Others

భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వర్తమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం
*
‘క్షమయా ధరిత్రీ’ అంటే సహనానికి భూదేవి. ప్రస్తుత 21వ శతాబ్ద ద్వితీయ దశకంలో మానవ మనుగడకు ప్రాణాధారమైన భూమి పర్యావరణ విధ్వంసంతో ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా మనిషి జీవించే ఆయుర్దాయం వంద సంవత్సరాల లోపు కావటంతో, బతికినంతకాలం శృతిమించిన అవసరాల విలాస జీవనయానం కోసం అత్యాధునిక మానవుడు తన కాళ్ళకింద నేల తవ్వుకొంటూ, తాను కూర్చున్న చెట్టుకొమ్మ తానే నరుక్కుంటూ, పీల్చేగాలిని కాలుష్యభరితంగా ఊపిరి సలపకుండా చేసుకొంటూ, ప్రకృతి వైపరీత్యాలను ఆహ్వానిస్తూ తన ఆయుష్షును తానే క్షీణింపజేసుకొంటున్నాడు.
పర్యావరణానికి తూట్లుపడేటట్లు భూతాపం పెరిగే విపత్కరతకు మనిషి బాధ్యుడై ప్రకృతి వైపరీత్యాల మహోత్పాతాన్ని ఎదుర్కొంటూ మృత్యుసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. మాతృమూర్తిగా ఆరాధించుకోవలసిన భూమాతను విధ్వంసకరమైన తాపం పెరిగే అధునాతన అరిష్టాల జీవన విధానాలకు బానిసలై క్రుంగదీస్తూ మన మనుగడకే పెనుప్రమాదం సృష్టించుకొంటున్నాడు.
భూతాపం కారణంగా హిమాలయాలు కరిగిపోతున్నాయి. నదులలో జీవ జల సంపద క్షీణించటమే కాకుండా కాలుష్యం కోరలలో చిక్కుకొంటున్నాయి. అడవులు, జీవులు అంతరించిపోయేటట్టు, అభివృద్ధి పేరిట ప్రకృతిని అవసరాలకు మించిన దురాశ, వ్యామోహంతో భూమిని సాధ్యమైనంత విధ్వంసకరకంగా వికృతం చేస్తున్నాం. సముద్రాల నీటి మట్టాలు పెరిగి భూ జనవాసాలపై విరుచుకుపడుతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటంతో వరదలు, కరువు కాటకాలు, తుపాన్‌లు, భూకంపాలు, సునామీలు, అతివృష్టి, అనావృష్టి వైపరీత్యాలతో జన జీవనం అతలాకుతలమవుతోంది. ఆహారోత్పత్తి అవరోధాలు, అంటువ్యాధులు, బలవర్థక ఆహార లోపాలు, త్రాగునీటి కాలుష్యం, సామాన్యుని నుంచి సంపన్నుని వరకు జీవన సంక్షోభం తప్పటంలేదు. భూగ్రహాన్ని జీవింపజేసే శాస్ర్తియ, సాంకేతిక ప్రగతి సాధించటానికి ప్రకృతి వనరులు సద్వినియోగం, దురాశ వ్యామోహం శృతిమించటం కారణంగా ప్రకృతి సహజవనరుల దోపిడీ యథేచ్చగా కొనసాగుతోంది.
రేపటి మనుగడ..
‘‘భూమి, గాలి, నేల, నీరు వంటి ప్రకృతి వనరులు మనకు పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన సంపద కాదు. మన చిన్నారుల దగ్గరనుంచి వాటిని అప్పుగా తీసుకొని అనుభవిస్తున్నాం. ఆ రుణాన్ని మనం యథాతథంగా తీర్చాలి. అంటే రానున్న భవిష్యత్తు తరాలకు ఆ సంపద అప్పగించేటట్టు మనం జీవించాలి’’ అన్నారు మహాత్ముడు. కానీ ప్రస్తుతం ఆ స్థితిగతులు లేవు. గాంధీజీ సందేశం ప్రకారం ప్రతి మనిషి అవసరాలు సంతృప్తిగా తీరటానికి సరిపడే వనరులను ప్రకృతి సమకూర్చింది. కాని అధునాతన సమాజం తత్కాల తాత్కాలికంగా భవిష్యత్ తరాల పిల్లల ప్రకృతి సంపదను కొల్లగొట్టి బతకటం తప్ప వారికి భవిష్యత్‌లో సంభవించనున్న విపత్కర పరిణామాలను అరికట్టే సత్సంకల్పం లేదు. అందువలన ఈ రోజు మన బతుకు రేపటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది.
ప్రస్తుత ప్రపంచం ‘న్యూ డేంజర్ జోన్’లో అడుగుపెట్టింది. నేల, నీరు, చెట్టు, పిట్ట జీవ చైతన్యాన్ని కోల్పోతోంది. వికృత నిర్జీవ వ్యవస్థ సర్వత్రా తాండవిస్తోంది. భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్‌డై ఆక్సైడ్ వంటి విధ్వంస కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుతోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టుగా అభివృద్ధి పేరిట ప్రభుత్వాధి నేతలు, సంపన్న సమాజం జనావళికి మృత్యుముఖం వైపు నెట్టేస్తోంది. ఢిల్లీ వంటి దేశరాజధాని నగరాలలో పీల్చేగాలి కాలుష్యం కారణంగా ఊపిరి పీల్చుకొనే కాలుష్య సమస్యలు పీడిస్తున్నాయి. గంగానదివంటి పవిత్ర నదులు కాలుష్యపు కోరలలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. నగరాలు, పల్లెలు తీవ్రమైన త్రాగునీటి సమస్యలతో సతమతమవుతున్నాయి. మూసీ, హుస్సేన్ సాగర్ వంటి జల కాలుష్యం ఇంచుమించు దేశమంతటా విస్తరిస్తోంది. త్రాగే నీటితో పాటు పీల్చేగాలిని కూడా సమీప భవిష్యత్తులో కొనుక్కొవలసిన దుస్థితి ప్రాప్తించే పరిస్థితులు వేగంగా నెలకొంటున్నాయి. ఒకప్పుడు వరిధాన్యపు గింజల కంకులు కుచ్చులుగా, పిచ్చుకల కోసం వేళ్ళాడేవి.
నేడు సెల్‌ఫోన్‌ల సవ్వడితో పిచ్చుకలు అతి త్వరితంగా అంతరించి కనుమరుగైపోతున్నాయి. కాకుల జనాభా జనవాసాలలో క్షీణించిపోతోంది. గ్రద్దల సంఖ్య రాబందులకంటే వేగంగా పడిపోతోంది. అంటువ్యాధులు ప్రబలకుండా జనాన్ని రక్షించే పర్యావరణ జీవులు, సహచర జంతు, మృగ, పక్షులు ప్రధానంగా వృక్షాలు, అటవీ సంపద అంతరించిపోయే చీకటి భవిష్యత్తువైపు ధరిత్రి కదులుతోంది. భూదేవి అసహనంగా, నిర్వేదంగా, వేదనాయుతంగా, నిస్సహాయంగా చలిస్తోంది, తలవంచుతోంది. ‘‘ఒకవేళ భూమిపై నుంచి తేనెటీగ కనుక అదృశ్యమైతే, ప్రపంచ మానవుడు బతకటానికి నాలుగేళ్ళు మాత్రమే వుంటుంది. తేనెటీగలు లేకపోతే పరాక పుప్పొడి వ్యాప్తి వుండదు. మొక్కలుండవు. జంతువులు వుండవు. మనిషి ఉండడు’’ అన్నారు ప్రపంచ శాస్ర్తియ మేధావి అల్బర్ట్ ఐన్‌స్టీన్.
ప్రస్తుత దశాబ్దాలలోని దుస్థితి తెలిసినా, రానున్న తరాలను గురించి ఆలోచించే దార్శనికత ప్రస్తుత ప్రపంచానికి లేదు. వినాశకాలే విపరీత బుద్ధులతో ధరిత్రిని నిర్లక్ష్యం చేస్తూ ప్రస్తుతం అంతరిక్షం వైపు కదులుతున్నాం. విశ్వవిఖ్యాత శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించిన ఐదు భయాలతో భూతాపాన్ని అరికట్టడం ప్రధానమైనది. కర్బన ఉద్గారాలను తక్షణం తగ్గించుకోకపోతే భూమి ఏదో ఒక రోజు 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో శుక్రగ్రహం అవుతుంది. భూమిమీద విపరీత జనాభా, పర్యావరణ విధ్వంసం కారణంగా మానవాళి ఇక మరోగ్రహానికి చేరుకోవాలి. తప్పదు.. మరో వెయ్యేళ్ల తర్వాత భూమిపై మనుగడ వుండదు’’ అన్నారు.
భూతాపం నుంచి బయటపడలేని ప్రపంచం, గ్రహంతరవాసం గురించి ఆలోచిస్తోంది. ఈ ధరిత్రీ దిన సందర్భంలో, అంతరిక్షంలో అంతర్నిహిత అనంత అంధకార గుహాంతర్భాగం ‘కృష్ణబిలం’ ఛాయాచిత్రాన్ని ‘ఈవెంట్ హారిజాన్’ టెలిస్కోప్‌లు క్లిక్ చేయటం, అత్యద్భుత విశేషాంశం. అమ్మ అవనికి ఇల్లు కట్టాలని, ప్రపంచంలోని దేశాలు ఎన్నో ఒప్పందాలు చేసుకొంటూ సంతకాలు పెడుతున్నాయి. అగ్రదేశాలకు చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి పేరిట అత్యాశతో అర్రులు చాస్తున్నాయి. పారిస్ ఒప్పందం పట్టించుకొన్న దేశం లేదు.
క్షమయా ధరిత్రీ! కాబట్టి రక్షించు తల్లీ!

- జయసూర్య 94406 64610