Others

పిల్లల ఆనందం కోసం ‘నో బ్యాగ్ డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాతి చరిత్రలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవారు పిల్లలు. బాలల ఉనికి దేశానికి జీవనాడి’ అన్నారు మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. పిల్లల ప్రాధాన్యతను గొప్పగా గుర్తించినప్పటికీ మన దేశంలో బాలలకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదు. కారణం గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న విద్యావ్యవస్థ.
బహుప్రాచీనమైన సుసంపన్నమైన భారతీయ సంస్కృతి, వారసత్వాలను నాశనం చేసే దురుద్దేశంతో బ్రిటీషువారు బలవంతంగా రుద్దిన ఆంగ్ల భాష వలన జరగకూడని నష్టం భారతీయులకు జరిగింది. జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడబడ్డ సంస్కృతంతోబాటు మన మాతృభాషలను మరచిపోయే స్థితి కల్పించారు. పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాల మోజులో పడిన జనం ఆంగ్ల మాధ్యమంలో పిల్లలను చదివించడం, గణితం, శాస్తవ్రిజ్ఞానం అందిస్తే చాలన్నట్టు రూపొందించిన పాఠ్యాంశాలు పెరగడంతో విద్యలో విషయం, విలువలు తగ్గిపోయి పుస్తకాల బరువు పెరిగి, విద్యార్థి బరువుతో పోటీపడింది. పదేళ్లకే పిల్లల నడుములు ఒంగిపోయే పరిస్థితి దాపురించింది.
ర్యాంకులు, ఉద్యోగాలకు అవసరమైన మార్కులు తెచ్చుకోవడానికి నేటి విద్యార్థులు పరుగులు పెట్టడంతోనే సరిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే విద్యావిధానంలో సామాజిక, నైతిక సంక్షోభం తప్పదని, అప్పటి తరానికి నేటి తరానికి మధ్య తెలివితేటల్లో అంతరాలు వచ్చాయని, పాత తరంకంటే నేటి తరం సామాజిక స్పృహ, సమయస్ఫూర్తి వంటి విషయాల్లో వెనుకంజలో ఉన్నారని సామాజిక శాస్తవ్రేత్తలు హెచ్చరించిన విషయం విదితమే.
కారుచీకటిలో ఆశాజ్యోతిలా నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో బాలల పట్ల ఉదారంగా వ్యవహరించడం మొదలయింది. వెట్టిచాకిరీ, బాల కార్మిక విధానాలకు బాలలను దూరంచేస్తూ బడిఈడు పిల్లలను బడికి రప్పించడానికి అమ్మఒడి పథకం ప్రారంభించారు. పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం రోజున 15 వేల రూపాయలు అందించడమంటే పేదింటి అమ్మలకు పండుగే మరి.
పిల్లలపాలిట దేవుడిలా అవతరించిన నేటి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి మొదటి, మూడో శనివారాల్లో ‘నోబ్యాగ్ డే’గా ప్రకటించి మరో మేలైన నిర్ణయం తీసుకుంది. రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతలకు భిన్నంగా ఆట, పాటలతో పిల్లలను ఉత్తేజపరిచి పాఠశాల మీద భయం దూరంచేస్తూ, బడిలో ఆనందంగా ఉంచే గొప్ప ప్రయత్నం ఇది.
నిజానికి విద్య అంటే అన్ని విషయాల్లో పిల్లలు వికాసం పొందడమే. వ్యాయామం, ఆటలు-పాటలు, ప్రయోగాలు, వృత్తివిద్య తర్ఫీదులు, సృజనాత్మక కార్యక్రమాలు, శాస్ర్తియ దృక్పథం, నైతిక విలువలు, సామాజిక స్పృహ కలగలిసి బోధించేదే నిజమైన విద్య అని గ్రంథాలు బోధిస్తున్నాయి. దేశంలో 1950నుండి 1990 వరకు విద్యారంగానికి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చింది. 1966లో కొఠారి కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రభుత్వమే ఏర్పాటుచేసి విద్యాఅవకాశాలను కల్పించాలి. అలా సవ్యంగా జరుగుతుండగానే 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ప్రభావం వైద్యరంగంపై పడి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమై, రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థలు విద్యారంగాన్ని నియంత్రించటం ప్రారంభించాయి. తరువాతనుండి పిల్లలకు నైతిక విలువలతోకూడిన విద్య దూరమవుతూ వచ్చింది. ఫలితం అందరికీ తెలిసిందే. ప్రతి ఇంటా జరుగుతున్నదే.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘నోబ్యాగ్ డే’ వలన కలిగే ప్రయోజనాలు చర్చించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. నోబ్యాగ్ డే నిర్వహించే రోజున 1,2 తరగతుల పిల్లలచే ‘పాడుకుందాం’, ‘మాట్లాడుకుందాం’, ‘నటిద్దాం’, ‘సృజన’ అనే ప్రక్రియలు చేయిస్తారు. వీటికి అదనంగా ‘తోటకు పోదాం’, ‘విందాం’ అనే ప్రక్రియలను 3, 4, 5 తరగతుల విద్యార్థులతో నిర్వహిస్తారు. విద్యార్థులలో పాఠశాల పట్ల ఉన్న భయాన్ని దూరంచేస్తూనే, పిల్లల్లో దాగిఉన్న వివిధ రకాల కళలను, చాతుర్యాలను, సృజనాత్మకతను వెలికితీయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. నిజానికి పూర్వకాలంలో చదువులు ఆడుతూపాడుతూ సాగేవి. నేటి కాలపు పిల్లల్లా ఒత్తిడిలేని విద్య నేర్చారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాలు గడిపారు. మరల పాతతరం వైపు తిరిగి చూసే ఈ ఆలోచన నిజంగా ఆహ్వానించదగ్గదేకాక గొప్పది.
మొదటి ప్రక్రియగా అభినయ గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు పాడించడంవలన పిల్లల్లో నిబిడీకృతమై శక్తులు బయటపడడమే కాకుండా నైతిక విలువలు, దేశభక్తిని నేర్పించవచ్చును. అక్షరాలను స్పష్టంగా పలకడం తెలియడంతో నేటి టీవీ యాంకర్లలా కాకుండా ఉచ్ఛారణా దోషాలను అధిగమించగలరు. మొక్కై వంగనిది మానై వంగునా అనే నానుడి ప్రకారం పిల్లలకు బాల్యంనుండే మంచి లక్షణాలు నేర్పించడం పెద్దల కర్తవ్యం. ఆ లోటు ఇలా తీరుతుంది.
రెండవ ప్రక్రియగా కథలు చదవటం, చెప్పటం, అనుభవాలు పంచుకోవటం, పొడుపు కథలు, పజిల్స్, సరదా ఆటలు ఆడడాన్ని ‘మాట్లాడుకుందాం’ లో చెప్పిస్తారు. కథలు చదవడం చెప్పడంవలన చాలా ప్రయోజనం ఉంది. ‘‘మీ పిల్లలు తెలివైనవాళ్ళుగా ఎదగాలంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలు చదివి వినిపించండి. మరింత తెలివైనవాళ్లు కావాలంటే మరిన్ని మంచి కథలను చదివి వినిపించండి’’అని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. అది నిజమని నిరూపించిన ఉదాహరణలు ఉన్నాయి.
మూడవ ప్రక్రియలో నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం చేయడం, చూపించడంవలన పిల్లల్లో అంతర్గతంగా ఉన్న నటనాచాతుర్యం, కౌశల్యాలు బయటపడతాయి. బాల్యంనుండే వారి నైపుణ్యాలు తెలియడంవలన ఆసక్తిఉన్న రంగంలో తగిన శిక్షణ పొందుతూ రాణించి ఉన్నత స్థితి చేరుకుంటారు. నటన, రచన, నృత్యరంగాలను ఉపాధిగా మార్చుకుని పేరుప్రతిష్టలు పొందుతూనే ధనార్జన చేస్తున్నవారు ఎందరో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆ మార్గంలో ఎదుగుతూ పిల్లలు ఉపాధిని ఎంచుకుని స్థిరపడతారు.
నాలుగవ ప్రక్రియలో బొమ్మలు గీయడం, రంగులు, బంకమట్టితో బొమ్మలు/ నమూనాలు/ మాస్కులు చేయడం, అలంకార వస్తువులు తయారీ నేర్పిస్తారు. పిల్లలలో చిత్రకళా నైపుణ్యాలు బయటపడడానికి, హస్తకళలను వృత్తిగా స్వీకరించి బ్రతుకుతెరువు తెలుసుకోవడానికి దోహదపడతాయి. కుల వృత్తులు దూరమై ఉద్యోగాలకోసం వెంపర్లాడుతూ నిరుద్యోగ సమస్యతో బాధపడే బదులు చేతివృత్తుల ఆసరాతో గౌరవంగా బ్రతికే మార్గం కొందరికైనా తెలుస్తుంది.
3,4 తరగతులకు అదనంగా చేయించే ప్రక్రియ తోటకుపోదాం/ పరిశుభ్రం చేద్దాంలో బడి తోటలో పాదులు వేయడం, కలుపుతీయడం, పందిరివేయడం, ఎరువులు వేయడంవలన పిల్లలకు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. పచ్చని చెట్టు ప్రగతికిమెట్లు అని తెలుసుకున్న పిల్లలు తమ ఇంటివద్ద, వీధుల్లో మొక్కలునాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతారు. వాతావరణ కాలుష్యం అరికట్టి స్వచ్ఛమైన గాలి పీల్చడానికి వర్షాల రాకకు మొక్కల అవసరం గుర్తిస్తారు.
పాఠశాల ఆవరణ/ తరగతి గదులు శుభ్రంచేయించడం వలన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా జీవించగలమన్న భావం పిల్లల్లో పెరగడంవలన ఇంట్లోకూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. నిరక్షరాస్యురాలైన తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వ్యాధులనుండి రక్షించుకునే శక్తి పిల్లల్లో పెరుగుతుంది. వైద్య ఖర్చులులేని గృహం ధన వంతులతో సమానమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.
విందాం/ విందాం ప్రక్రియ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయితీ అధికారి, కుటుంబ సంక్షేమ అధికారి, పోస్ట్ఫాసు, వ్యవసాయదారుడు, వ్యాపారి మొదలగువారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించడం వలన పిల్లల్లో ప్రభుత్వ అధికారుల పట్ల భయం, అపోహలు తొలగిపోతాయి. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, పథకాల పట్ల అవగాహన పెరుగుతుంది. ప్రజాసంబంధాలు అనగా పెద్దలతో, అధికారులతో వ్యవహరించే తీరుతెన్నులు తెలుస్తాయి. నో బ్యాగ్ డే కేవలం పిల్లల వీపుల మీద భారం మాత్రమే తొలగించేది కాకుండా పిల్లల మనస్సులో ఉన్న భయాలను, హృదయంలో గూడుకట్టుకున్న సందేహాలను, బెరుకుతనాన్ని దూరంచేసేది కావాలి.
‘కాలిన పెనంమీద పడిన నీటిచుక్క నామరూపాల్లేకుండా పోతుంది. తామరాకు మీద పడితే కాసేపు ముత్యంలా కనబడుతుంది. స్వాతి కార్తెలో ముత్యపుచిప్పలో పడితే ముత్యమై విరాజిల్లుతుంది’ అనే సుభాషితం పిల్లలకూ వర్తిస్తుంది. పిల్లలు పెరిగిన వాతావరణం వారి భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. పిల్లల మెదళ్ళ మీద చిన్నప్పుడు పడిన భావాల ప్రభావం శాశ్వతంగా ముద్రించుకోవాలంటే వారి పెంపకం, విద్యా విధానాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. అప్పుడే మనోధైర్యంతో పిల్లలు విజయాలవైపు అడుగులు వేయగలరు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 83286 42583