Others

స్టార్టప్‌లతో సమాజంలో మార్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా’ అన్న నినాదం ఎందరినో ఉత్తేజితుల్ని చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఓ కొత్త ‘లెవల్’కు చేరుకోవాలంటే నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని విధానకర్తల భావన. మన దేశంలో అత్యధికంగా యువత ఉన్న సంగతి అందరికీ తెలుసు. వారి శక్తియుక్తులు దేశ ఆర్థికవృద్ధిలో కీలకమన్న అంశం అందరూ గుర్తించారు. దాంతో వారిని ప్రోత్సహించేందుకు, వారి సృజనను వెలికి తీసేందుకు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కొత్త వాతావరణం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గ్రహించడంతో ఆ నినాదం పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైతన్యమే ఇది. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం ఇక్కడా కొనసాగుతోంది.
ఒక రంగంలో నూతన దారిలో పయనించడానికి చేసే అనే్వషణే ఈ స్టార్టప్‌లు. ప్రతి రంగం శాఖోపశాఖలుగా విస్తరించిన సందర్భంలో ప్రతి శాఖ తిరిగి ఉపశాఖలుగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఆవిష్కరణల రంగం విస్తృతమైంది. వర్తమాన చైతన్యం, సాంకేతికత, అవగాహనను దృష్టిలో పెట్టుకుని కొత్తదారులను అనే్వషిస్తూ ముందడుగువేస్తున్న వారి వెన్నుతట్టే వాతావరణం అంతటా కనిపిస్తోంది. కొత్త ఆలోచనలకు ఆదరణ- అభినందనలు లభిస్తున్నాయి. ఈ కొత్త కానె్సప్ట్‌లకు వ్యాపారాత్మకత అద్దాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ వ్యాపారాత్మకతకు పెట్టుబడి పెట్టేందుకు ‘ఏంజిల్స్’రంగంలోకి ప్రవేశిస్తున్నారు. అప్పుడు ఆవిష్కర్త పరిధి పెరుగుతుంది.
ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థలు ఒకప్పుడు ఇదే ‘మాడ్యూల్’లో ప్రారంభమయ్యాయి. ఈ విజయ దృశ్యాన్ని చూసి ఎందరో ఇప్పుడు స్టార్టప్‌లతో కుస్తీపడుతున్నారు. తమతమ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. అలా ప్రజ్ఞచూపిన వారికి వెంచర్ కాపిటల్ సంస్థలు ముందుకొచ్చి ఆ స్టార్టప్ సంస్థలను ఉన్నతికి తీసుకెళ్ళేందుకు చొరవ చూపుతున్నాయి. అలాగే కొన్ని ‘‘్ఫండ్స్’’ సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నాయి. దీనే్న ‘సీడ్ ఫండింగ్’ అంటున్నారు. దీంతోపాటు కొత్తగా ‘క్రౌడ్ ఫండింగ్’అనే పద్ధతి సైతం అందుబాటులో ఉంది. ఒక ఆలోచనను ఇష్టపడి, దాని అవసరాన్ని గుర్తించి, వ్యాపారాత్మకంగా అది ముందుకు సాగగలదని భావించేవారు భాగస్వాములుగా చేరడానే్న క్రౌడ్ ఫండింగ్ అంటున్నారు. బ్యాంకులు సైతం లాభసాటిగా భావించే స్టార్టప్‌లకు రుణాలను అందిస్తున్నాయి.
ఉబెర్, ఫ్లిప్‌కార్ట్, గ్జియామి తదితర స్టార్టప్ సంస్థలకు పెట్టుబడులు పెద్దఎత్తున రావడంతో అవి ఏకంగా అంతర్జాతీయ సంస్థలుగా అవతరించాయి. అయితే ఇందులో పెట్టుబడులుపెట్టిన వ్యక్తులు-సంస్థల ‘‘స్టేక్’’ ఎక్కువగా ఉంటుందనేది సహజం. అలాగే షేర్ మార్కెట్ ద్వారా నిధులు సమకూర్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. అయితే ఇదంతా ఒక పూట-రెండు పూటల్లో జరిగే వ్యవహారం మాత్రం కాదు.
ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పెరుగుతాయి. సమాజంలో చలనగతి పెరుగుతుంది. ఆదాయ వనరులు అధికమవుతాయి. దాంతో ఇదొక ‘‘చక్రం’’లా అభివృద్ధికి దోహదపడుతుంది. అన్ని దేశాల్లో దీని ప్రభావం ఒకేలా కనిపించదు. ఈ స్టార్టప్‌ల సంస్కృతి అమెరికాలో ఎక్కువగా కనిపిస్తోంది. వాటిని ఆదుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్స్, ఫండ్స్ అక్కడ ఎక్కువగా దర్శనమిస్తాయి. అవన్నీ ఒక వ్యవస్థలా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది స్టార్టప్ సంస్థలకు ఆర్థిక సాయం అందించిన సంస్థలు అనేకం కనిపిస్తాయి. ఈ వాతావరణాన్ని గమనించి భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వివిధ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. ఆ విధంగా వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎందరో పారిశ్రామికవేత్తలు ఈ పాత్రను పోషిస్తున్నారు. హైదరాబాద్ టీ-హబ్‌లోని అనేక స్టార్టప్ సంస్థలకు రతన్ టాటా స్ఫూర్తిగా నిలిచారు. టీ-హబ్‌ను ఆయన వేనోళ్ళ కొనియాడారు. ఈ రకమైన ప్రోత్సాహకాలు పెరుగుతున్నందువల్ల టీ-హబ్-2 సైతం త్వరలో ప్రారంభం కానున్నది. అందులో వివిధ పారిశ్రామిక సంస్థలు తమ పరిశోధన- అభివృద్ధి (రీసెర్చి- డెవలప్‌మెంట్) కేంద్రాలను ఏర్పాటుచేయనున్నాయి. స్టార్టప్ సంస్థలు, ఈ కేంద్రాలు పరస్పరం స్ఫూర్తి పొందుతూ, లబ్ధిపొందుతూ ముందుకు సాగే అవకాశాలు దండిగా ఉన్నాయి.
రితేష్ అగర్వాల్ అనే ఒడిశా యువకుడి స్టార్టప్ విజయగాథ దేశంలో ఎందరినో ఆకర్షించింది. స్ఫూర్తినిచ్చింది. ఎందరికో ఆయన ఉపాధి కల్పించి ప్రధాని చేత శభాష్ అనిపించుకున్నారు. ఆయన ప్రారంభించిన స్టార్టప్ సంస్థ పేరు- ‘‘ఓయో’’ ఇది ప్రపంచ వ్యాప్తంగా హోటల్ గదులను అందుబాటు ధరలో అవసరమైన వారి అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెంగాల్‌కు చెందిన శుచీ ముఖర్జీ సైతం స్టార్టప్ సంస్థతో ముందుకొచ్చింది. ఆమె అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చి షాపింగ్ పోర్టల్‌ను ప్రారంభించి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఎందరికో ఉపాధిని చూపింది. ఐఐటి ఢిల్లీకి చెందిన కునాల్ బెహల్ తన మిత్రుడు రోహిత్‌తో కలిసి ‘స్నాప్‌డీల్’ను ఏర్పాటుచేసి విజయం సాధించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇందుకోసం పూర్తిగా అంకితభావం (ప్యాసన్) కావాలని వారు అంటున్నారు. ఇలాంటి వ్యాపార ప్రారంభకులు ప్రభుత్వ మద్దతు మరింత ఆశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడటం కన్నా ఉద్యోగాలు కల్పించే (జాబ్ ప్రొవైడర్స్) వారిగా ఎదిగే, ఆత్మవిశ్వాసంతో కదిలే వీరే భవిష్యత్ నిర్మాతలు. ప్రఖ్యాత వాట్సాప్ (ఫేస్‌బుక్) సంస్థ భారతదేశంలోని స్టార్టప్ సంస్థలకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. వివిధ రంగాలకు చెందిన స్టార్టప్ సంస్థల మధ్య పోటీ నిర్వహించి రూ.1.75 కోట్ల బహుమతులను (ప్రోత్సాహకాలను) ప్రకటించింది. స్టార్టప్ ఇండియా- వాట్సాప్ గ్రాండీ ఛాలెంజ్ పేర నిర్వహించిన ఈ పోటీ ఫలితాలను ఇటీవల ప్రకటించింది. విజేతలైన ఐదు సంస్థలకు ఈ మొత్తం అందజేస్తారు. ఒక్కో సంస్థకు రూ.35 లక్షల చొప్పున అందించనున్నారు.
విద్యుత్ రంగంలో వ్యయాలను తగ్గించే అంశంపై కృషిచేసిన మినియన్ ల్యాబ్స్, ఆరోగ్య- సాంకేతిక రంగంలో విశేష కృషిచేసిన మెడ్‌కార్ట్స్, వ్యవసాయ - సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపిన గ్రామోఫోన్, కృత్రిమ మేధ రంగంలో కీలక పురోగతికి పాటుపడుతున్న జాలిస్, వర్చువల్ రియాల్టీ కంటెంట్ విషయంలో పనిచేస్తున్న మెల్జో అంకుర (స్టార్టప్) సంస్థలను వాట్సాప్ విజేతలుగా ప్రకటించింది. మొత్తం స్టార్టప్ వ్యవస్థకు తమ సంస్థ కీలక భాగస్వామిగా నిలుస్తున్నదని వాట్సాప్ (ఇండియా) సంస్థ అధికారి ఇటీవల కొత్త ఢిల్లీలో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాల వల్ల వివిధ రంగాలలో సాంకేతికత, పరిశోధన పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. విస్తరణకు ఈ రెండు అంశాలు కీలకం. ఇక ఉపాధి విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
తన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కాగ్నిజెంట్ సంస్థజెనిత్ టెక్నాలజీస్ సంస్థను కొనుగోలు చేసింది. ఐర్లాండ్‌కు చెందిన ఈ జీవ పరిజ్ఞాన (లైఫ్ సైనె్సస్) తయారీ సాంకేతికతగల జెనిత్ సంస్థ ఔషధ, వైద్య పరికరాల తయారీ- నిర్వహణలో కీలకంగా నిలిచింది. ఈ విశేష పరిజ్ఞానం చేజిక్కించుకోవడం వల్ల కాగ్నిజెంట్ మరింత బలోపేతం కానున్నది, సామర్థ్యం పెరగనున్నది. వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవం అవసరాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది. వర్తమానంలో లైఫ్ సైనె్సస్‌కు అపూర్వ ఆదరణ కనిపిస్తోంది. దీని విస్తృతి సైతం అధికంగా ఉంది. దీన్ని అనుసరించే ఐటీ రంగం అభివృద్ధిని సాధిస్తోంది. ఈ రెండూ పరస్పర ఆధారితాంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాగ్నిజెంట్ సంస్థ జెనిత్‌ను టేకోవర్ చేసింది. ఈ విధంగా సామర్థ్యం గల స్టార్టప్‌లను బడా కంపెనీలు టేకోవర్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వర్తమాన సమాజం ఎలా ముందుకు కదులుతుందో తెలుసుకోవడానికి ఈ పరిణామాలు దోహదపడతాయి.

-వుప్పల నరసింహం 99857 81799