AADIVAVRAM - Others

బాలకవుల కాణాచి - ‘తడ్‌పాకల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు. విశాలమైన పరుపు బండలపై హోయలుపోతూ గలగల సవ్వడితో ప్రవహించే పవిత్ర గోదావరి నది. అంతటి మహిమాన్వితమైన ఆ పుణ్యభూమి బాల కవుల కాణాచిగా మారింది. అంశం ఏదైనా, పారుతున్న నది సవ్వడి చేస్తున్నట్లే ఆ విద్యార్థుల కవిత ఝరులు ప్రవహిస్తాయి. కవితలు రాస్తూ, కథలు అల్లుతున్న ఆ విద్యార్థులు చందోబద్ధంగా పద్యాలు రచించేందుకు సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ ఉన్నత పాఠశాల బాల కవుల కార్ఖానాగా మారింది. ఇప్పటికే జిల్లా, రాష్టస్థ్రాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆ పసికూనలు, తాజాగా, రాష్టస్థ్రాయి కథల పోటీల్లో తమ ప్రతిభను కనబర్చుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. పిల్లల్లో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీస్తే అద్భుత ప్రతిభ చూపుతారని మానసిక నిఫుణులు చెబుతున్న మాటలను ఆ పాఠశాల విద్యార్థులు అక్షర సత్యాలు చేస్తున్నారు. పాఠశాలకు చెందిన తెలుగు భాషా పండితుడు ప్రవీణ్‌శర్మ, విద్యార్థుల్లో దాగిఉన్న రచన సామర్ధ్యాన్ని వెలికి తీయడంతో ఆ పిల్లలు రాసిన కవిత ఝరులు అద్భుత సవ్వడి చేస్తున్నాయి. కవితలు, రచనలు రాయడంలో ప్రవీణ్‌శర్మ చూపిన బాటలో విద్యార్థులు రచించిన అనేక కవితలు ఇప్పటికే ఏడు పుస్తకాలుగా ముద్రించబడ్డాయి. ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభల్లో 4పుస్తకాలను అవిష్కరించిన భాషాభిమానులచే శభాష్ అనిపించుకున్నారు. చిగురు బాలశతకం, గుడుత శతకం, చెట్టు శతకం, చిగురుకొమ్మ, బాల కవితా తరంగాలు తదితర పుస్తకాలన్నీ ఆ చిన్నారి చేతులు రాసిన కవిత సంపుటిలే. వంద కవితలు పూర్తికాగానే పుస్తకాన్ని అచ్చు వేయించుకోవడం ఆ విద్యార్థులకు అలవాటుగా మారింది.
నాన్నా..
నాన్నా అనే శీర్షికపై రజిత 9వ తరగతి విద్యార్థిని రాసిన కవితను చదివితే కళ్లు చెమర్చకమానవు. నవమాసాలు మోయకపోయినా, పురిటి నొప్పులు తెలియకపోయినా కడుపులో పెట్టుకుని మా ఆకలి తీర్చావు. మా విజయానికి ప్రతీసారి నీవే నాన్నా, ఓటమిని ఎత్తుకుని బడుగు జీవుల బతుకు లాగుతున్నావంటూ కొనసాగిన ఆ శీర్షిక విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతోంది. రైతు, ఆటస్థలం, ఆప్యాయత, హరితహారం, సూర్యోదయం, పల్లెటూరు, తెలుగుభాషా ఇలా అనేక శీర్షికలపై విద్యార్థుల కవితా సంపూటిలను చదివిన వారంతా శభాష్ అన్నారు. హైదరాబాద్, సిరిసిల్లా తదితర ప్రాంతాల్లో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కవిత పోటీల్లోనూ బహుమతులు పొంది తడ్‌పాకల్ ఖ్యాతిని సమాజానికి చాటిచెప్పారు. 2017సంవత్సరంలో చిగురు బాల శతకం జాతీయస్థాయిలో ఉత్తమ పుస్తకంగా ఎంపికైంది. తెలుగు మహాసభల్లో అనేకమంది విద్యార్థిని, విద్యార్థులు తమ కవిత ఝరిని వినిపించి, బహుమతులు పొందారు. బాల కవిత తరంగాలను 2013సంవత్సరంలో అష్ఠావధాని గణపతిశర్మ ఆవిష్కరించగా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణకు నోచుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన తెలుగు మహాసభల్లోనూ విద్యార్థుల ప్రతిభను జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభినందించారు. నేటికి కూడా పాఠశాలలో కాలక్రమణ పట్టికలో కొంత సమయాన్ని కవిత రచనలకు కేటాయిస్తూ తీర్చి దిద్దుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ బాల సాహిత్య పరిషత్, ఆనేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ బడిపిల్లల కథల పోటీల్లో తడ్‌పాకల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 450కథలు రాగా, నిర్వాహకులు అందులో 50ని ఎంపిక చేయగా, తడ్‌పాకల్ పాఠశాల విద్యార్థుల 28కథలు అందులో స్థానం సంపాదించాయి. తొలి విడతలో 14కథలను తీసుకున్న నిర్వాహకులు, మలి విడతకు మరో 14కవితలను ఎంపిక చేశారు. త్వరలో ఈ బాలకవులందరినీ హైదరాబాద్ వేదికగా ఘనంగా సన్మానించనున్నారు. ఏ విద్యార్థిని కదిపినా, కవితా ఝరి ప్రవహిస్తునే కనిపిస్తుంది.
ప్రతిభను వెలికితీశాం : ప్రవీణ్‌శర్మ
పాఠశాలల్లో జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించామని, చిన్నపాటి వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తూ శిక్షణ అందించడంతో మరింత చక్కగా కవితలు, కథలు రాస్తున్నారని తెలుగు భాషా ఉపాధ్యాయుడు ప్రవీణ్‌శర్మ తెలిపారు. కొంతమంది విద్యార్థులు చందోబద్ధంగా పద్యాలు కూడా రాస్తున్నారని, త్వరలోనే శతక పద్యాల పుస్తకాన్ని అచ్చు వేయిస్తామన్నారు.
ఉపాధ్యాయుల స్ఫూర్తితోనే...
ఉపాధ్యాయులు అందిస్తున్న సూచనలు, సలహాలు పాటిస్తునే కవితలు రాయగలుగుతున్నామని 9వ తరగతికి చెందిన జాహ్నవి, సమీర్ అనే విద్యార్థులు తెలిపారు. చేయూతను అందిస్తే ఎలాంటి విద్యార్థినైనా నిష్ణాతులైన రచయితలుగా మారుతారని తడ్‌పాకల్ విద్యార్థులు చాటిచెబుతున్నారు.

- ఎస్.శ్రీనివాసమూర్తి 9440786224