Others

సరికొత్త ‘ద్యుతి’ని అందించనున్న ఒలింపిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సంవత్సరం జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. ఇటీవలనే ఆ క్రీడల్లో విజేతలకు అందివ్వనున్న పతకాలను ప్రజల ముందు ప్రదర్శించారు. అక్కడ జరిగే క్రీడల్లో తెలుగమ్మాయి సింధు పతకం గెలుచుకోగలదన్న ఆశాభావం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి పెద్దసంఖ్యలో క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఇది ఇలా ఉంటే.. ఈ క్రీడలు మానవాళి ఓ సరికొత్త మలుపు తిరిగేందుకు దోహదపడనున్నాయి. ఈ క్రీడల నిర్వహణకు కృత్రిమ మేథను గరిష్టంగా ఉపయోగించనున్నారు. ఎటు చూసినా రోబోలు.. డ్రోన్లు, కంప్యూటర్లు.. కనిపిస్తాయి. వాతావరణ కాలుష్యానికి తావివ్వని వాహనాలను ఉపయోగించబోతున్నారు. కార్బన్ ఉద్గారాల మాట వినిపించదు.. రోడ్లు సైతం సరికొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఓ వైపు జపాన్ సంప్రదాయ సంస్కృతిని గౌరవిస్తూనే అత్యాధునిక టెక్నాలజీని అణువణువునా ఉపయోగిస్తున్నారు. ‘‘రీసైక్లింగ్’’ అన్న మాట అక్కడ మార్మోగుతోంది. పతకాలకు ఉపయోగించే బంగారం, వెండి తదితర లోహాలను సైతం రీసైక్లింగ్ ద్వారా సేకరించడం గమనార్హం.
ప్రపంచంలోని మెరుగైన పద్ధతులను ఆచరణలో పెట్టేందుకు నిరంతరం తపిస్తున్నారు. దాదాపు 206 దేశాల నుంచి ఉత్తమ శ్రేణి క్రీడాకారులు పాల్గొననున్న ఈ క్రీడలు మానవ ఉత్కృష్టతకు, చైతన్యానికి ప్రతీకలుగా నిలువనున్నాయి. అనంతమైన ఉత్సాహం, ఉత్ప్రేరకం అందించనున్నాయి. సరికొత్త శకానికి దిక్సూచిలా ఇవి జరగనున్నాయి. మానవ జీవన విధానాన్ని సరికొత్త ‘లెవల్’కు తీసుకెళ్ళే ప్రక్రియ ‘ఇగ్నైట్’ కానున్నది.
గతంలో కొత్త ఢిల్లీలో ‘ఆసియన్ గేమ్స్’ జరిగినప్పుడు దేశ రాజధాని పూర్తిగా రూపాంతరం చెందింది. వాటి స్వభావమే అది. ఇప్పుడు కూడా టోక్యో పూర్తిగా రూపాంతరం చెందుతోంది. దాని ప్రభావం ప్రపంచంపై తప్పక కనిపిస్తుంది. ప్రపంచపు మేలిమిని మూటగట్టి తీసుకొచ్చి ప్రదర్శించేందుకు, అన్ని రంగాల్లో మెరుగైన వాటిని ఓ గుచ్ఛంగా తీసుకొచ్చినప్పుడు అది కలిగించే ప్రభావం, కల్పించే స్పందన ఇంతా... అంతా కాదు. కొత్త ఉత్తేజాన్ని, ద్యుతిని అందిస్తాయి. ఆశావహ ఆలోచనలను మరింత ఇగ్నైట్ చేయనున్నాయి.
1896 సంవత్సరం ఎథెన్స్‌లో ఆధునిక రూపంలో ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఆ తరువాత వివిధ దేశాలలో ఈ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. 2018 సంవత్సరంలో చైనాలోని పియాంగ్ చాంగ్‌లో, అంతకుముందు 2016లో రియోలో, అంతకుముందు 2012లో బార్సిలోనాలో ఈ క్రీడలు మానవ శక్తిని, యుక్తిని, నైపుణ్యాలను, క్రమశిక్షణను, క్రీడాకళను కాపాడుతూ వస్తున్నాయి. జరిగిన ప్రతిసారి ఓ కొత్త ప్రేరణను కల్పించాయి. సరికొత్త ఉత్ప్రేరకాన్ని అందించాయి. ఆలోచనల్ని ‘ఇగ్నైట్’ చేశాయి. ఇవి మానవుని ఎదుగుదలకు, ఉన్నతికి, వికాసానికి, వినూత్న ఆవిష్కరణలకు ఊతం ఇచ్చాయి. మరింత కష్టపడే తత్వానికి, ‘స్పర్ధ’కు సరికొత్త నిర్వచనం చెప్పాయి. ఇదే కదా మానవాళికి కావలసింది, ఇదేకదా ప్రపంచానికి అవసరమైనది?... ఇదేకదా నిబిడీకృతమైన శక్తిసామర్థ్యాలను వెలికితీసే తీరు...
అప్పుడెప్పుడో శతాబ్దాల క్రితం ఎథెన్స్‌లో గ్రీకుల ఉత్సవంగా ప్రారంభమైనప్పటినుంచి మానవాళి భవిష్యత్‌కు ఒలింపిక్స్ దారిచూపుతోంది. లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ క్రీడలవల్ల కేవలం క్రీడాకారులకే కాదు మానవాళికి మేలు జరుగుతోంది. ఆ విషయం వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ రుజువు చేయబోతున్నాయి. కృత్రిమ మేథ విశ్వరూపం అక్కడ ప్రదర్శితం కానున్నది. మనిషి వివిధ క్రీడల్లో కొత్త రికార్డులను సృష్టించేందుకు కష్టపడుతూ ఆ ‘క్రమం’లో ఎన్నోఎనె్నన్నో కొత్త అంశాలకు అంకురార్పణ చేస్తున్నారు. ఆ క్రీడల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఇదొక ‘చక్రం’ లాంటిది. సరికొత్త ఆవిష్కరణ. దాన్ని ప్రజానుకూలంగా మలచడం, తిరిగి అది మరో ఆవిష్కరణకు ఊపిరిలూదడం.. ఇలా మొత్తం ప్రక్రియ మానవుడి మెరుగైన జీవనానికి, మెరుగైన సమాజానికి ఉపకరిస్తోంది.
జపాన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పెట్టింది పేరు. ప్రపంచానికి రోబోలను అందిస్తున్న దేశం. మానవ జీవితంలోని అన్ని రంగాలకు అవసరమైన రోబోల తయారీకి జపాన్ తెరలేపింది. చివరికిప్పుడు 206 దేశాల నుంచి వచ్చే క్రీడాకారులను, వారి వెంట వచ్చేవారిని ఈ రోబోలు ఆత్మీయంగా పలకరించనున్నాయి. ‘కొత్త స్పర్శ’ను కలిగించనున్నాయి. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించబోతున్నారు. విమానాశ్రయంలో దిగినప్పటినుంచి రోబోలు ‘దారి’చూపుతాయి. చేయూతనిస్తాయి. సమాచారం అందజేస్తాయి.. స్వాగతం పలుకుతాయి, పలకరిస్తాయి. వివిధ భాషలు మాట్లాడతాయి. ఇట్లా ఒకటారెండా రాబోయే సాంకేతికత రాశీభూతమై అక్కడ దర్శనమివ్వబోతోంది. ఆయా దేశాలనుంచి వచ్చేవారు ఆ సాంకేతికత మేలిమిని తమవెంట జ్ఞాపకాలుగా మోసుకెళతారు.. ఎప్పటికైనా తమ దేశానికి ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రాకపోతుందా?...అని ఆశాభావం వ్యక్తపరచడం ఖాయం.
ఇలా ప్రపంచం సరికొత్త దిశగా ‘‘రూపాంతరం’’ చెందుతూ ఉంటే, ‘మేలిని’ని పట్టుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటే, తమ శక్తిని, యుక్తిని, నైపుణ్యాలను, సాంకేతికతను ఉన్నతీకరించుకునేందుకు ఉద్యుక్తులవుతుంటే... భారతదేశంలో మావోయిస్టుల ‘‘తాత్విక చింతన’’ ఎంత పాత చింతకాయ పచ్చడో తేటతెల్లమవుతోంది. ప్రపంచమంతటా ‘స్పర్ధ’తో పోటీపడి, జ్ఞానానికి వనె్నలద్దుతూ ఉంటే మావోయిస్టులు మాత్రం ‘‘సాయుధ పోరాటం’’ అంటూ సమిధలు పేర్చడం ఎంత దారుణం?... సమాజ పోకడలకు, జరుగుతున్న పరిణామాలకు సాయుధ పోరాట ‘‘కల’’కు పొంతన కుదురుతుందా? సమ్యక్ ఆలోచనగా అది దర్శనమవుతున్నదా?... సాంత్వన వైఖరి అందులో గోచరమవుతున్నదా?...లేదు!... లేదుగాక లేదు. మరి అలాంటి భావజాలాన్ని తలకెత్తుకుని తలలను ఉత్తరించే కార్యక్రమం చేపడితే, విధ్వంసం బాటలుపరిస్తే అదెలా అంగీకారయోగ్యమవుతుంది?... అక్షరానికి- సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ప్రజల్ని నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలుచేస్తూ, పాటలతో పొద్దుపుచ్చితే, ‘పాచిపోయిన’ సూత్రీకరణలను వల్లిస్తే అణగారిన, దగాపడిన ప్రజల ‘సాధికారత’ పెరుగుతుందా? సాధికారత నేడు అత్యున్నత ‘వరం’. దానికోసమై అన్ని దారులు అటుగా కదలాలి.. అలాగాక ప్రపంచం ఓవైపు పరుగెడుతూ, ఒలింపిక్స్‌లో రికార్డులను బద్దలుకొట్టే తరహాలో దూసుకుపోతుంటే... దండకారణ్యంలో ‘‘కమ్యూనిజం’’ బీజాలు విత్తాం... అవి మొలకెత్తుతున్నాయి... అవి వృక్షాలై మొత్తం ప్రపంచానికి నీడ నిస్తాయని డాంబికాలు పలికితే ఎలా?... ప్రపంచమంతటా కమ్యూనిజం మొలక మాడిమసైపోయిన ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తున్నా, ‘స్పర్ధ’ క్రీడల్లోనే కాదు జీవనంలోని అన్ని రంగాలకు అన్వయమయ్యేదని కమ్యూనిస్టు దేశాలే నిర్థారించి ఆ ‘స్పర్ధ’తోనే సంపద సృష్టికి పాటుపడుతుండగా, స్పర్ధలేని, సంపద సృష్టి అంతగా అవసరంలేని సమాజం కోసం మేం త్యాగాలు చేస్తున్నాం... మాతో చేయికలపండి అని మావోలు ఇంకెంత కాలం ‘గందరగోళం’ సృష్టిస్తారు? సాయుధ పోరాటాలకు ఇది సమయంకాదని, ‘స్పర్ధ’తో, స్ఫూర్తిదాయకమైన, స్పర్ధతో ప్రపంచాన్ని తీర్చిదిద్దే విధానం అందరి ఆమోదం పొందుతోంది. చివరికి చందమామపైకి వెళ్ళేందుకు అదే ‘దారి’ చూపుతోంది. ఈ నేపథ్యంలోనైనా మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలనిగాక ఆత్మవిమర్శ... ఆత్మపరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతో కనిపిస్తోంది. లేకపోతే ‘‘పరుగు’’లో.. ఒలింపిక్స్ లాంటి పరుగులో కనిపించకుండా కనుమరుగు కావడం ఖాయం.

- వుప్పల నరసింహం 9985781799