AADIVAVRAM - Others

పులులను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో ప్రతి ప్రాణికి సముచిత స్థానం ఉంది. పులికి భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానముంది. దేని విలువ దానికే. జంతు రాజ్యంలో అడవికి రాజైన సింహం తర్వాత అగ్రస్థానం పులిదే. పులి రాజసానికీ, ఠీవికి పేరు. దాని కళ్ళల్లోని స్ఫురద్రూపం, నడకలో గాంభీర్యం చూస్తేనే వణుకు పుడుతుంది. పులులు ఆరోగ్యపరమైన జీవావరణ వ్యవస్థకు సూచికలు. పర్యావరణ, ఆరోగ్యకరమైన అరణ్య నిర్మాణానికి ఇవి చిహ్నాలు. మొక్కలు పెంచుకున్నట్లే పులిని కాపాడుకోవాలి, వాటిని కాపాడుకోకపోతే అడవి వెలవెలపోతుంది. పులి మన జాతీయ జంతువు. పులుల జనాభాలో మన దేశానిదే అగ్రస్థానం. ఒకప్పుడు మన దేశంలో అడవులు విస్తారంగా ఉండేవి. పులులు కూడా గణనీయంగా ఉండేవి. వందేళ్ళ క్రితం వరకు ఈ భూమీద పులి రాజ్యాలు ఉండేవి. టర్కీ నుంచి రష్యా వరకు ఆ రాజ్యాలు వ్యాపించి ఉండేవి. పులుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి. అదే ఇప్పటి మన జాతీయ జంతువు. పులుల ఆవాసాల యొక్క రక్షణ మరియు విస్తరణకు ప్రోత్సహించడానికి మరియు పులుల పరిరక్షణపై అవగాహన ద్వారా పొందే మద్దతుకోసం 2010 సంవత్సరం నుండి జూలై 29వ గ్లోబల్ టైగర్ డే (అంతర్జాతీయ పులుల దినోత్సవం) నిర్వహిస్తున్నారు.
గత వంద సంవత్సరాలలో 97 శాతం అడవి పులులను ప్రపంచ కోల్పోయింది. 1913లో 1,00,000 ఉన్న పులులు 2013లో 3274కు, తరువాత 2014లో 3200కు తగ్గిపోయాయి. నగరాల విస్తరణ మరియు వ్యవసాయం కారణంగా పులులు 93 శాతం మేర సహజ ఆవాసం కోల్పోయాయి. అంతేగాకుండా మానవ -వన్యప్రాణి సంఘర్షణ మరియు వాతావరణ మార్పుకూడా పులుల జనాభా క్షీణతకు మరియు ఆవాస నష్టానికి కారణాలు. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట రాచరికపు సరదాగా ఉండేది. అక్బర్ చక్రవర్తి విరివిగా పులుల వేటలో పాల్గొనేవారు. విచక్షణా రహితంగా పులులను వేటాడటం, అవి స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలోనే పులులు సంచరించే అభ్యరణ్యాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా జూలై 29న గ్లోబల్ టైగర్ డే పాటించాలని 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జరిగిన టైగర్ సమ్మిట్‌లో నిర్ణయించారు. పెరిగిన నగరాలు, పట్టణీకరణతో అడవుల విస్తీర్ణం అతివేగంగా, గణనీయంగా తగ్గిపోయింది. అవి మనుగడ సాగించే ఆవాస ప్రాంతం తగ్గిపోవడంతో వాటికి ఆహార లభ్యత తగ్గిపోయింది. అవి సంచరించే ప్రాంతం లేక వాటి మనుగడ దెబ్బతింది. దీంతో వాటి సంఖ్య రాను రాను తగ్గిపోయింది. పులిచర్మం, పులి ఎముకలు, గోర్లు, వెంట్రుకలు ఇలా దాని శరీరంలోని అన్ని భాగాలకూ అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో వాటిని విశృంఖలంగా వేటాడుతున్నారు. చైనీయుల సంప్రదాయ వైద్యంలో పులి గోళ్లు, మీసాలను ఉపయోగిస్తారట. వాటికోసం వారు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పులి శరీర భాగాల అక్రమ వ్యాపారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సాలీనా ఆరు బిలియన్ల అమెరికన్ డాలర్లు అని అంచనా.
పులులు జాతులు.. పులులు అంతరించిపోకుండా రక్షించడానికి 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమ్మిట్ వద్ద ఈ దినోత్సవం స్థాపించబడింది. ఈ సమ్మిట్ 2022 కల్లా ప్రపంచంలో పులుల జనాభా రెట్టింపు చేసేందుకు ప్రతినబూనింది. ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు మొత్తం తొమ్మిది జాతుల పులులు ఉండేవి. వాటిలో మూడు జాతుల పులులు పూర్తిగా అంతరించిపోయాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. పులి గాండ్రిపు కనీసం రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. మగ పులి బరువు దాదాపు 250 కిలోలు ఉంటుంది. ఆడపులి బరువు సుమారు 160 కిలోలు. పులి విసిరే ఒకే ఒక పంజా దెబ్బకు మనిషి కపాలం పగిలిపోతుంది. పులి ఆయుర్దాయం గరిష్టంగా 26 ఏళ్ళు.
అభయారణ్యాన్ని సందర్శించడానికి మే నెలలో ప్రజలను అనుమతించరు. అరణ్యంలోని పులులను లెక్కించడానికి ఆ నెలను అనువైన సమయంగా పరిగణించి అందుకు ఉపయోగిస్తారు. ఆ నెలలో పులులు మండే వేసవి తాపం కారణంగా లోతట్టు ప్రాంతాలనుంచి కదిలి నీళ్ళకోసం అడవి అంచులలోకి వస్తాయి. మే నెలాఖరునాటికి క్షేత్ర సిబ్బంది వాటి సంఖ్య వివరాలను తమ పైఅధికారులకు సమర్పిస్తారు.
భారతదేశంలో పులులను చూడటానికి బందల్‌ఘర్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్), రణథంభోర్ నేషనల్ పార్క్ (రాజస్థాన్), కాన్వా నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్), జింకాల్బెట్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్) మొదలగునవి కలవు. ఇండియాలో సుమారు 50 వరకు పులుల అభయారణ్యాలున్నాయి. పులులను గణించేందుకు (పులుల గణన) నాలుగేళ్ళకొకసారి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నాలుగేళ్ళకొక్కసారి తప్పక చేస్తారు.
పులుల వేటపై నిషేధం
1970 సంవత్సరం వరకు పులుల వేటకు వ్యతిరేకగా ఎటువంటి చట్టాలు లేవు. దీంతో వివిధ కారణాల కోసం వేలల్లో వాటిని మట్టుపెట్టారు. 1940లో 40వేల పులుండగా, 1970 ప్రారంభం ప్రాంతంలో వాటి సంఖ్య 1800కు చేరింది. దాంతో కేంద్ర ప్రభుత్వం 1971లో పులులను వేటాడటంపై జాతీయ స్థాయిలో నిషేధం విధించారు. ప్రస్తుతం భారత్‌లో 2500 వరకు పులులు ఉన్నట్లు అంచనా. అందుకే పులుల సంక్షరణ ప్రాధాన్యతను భారత్ ఎప్పుడో గుర్తించింది. 1972లోనే పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన భారత్ మరుసటి ఏడాదే ప్రాజెక్టు టైగర్స్‌ను ప్రారంభించింది. పులుల్ని వేటాడేవారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తెచ్చింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తుంది. దేశంలో 48 పులి అభయారణ్యాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం నాలుగు దేశాలుమాత్రమే పులిని జాతీయ జంతువుగా గుర్తించాయి.
బెంగాల్ టైగర్- భారతదేశం, బంగ్లాదేశ్ జాతీయ జంతువు
సైబీరియన్ టైగర్ - దక్షిణ కొరియా దేశ జాతీయ జంతువు
మలయన్ టైగర్- మలేసియా దేశ జాతీయ జంతువు
దేశంలో 1973లో తొమ్మిది అడవులు, 2700 పులులలో ప్రారంభమైన టైగర్ రిజర్వ్‌ల సంఖ్య 2018నాటికి 50కి చేరుకుంది. ప్రాజెక్టు టైగర్‌లో పులులు మాత్రమే కాకుండా ఇతర అడవి జంతువుల జనాభా, వృక్ష సంపద, సహజవనరులు మొత్తం పర్యావరణ పరిరక్షణకు వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. 13 పులి శ్రేణి దేశాల్లో అత్యధిక సంఖ్యలో 2226 పులులు భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంను 500 పులులతో మలేసియా అనుసరిస్తోంది. 2004లో 440 పులలలో మూడో స్థానంలో వున్న బంగ్లాదేశ్ టైగర్ సెన్సస్ 2015లో 106 పులుల జనాభా క్షీణతను చవిచూసింది.
సంతతి పెంచుకొనేందుకు తగు సమయం
వానాకాలంలో పులుల లైంగిక పద్ధతికి కుతూహలపడతాయి. తద్వారా వాటి సంతతి పెంపొందించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపడ్తారు. జూలై 1 నుంచి సెప్టెంబరు నెల చివరివరకు అడవులల్లో మనుష్యులు, పర్యాటకులు వెళ్ళకుండా జాతీయ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం వారి ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేస్తారు. దేశంలోనే పెద్దదైన అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతం 17 పెద్ద పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. ఆడ, మగ పులులు కలిసి గడిపే సాధారణ సమయం మూడు నుంచి ఏడు రోజుల మధ్య ఉంటుంది. ఆడ పులి 94 నుంచి 115 రోజుల్లో పిల్లలకు జన్మనిస్తుంది. దాదాపు ఒక ఆడపులి సాధారణంగా 3 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తుంది. పుట్టిన పిల్లలు కళ్ళు తెరవడానికి వారం నుంచి పదిహేనురోజులు పడుతుంది.
ఇంతకుముందు పులుల జనాభాను లెక్కించేందుకు పాదముద్రలను గుర్తించడం ఒక్కటే విధానం ఉండేది. అవి సంచరించే ప్రాంతాల్లో రహస్య కెమెరాలు ఏర్పాటుచేసి, వాటి పాదముద్రలను సేకరించేవారు. అయితే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యూల్ బయాలజీ (సిసిఎంబి) పులుల మలం ద్వారా వాటిని లెక్కించే పద్ధతిని ఆవిష్కరించింది. కెల్విన్ క్లెయన్ కంపెనీకి చెందిన ‘ఒబేషన్ ఫర్ మెన్’ పర్ఫ్యూమ్ పరిమళానికి చిరుతలు కెమెరాల ముందుకు వచ్చేవి. ఆ తర్వాత గ్వాటెమాలాలలో కూడా ‘ఒబేషన్ ఆఫ్ మెన్’ పర్ఫ్యూమ్ ఎరగా వేసి పులుల జాడ కనుగొన్నారు పరిశోధకులు. దేశంలో పులుల సామ్రాజ్యం క్రమంగా అంతరించిపోతోంది. గత ఆరేళ్ళకాలంలో 110 పులులు కనుమరుగయ్యాయని ప్రభుత్వం లెక్కలలో తేలింది. 17 రాష్ట్రాల్లో 49 వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 2226 పులులు ఉన్నాయి.
జాతీయ జంతువును కాపాడుకుందాం
పులితో పోరాటం అంటే ప్రాణాలపై ఆశలను వదలుకోవడమే. అయితే ఇది గతం. వర్తమానానికి వస్తే మమ్మల్ని చంపొద్దు, కాపాడాలి అంటూ పులి వేడుకుంటుంది. మనిషి దురాశకు పులి బలైపోతోంది. విచక్షణా రహితంగా పులులను వేటాటంతోపాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే అవి అంతరించిపోవడానికి కారణం. గత ఐదేళ్లలో భారత్‌తో సహా మిగతా ప్రపంచ దేశాల్లోనూ పులుల సంఖ్య చెప్పుకోదగిన రీతిలో వృద్ధి చెందడం ఆహ్వానించదగిన పరిణామం. 2010లో ప్రపంచ వ్యాప్తంగా 3200 పులులు ఉండగా, ప్రస్తుతం 3890కు చేరుకుంది. పులుల జనాభా పెరుగుదల సుమారు 22 శాతం ఉందని ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 690 పులులు పెరగ్గా ఒక్క భారత్‌లో వాటి సంఖ్య 500 పెరగడం విశేషం. భారత్‌తోపాటు రష్యా, నేపాల్, భూటాన్ దేశాల్లో కూడా పులుల సంఖ్య పెరిగింది. పార్వతి వాహనం పులి. అందుకే ప్రపంచంలో అతి ఎక్కువమంది ఇష్టపడే జంతువుల్లో పులి ఒకటి. లక్షల సంవత్సరాల క్రితం నుంచీ పులులు భూమిపై జీవనం సాగిస్తున్నాయి. ఇవి పానె్థర కుటుంబానికి చెందిన జీవులు. 2000 జనవరి నుంచి 2014 ఏప్రిల్ వరకు దాదాపు 1600 పులుల్ని వేటగాళ్ళు చంపేశారు. సైబీరియన్, బెంగాల్, ఇండోచైనీస్, మలయాన్, సమత్రాన్, సౌత్ చైనా మొదలైన ఆరు జాతుల పులులు మాత్రమే ప్రపంచం మొత్తంమీద ఉన్నాయి..

- కె.రామ్మోహన్‌రావు 9441435912