Others

ఢంకా మోగించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడత నలగని గ్లాస్కో పంచె. పైన బంగారం రంగులో ఖద్దరు లాల్చీ. మోముపై చెరగని చిరునవ్వు. ఇవీ ఎవి సుబ్బారావుగా వినుతికెక్కిన అనుమోలు వెంకట సుబ్బారావు సూచికలు. లక్షన్నర రూపాయలు సొంత డబ్బుతో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌ని నెలకొల్పి, ఎల్వీప్రసాద్‌లో తొలి చిత్రం పెంపుడు కొడుకును ఆరంభించిన ఆ వ్యక్తిపేరు అనుమోలు వెంకట సుబ్బారావు.

1926 జనవరి 20న కృష్ణాజిల్లా పునాదిపాడులో జన్మించిన సుబ్బారావు -ఇంటర్ వరకు చదివారు. బావమరిదిని ఇంజనీరింగులో చేర్పించాలని చెన్నపట్టణం వచ్చారాయన. అక్కడ విజయరాఘవాచారి రోడ్డులోని రిపబ్లిక్ గార్డెన్స్‌లో మకాం వేశారు. అప్పుడు తాతినేని ప్రకాశరావు, ఎన్టీ రామారావు అక్కడే ఉండటంతో ముగ్గురికీ స్నేహం కుదిరింది. ఎన్టీ రామారావు తల్లి సుబ్బారావుకి భోజన సదుపాయాలు సైతం సమకూర్చడంతో బావమరిది ఇంజనీరింగ్ సీటు మాటెలావున్నా, సుబ్బారావు ఆసక్తి సినిమాల వైపు మళ్లింది. సినిమాలు చూడటం, చర్చించుకోవడం దినచర్యగా మారింది. బావమరిదికి సీటురాలేదు. వచ్చిన పనికాలేదు కదా అని సుబ్బారావు సొంతూరికి వెళ్లిపోలేదు. డబ్బు సమకూర్చుకున్నారు. 1952లో సినిమా సంస్థను స్థాపించి తాతినేని ప్రకాశరావు ప్రోత్సాహంతో ఎల్వీ ప్రసాద్‌ను కలుసుకున్నారు. సినిమా తీసి పెట్టమని కోరారు. ఎల్వీ ప్రసాద్ స్ఫూర్తితో ఈయన ప్రసాద్ ఆర్ట్‌పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించారు.
తన తొలి చిత్రాన్ని అక్కినేనితో తీయాలని సుబ్బారావు కోరిక. పల్నాటి యుద్ధం, సంసారం, పరదేశి చిత్రాల్లో ప్రసాద్-అక్కినేని కాంబినేషన్ బాగుంది. ఈ చిత్రంలో కూడా అది పండుతుందని సుబ్బారావు భావించారేమో. ‘మా తొలి చిత్రానికి మీరే హీరో’ అంటూ అక్కినేని చేతిలో పదివేలు అడ్వాన్స్ ఉంచారు. ఈ పాత్ర వెయ్యలేనంటూ అడ్వాన్స్ మొత్తం సుబ్బారావుకు అక్కినేని తిరిగిచ్చేశారు. ఆ సినిమా పెంపుడు కొడుకు. శివాజీ గణేషన్‌ను అక్కినేని స్థానంలో తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో దర్శకులు ప్రసాద్- తోటమాలి వేషం వేశారు (రంగస్వామి పాత్ర). ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ తొలి చిత్రంగా 1957 నవంబర్ 12న విడుదలైంది.
ఈ చిత్రం ఒక్క వీధి పాట తప్ప మిగిలిన పాటల చిత్రీకరణ ఉండాల్సిన స్థాయిలో లేదని, శివాజీగణేషన్ ఉచ్ఛారణ బాగలేదని, ఈ లోపాల్ని పక్కనపెడితే పెంపుడు కొడుకు మంచి చిత్రమన్న ప్రశంసలు వచ్చాయ. కానీ ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేదు. కన్నతల్లికీ కడుపుతీపికి సంఘర్షణ ‘పెంపుడుకొడుకు’. ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఎల్వీ ప్రసాద్, మంత్రవాది శ్రీరామమూర్తి, శివాజీగణేషన్, ఎస్వీ రంగారావు, ఆర్ నాగేశ్వరరావు, రావులపల్లి, సావిత్ర తదితరులు నటించారు. ద్వితీయ చిత్రంగా తమిళంలో విజయవంతమైన శివాజీగణేశన్ సినిమాను ‘వీరప్రతాప్’గా డబ్ చేశారు. ఇది విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత దాదాపు మూడేళ్లు నిర్మించి మే 1, 1959లో విడుదల చేసిన ఇల్లరికం చిత్రం అనూహ్య విజయం సాధించి రజితోత్సవం జరుపుకుంది. టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న పాటలన్నీ సూపర్‌హిట్. ఇదే కథను తమిళంలో ‘మాడివీట్టుమాపిల్లై’, కన్నడంలో జయలలిత కళ్యాణకుమార్‌లతో మళేఅశియాగా, మళయాళంలో ప్రేమనజీర్, షీలాలతో కవితోళన్‌గా నిర్మించారు. ఈ చిత్రం హిందీలో ససురావ్ పేరుతో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఎల్వీ ప్రసాద్ నిర్మాతగా వెలువడింది. అన్ని భాషల్లో చిత్రం సక్సెస్‌కావటం కుటుంబ కథాచిత్రాల ప్రాముఖ్యత తెలియచేసింది. కె ప్రత్యగాత్మ దర్శకుడిగా 1961లో వచ్చిన భార్యభర్తలు నెగెటివ్ టచ్ వున్న హీరో పాత్రను నిర్వహించటానికి ముందుగా అక్కినేని యిష్టత చూపకపోయినా, ఆయన్ని కథ విశేషంగా వొప్పించారు దర్శకుడు. మొదటి రాత్రి శారద (కృష్ణకుమారి) ఆనంద్‌తో (అక్కినేని) ‘బలవంతాన మెడలో తాళికట్టారు. కానీ నా మనసును మీరు గెలవలేరు’ అని బాధపడుతుంది. అయితే- ‘నీ మనసులో నాకు చోటుదొరికేదాక వేచి వుంటానంటాడు’ ఆనంద్. ఈ చిత్రానికి ప్రాణంపోసిన వారిలో ముఖ్యులు సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు. ఆరోజుల్లో అగ్ర కథానాయకులతో జమున విభేదాలు రావటంతో ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కృష్ణకుమారికి లభించిందంటారు. ఈ చిత్రం కృష్ణకుమారి నటజీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఈ చిత్రాన్ని ఎల్వీ ప్రసాద్ తమిళ (ఇరువుర్ ఉళ్లం), హిందీ భాషలో నిర్మించగా హిందీ చిత్రం హమ్‌రాహీలో జమున కథానాయికగా నటించటం విశేషం. 1963లో కె ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ‘పునర్జన్మ’ చిత్రంలో అక్కినేని మతిలేనివాడిగా, కళాకారుడుగా, అద్భుతంగా అభినయించి నటించారు. కృష్ణకుమారి అనేక క్లిష్టమైన సన్నివేశాలకు తగ్గట్లు అభినయించి, అక్కినేనితో ఒక విధంగా పోటీపడి నటించారు. 1963లో విడుదలైన చిత్రాలన్నింటిలో ఇది ఓ వెరైటీగా నిలిచింది. 1965లో కుమారి జయలలితను పరిచయంచేస్తూ అక్కినేని హీరోగా జగ్గయ్య, సావిత్రి ప్రధాన పాత్రలుగా నిర్మించిన చిత్రం ‘మనుషులు మమతలు’. టి.చలపతిరావు సంగీతంలో చక్కని అలరింపుతో ఈ గీతాలు నేటికీ శ్రోతలను రంజింపచేస్తున్నాయి. వంద రోజులు ఆడింది.
22-2-1968న విడుదలైన అక్కినేని, సావిత్రి నటించిన నవరాత్రి చిత్ర గీతాలు నేటికి అలరించటం విశేషం. ఈ చిత్రం వందరోజులు ఆడింది. అక్కినేని, జయలలిత నటించిన 1-2-1968న విడుదలైన బ్రహ్మచారి చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడి సక్సెస్ సాధించింది. భార్యభర్తలు, కులగోత్రాలు, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం (1969) చిత్రాలకు కేంద్ర ప్రభుత్వ బహుమతులు లభించాయి. వీరి చిత్రాలకు రాజేశ్వరరావు, చలపతిరావు, కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించారు. అక్కినేని హీరోగా నటించిన బ్రతుకుతెరువు ఆధారంగా ‘జీ నే కీ రాహీ’ హిందీలో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చింది. బ్రతుకుతెరువు (1953) చిత్రాన్ని చిన్నచిన్న మార్పులుచేసి, అదే కథను అక్కినేనితో భార్యబిడ్డలు (1972)గా నిర్మించి విజయం సాధించటం చెప్పుకోదగ్గ విశేషం. తర్వాత ఆలుమగలు (1977), పల్లెటూరిబావ, నాయకుడు- వినాయకుడు (1980) చిత్రాలు నిర్మించారు. తాతినేని రామారావు దర్శకత్వంలో ప్రెసిడెంటుగారి అబ్బాయి (1987) చిత్రం విజయ్సోవ వేడుకల్ని సెప్టెంబర్ ఒకటిన మద్రాసు కార్పొరేషన్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. మొత్తం 12 చిత్రాలను కేవలం అక్కినేనితో నిర్మించిన సుబ్బారావు తమ అభిమాన కథానాయకుడితో వియ్యమందడం విశేషం. తెలుగుతోపాటు ఇతర భాషలలోనూ మొత్తం 35 చిత్రాలను నిర్మించి 45 ఏళ్లపాటు సినీ రంగంలో ఢంకా మోగించి ‘లోగో’ను సార్థకం చేసుకొన్న సంస్థ పీఏపీ. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలకు సంబంధించిన కథాచర్చల్లో చక్రపాణి, దుక్కిపాటి మధుసూధనరావు లాంటి అనుభవజ్ఞులు పాల్గొనేవారంటే, అదేవిధంగా ‘్భర్యభర్తలు’ శత దినోత్సవం జరుపుకొని, రాష్టప్రతి రజిత పతకాన్ని పొందినప్పుడు ‘అన్నపూర్ణ’ సంస్థ అధినేత పీఏపి వారిని సత్కరించారంటే అలనాడు పరిశ్రమలో స్నేహానుబంధాలూ, ఆరోగ్యకర వాతావరణం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు.
నేటి సహాయకుడే- రేపటి- డైరెక్టర్
దర్శకుల ఎంపికలో పీఎపీ సంస్థకు ఓ ప్రత్యేకత ఉంది. ఎల్వీ ప్రసాద్ తొలి చిత్రాన్ని ఆరంభించిన ఈ సంస్థ ఆయన శిష్య, ప్రశిష్య పరంపరను, సహాయ ప్రధాన దర్శకులుగా తెలుగుతెరకు పరిచయం చేసింది. కె.ప్రత్యగాత్మ (్భర్యభర్తలు), తాతినేని రామారావు (నవరాత్రి), మోహనగాంధీ (అర్ధాంగి) ప్రభృతులు ఈ కోవలోనివారే. ఇది కేవలం పీఎపీకి మాత్రమే ప్రత్యేకం.
క్రమశిక్షణగల డి మధుసూదనరావు వంటి నిర్మాతల్ని ఆదర్శంగా తీసుకుంటాను అనేవారు సుబ్బారావు. చిత్ర నిర్మాణాన్ని సమర్థుడైన దర్శకుని చేతుల్లోపెట్టి నిర్మాణం జరిగినంత కాలం ఏవిధమైన టెన్షన్ లేకుండా కులాసాగా జీవితాన్ని అనుభవించిన అదృష్టవంతుడు పీఏపీ సుబ్బారావు.
నా జీవనయాత్రలో మరచిపోలేని ఆత్మీయులు అక్కినేని నాగేశ్వరరావు అని బాహాటంగా చెప్పుకుంటారు సుబ్బారావు. అందుకే వారి మైత్రీ బంధాన్ని బంధుత్వంగా మలచుకుని వియ్యంకులైనారు. జాతస్య మరణం ధృవం అన్నట్లు మార్చి 22, 2007న పీఏపీ సుబ్బారావు పరమపదించినా ఆయన నిర్మించిన ఉదాత్త చిత్రాలు అనునిత్యం రసజ్ఞ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వుంటాయి.

-కందేపు శ్రీనివాసరావు