Others

ఆరోగ్య కేంద్రాలకు సుస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం రోగులకు వ్యవస్థీకృత వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అర్హత లేని వైద్యులను ఆశ్రయించడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ‘అందరికీ ఆరోగ్యం’ అనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వ నిధులతో అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించడానికి మూడంచెల ఆరోగ్య సేవా కేంద్రాలను నెలకొల్పారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను వివిధ స్థాయిలలో జనాభా ప్రాతిపదికగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడంలో కీలక భూమిక వహిస్తున్నాయి. వైద్యులకు, సమాజానికి మధ్య మొట్టమొదటి సంప్రదిత కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వ్యాధులపై సమగ్ర అవగాహన కల్పిస్తూ, వ్యాధి నిర్థారణ, నివారణకు కృషి చేస్తాయి. ఇవి- పునరావాస సేవలను అందించే సమగ్ర ఆరోగ్య సేవా కేంద్రాలు అని ‘జాతీయ ఆరోగ్య విధానం-2017’ స్పష్టంగా పేర్కొన్నది. గనుక గ్రామీణ భారతానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.
జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో ఈ ఏడాది జనవరి నాటికి 33,235 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడానికి, అంటువ్యాధులు నివారణకు, కుటుంబ నియంత్రణ ప్రణాళికలు అ మలు పరచడానికి, మాతా శిశు సంరక్షణ, వ్యాధులపై సమాచార సేకరణ, వాస్తవాలను నివేదించడం, రోగులకు ప్రాథమిక పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య కార్యక్రమాలను కింది స్థాయిలో అమలుపరచడం, ప్రజారోగ్యంపై ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ, మార్గనిర్దేశం చేయడం లాంటి గొప్ప లక్ష్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించడం ఈ కేంద్రాల ప్రధాన కర్తవ్యం. కానీ, నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గర్భిణుల సంరక్షణ, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య కార్యక్రమాలపై ప్రచారం వంటి పనులకే పరిమితమై సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో వైఫల్యం చెందాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సేవలపై నమ్మకం కోల్పోయి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడం అనివార్యమైంది. ప్రైవేటు ఆస్పత్రులలో వైద్య ఖర్చులు భరించలేక పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధారణ వైద్య సేవలను సైతం అందించడంలో వైఫల్యం చెందుతున్నాయి. మందుల కొరత, రోగ నిర్థారణ పరీక్షలకు అరకొర సౌకర్యాలు, అపరిశుభ్ర వాతావరణం, వౌలిక వసతుల లేమి, ఆధునిక వైద్య పరికరాలు, అంకితభావం కలిగిన డాక్టర్లు, సిబ్బంది లేకపోవడం ఇందుకు కారణాలవుతున్నాయి. కొన్ని ఆరోగ్య కేంద్రాలలో రెగ్యులర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు, కాంపౌండర్లు రోగులను పరీక్షించడం, మందులను సూచించడం కనిపిస్తుంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఫలితంగా అవి వెలవెలబోతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా పారదర్శకత లోపించి ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు రోజురోజుకూ విశ్వాసం సడలిపోతోంది. దీంతో చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రథమ చికిత్స కేంద్రాలుగా మారాయి.
ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను ఉచితంగా అందించడం ప్రభుత్వం బాధ్యత. వైద్యసేవలను పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో 21వ ప్రకరణలో స్పష్టంగా పేర్కొన్నారు. గనుక ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడానికి తగిన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి ఆరోగ్య కేంద్రానికి వైద్యులను, సిబ్బందిని కచ్చితంగా నియమించాలి. వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోగ నిర్థారణ పరీక్షలకు తగిన వసతులను ఏర్పాటు చేయాలి. సీజనల్ వ్యాధులను నివారించేందుకు వైద్య సిబ్బందిని, మందులను ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి. అంబులెన్స్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచి, అత్యవసర సమయాల్లోనూ వైద్య సదుపాయాలు కల్పించాలి. వైద్యసేవలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలి.
వ్యాధులపై, పారిశుద్ధ్యంపై అవగాహన శిబిరాలను గ్రామాల్లో తరచూ ఏర్పాటు చేసి, వైద్య సిబ్బంది ప్రజలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను పటిష్టంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2017 జాతీయ ఆరోగ్య విధానంలో ప్రకటించినట్లుగా ప్రజారోగ్యంపై చేసే వ్యయాన్ని స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతానికి పెంచాలి. ఆ మేరకు ఏటా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల్లో ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు జరగాలి. ఇలా చేసినపుడే ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి గట్టి కృషి జరిగి, ‘ఆరోగ్య భారత్’ నిర్మాణానికి గట్టి పునాది పడుతుంది. సార్వత్రిక ఆరోగ్య రక్షణ కల సాకారం అవుతుంది.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367