Others

5జీ ప్రభంజనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ఇప్పుడు మన అరచేతిలో ఒదిగిపోతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 5జీ మొబైల్ సేవలతో ఇది మరింత తేటతెల్లమవుతోంది. తాజాగా 5జీ ప్రపంచాన్ని కమ్మేస్తున్న టెక్నాలజీ. చైనాలో ఈ సేవలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మన దేశంలో వచ్చే మూడు మాసాల్లో 5జీ మొబైల్ నెట్‌వర్క్‌కు అవసరమయ్యే స్పెక్ట్రమ్ (రేడియో తరంగాలు)ను ప్రభుత్వం వేలం వేయబోతున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియాల్లో అతి త్వరలో పూర్తిస్థాయిలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నది.
తొలి పారిశ్రామిక విప్లవం సందర్భంగా ఆవిరి యంత్రం తీసుకొచ్చిన విప్లవాత్మక పరిణామాల కన్నా బలమైన పరిణామాలను వర్తమానంలో ఈ 5జి టెక్నాలజీ తీసుకురాబోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవన విధానంలో సమూల మార్పులను తీసుకురాబోతోంది. 5జి ద్వారా మన ఇళ్లు, నగరాలు మరింత ‘స్మార్ట్’గా రూపాంతరం చెందబోతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), కృత్రిమ మేధకు మరింత ఆక్సిజన్ అందుతుంది. స్వయం చోదక వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ శతాబ్దపు అతి పెద్ద సమస్యల్లో ఒకటైన ట్రాఫిక్ నియంత్రణకిది ఎంతో ఉపకరించనున్నది. ట్రాఫిక్ డేటా విశే్లషణకు దోహదపడనున్నది. సమాచారాన్ని అందిపుచ్చుకోవడంలో విప్లవాత్మక మార్పులు దీనివల్ల సాధ్యమవుతుంది. వేగంగా సమాచారాన్ని బట్వాడా చేసేందుకు వీలవుతుంది. డేటానే వర్తమాన కాలంలో ఇంధనం, సంపదగా భావిస్తున్న సందర్భంలో దాన్ని వేగంగా బట్వాడా చేయడం అత్యంత కీలకం. ఆ కీలకమైన ప్రక్రియకు ప్రాణవాయువుగా 5జి నిలుస్తోంది. ఇప్పుడున్న 4జితో పోల్చితే 5జి వేగం వంద రెట్లు ఎక్కువగా ఉండగలదని భావిస్తున్నారు.
రష్యాలో 5జి నెట్‌వర్క్‌ను అభివృద్ధిచేసేందుకు చైనాకు చెందిన ‘హువాయ్’ టెలికాం కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. సంవత్సర కాలంలో రష్యాలో 5జి నెట్‌వర్క్‌ను అభివృద్ధిపరచనున్నారు. అమెరికాతో చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యాతో ఈ ఒప్పందం హువాయ్‌ని ఎంతో ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. ఎయిర్‌టెల్ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు, కోల్‌కతాల్లో 5జి సర్వీసుల ప్రయోగాత్మక సేవలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. 5జి సర్వీసులు ప్రారంభించేందుకు దేశాన్ని 22 ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించింది, ఇందులో 10 బ్లాక్‌లుంటాయట.
5జిని సపోర్ట్‌చేసే స్మార్ట్ఫోన్లను సామ్‌సంగ్, గ్జియామి, వన్‌ప్లస్, ఒప్పో తదితర కంపెనీలు మార్కెట్లోకి త్వరలో ప్రవేశపెట్టనున్నాయి. యాపిల్, ఐఫోన్ బ్రాండ్ ఫోన్లు సైతం రానున్నాయి. 5జి ఫోన్ల వాడకంలో చైనా అగ్రభాగాన ఉండగలదన్న అంచనాలున్నాయి. వచ్చే ఐదేళ్ళలో మొత్తం ప్రపంచంలో 5జి కనెక్షన్లలో 40 శాతం కేవలం చైనాలో ఉండగలవని భావిస్తున్నారు. చైనా అగ్రభాగాన నిలిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. అమెరికాను సైతం ఈ విషయంలో వెనక్కి తోసేసి దూసుకుపోనున్నది. వచ్చే దశాబ్దకాలంలో చైనా ఈ రంగంపై 411 బిలియన్ డాలర్లను ఖర్చుచేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడగలదని భావిస్తున్నారు.
బ్రిటన్‌లోని బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బరో, లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ తదితర నగరాలలో ఇప్పటికే 5జి మొబైల్ సేవలు అందుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సిగ్నల్స్ సమస్య ఎదురవకుండా సమాచారాన్ని సవ్యంగా ఇచ్చిపుచ్చుకునేందుకు 5జి ఎంతో ఉపయోగపడుతుందని వినియోగదారుల అభిప్రాయం. సమాచారం సూపర్ ఫాస్ట్‌గా బట్వాడా అవుతోందని, ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగిందని, డౌన్‌లోడ్ గతంలోకన్నా ఎంతో వేగంగా జరుగుతోందని అంటున్నారు.
రోబోటిక్స్, కృత్రిమ మేధ, వర్చువల్ రియాల్టీ, ఆగ్మెటెండ్ రియాల్టీ మరికొన్ని అంశాలకు ఈ టెక్నాలజీ ఎంతో మేలుచేస్తుందని, డ్రోన్ల వాడకంలో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటాయని, భవిష్యత్ సాంకేతికతకు ఇది మరింత వెన్నుదన్నుగా నిలుస్తుందని, దీనివల్ల ఎల్లలు లేని ప్రయోజనాలు ప్రజలకు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇ.ఇ. అనే నెట్‌వర్క్ కంపెనీ ఇప్పుడు 5జి సేవల్ని బ్రిటన్‌లో అందిస్తోంది. ఇంకా అనేక కంపెనీలు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి.
అమెరికాలో 5జి ప్లస్ సర్వీసులు అట్లాంటా, ఇండియానా పోల్స్, న్యూఓర్లీన్స్, హూస్టన్ తదితర నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఎ.టి. అండ్ టి కంపెనీ ఈ సర్వీసులను అందిస్తోంది. చాలా నగరాల్లో ఇప్పుడిప్పుడే 5జి టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. చైనా, బ్రిటన్‌లో కన్నా ఈ విషయంలో అమెరికా నగరాలు కొంత వెనుకబడి ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సర్వీసు ప్రొవైడర్లు, 5జిని సపోర్టుచేసే ఫోన్లు విస్తృతంగా లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే పరిస్థితి వేగంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక జపాన్‌లో వచ్చే సంవత్సరం పెద్దఎత్తున 5జిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డొకొమో, సాఫ్ట్ బ్యాంక్, రకుటెన్, కెడిడి కంపెనీలకు జపాన్ ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. వాణిజ్యపరంగా సేవలు అందించేందుకు ఈ సంస్థలు సర్వసన్నద్ధమవుతున్నాయి. ప్రధాన మెట్రోపాలిటిన్ నగరాలలోనే గాక గ్రామీణ ప్రాంతాలలోనూ సర్వీసులు అందించేందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ సంయుక్తంగా 5జి సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. జపాన్ ఆంతరంగిక వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ శాఖ దేశాన్ని 4,500 బ్లాకులుగా విభజించి స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. 2016 సంవత్సరంలోనే టోక్యోలో ఈ 5జి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించి విజయం సాధించారు. అనంతరం ఆయా సంస్థలు తమతమ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసుకోవడంలో మునిగిపోయాయి. బ్రిటన్, చైనా దేశాలు 5జి సేవలు ప్రారంభించడంతో జపాన్ సైతం ఆ జాబితాలో త్వరగా చేరేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తోంది. భారత్ పరిస్థితి సైతం ఇలాగే ఉంది. మన దేశంలో వచ్చే సంవత్సరమే పెద్దఎత్తున 5జి సేవలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌టెల్ సంస్థ తొలుత కొన్ని నగరాల్లో 5జి సేవలు అందిస్తున్నప్పటికీ ఆ సేవలు విస్తృతమవడానికి మరికొన్ని నెలల కాలం పట్టనున్నది. 5జిపై మరింత మెరుగైన సాంకేతిక పద్ధతులను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈనెలాఖరులో చైనాలోని షాంఘై నగరంలో ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-19’ జరగనున్నది. ఇందులో వందలాది కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసియా, యూరప్, అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన అభివృద్ధి సంస్థలు ఆ సమ్మేళనం సందర్భంగా వివిధ సదస్సుల్లో, ప్రదర్శనల్లో పాల్గొననున్నాయి. దీని ప్రభావం ఆసియా ఖండంపై ప్రబలంగా ఉండగలదని భావిస్తున్నారు. ఈ 5జి ప్రభంజనాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఈ ‘కాంగ్రెస్-19’ దోహదపడగలదని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ప్రజలు సరికొత్త విప్లవం అంచున నిలుచున్నారనడంలో అతిశయోక్తి ఇసుమంత కూడా కనిపించడం లేదు.

-వుప్పల నరసింహం 99857 81799