Others

అర్థం - పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదవేదాంగాలు, అన్ని ధర్మశాస్త్రాలు చదివి జ్ఞాన సంపద సమకూర్చుకోవటం అందరికీ సాధ్యంకాదు. అభిలాష వున్నా అభినివేశంతో వాటిని అధ్యయనం చేసి ఒంటపట్టించుకోవటం చాలామందికి కుదరకపోవచ్చు. అధ్యయన, స్వాధ్యాయ, నిదిధ్యాసల వంటి యోగ ప్రక్రియలకు వీలులేని సామాన్యులకోసం శ్రీవ్యాస భగవానుడు భాగవత పురాణం ప్రవచించాడు. వారసుడైన వైయ్యాసి (శుకదేవుడు) ఆదిత్యామృతాన్ని భవ్యజీవితంలో ఆస్వాదించి ఆనందించి, తరించే అవకాశం కలిగించాడు. దైవోపహతుడైన పరీక్షిత్తుడు, విధి వ్రాతను తప్పించుకలేకపోయినా, సప్తాహాలలో సారం సంగ్రహించి మోక్షం పొందగలిగాడు. అందుకే శ్రీ్భగవతం ‘అవరోహపంథ’ అని, వేద విజ్ఞానానికి రామసేతువు వంటిదని, భవరోగ నివారణకు తారక మంత్రం అని చెబుతారు. అసలైన వైరాగ్యం పొందటానికి జ్ఞానమార్గం కన్నా కర్మమార్గమే సులభం అన్నది సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ ఉవాచ. అందుకు ఆ పరామాత్మే ప్రబల నిదర్శనం. జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీమహావిష్ణువు కృష్ణావతారంలో మహాభోగపురుషుడు, యోగేశ్వరేశ్వరుడు రెండూ తానేనని నిరూపించాడు. దశావతారాలు, కర్మధర్మాలకోసమే ధరించాడు. అందుకే ఉత్తమం, క్లుప్తం, పరిమితం అయిన మానవ జన్మను అడవి కాచిన వెనె్నల చేయకూడదు. వృధాగా విషయ భోగలాలసతో కాలక్షేపం చేయటంకన్నా, కన్నయ్య కథాకాలక్షేపం మిన్న. కాబట్టి అలాంటి శ్రోతలను ఉత్తమ శ్లోకులు అంటారు. అందుకు భిన్నమైన జీవన విధానం సూర్యోదయం, సూర్యాస్తమయములకే పరిమితమై క్షీణిస్తుంది అంటున్నది శ్రీ్భగవతం. అందువల్ల ఆ పరమ పురుషుడైన వాసుదేవుడిని భక్తితో ఆరాధించేవారు ముక్తి సులభంగా పొందవచ్చునన్న ఉపాయం సాక్షాత్తు శుకయోగి ముఖంగా వెలువడ్డ మహావాక్యాలు విన్న పరీక్షిత్తుడే సాక్ష్యాధారం.
పరమాత్మ సర్వవ్యాపి; సర్వాంతర్యామి; సర్వాత్మ. ఎలా ఆయనను దర్శించాలి? యోగించటం ఎలా? అన్న ప్రశ్నలు మిక్కిలి సమంజసం. మహాయోగులకు దృశ్యమానమైన ఆ పరమాత్మ రూప లావణ్యం దేవ, దానవ, మానవ గణాలలో ఎవరికీ సాధ్యంకాదు. కనుకనే మహానుభావులు దివ్యస్తపతులై అవతరించి, ఆ అచింత్యాద్భుత శక్తికి అనేక రూపకల్పనలు చేశారు. శిల్పచాతుర్యంతో వాటిని అర్చ స్వరూపాలుగా ఆలయాలలో ప్రాణప్రతిష్ఠ జరిపించి అందరికీ అందుబాటులో ఉంచారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు దర్శించి ఆ పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని సేవించినవారు పుణ్యశ్లోకులు. వారూ ఉత్తమ శ్లోకులతో సమాన ప్రతిపత్తికి అర్హులు కాగలవారే. యవ్వనం, దృఢత్వం ఈ శరీరములో ఉన్నప్పుడే క్షేత్రదర్శనం చేసుకోకపోతే ఆ మనిషి నేత్రద్వయం నెమలి కళ్లలా నిర్జీవం, ఆ కాళ్లు చెట్టు బోదెలతో సమానం. వెరసి ఆ జీవితం అడవి కాచిన వెనె్నలే అవుతుంది. అడవిలో వృక్షాలు వేల సంవత్సరాలుగా అలా స్థిరపడి నిలబడే వుంటాయి. కొలిమి తిత్తి గట్టిగా ఊపిరి పీల్చి వదిలే చందాన, ఆ జీవి శరీరం గాలి ఆడినా నిరుపయోగం అవుతుంది. ఆహార నిద్రా భయ మైథునాలకు పరిమితం అయిన మనిషి కూడా రెండు కాళ్లున్న పశువేనంటోంది శ్రీ్భగవతం.
భవబంధాలనుంచి విముక్తికోరే వ్యక్తి మానసిక బంధాలనుంచి కూడా దూరం కావాలి. ఇతరుల ఆలోచనలోగాని, తనవైన ఆలోచనలలోగాని, చిక్కుకున్న మనిషికి ఫలితం దక్కదు. కేవలం ఆలోచనలే కాదు, భౌతిక, మానసిక, మేధోవికారాలు కూడా ప్రతిబంధకాలే! భవబంధ విమోచనకు పరమ ఔషధం నిరంతర హరినామ జపం. స్థిర సుఖాసనంలో దైవ ధ్యానముద్రలో కూచున్న వ్యక్తికి ఎలాంటి వికారాలు దరికిరావు. ఈ శరీరం ఒక విషయ భోగాల నిలయంగా సుఖ విలాస మందిరంగా భావించే మనిషి మనిషే కాదు. అలాంటివాడు కుక్కకన్నా హీనమైన వాడు; గాడిదకన్నా దీనమైనవాడు.ఉదాహరణకు కుక్కలు ఇంటిలో జొరబడ్డ ప్రతిసారి చావుదెబ్బలు తిని బయటికి పరుగెత్తుతాయి. అయినా వాటి గుణం మారదు. గాడిదలు నిజంగా అడ్డగాడిదలే. అడ్డమైన చాకిరీ చేస్తూ, మోయరాని బరువులు మోస్తూ, కామాశతో ఆడ గాడిద కాలి తన్నులు భరిస్తూ వెంట తిరుగుతాయి. కాముకులు ఇలాంటివారే కదా! వారికి సంభోగ ధ్యాస మినహా ఎలాంటి భయభీతులుగాని, సిగ్గూ లజ్జలు గాని పట్టవు. అలాంటివారు ద్విపాద పశువులు. ధనవంతులు, వ్యాపారదక్షులు గాడిద చాకిరీ చేస్తూ డబ్బు గడించడం తప్ప వేరే ఆలోచనలకు తావు కలిగించరు. అడ్డదారుల్లో అడ్డగాడిదల్లా అడ్డమైన గడ్డిమేయటంతోనే వారికి సుఖం కనిపిస్తుంది. భౌతికమైన సుఖం, ఆర్థిక లాభం తప్ప ఆధ్యాత్మికంగా అలాంటి మూర్ఖులకు ఎలాంటి లాభం కలగదు. అది వారికి తెలియదు. అందుకే శ్రీ్భగవతం అలాంటివారిని అల్పజీవులుగా పరిగణిస్తున్నది.
శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా శ్రీహరి కథామృతాన్ని సేవించేవారు, భౌతిక జీవనానికి, వ్యసనాలకు దూరంగా మసలుకోవాలి. సతతం ఆ పరమాత్మ పాదపద్మాలను హృదయ మందిరంలో పదిలపరచుకుని ధ్యానించాలి. ఆ దివ్య నామ స్మరణమే అన్ని రోగాలకు ఔషధం. అన్ని త్యాగాలకు మూల మంత్రం. అదే మానవ జీవిత పరమగమ్యం. ఈ జీవిత విధానాన్ని శ్రీ్భగవతం అద్దం అంటోన్నది. శ్రీహరి పాదసేవనమే పావన జీవన పరమార్థం అని చాటుతున్నది. అదే దాని అర్థం. పరమార్థానికి తాత్పర్యం.

-వి.ఆర్.రావ్