Others

‘కార్పొరేట్’ రంగంలోకి కార్మిక లోకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిగంటల తగ్గింపు కోసం అమెరికాలోని చికాగోలో 1884లో కార్మికులు జరిపిన ఆందోళన-సమ్మెల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మే 1న ‘కార్మిక దినోత్సవం’ (మేడే)గా ప్రకటించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ఆనాటి సమ్మె- ఆందోళన స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
దాదాపు 140 ఏళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. ఆనాటి పొగ గొట్టాలు, అపరిశుభ్ర వాతావరణం, మురికి కూపాలు అగుపించవు. అది ప్రథమ పారిశ్రామిక విప్లవం తొలినాళ్ళ నాటి ముచ్చట. వర్తమానంలో నాల్గవ పారిశ్రామిక విప్లవం కొనసాగుతోంది. పనిగంటల తగ్గింపుకోసం కార్మికులు పోరాడిన సమయానికి, ఇప్పటి సమయానికి హస్తిమశకాంతరముంది. కార్పొరేట్ రంగంలో కార్మిక లోకం భాగస్వామ్యం అనూహ్యంగా పెరిగింది.
సమాజంలో కార్మిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం మాత్రమే ఉన్నాయని ప్రబోధించే కమ్యూనిస్టులు (మార్క్సిస్టులు) కార్మిక దినోత్సవాన్ని నిన్నమొన్నటి వరకు ‘కమ్యూనిస్టుల దినోత్సవం’లా జరిపారు. తమ భావజాల వ్యాప్తికి ఇచ్చిన ప్రాధాన్యత కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఇవ్వలేదన్నది యదార్థం. దాంతో కార్మికులు క్రమంగా వారి ఉక్కు కౌగిలి నుంచి, పిడికిలి నుంచి విడివడి తమ సమస్యల పరిష్కారానికి వివిధ కార్మిక సంఘాలలో సమీకృతమవుతున్నారు. కమ్యూనిస్టులు జరిపే కార్మిక దినోత్సవం ఏటా ఓ తంతులా జరుగుతోంది తప్ప అందులో ‘కార్మికుల ఆత్మ’ కనిపించదు. ఇందుకు సమాజంలో మారిన పరిస్థితులను ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.
సమాజంలో రెండు వర్గాలున్నాయన్న మార్క్స్ ప్రతిపాదన, సిద్ధాంతం పలచబడింది. లోకంలో ప్రజలు మాత్రమే ఉన్నారని వారి వ్యాకోచ, సంకోచాలే అనేక పరిణామాలకు కారణమని తేటతెల్లమవుతోంది. మార్క్సిస్టులు- కమ్యూనిస్టులు దీన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. గత 150 ఏళ్లుగా ఇదే వైఖరితో కొనసాగుతున్నారు. భారతదేశంలో గత 90 ఏళ్లుగా ఇదే ధోరణిలో నడుస్తున్నారు.
మార్క్స్ జననానికి ముందు శ్రమ ఉంది.. సమాజముంది, ఆయన మరణానంతరమూ శ్రమ- సమాజముంది. ఇకపై కూడా ఉంటుంది. అయితే ఆయన ప్రతిపాదించిన రెండు వర్గాలుగా గాక అద్వైత (రెండు కానిది) రూపంలో సమాజం కనిపిస్తుంది, కొనసాగుతోంది. దీన్ని పట్టుకోవడంలో మార్క్స్ విఫలమయ్యాడు, అనంతరం ఆయన అనూయాయులు ఆ అద్వైత రూపాన్ని అంగీకరించేందుకు సుతరాము అంగీకరించడం లేదు. అంటే వాస్తవానికి దూరంగా జరిగి సిద్ధాంతీకరించి శ్రామికుల పేర పిడివాదంతో ప్రజలను ఆకర్షించాలనుకుంటే ఎలా? మూస పద్ధతిలో నూట పాతికేళ్లుగా కొనసాగితే అందులో అర్థమేమైనా ఉందా? కొన్ని వేల సంవత్సరాల మానవ చరిత్రను తొలి పారిశ్రామిక విప్లవం మార్చేసింది. ఆవిరి యంత్రం మానవ ఆలోచనా విధానాన్ని సరికొత్త ఎత్తుకు చేర్చింది. ఆ కల్లోల పరిస్థితుల సమయంలో ఆచరణ సాధ్యమా? కాదా?? అని సరిచూసుకోకుండా ఆవేశంతో రెండు వర్గాల సిద్ధాంతాన్ని మార్క్స్ ప్రతిపాదించి, కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టి, వారిలో ద్వేషం నింపి తమ సిద్ధాంత వ్యాప్తికి పడరాని పాట్లు పడ్డారు. చివరికి ఏ పారిశ్రామిక సమాజాలలో తమ పలుకుబడి పెంచుకుని విస్తరించారో అక్కడే బొక్కాబోర్లాపడ్డారు. రష్యా, తూర్పు యూరప్, చైనా, లాటిన్ అమెరికా తదితర దేశాలలో మార్క్సిజం... రెండు వర్గాల సిద్ధాంతం కుప్పకూలిన ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడూ రెండు కానిది (అద్వైతం)గా ఉంటుందని తేటతెల్లమైంది. రెండు వర్గాల సిద్ధాంతాన్ని గట్టిగా విశ్వసించి, రాజ్యాధికారంలోకి వచ్చిన చైనా సైతం- ‘పిల్లి తెల్లదైతేనేమి, నల్లదయితేనేమి ఎలుకను పట్టడమే ముఖ్యం’ అన్న మాటతో అద్వైతాన్ని అంగీకరించి ఇప్పుడు ప్రపంచంలోనే ప్రభావశీల దేశంగా వెలుగొందుతోంది.
కార్మిక దినోత్సవపు తొలినాళ్ళ పోరాట పటిమ, మిలిటెన్సీ, హింసకు దిగి పెట్టుబడిదారుల నడ్డి విరవాలన్న ‘కసి’ ఇప్పుడు రూపాంతరం చెందాయి. కాని మన దేశంలోని చాలా కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా మావోయిస్టు పార్టీ మాత్రం ఆ కసిని ద్విగుణీకృతం చేసి, మిలిటెన్సీని ముమ్మరం చేసి తమ ‘కల’ను సాకారం చేసుకోవాలని ఆరాటపడుతోంది. వారి ‘కల’లో కార్మికుల ‘కలలు’ గల్లంతవుతున్నాయన్న మాట విస్మరించరానిది. చైనాలోని కార్మికుల మాదిరి అన్ని విధాలా ఎదగాలని భారతదేశ శ్రమజీవులు ఆకాంక్షిస్తున్నారు. మరి చైనా అనుసరిస్తున్న విధానాలేమిటి? భారతదేశ కమ్యూనిస్టులు, మావోయిస్టులు ప్రబోధిస్తున్నదేమిటి? అని యోచించాలి కదా?
మారిన నేటి పరిస్థితులకనుగుణంగా, నాల్గవ పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన మార్పులనుసారంగా విధానాలుంటే ఎవరైనా స్వాగతిస్తారు? అలాగాక తొలి పారిశ్రామిక విప్లవం నాటి ధోరణిలో నినాదాలు ఇస్తూ, ఊరేగింపులు జరుపుతూ, ఉద్యమాలకు సన్నద్ధమవుతే కార్మిక (శ్రామిక) లోకం కాలానుగుణంగా ఎదుగుతుందా? కార్మిక- కర్షక సంక్షేమం వెనుక తట్టులోకి పంపి, తమ భావజాల వ్యాప్తిని, రాజ్యాధికారకాంక్షను ముందుపెట్టి పోరాటాలు చేయడం ఎవరికి శ్రేయస్కరం? ప్రతి ఐదు- పది సంవత్సరాలకు ప్రపంచం మారుతోంది. గతంలో వందల- వేల సంవత్సరాలలో కనిపించని మార్పు ఇప్పుడు కేవలం దశాబ్దాలోనే చోటుచేసుకుంటోంది. ఉత్పత్తి విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం కార్మికులే పని చేయాల్సినచోట ఇప్పుడు రోబోలు, యంత్రాలు పనిచేస్తున్నాయి. అందరి ఎరుకలో ఉన్న ఈ విషయాలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా ఆవిరి యంత్రాల కాలం నాటి నినాదాలు ఇస్తే అర్థం ఉందా? ‘పోరాడితే పోయేది ఏమీ లేదు.. సంకెళ్లు తప్ప!’ అన్న నినాదం ఇప్పుడు ప్రాసంగికమైనదేనా?
మొత్తం సమాజం ‘రీ డిజైన్’ అయిన వేళ, 5జీ టెక్నాలజీతో మరింత వేగం సమాజంలో కనిపించనున్న సందర్భంలో, శ్రామికులు ‘వాటాల’ రూపంలో వివిధ కార్పొరేట్ సంస్థల షేర్లు కొనుగోలు చేసి లాభపడుతున్న నేపథ్యంలో, తమ సంతానాన్ని కార్పొరేట్ సంస్కృతికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్న సమయంలో కొన్ని నిచ్చెన మెట్లు పైకి ఎక్కి నిల్చున్న నేటి కార్మిక వర్గానికి అందించాల్సిన మార్గదర్శకత్వం ఎలా ఉండాలో నేటి కమ్యూనిస్టు పార్టీలు యోచిస్తున్నాయా? లేదనే సమాధానమొస్తోంది. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు అనుసరించిన విధానాలనే ఇంకా పట్టుకుని పాకులాడితే ఆ విధానం ఇప్పుడు ప్రజలకు మేలు చేస్తుందా? అన్న ప్రశ్న వేసుకుని వివేకవంతమైన సమాధానం చెప్పుకోవాలి కదా?
గత మూడు దశాబ్దాల కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. బెర్లిన్ గోడ కూలిన లగాయతు, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనది ఆదిగా, ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ ప్రపంచాన్ని కమ్మేసిన వేళ అవేమీ కనిపించనట్టు, వర్తమానంలో డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ ఎకానమీ వర్ధిల్లుతున్నా పట్టించుకోక- అదే మిలిటెన్సీ, అదే ద్వేషం, అదే కసి, అవే పోరాటాల వల్ల శ్రామికులకు ఒరిగేది ఏమిటి? ‘హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా’ అని గత అనుభవాలు చెబుతున్నా చెవిన పెట్టకపోతే ఎలా?
కార్మిక లోకం స్వచ్ఛందంగా, లోకం పోకడను అర్థం చేసుకుని, ఇరుగు- పొరుగును చూసి కొత్తదారుల వెంట కదులుతోంది. ఈ లోకంలో రెండు వర్గాలు లేవని చాటుతోంది. ఉన్నది ‘అద్వైతమే’నని విశ్వసించి ఆ మార్గంలో పయనిస్తోంది. అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇదే! అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఎందరో తమ ప్రతిభ, జ్ఞానం, పరిజ్ఞానం ఆధారంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఎన్నో ఆవిష్కరణలకు తెర దీసి కుబేరులవుతున్నారు. అమెరికాలోనే కాదు భారతదేశంలోనూ ఈ దృశ్యమే కనిపిస్తోంది. దళితుల్లోనూ ఎందరో కోటీశ్వరులున్నారు. ‘డిక్కీ’ ద్వారా ఇంకా, ఇంకా పైకి ఎగబాకుతున్నారు. దీనివల్ల ఏమర్థమవుతోంది? ఇప్పుడు ఒకరిపై ద్వేషాన్ని వ్యాపింపజేసే ఎర్రజెండా కాదు, జ్ఞాన చక్షువులను విప్పార్చే విజ్ఞాన జెండా చేపట్టాలని చెప్పకనే చెబుతోంది కదా? మారిన కాలమాన పరిస్థితులకనుగుణంగానే కార్మిక లోకం కదం తొక్కాలి తప్ప ఈ ‘మేడే’ సందర్భంగా కల్లబొల్లి నినాదాల- సిద్ధాంతాల జోలికి వెళ్ళకపోవడమే మేలు!

-వుప్పల నరసింహం 99857 81799