Others

ఆ మాట మీరనకూడదు నేను వినకూడదు ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై టి.నగరు బజోల్కారోడ్‌లో ‘లక్ష్మీనిలయం’.. బ్రహ్మముహూర్తం వేళ మూడుగంటలకే కాంతులు పంచుకుంటుంది. ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారకరాముడు అప్పుడే నిద్రలేస్తాడు. నిద్రలేచే సమయానికి వాహినీవారి పహిల్వాన్ వస్తాడు. ఆ పహిల్వాన్ నమ్మకస్తుడు. విజయ వాహినీ స్టూడియో అధినేత నాగిరెడ్డికి, యన్‌టి రామారావుకీ, తర్వాత త్రివిక్రమరావుకి మసాజ్ చేస్తుంటాడు. అయితే వరుసక్రమంలో ముందు యన్‌టిఆర్, తరువాత త్రివిక్రమరావు, ఆ తర్వాత నాగిరెడ్డి. వీరికి మసాజ్ చేయడం పహిల్వాన్ బాధ్యత!
కండలు తిరిగిన పహిల్వాన్‌కి కండబలం ఎంతుందో గుండెబలం కూడా అంతే వుంది. దాంతోబాటు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ. అందుకే ఈ ముగ్గురూ పహిల్వాన్ కుటుంబ బాధ్యతలు చూసుకోవడంతోబాటు ఆయనకోసం ఒక అంబాసిడర్ కారు, డ్రైవరుని కూడా కేటాయించారు. పహిల్వాన్‌కి మసాజ్‌తోబాటు ఇరుకు మంత్రాలు వెయ్యడంకూడా తెలుసు. రామారావుకు సెంటిమెంట్‌పై నమ్మకం ఎక్కువ... ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ముందటిరోజు ఫైట్స్‌లో ఒళ్లు ఎంత హూనమైపోయినా.. పచ్చిపుండులా అనిపించినా పహిల్వాన్ చెయ్యి పడిందంటే ఆ బాధంతా పటాపంచలైపోయేది.
యన్‌టిఆర్ క్రమేపీ బిజీ అయిపోయారు. త్రివిక్రమరావుకి ఉదయం నాలుగ్గంటలకే నిద్ర లేవాలంటే బద్ధకం. నాగిరెడ్డికి గార్డెన్‌చుట్టూ వాకింగ్‌తోనే సరిపోతుంది.
మసాజ్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఉదయం మూడుగంటలకే యన్‌టిఆర్ లక్ష్మీనిలయం ముందు పహిల్వాన్ కారాగేది. ఆరోజు యన్‌టిఆర్ మూడు గంటలకంటే ముందు లేచి పహిల్వాన్ కోసం ఎదురుచూస్తున్నారు.
యన్‌టిఆర్ ఇంటి ప్రాంగణం గురించి కొంత చెప్పాలి. ఇంట్లో లక్ష్మీకళతో కళకళలాడుతున్న పది ఆవులూ, నాలుగు మేలుజాతి కుక్కలూ, రెండు గుర్రాలూ ఉండేవి. ఒక్కో ఆవు కడివెడు పాలిచ్చేది. అలాగే గుర్రాలు చాలా సెన్సిటివ్‌గా ఉండేవి. గుర్రపుస్వారీ అంటే నందమూరి సోదరులకు మహా ఇష్టం. ఆ గుర్రాలు తళతళ మెరవడానికి స్కార్ఫ్ ఆయిలు ప్రత్యేకించి తెప్పించి పట్టించేవారు. గుర్రం కదులుతున్నపుడు ఓ మెరుపుచారలా శరీరం మెరుస్తూ కొత్త కాంతులతో గుర్రాలు కళకళలాడుతూ ఉండేవి.
ఆ గుర్రాలకు తాపించే స్కార్ఫ్ ఆయిలుతో పహిల్వాన్ మసాజ్ చేసేవారు. యన్‌టిఆర్ గోచీకట్టుకొని సిద్ధంగా ఉండేవారు. బంగారు మొలతాడు రెండు పేటలు ధగధగా మెరుస్తుండేది. అసలే బంగారు ఛాయ. దానిమీద స్కార్ఫ్ ఆయిల్‌తో రుద్దుతుంటే.. చూడ్డానికి రెండు కళ్లూ చాలేవి కావు. మొదట్లో యన్‌టిఆర్ లంకాకు మేలుజాతి పొగాకు చుట్ట కాల్చేవారు గాని, తర్వాత అలవాటు వదులుకున్నారు.
ఇంతలో పహిల్వాన్ రానే వచ్చారు.
యన్‌టిఆర్‌కి తమాషా అలవాటుంది. తాను ఎవరిమీదైనా అకారణంగా కోప్పడినా, అనివార్య కారణాలచేత ఇతరులకు అసౌకర్యం కలిగించినా.. లోలోపలే పశ్చాత్తాప పడేవారు. వారు కనిపించగానే హుషారుగా పలకరిస్తూ సరదాగా జోకులు వేస్తూ.. వాళ్లు ఆనందంగా ఆదమరచి నవ్వుతుంటే తృప్తిపడేవారు. ముఖ్యంగా మేకప్‌మేన్ ముత్తు, కాస్ట్యూమర్ మేక రామారావు.. అడపా దడపా నాకూ అటువంటి సందర్భాలు అనుభవంలోకి వచ్చాయి.
పహిల్వాన్‌ని పలకరించడం, కుశల ప్రశ్నలు వేయడం, తన షూటింగు అనుభవాలు చెప్పడం అంతా అయిపోయింది. పిచ్చాపాటీ జరుగుతున్న గంటసేపూ పహిల్వాన్ మసాజ్ చేస్తూనే ఉన్నారు. మసాజ్ అయిపోయింది. ‘శలవు మహాప్రభో! వెళ్ళొస్తాను!’ అన్నారు పహిల్వాన్. అది ఆయన అలవాటు. ఈ మహాప్రభో అన్న పదం యన్‌టిఆర్‌కి నచ్చి చాలా సినిమాల్లో ఉపయోగించారు కూడా.
పహిల్వాన్‌తో సరదాగా ‘బ్రదర్ పహిల్వాన్! మీలో ‘పస’ తగ్గింది. వయస్సు పైబడుతున్నట్టుంది ఔనా!’ అన్నారు యన్‌టిఆర్ నవ్వుతూ. అంతే పహిల్వాన్ తలపాగా తీసేసి ‘ఈ మాట మీరనకూడదు. నేను వినకూడదు! శెలవిప్పించండి!’ అంటూ వెళ్లిపోయారు. తర్వాత ఎన్నిసార్లు కబురుచేసినా రాలేదు. ఆ అంబాసిడర్ కారుని నాగిరెడ్డికి ఒప్పగించారు. యన్‌టిఆర్ మనసులో నిజాయితీ గురించి చెప్పేటపుడు ముందుగా వాహినీవారి పహిల్వానే్న ఉదహరించేవారు. బతికినంతకాలం తల దించకుండా బతికారు పహిల్వాన్.

-ఇమంది రామారావు 9010133844