Others

పాశుపతాస్త్రం.. సమాచార హక్కు చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు పాలనా యంత్రాంగంలో అవినీతిని నియంత్రించడానికి సమాచార హక్కు చట్టం ఓ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారానే కొందరు నేతలు పొందుతున్నారు. విద్యావంతులు, రాజకీయ పక్షాలు, మేధావులు మాత్రమే ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. సామాన్య మానవుడు ఈ చట్టాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాడో అప్పుడు అధికారులు జవాబుదారీతనంతో పనిచేస్తారు. సమాచార హక్కు చట్టం అవసరాన్ని, దాని పుట్టుపూర్వోత్తరాలను ప్రజలంతా విధిగా తెలుసుకోవాలి.
రాజస్థాన్‌లోని ఒక నగర పాలక సంస్థలో ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ భవనాన్ని నిర్మించాడు. అక్కడి కొంతమంది మహిళలు ఆ కాంట్రాక్టర్ వద్దకు వెళ్లి- ‘ఎన్ని ఇటుకలు, ఎంత సిమెంటు వాడారు? ఏ రకం సిమెంటు వాడారు? ఎంతమందికి ఎన్నిరోజులు పని కల్పించారు?’ వంటి ప్రశ్నలకు సమాచారం ఇవ్వాల్సిందిగా నిలదీశారు. ఏ కాంట్రాక్టర్ కూడా ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడు. ఎందుకంటే నాసిరకం పనుల బాగోతం బయటపడుతుంది. ఈ నేపథ్యంలో ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ అనే సంస్థ- ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు చేయాలని, అవినీతికి పాల్పడి నాసిరకం పనులు చేయకూడదని నిలదీసింది. ప్రతి కార్యాలయంలోని అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని, అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వమే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పోరాటం చేసింది. ప్రజల్లో చైతన్యం కోసం ‘జన్ సున్ వాయి’ (ప్రజా విచారణ) పేరుతో ఎంకెఎస్‌ఎస్ సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం సేకరించి అధికారుల దృష్టికి ఈ సంస్థ ప్రతినిధులు తీసుకెళ్ళేవారు.
మొదటగా పనికి ఆహార పథకానికి సంబంధించి సమాచారం సేకరించేవారు. అధికారులు సమాచార పత్రాలను ఇవ్వడానికి నిరాకరిస్తే, మూడు సంవత్సరాలపాటు ప్రదర్శనలు, ఊరేగింపులతో నిర్విరామ పోరాటం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. రాజస్థాన్ అసెంబ్లీలో 1995లో ఒక ప్రత్యేక చట్టాన్ని తేవడానికి కారకులయ్యారు. ఆ తర్వాత దశాబ్దకాలం గడిచిన తర్వాత అందులోని మర్మాన్నీ గ్రహించిన కేంద్ర ప్రభుత్వం 2005, అక్టోబర్ 12న ‘సమాచార హక్కు చట్టాన్ని’ రూపొందించి, దేశవ్యాప్తంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంది. సమాచార హక్కును రాజ్యాంగంలోని రెండు ప్రాథమిక హక్కుల కింద భావ ప్రకటన స్వేచ్చ, జీవించే హక్కుగా గుర్తిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తిఅయినా ప్రభుత్వ ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాలు, నియమ నిబంధనలు, హాజరు పట్టికలు, ఉత్తరాలు వంటివి పొందవచ్చు. సమాచారం కావాలనుకుంటున్న వ్యక్తి ఆ పత్రాల నకళ్ల కోసం కొద్ది మొత్తం చెల్లించాల్సి రావచ్చు. సమాచారం కోరుకుంటున్న వ్యక్తి దారిద్య్రరేఖకు దిగువున ఉన్నట్లయితే ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే అధికారి ఒకరుండాలి. ఈ సమాచార అధికారిపైనా మరో ఉన్నతాధికారి ఉంటాడు, సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లయితే- ఆ అధికారిపైన ఫిర్యాదుచేస్తే చట్టప్రకారం కేసులు నమోదవుతాయి.
ఇంతటి గొప్ప చట్టం ఉన్నా దేశంలో అందరికీ దీనిమీద సరైన అవగాహన లేక ఎక్కువగా ఉపయోగించుకోలేక పోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అధికారులపై ఉన్న భయంతో సమాచారం తెలుసుకోడానికి సాహసించని పరిస్థితిని గ్రామాల్లో చూడవచ్చు. ఒకరిద్దరు వీటిని ఉపయోగించుకుంటే అధికారులు వారిని మచ్చిక చేసుకొని, తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. రాష్టస్థ్రాయిలో, కేంద్రస్థాయిలో ఉన్నత విద్యావంతులు, సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని సమాచారాన్ని పోరాటాలకు దిగుతున్నారు. గ్రామస్థాయిలో ఎప్పుడైతే సామాన్య మానవుడికి ఈ చట్టం పట్ల అవగాహన కల్పించి, దీన్ని ఉపయోగించుకొని అధికారులపై జవాబుదారీతనాన్ని పొందుతాడో సంపూర్ణంగా అవినీతిని నిర్మూలించడానికి అవకాశం ఏర్పడుతుంది. చదువుకున్న విద్యార్థులు ఈ చట్టం పట్ల తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. గ్రామంలోని వివిధ వర్గాల వారితో చర్చించి ఆ తర్వాత సమాచార సేకరణకు పూనుకుంటే ఫలితముంటుంది. సమాజశ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరూ అధికారులపై ఎలాంటి అనుమానాలున్నా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలి. సమాచారాన్ని సేకరించి అవగాహన చేసుకొని ఏమైనా తప్పులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. చట్టప్రకారం చర్యలు తీసుకునేలా కృషిచేసినప్పుడే అవినీతి తగ్గుముఖం పడుతుంది. గ్రామాలు అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది. అధికారులు కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, నిస్వార్థంగా విధులు నిర్వర్తించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. మొదట్లో కొంత ఇబ్బందిగాఉన్నా ధైర్యంతో ముందడుగువేస్తే- అధికారులతో పనిచేయించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వాలు ఏ చట్టాలను తీసుకొచ్చినా అవి పేద ప్రజల అభివృద్ధికి, సమాజశ్రేయస్సుకు పాటుపడేలా ఉంటాయి. ప్రతిఒక్కరూ వాటిపై అవగాహన చేసుకొని, వాటిని అనుకూలంగా మార్చుకున్నప్పుడే ఆశించిన ప్రగతిని పొందవచ్చు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే ఎలాంటి లాభం చేకూరదు. ప్రభుత్వం తలపెట్టే ప్రతి కార్యక్రమం పైన దృష్టికేంద్రీకరించి, అవి సవ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉంది. సామాన్య ప్రజానీకాన్ని చైతన్యవంతులుగా మార్చే చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి.

-డా. పోలం సైదులు 94419 30361