Others

వినడం మంచి అలవాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట్లాడే వ్యక్తులకంటే వినే వ్యక్తులు వివేకవంతులంటారు. మాట్లాడే వ్యక్తులు తమకు తెలిసిన ఒక సబ్జెక్టు మీదే మాట్లాడొచ్చు. వినే వ్యక్తులు అటువంటివారినెందరిరో కలిసి వారి మాటలు వింటారు. ఈ విషయాన్ని గ్రహించి వారందరికంటే తెలివైనవారే అయి ఉండొచ్చు.
ఒక పాఠశాలలో తెలుగు పండితుడు ఆ సబ్జెక్టు మాత్రమే చెబుతాడు. చరిత్ర మాస్టారు చరిత్ర చెబుతాడు. అలాగే సైన్సు, హిందీ, లెక్కలు.. వేరు వేరు టీచర్లు చెబుతారు. ఇవన్నీ విన్న విద్యార్థి తన జ్ఞానాన్ని పెంచుకుని, ఆ టీచర్లందరికంటే ఉన్నతమైన స్థితికి వెళ్లడం మనం అనాదిగా చూస్తున్న వాస్తవమే! అయితే విద్యార్థినీ విద్యార్థులు ఇది గ్రహించలేకపోతున్నారు. చివరికి పరీక్షల సమయంలో ఆందోళన పెంచుకుని, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అదే ఒకసారి విని వుంటే పరీక్షల సమయంలో ఒక రీడింగుతో పరీక్ష రాయొచ్చు. పిల్లలే కాదు కొందరు తల్లిదండ్రులు కూడా పరీక్షలు దగ్గరపడే సమయంలో ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తారు. కాలేజీకి వెళ్తే ఏముందిలే.. ఆ సమయంలో ఇక్కడే చదవొచ్చు అంటారు పైగా.
‘వినదగు నెవ్వరు జెప్పిన’ అని పెద్దలు ఏనాడో చెప్పారు. అందరూ చెప్పిన విషయాలను విని, విచక్షణాజ్ఞానంతో విశే్లషించి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ, ఎవరో మనకు కావలసినవారొకరు చెప్పారనీ, అదే నూటికి నూరు శాతం నిజమని నమ్మకూడదు. అందుకే న్యాయమూర్తులు రెండు పార్టీల వాదాలను వింటారు. వాద ప్రతివాదాలు విన్నాక సరైన జడ్జిమెంటు ఇవ్వగలుగుతారనేది సత్యం.
మహావక్త విన్‌స్టన్ చర్చిల్ గురించి తెలియనివారుండరు. గొప్ప మేధావి. అద్భుతమైన వక్త. ఆయన ఒక సభలో మాట్లాడుతూ ‘‘శ్రోతకాని వారు వక్త కాలేరు. ఎవరు చెప్పినా వినాలి. ఎంత చెత్తగా చెప్పినా వినాలి. దానివల్ల ఎలా మాట్లాడకూడదో, ఎలా మాట్లాడలో తెలుస్తుంది’’. ఎవరైనా సరిగ్గా మాట్లాడనప్పుడు చెప్పావులేవోయ్ చెత్త అనుకుంటే, అతడు చెప్పేది ఏదీ వినలేం. అది మన మనసులో రిజిస్టర్ కాదు. కాబట్టి రేపు మనం కూడా అలా మాట్లాడచ్చు. వినటంవల్ల అనేక లాభాలున్నాయనేది అనుభవించినవారికే తెలుసు.
బాగా కోపంగా వున్న వ్యక్తితో మనం ఎంత మాట్లాడినా లాభం లేదు. ఆ సమయంలో అతడిని ఓదార్చేది ఒక్కటే. అదే మీరు వినడం. ప్రేమకు మొదటి మెట్టు వినడమే అంటారు చార్లీ చాప్లిన్. కౌన్సిలింగ్‌లో కూడా విజనింగ్ (వినడం) అనేదే ముఖ్యపాత్ర వహిస్తుంది. నిజానికి విన్న తరువాత కౌన్సిలర్ పని చాలా సులభమైపోతుంది. ఎందుకంటే కౌన్సిలర్ పూర్తిగా విన్నాడనే తృప్తి, ఆపైన నమ్మకం ఏర్పడతాయి. చెవులున్నాయి కాబట్టి అన్నీ వింటాం. రైల్వే స్టేషన్‌లో, కంపార్ట్‌మెంట్లలో పక్కవారు చెప్పే కబుర్లు, బస్టాండుల్లో, బజార్లలో అరుపులు వింటాం. అది మామూలుగా వినడమవుతుంది. ఒక చెవితో విని రెండో చెవిలోంచి వదిలేయడం లాంటిది. అయితే శ్రద్ధగా వినడం ముఖ్యం. ఇది మనకు చాలా అవసరం. ఇంట్లో, కాలేజీల్లో పనిచేసే ప్రదేశాల్లో ఇది ముఖ్యం.
ఈ మధ్య భాస్కరరావు తన కొడుకు సురేష్‌తో మా ఇంటికొచ్చాడు. సురేష్ డిగ్రీ ఫెయిలయ్యాడు. ఉద్యోగం లేదు. చావాలనిపిస్తుందన్నాడు. పాతికేళ్ళొచ్చినా ప్రయోజకుడు కాలేదు. చదువు, జాబ్ లేదనే బాధకన్నా తన తమ్ముడు ఇంజనీరింగ్ పాసై మంచి ఉద్యోగం చేస్తున్నాడనే బాధ ఎక్కువగా కనిపిస్తుంది. తమది మధ్యతరగతి కుటుంబం. సరిగ్గా చదువుకోలేకపోయాననీ, స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరిగేవాడినని, తన తండ్రి సరిగ్గా క్రమశిక్షణ నేర్పలేదనీ, అందుకే అలా అయ్యాననీ అన్నాడు.
ఇటువంటి అమాయకులు మన సమాజంలో చాలామంది వున్నారు. మరి అదే తండ్రి తన రెండవ కొడుకుని ఇంజనీరింగ్ ఎలా చదివించాడని ఆలోచించరు. తండ్రి ఇద్దరు కొడుకులకి ఒకేవిధంగా చెప్పినా, వినే పద్ధతిలో తేడా ఉంది. మొదటివాడు విన్నాడు. రెండోవాడు శ్రద్ధగా విన్నాడు అంతే. దీనినే సైకాలజిస్టులు హియరింగ్ అండ్ విజనింగ్ అంటారు. సామాన్యులు ‘పెద్దల మాట చద్దన్నం మూట’ అంటారు. అది తింటే శరీరానికి శక్తి, జీర్ణశక్తి కూడా పెరుగుతాయి.
ఇతరులు చెప్పింది వినడం, అందులోంచి మంచి తీసుకోవడం, చెడుని విసర్జించడం ఒక మంచి లక్షణం. అలాగే మీ మాటలు కూడా మీరు వినాలనే శ్రద్ధ ఉండాలి. ఇకనుంచి బుద్ధిగా చదువుకుంటాను. ఇంకెప్పుడూ కాని పనులు చెయ్యను అనే స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు కొందరు. వాటిని అమలుపరచాలంటే మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ మాటలు వినాలి. మీరెలా ఉండాలనుకుంటున్నారో, మీ ప్రవర్తనలో ఏయే మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో ఒక కాగితంమీద రాసి పెట్టుకుని వాటిని అక్షరాలా అమలుపరిచే ప్రక్రియను ప్రారంభిస్తే, మీ మాట మీరు విన్నట్టే లెక్క. ఇతరులు చెప్పినవి విన్నా, వినకపోయినా మీ మనసు అందించే పాజిటివ్ సజెషన్లను స్వీకరించండి. అది మీ లక్ష్యాలను చేర్చేందుకు దోహదపడుతుంది.

- పి.ఎం. సుందరరావు 9490657416