస్తాను’ అభినందన్ చెప్పాడు.
‘నీకు ఆసక్తి ఉన్న రంగంలో పనిచేసేప్పుడు అది ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. డబ్బు కోసం ఆసక్తి లేని పని చేస్తే అది కష్టాన్ని ఇస్తుంది’ ఆ మొత్తం సంభాషణ విన్న తండ్రి చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి