AADIVAVRAM - Others

వికీ, వికీపీడియా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఈ మధ్యనే తయారయిన ఒక సరికొత్త ఇంగ్లీషు మాటని తీసుకుందాం. కలన యంత్రాలని, అంతర్జాలాన్ని తరచు వాడే వాళ్లకి ‘వికీ, వికీపీడియా’(wiki, wikipedia) అనే మాటలు తెలిసే ఉంటాయి. ‘వికీ’ (wiki) ని ‘ఎన్‌సైక్లోపీడియా’ (encyclopedia) ని సంధించగా ‘వికిపీడియా’ వచ్చింది. అదే విధంగా ‘వికి’ని ‘డిక్షనరీ’ (dictionary)) ని సంధించగా ‘విక్షనరీ’ (wiktionary) వచ్చింది. ‘ఎన్‌సైక్లోపిడియా’ అంటే మనలో చాలామందికి తెలుసు. దీనిని తెలుగులో ‘జ్ఞాన సర్వస్వం’ అందాం. ఇంతకీ ఈ ‘వికి’ ఏమిటి? ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది?
హవాయి భాషలో ‘వికివికి’ (wikiwiki) అనే మాట ఒకటుంది. అసలు హవాయి భాషలోని చాలా మాటలలో అక్షరాలు ఇలా రెండేసి సార్లు పునరావృత్తమవుతూ వస్తాయి. ఉదాహరణకి హనోలులు, వైకీకీ, కమేహమేహ, అపొపొ, నానా, నెనె మొదలైనవి. అదే విధంగా వికీ అంటే ‘జోరుగా’ అని అర్థం. వికివికి అంటే మరికొంచెం జోరుగా. ఈ వికివికి వేగాన్ని తెలియజేస్తుంది. అందుకని హవాయి విమానాశ్రయం నుండి ఊళ్లోకి జోరుగా (లేదా గబగబ) తీసుకెళ్లే ‘ఎక్స్‌ప్రెస్ బస్సు’ కి వాళ్లు ‘వికివికి’ అని పేరు పెట్టుకున్నారు.
ఈ వికివికి అనేదానికి సరి అయిన తెలుగు మాట ‘గబగబ’. మన తెలుగులో కూడా బరబర, దడదడ, రెపరెప, పరపర మొదలైన మాటలు కొల్లలు. మనం కూడా శంషాబాద్ నుండి హైదరాబాద్ ఊళ్లోకి తీసికెళ్లే ‘ఎక్స్‌ప్రెస్ బస్సు’కి ‘గబగబ’ అని పేరు పెడితే ఎలాగుంటుందంటారు? అంటే ఇంగ్లీషులో ‘ఎక్స్‌ప్రెస్’ అనే మాటకి సమానార్థకంగా హవాయి భాషలో వికివికి అనిన్ని, తెలుగులో గబగబ అనిన్ని అనొచ్చన్నమాట. గబగబ కాకపోతే చకచక. మీ ఇష్టం.
ఏది ఏమైతేనేమి, ‘వికి’ అంటే వేగం కనుక వికిపీడియా అంటే జోరుగా తయారుచేసిన జ్ఞాన సర్వస్వం. అంటే, పెద్ద హడావిడి చెయ్యకుండా, తొందరతొందరగా, ఏకరాత్రి పెళ్లి చేసినట్లు, తయారుచేసిన ‘గ్రంథం’ సాధారణంగా మనం ఒక గ్రంథ రచన చెయ్యాలంటే ఒక ప్రణాళికా బద్ధంగా చాలా విషయ సేకరణ చేసి, దానిని తార్కికమైన క్రమంలో అమర్చి, అజ్ఞానం వల్ల చేసిన తప్పులని, రాతలో దొర్లిన పొరపాటులనీ సరి చూసుకుని అప్పుడు పుస్తకం ప్రచురిస్తాం. వికీ పద్ధతి దీనికి వ్యతిరేకం. చిన్న ఉదాహరణ. నేను వికీపీడియాలో ఒక వ్యాసం రాసేననుకుందాం. అది అంతర్జాలం ద్వారా మీకు మీ కంప్యూటర్ మీద చదువుతూన్నప్పుడు నేను రాసినది తప్పు కాకపోయినా మీ కంటికి అది తప్పులా అనిపించిందని అనుకుందాం. అనిపించడమేమిటి, వెంటనే ఆ తప్పుని సవరించాలనే కోరిక మీకు పుడుతుంది. అచ్చేసేసిన పుస్తకంలో ఇటువంటి సవరింపులు సాధ్యంకావు; వికీపీడియాలో ఆ ‘తప్పు’ని వెనువెంటనే సవరించగలిగే సౌలభ్యం మీకు ఉంటుంది. వికీపీడియాలో సవరింతలు చెయ్యటానికి సర్వులకీ అధికారం ఉంది. వెసులుబాటు ఉంది. కనుక ఈ వికీపీడియాలో కనబడే అంశాలు జోరుగా మారిపోయే సావకాశం ఉంది. అన్నీ తెలుసున్నవారు ‘గ్రంథకర్త అభిప్రాయం ఏమిటో, ఎందుకిలా రాసేడో’ అని ఆలోచిస్తూ వెనువెంటనే మార్పులు చెయ్యటానికి సిద్ధపడరు. కానీ మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్లు మార్పులు చెయ్యటానికి తటపటాయించరు. అందుకనే వికీపీడియా మీద సర్వుల అభిప్రాయాలు ఉంటాయి కనుక ఆ విషయ సంగ్రహంలో సాధికారత లోపించటానికి అవకాశాలు ఎక్కువ.
ఈ వికీపీడియా అనే ఊహ మన తెలుగు వాడి బుర్రలో పుట్టి ఉంటే దాన్ని ‘గబగ్రంథం’ అనో, ‘జోరు పుస్తకం’ అనో, ‘గబ జ్ఞాన సర్వస్వం’ అనో అనుండేవాడేమో! ‘గబఘంటువు’ అంటే గబగబ తయారుచేసిన నిఘంటువు అన్న మాట లేదా ‘విక్‌ష్నరీ’. దీని అర్థం ఏమిటంటే గబగబ తయారుచేసింది కనుక నాణ్యత ఉండకపోవచ్చు. తప్పులు ఉండొచ్చు. కానీ ఏదీ లేని పరిస్థితులలో ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా. అది వికీపీడియా వారి ఉద్దేశం.
ఈ విషయం రాస్తూ ఉంటే ఇంగ్లీషు మాట ‘ఎక్స్‌ప్రెస్ బస్’లో ‘ఎక్స్‌ప్రెస్’ అన్న మాట యొక్క అసలు అర్థం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. మన దేశంలో ఎక్స్‌ప్రెస్ రైలు బండి అంటే అదేదో ఒక ఊరి నుండి మరొక ఊరికి జోరుగా తీసుకెళ్లే బండి అన్న అర్థంలో వాడుతున్నాం. జనతా ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్ వగైరా. ఎక్స్‌ప్రెస్ అన్న మాటని ‘ప్రత్యేకమైన దూత’ అనే అర్థంలో వాడటం కూడా కద్దు. ఉత్తరాలని కానీ, బంగీలని కానీ ప్రత్యేకమైన శ్రద్ధతో బట్వాడా చేసే పద్ధతిని ‘ఎక్స్‌ప్రెస్ తపాలా’ అనేవారు. మూడొంతులు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అన్నప్పుడు ‘జోరుగా వార్తలని అందించటమే మా ధ్యేయం కానీ, మేము రాసిన వాటిల్లో తప్పులుండొచ్చు’ అని అర్థం ఉందేమో. కనుక్కోవాలి. అమెరికాలో ఏ వార్తాపత్రికల పేర్లలోనూ ‘ఎక్స్‌ప్రెస్’ అనే మాట కనిపించదు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బోస్టన్ హెరాల్డ్ ట్రిబ్యూన్, మెర్క్యురీ న్యూస్ మొదలైన పేర్లలో ఎక్కడా ‘ఎక్స్‌ప్రెస్’ కనిపించదు.
అదండీ, టూకీగా వికీ కథ.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా