Others

‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర పార్టీల బలాలను, బలహీనతలను అందిపుచ్చుకోవడంలో అందెవేసిన చేయి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. తెలంగాణ రాష్ట్ర సాధనలోను, శాసనసభ ‘ముందస్తు’ ఎన్నికల్లోను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్న ఆయన ఇపుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. థర్డ్‌ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్, మూడవ ఫ్రంట్ తదితర పేర్లతో- భాజపా రహిత, కాంగ్రెస్సేతర పక్షాలను ఏకం చేసే నాయకుడిగా తన ప్రయత్నాలను ఆయన ఇప్పటికే ప్రారంభించారు. ఈ పనిలో భాగంగా కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్, వైకాపా అధ్యక్షుడు జగన్ వంటి నేతలను కేసీఆర్ కలిశారు. ఇతర రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతలు పిలవకపోయినా, తనకు తానే వివిధ ప్రాంతాలకు వెళుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంకేతాలను బలంగా ఇస్తున్నారు.
కేసీఆర్ చెబుతున్నట్లు నిజానికి దేశంలో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం ఉందా? అది పురుడు పోసుకుందా? కేసీఆర్ సహా మరో ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎవరైనా ఫెడరల్ ఫ్రంట్ గూర్చి మాట్లాడారా? భాజపా లేని, కాంగ్రెస్ లేని కూటమి ఆవశ్యకత గూర్చి దేశంలో ప్రాంతీయ పార్టీల మధ్య సూత్రప్రాయమైన అంగీకారమైనా కుదిరిందా? చర్చ అయినా జరిగిందా? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానం దొరకదు. పోనీ, థర్డ్‌ఫ్రంట్ పేరుతో కొద్దిపాటి నిర్మాణమైనా చేశారా? ఫ్రంట్‌లో తాము ఉంటామని ఏ ఒక్క నాయకుడైనా భరోసా ఇచ్చాడా? మరి కేసీఆర్ ఒక్కడే థర్డ్‌ఫ్రంట్ బోర్డు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నట్టు? ఈ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి- ఏ ప్రధాన పార్టీ ప్రయోజనాలను కాపాడబోతున్నట్లు? కేసీఆర్ వెనుక దాగున్న నేత ఎవరు? ఇవన్నీ అనుమానించాల్సిన అంశాలే.
గతంలోనూ మన దేశంలో ఎన్నో ఫ్రంట్‌లు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్, వీపీ సింగ్‌ల నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్, ఆ తరువాత చంద్రబాబు, అమర్‌సింగ్ సారథ్యంలో భాజపా రహిత, కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పడ్డాయి. ఆనాటి పరిస్థితులలో నేషనల్ ఫ్రంట్ విజయవంతం కాగా, థర్డ్‌ఫ్రంట్ విఫలమైంది. ఇపుడు భాజపా, కాంగ్రెస్ పార్టీలు బలమైన పార్టీలుగా ముందుకు వచ్చాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు గానీ, కాంగ్రెస్‌కు గానీ ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సీట్లు లభించవనేది పలు ప్రాంతీయ పార్టీల నమ్మకం. కొన్ని సర్వేలు సైతం ఇదే అంశాన్ని వ్యక్తం చేశాయి. ఇపుడున్న ఎన్డీఏ, యూపీఏ కూటములతో చాలా ప్రాంతీయ పార్టీలు జతకట్టాయి.
ప్రాంతీయ పార్టీలు నిబద్ధతతో, క్రమశిక్షణతో సంబంధిత కూటమిలోనే ఉండాల్సిన పని లేదు, అలాంటి నియమమూ లేదు. అలాంటప్పుడు తమ పార్టీ చెప్పుకోదగ్గ రీతిలో ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటే- రాజకీయంగా తాను బలపడవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్డీఏకు తగినన్ని సీట్లు రాని పక్షంలో తాము కీలక పాత్ర పోషిస్తామని ఆయన అంచనా వేస్తున్నారు. భాజపాకు కొన్ని లౌకిక పార్టీల నుండి నేరుగా మద్దతు లభించనందున, కెసిఆర్ థర్డ్‌ఫ్రంట్ రూపంలో లౌకిక పార్టీల మద్దతును పొంది, తద్వారా మోదీ ప్రయోజనాలను నెరవేర్చవచ్చునన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఆలోచనతోనే ప్రధాని మోదీ తెలంగాణలో కేసీఆర్ కోరుకున్నట్లు ముందస్తు ఎన్నికలకు సహకరించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. భాజపాతో గానీ కాంగ్రెస్‌తో గానీ చేతులు కలపడం కన్నా- మూడవ శక్తిగా ఉంటే కలిగే ప్రయోజనాలు బహుముఖంగా ఉంటాయన్నది కేసీఆర్ ఆలోచన కావచ్చు.
దీనికితోడు పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రీత్యా అటువైపుగా వెళ్ళటం కేసీఆర్‌కు గిట్టదు గాక గిట్టదు. చంద్రబాబుతో రాజకీయ విభేదాలు, రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా ఉన్నందున తామే కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి చేరుకుంటే తన రాజకీయ సుస్థిరతకు తిరుగుండదనేది కేసీఆర్ ఆలోచన. చంద్రబాబుకు శత్రువైన జగన్ కూడా కేసీఆర్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్లనే ఫెడరల్ ఫ్రంట్‌కు కర్త, కర్మ, క్రియ కేసీఆరే అయ్యారు. అవకాశం కలసి వచ్చి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో ప్రవేశిస్తే, తెలంగాణలో పగ్గాలను ఆయన కుమారుడు కేటీఆర్ చేపట్టే పరిస్థితులు రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

-పోతుల బాలకోటయ్య