Others

కెవి చలం.. సొంత డైలాగులు (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవి చలంకి మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. ఆయన సెట్‌లోవుంటే నవ్వుల పంట పండాల్సిందే. అప్పటికప్పుడు ఏదో ఒక పంచ్ పేల్చి, యూనిట్ సభ్యులందర్నీ నవ్వుల్లో ముంచెత్తడం ఆయన అలవాటు. ‘సర్కస్ రాముడు’ చిత్రం చెన్నైలో జరుగుతోంది. జెమినీ సర్కస్‌లో షూటింగు. యన్‌టిఆర్ రింగ్ మాస్టారు. ఆయన అసిస్టెంటు కెవి చలం. ఆ సినిమాకి నేను సహకార దర్శకుడిని. దాసరి నారాయణరావు దర్శకుడు. షూటింగంటే ఎంత హడావుడిగా ఉంటుందో తెలిసిన విషయమే కదా. పైగా దాసరి ఒకేసారి నాలుగు సినిమాలు ప్రారంభించేవారు. నాలుగు సినిమాలకు వన్‌లైన్ ఆర్డరు, ట్రీట్‌మెంటూ తప్ప ఇంకేం సిద్ధంగా ఉండేది కాదు. డైలాగులు సెట్‌లో రాసుకోవడమే.
సెట్‌లో డైలాగుల సమయంలో నన్ను పిలిచేవారు. ఆయన ఫ్లోలో చెప్పుకుపోతుంటే.. షార్ట్‌హాండ్‌లో రాసినట్టు రాసుకొని దాన్ని నిమిషాల్లో ఫెయిర్‌చేసి అందించాలి. అంటే సాంకేతిక సిబ్బంది కూడా సర్కస్ కంపెనీలాగా పనిచెయ్యాలి.
యన్‌టి రామారావు సర్కస్‌రాముడు పాత్రకు మాటలు సిద్ధంగా ఉన్నాయి. చలంకి మాటలు ఏంరాయాలో గురువుగారికి తోచలేదు. ఇంతలో చలం వచ్చి సీను పేపరు అడిగాడు. ‘ఇందులో హీరో డైలాగులున్నాయి గానీ నా డైలాగులేవీ?’ అన్నాడు, క్వొశె్చన్ మార్క్ ముఖంపెట్టి-
‘హీరో ఈ డైలాగులు విలన్ రావుగోపాలరావుతో అంటాడు. హీరోకి వంత పలుకుతూ నువ్వు డైలాగ్ చెప్పాలి. ఎలా చెప్తావ్?’
‘అంటే విలన్‌కి వార్నింగ్ ఇవ్వమంటారు, అంతేకదా?’
‘అంతే! అంతే!’
‘అలో..పొలో.. నీ తల.. పులీ.. కచ్ బిచ్ కచ్ బిచ్’ అన్నాడు. దాసరి పక్కున నవ్వారు. రాసుకోవయ్యా! అన్నారు.
‘మరి చివర్లో ఓ డైలాగు చెప్పాలి!’
‘అంటే రావుగోపాలరావు ఉపన్యాసం అయిన తర్వాతా?’
‘అవునూ!’ అన్నాను.
‘కసా బిసా మహా నస!’ అన్నాడు చలం స్పాంటేనియస్‌గా రావుగోపాలరావు సుదీర్ఘమైన డైలాగు తర్వాత చలం పంచ్ బాగా పేలింది. యన్‌టిఆర్ కూడా చలం డైలాగులు బాగున్నాయ్ బ్రదర్! అన్నారు.
‘సర్కస్ రాముడు’ చిత్రంలోనే విలన్‌ని పిలుస్తూ ‘వో లఫంగీ! మా సివంగీ.. పిలీసి... పిలీసి’ అన్నాడు. ఇలా భాషగాని భాషని సృష్టించాడు కెవి చలం.
బెంగళూర్ పేలస్‌లో రాజామందిర్. మరో పాత్ర యన్‌టిఆర్ రాజాగా ఉంటుంది. అక్కడ షూటింగు జరుగుతున్నంత కాలం పనిలేకపోయినా కూడా ఉండేవాడు. అందర్నీ ఆటపట్టించేవాడు.
‘ఏం చలం! ఈ సినిమాకోసం.. నువ్వు ఎన్నిరోజులు కేటాయించావ్?’ అని అడిగారు యన్‌టిఆర్.
‘త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్- ట్వంటీఫోర్ హవర్స్ ఎట్ యువర్ సర్వీస్ సార్!’ అన్నాడు తడుముకోకుండా-
ఆమాట విని ముందు ఆశ్చర్యపోయి తర్వాత ఫక్కున నవ్వేరు.
తిరుగు ప్రయాణం కోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారు. ప్రొడక్షన్ కంట్రోలర్ కోటేశ్వరరావు ‘చలం, ఫ్లైట్‌లో ప్రయాణం చెయ్యడం నీకు భయంకదా? ట్రైనుకి బుక్‌చెయ్యనా?’ అని అడిగారు సరదాగా.
‘అన్నగారు అండగా వుంటుండగా నాకేం భయం. ఫ్లైట్‌లోనే కాదు, పుష్పక విమానంలోనైనా వెళ్లడానికి సిద్ధంగా వున్నాను’ అన్నాడు. యన్‌టిఆర్ నవ్వేసి ప్రేమగా కెవి చలం తల నిమిరారు.

-ఇమంది రామారావు 9010133844