Others

సరికొత్త విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్షత్రాలై వెలిగే కళ్ళలో
ఇంకా రంగులు వెలియని
బొమ్మల ప్రపంచం కదలాడ్తుండగానే
ఆ గేట్లు తెరుచుకుంటాయి!
ముద్దులొలికే మొగ్గ శరీరాల్ని
యూనీఫారాలు కబళిస్తాయి!
ఆటల తోటనుంచి బయలుదేరిన
నాజూకు సీతాకోక చిలుకల పెడరెక్కలను
అక్షరాల దారాలు విరిచికడ్తాయి!
పట్టువదలని గట్టి పదాలు
చిట్టి నాలుకలను ఒడిసిపట్టి
సిలబస్ కత్తులతో సానపడ్తాయి!
పాలవెనె్నలంటి చిన్నారి చేతివేళ్ళలో
సిరా ముళ్ళను అవలీలగా గ్రుచ్చి
కలల చందమామను దోచుకెళ్తాయి!
బాల్యపు కాళ్ళను బంధించే
కన్నవాళ్ళ కార్పొరేట్ ప్రణాళికలు
పరీక్షల పంజరాలతో సన్నద్ధమై
ర్యాంకుల కబంధహస్తాలు చాచి
రారమ్మని ఆత్రంగా నోళ్ళు తెరిచి
రేపటి తరం రెప్పలపై మిగిలిన
వేకువ జాడల్ని హరిస్తూ
ఆహ్వానగీతాల గాలమేస్తున్నాయి!

- డేగల అనితాసూరి, 9247500819