Others

విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పు పలువురిని ఆశ్చర్య భరితులను చేసింది. ప్రభుత్వ కొలువులో ఉన్న గ్రామ సేవకుడి నుండి జిల్లా కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఆ తీర్పు సారాంశం. ఇది నిజంగా అమలైతే విద్యాభివృద్ధికి కృషిచేసినట్లే. అయితే ఆచరణలో ఇది సాధ్యమయ్యేనా? అన్న సందేహాలు లేకపోలేదు. సాధారణ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపకుంటే సంక్షేమ పథకాలకు వారిని అనర్హులుగా చేయాలన్న ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ ఆచరణలో సాధ్యమైతే- విద్యావ్యాపారాన్ని నిర్వహించేవారు ఊరుకుంటారా? ప్రస్తుతం దేశంలో దండిగా లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారం ఏదన్నా ఉందంటే అది విద్యారంగమే అన్నది వాస్తవం.
ఎలాంటి సంస్కరణలైనా ఆచరణలో అమలు కావాలంటే అది పాలకులపైనే ఆధారపడి ఉన్నది. మన నేతలు ఇంతటి సాహసానికి పూనుకుంటారంటే నమ్మలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే అధ్యాపకులు మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం ఉంది. కానీ గల్లీకొక ప్రైవేటు పాఠశాల వెలసి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మొత్తం విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో అవకాశం కల్పించి, తగినంత మంది సిబ్బందిని నియమించి, వౌలిక సదుపాయాలను కల్పించడానికి వీలవుతుందా?
ఉద్యోగులు వారి పిల్లలను తమకిష్టమైనచోట చదివించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని ఒత్తిడి చేస్తే, వారు తమ హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు కదా? అంటే పేదలు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలను మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఇదో ప్రయత్నమా? నేడు తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించడానికంటే, తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ప్రభుత్వ బడులపై ఆసక్తి పెంచుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఉన్నత స్థానాలను అధిరోహించినవారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించారు. అప్పుడు ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసేవారు. గతంలో ఇంతగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు లేవు. పోటీ నామమాత్రంగానే ఉండటం మూలంగా ప్రభుత్వ కొలువులు పొందడం సులభంగా ఉండేది. నేటి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ఉపాధ్యాయ కొలువులు సాధించడానికి రేయింబవళ్ళు కష్టపడి చదివి, పో టీపరీక్షలో నెగ్గితే ఆ అదృష్టం కొంతమందికే కలుగుతుంది. తీరా ఉద్యోగం పొందాక, ఎక్కువ శాతం ఉపాధ్యాయులు నామమాత్రంగానే విధులు నిర్వర్తిస్తూ, రోజులో ఎక్కువ భాగాన్నీ వారి వ్యక్తిగత పనుల కోసం కేటాయిస్తుంటారనడంలో అతిశయోక్తి లేదు. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారంటే ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థ సత్ఫలితాలను ఇవ్వడం లేదని అర్థమవుతుంది. మిగిలిన వర్గాల్లోనూ ఇదే విధమైన భావన ఉంది. అయితే, నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు అక్కడక్కడా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులందరూ ఇలాంటి భావన కలిగి ఉంటేనే ప్రభుత్వ పాఠశాలలపై సాధారణ ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
ఏటా జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే దశలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు- ‘అనుమతి లేని పాఠశాలలను రద్దుచేయాలని, ఫీజులను తగ్గించాలని, పిల్లలపై ఒత్తిడి చేయకూడదని, పుస్తకాల బరువును తగ్గించాల’ని ఆందోళనలు చేయడం తప్పనిసరి తంతులా మారింది. ఈ ఆందోళనలను ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని, విద్యా ప్రమాణాలను పెంచుతామని పాలకులు హామీ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు సైతం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఒత్తిడి తగ్గించాలని వివిధ ఆందోళన కార్యక్రమాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ఇప్పటికైనా ఫీజుల పేరిట డబ్బు గుంజుతున్న ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారమయం చేసేవారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కేవలం ప్రకటనలకే పరిమితంగాకుండా ఆచరణలో సాధ్యమయ్యే సంస్కరణలను ప్రభుత్వం చేపట్టాలి.

-డా. పోలం సైదులు 94419 30361